Wednesday 15 November 2017

"జై మా అభిమాన హీరో!"

అనగనగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏదో గొప్ప కోసం 'ఇండస్ట్రీ' అంటున్నానే కానీ.. ఇది రెండుమూడు కుటుంబాలు అహోరాత్రులు కష్టపడి నిలబెట్టిన కుటీర పరిశ్రమ. స్థూడియోలు/హీరోలు/సినిమా హాల్స్.. మొత్తం ఆ కుటుంబాల చెమటతోనే తడిసుంటాయి. ఈ కుటుంబ హీరోలు నువ్వుతున్నారో, యేడుస్తున్నారో తెలుసుకోడం బహుకష్టం అని కిట్టనివాళ్లు అంటారు.

ప్రభుత్వాలు ప్రజల బాగు కోసం పని చేస్తుంటయ్. సినిమాల మంచిచెడ్డలు యెన్నడం కూడా ప్రజాసేవలో ఒక పవిత్ర కార్యం కావున నంది అవార్డుల యెంపిక కోసం ఒక నిస్పాక్షక జ్యూరీని నియమించారు. ఆ జ్యూరీ యెంతో బాధ్యతతో అవార్డుల్ని ప్రకటించింది.

ఇప్పుడో సమస్యొచ్చి పడింది. ఆస్తుల పంపకంలోలా అవార్డుల పంపకంలో ఒక కుటుంబానికే న్యాయం జరిగి, మిగిలిన కుటుంబాలకి అన్యాయం జరిగిందని ఫ్యాన్సాభిమానులు దుఃఖించసాగారు. ఇవన్నీ అన్నదమ్ముల కలహాల వంటివేననీ, తెర వెనుక వాళ్లంతా వొకటేననీ అంటారు గానీ నిజానిజాలు మనకి తెలీదు.

తెలుగు హీరోల అభిమానులకి తెలుగు భాషంత చరిత్ర వుంది. ఆనాడు ఎన్టీఆర్, ఏయన్నార్ పోస్టర్ల పేడసుద్దల ముద్దల నుండి ఈనాటి ఫేస్బుక్ పోస్టుల్దాకా.. ఇదో పురాతనమైన సంస్కృతి. ఆవకాయ పచ్చడి, గుత్తొంకాయలాగే తెలుగు హీరోల వీరాభిమాన థ్రిల్లింతా తెలుగోడి సొంతం.

బాధ యెవరికైనా బాధే! తెలుగు హీరోల అభిమాన కట్టప్పల బాధని సానుభూతితో అర్ధం చేసుకుంటూ.. వారీ బాధ నుండి త్వరలో బయటపడాలని ఆశిస్తున్నాను.

(fb post)