Thursday 28 June 2018

ఎన్నికల సమయం

అవి నా స్కూలు రోజులు. నా స్నేహితుడొకడు సంవత్సరం పొడుగునా చదువుకోడం తప్పించి అన్ని పనులూ చేసేవాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో.. Imp (important) అంటూ ఏవో ప్రశ్నల్ని సంపాదించే వాడు. పరీక్ష పేపర్ ఔట్ అవుతుందేమోననే ఆశతో చివర్రోజు వరకు వుండేవాడు. పరీక్షల్లో అడిగే ప్రశ్నలు తెలుసుకోడానికి అతను చేసే ప్రయత్నాలు ఆశ్చర్యకరంగా వుండేవి.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ.. ప్రజల సెంటిమెంట్/ఎమోషన్స్ తెలుసుకుని, ఎలాగైనా గెలవాలనే రాజకీయ పార్టీల లక్ష్యం చూస్తుంటే, నా చిన్ననాటి స్నేహితుడు గుర్తొస్తుంటాడు.
ఒకాయన విదేశాల్లో నల్లధనం అంటాడు, సంవత్సరానికో కోటి ఉద్యోగాలు అంటాడు. ఇంకొకాయన ఋణమాఫీలంటాడు, ఇంటికో ఉద్యోగం అంటాడు. విశేషం ఏమంటే.. తామివన్నీ చెయ్యాలని వీళ్లూ అనుకోరు, చేస్తారని ఓటర్లూ అనుకోరు. అందుకే కొందరు తెలివైన ఓటర్లు ఓటేసేందుకు డబ్బుచ్చుకుంటారు.
అమలు చెయ్య(లే)ని వాగ్దానాల్ని చేసే రాజకీయ నాయకులు, వారిని నమ్మని ప్రజానీకం.. ఇదంతా సైకిల్ చక్రం తిరిగినట్లు ఐదేళ్ల కోసారి వస్తుంటుంది. దీన్నే మనం ముద్దుగా 'ప్రజాస్వామ్యం' అని పిల్చుకుంటున్నాం.
ప్రజలు తమని నమ్మినా, నమ్మకపోయినా రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం కాకుండా మానుకోవు. ఏదోక అంశం తీసుకుని పాదయాత్రలనీ, ధర్నాలనీ, నిరాహారదీక్షలనీ.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటయ్.
ప్రజలు/ఓటర్లు గుంభన జీవులు. 'వురే రాజకీయ నాయకులూ! మాకు ఫలానా సమస్య ముఖ్యం, యిందుకోసం ఎవరైతే కొట్లాడతారో వారికి మా ఓటు.' అని తేల్చి చెప్పరు (పరీక్షల్లో ప్రశ్నల్లాగే). అంచేత రాజకీయ పార్టీలు ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ 'యెందుకైనా మంచిద'ని ప్రతి సమస్యనీ ప్రజల సమస్యగా మార్చడానికి కృషి చేస్తుంటాయ్.
మరప్పుడు మనమేం చెయ్యాలి?
అదేంటి మేష్టారూ! ప్రతొక్కటీ విడమర్చి చెప్పాలా? మన "పవిత్రమైన" ఓటు కోసం కుస్తీపోటీలు పడుతున్న రాజకీయ పార్టీల విచిత్ర విన్యాసాల్ని యే విస్కీనో, ఫిల్టర్ కాఫీనో చప్పరిస్తూ ఎంజాయ్ చెయ్యండి. ఇవ్వాళ సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే వినోదం ఎక్కువగా వుంది!

(fb post)