Sunday, 6 November 2016

సైకియాట్రిస్టుకి జట్కాబండి అవసరమా?


సినిమా యాక్టర్లు టీవీల్లో 'ఫ్యామిలీ కౌన్సెలింగ్' చేస్తున్నారని కొన్నాళ్లుగా వింటున్నాను. ఇవ్వాళ ఆదివారం, పెద్దగా పనుండదు. అంచేత - కౌన్సెలింగ్ 'జట్కాబండి'ని యూట్యూబులో అక్కడక్కడా కొద్దికొద్దిగా చూశాను. ఆశ్చర్యంగా జట్కాబండి ఫ్యామిలీలన్నీ పేదవర్గాల వారివే! సంపన్న వర్గాలకి కుటుంబ సమస్యలు వుండవనీ, వున్నా అందులో పేదవాడి కుటుంబంలో ఉన్నంత వినోదం వుండదనీ టీవీ వాళ్ళ అభిప్రాయం కావచ్చు. 

పేదవారి జీవితంలో వినోదం ఉండదు కానీ వారి జీవితం ఇంకొందరికి వినోదం కావడం ఒక ఐరనీ. అక్కడకొచ్చే కుటుంబాలు చాలా పేదగా, బీదగా, మురికిగా ఉంటాయి. కౌన్సెలింగ్ భామలు తాము మాత్రమే దట్టంగా మేకప్ కొట్టుకుని బాధిత మహిళలకి మాత్రం కనీసం పౌడర్ కూడా పూయనియ్యరా? వాళ్ళనలా జిడ్డుమొహంతో చూపిస్తేనే సన్నివేశం పండుతుందని క్రియేటివ్ హెడ్డుగారి ఆలోచనా? 

సరే! టీవీ అనేది వున్నదే వినోదం కోసం. వినోదం అన్నాక - అందులో అర్నబ్ గోస్వామి టీవీ డిబేట్ల నుండి అర్ధరాత్రి బూతుపాటల దాకా అనేక ప్రోగ్రాములు వస్తుంటాయి. ఛానెల్ నిర్వహణ వ్యాపారం కాబట్టి,  రేటింగ్స్ కోసం అనేకరకాల ప్రోగ్రాముల్ని వండుతుంటారు. అంచేత - టీవీవాళ్ళ బాధల్ని అర్ధం చేసుకోవచ్చు.

సినిమా నటులకి ఉద్యోగస్తుల్లా స్థిరాదాయం వుండదు, వారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంచేత సినిమా బుక్కింగులు తగ్గినప్పుడు - ఆరిపొయ్యే దీపంలో నూనె పోసినట్లు.. తమ కెరీర్‌ని ఇంకొంత పొడిగించుకోడం కోసం టీవీ ప్రోగ్రాముల్లోకి వస్తుంటారు. సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు చెయ్యాల్సిన 'ఫ్యామిలీ కౌన్సెలింగ్' అంటే యేమిటో సినిమా నటులకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి - వాళ్ళు తమకు తోచిందేదో చెప్పి, ఆపై ప్రొడ్యూసర్లకి 'థాంక్స్' చెప్పి, పేమెంట్ చెక్కు తీసుకుని వెళ్ళిపోతారు. అవసరమైతే ప్రోగ్రామ్ హెడ్ 'సూచన' మేరకు (TRP కోసం), ఆవేశపడ్డట్లు నటించి నాలుగు తిట్లు తిట్టేసి పోతారు. కావున - ఇట్లాంటి షోలు చేస్తున్న సినిమా నటుల్ని విమర్శించడం అనవసరం.  

అయితే - ఫ్యామిలీ కౌన్సెలింగ్ అనే 'రియాలిటీ షో'లో హైదరాబాదుకి చెందిన సైకియాట్రిస్టులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా అనైతికం. మనం టీవీవాళ్ళ వ్యాపార యావ అర్ధం చేసుకోవచ్చు, సంపాదన కోసం మాజీనటుల అవసరమూ అర్ధం చేసుకోవచ్చు. కానీ - ఒక పాపులర్ షోలో సైకియాట్రిస్టులు కూడా ఉండడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఆ డాక్టర్ల ప్రచార యావా, డబ్బు కక్కుర్తీ! 

ఇలా టీవీల్లో బహిరంగంగా జరిగే 'ఫ్యామిలీ కౌన్సెలింగ్' అనే వినోద కార్యకమంలో సైకియాట్రిస్టులు సైకియాట్రిస్ట్ 'వేషం' వెయ్యడం MCI కి రిపోర్ట్ చెయ్యదగ్గ నేరం. డాక్టర్లు కానివాళ్ళు అర్ధం చేసుకోవాల్సింది యేమనగా - మన తెలుగునాట ఇలా పబ్లిసిటీ కోసం, appearance money కోసం తమ వృత్తిని తాకట్టు పెట్టే చౌకబారు డాక్టర్లు ఉన్నారని. వీళ్ళు డబ్బుజబ్బు పట్టిన రోగిష్టి వైద్యులు, అసలంటూ కౌన్సెలింగ్ కావాల్సింది వీరికే! 

మిత్రులారా! టీవీల్లో కనపడే roguish డాక్టర్ల పట్ల - తస్మాత్ జాగ్రత్త!

(picture courtesy : Google)