Sunday 17 September 2017

యేసుపాదం! ఐ మిస్ యూ!


యేసుపాదం పొయ్యాట్ట! మనసు బరువుగా అయిపోయింది. యేసుపాదంతో నా అనుబంధం రెండు దశాబ్దాల పైమాటే! 

యేసుపాదం స్కిజోఫ్రీనియా బాధితుడు. అనుమానాలు, భయాలు.. తన్లోతాను మాట్లాడుకుంటాడు. స్నానం చెయ్యాలి, అన్నం తినాలి అన్న ధ్యాస లేనివాడు. నల్లటి పొడవాటి ఇనప స్థంభానికి యెర్రటి కళ్లు అతికించినట్లు కొంత ఆకర్షణీయంగా, మరింత భయంకరంగా కనిపిస్తాడు. భార్యని తన్నేవాడు, ఆమె పుట్టింటికి పారిపొయ్యింది. ఆ సౌలభ్యం లేని తలితండ్రులు యేసుపాదంతో తన్నించుంకుంటూనే వుండేవాళ్లు.

యేసుపాదం నాకో పేషంట్ ద్వారా పరిచయం. అతను కడుపేదవాడని తెలుసుకొని  ఫీజు తీసుకోలేదు. కొన్నాళ్లకి యేసుపాదం మందులూ కొనుక్కోలేడని అర్ధమై physician samples తో వైద్యం కొనసాగించాను. 

సైకియాట్రీ ప్రాక్టీస్ కొంత విభిన్నంగా వుంటుంది. పేషంట్లు డాక్టర్లని నమ్మరు, నిర్లక్ష్యంగా వుంటారు. యేసుపాదానికి నేనంటే చులకన భావం.

"నువ్విచ్చే మందులకి నరాలు లీకైతన్నయ్, నిన్ను చావదెం..తా."

"మందులెవడు మింగుతాడ్రా, నీయమ్మ మొగుడా?"

ఇట్లాంటి భాషతో నన్ను ప్రేమపూర్వకంగా పలకరించేవాడు. 

కాలక్రమేణా తలిదండ్రులు మరణించారు, అన్నం తింటున్నాడో లేదో పట్టించుకునేవాళ్లూ కరువయ్యారు. యెండల్లో వానల్లో రోడ్లమ్మట తిరగడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు యేసుపాదాన్ని ఊళ్లోవాళ్లు పట్టుకొచ్చేవాళ్లు, మనిషి అస్థిపంజరంలా మారిపొయ్యాడు. అటుతరవాత ఆ ఊరివాళ్లెవరన్నా వస్తే, యేసుపాదం కోసం వాళ్లతో శాంపిల్స్ పంపేవాణ్ని. వేసుకున్నాడో లేదో తెలీదు.

ఇప్పుడు యేసుపాదం పొయ్యడని వార్త! మంటల జ్వరంతో రోడ్లమ్మట అలా తిరుగుతూనే వున్నాట్ట. తిరిగీ తిరిగీ యెక్కడో రోడ్డు పక్కన పడి చనిపొయ్యాడు.

పుష్కరాలు పద్నాలుగేళ్లకోసారి వస్తాయి, సీజనల్ జ్వరాలు ప్రతేడాదీ వస్తాయి. వాటికి పేదవాళ్లంటే ఇష్టం, మానసిక జబ్బున్న పేదవాడంటే మరీ ఇష్టం. తనెవరో, తనేవిఁటో తెలీని యేసుపాదం జ్వరానికి బలైపొయ్యాడు. 

ఇకముందు, నాకేసి యెర్రగా చూస్తూ - 

"నీయమ్మా! నీ లంజకబుర్లు నాదగ్గర కాదు!" అంటూ ప్రేమగా పలకరించే యేసుపాదం నాక్కనపడడు, అదీ సంగతి!

యేసుపాదం! ఐ మిస్ యూ!  

(fb post)