Monday 27 June 2011

నాకు నచ్చిన విద్వాంసుడు


సితార్ రవిశంకర్, వీణ చిట్టిబాబు, షెహనాయ్ బిస్మిల్లాఖాన్ వంటి సంగీత విద్వాంసుల గూర్చి విన్నాను. వీరంతా గొప్ప ప్రతిభావంతులని అంటారు కాబట్టి నేనూ అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. 

అయితే నాకు నచ్చిన విద్వాంసుడు వేరు!

పూర్వం దూరదర్శన్ రోజులు గుర్తున్నాయా? ఆ రోజుల్లోనే ఇందిరాగాంధి చనిపోయింది. వారం రోజులు సంతాపం. వినోద కార్యక్రమాలన్నీ రద్దు చేయగా - వయొలిన్ ప్రోగ్రాం ఒక్కటే వచ్చేది. ఆ వయొలిన్ వాద్యగాడు పొట్టిగా ఉండే ఓ మధ్యవయసు ఆసామి. పొట్టిపంచెతో, నలిగిన కుర్తాతో, మాసిన గడ్డంతో - ఒక మహానాయకురాలు చనిపోయిన దేశంలో రోదనకి ప్రతీకగా ఉండేవాడు.

దించిన తల ఎత్తకుండా 'కువూయి, కువూయి' అంటూ వయొలిన్ వాయిద్యాన్ని గంటలకొద్దీ వాయించేవాడు. అప్పుడప్పుడు 'చాలా? ఇంకా వాయించనా?' అన్నట్లు పక్కకి ఎవరికేసో చూస్తుండేవాడు (బహుశా ఆ ప్రోగ్రామ్ ప్రెజెంటర్ వైపు చూస్తుండొచ్చు). వార్తలు మొదలయ్యే సమయానికి హఠాత్తుగా వాయింపుడు ఆపేసి, వయొలిన్ పక్కన పెట్టేసి, రెండు చేతులు జోడించి 'నమస్కార్' అని చెప్పేవాడు. 

ఆ నమస్కారం - 'అమ్మయ్య! ఇవ్వాళ నాకు బియ్యానికి డబ్బులొచ్చేసాయ్!' అని ఆనందపడుతున్నవాడిగా అనిపించేది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు అన్ని సంతాపాలకి ఆయన్నే పిలిచేవాళ్ళనుకుంటాను

పిమ్మట ఆయన రాజీవ్ గాంధి సంతాప దినాల్లోనూ దూరదర్శన్ని ఏలాడు. క్రమేణా కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చింది. 'సంతాప వాయింపుడు అవకాశాల కోసం ఈ వయొలిన్ విద్వాంసుడు పూజలూ గట్రా చేస్తున్నాడా?!' అని. ఈ లెక్కన తమ కాంగ్రెసు పార్టీకి దేశనాయకుడెవడూ మిగలడని ఒక నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్సోళ్ళు ఆయన్ని పక్కన పెట్టేశారు. 

ఆ వయొలిన్ విద్వాంసులవారికి మళ్ళీ అవకాశం రాకపోడానికి ఒక బలమైన కారణం వుందని మా గోపరాజు రవి చెబుతాడు. ఆయన సోనియాగాంధి దగ్గరకి పోయి 'నమస్కార్! మీ అత్తగారికి వాయించాను, మీ ఆయనకీ నేనే వాయించాను. మీకు కూడా వాయించే అవకాశం నాకు కలిపించండమ్మా!' అని వేడుకున్నాట్ట!

చివరాకరకి నే చెప్పొచ్చేదేమనగా - ఆవిధంగా నా అభిమాన విద్వాంసులవారు టీవీ (తెర) మరుగయ్యారు. సంతాపాలకి రోజులు కాకుండా పొయ్యాయి.