Thursday, 14 July 2011

మీ (మా) వారపత్రిక

చిన్నప్పటి జ్ఞాపకాలు యెవరికైనా మధురానుభూతులే! మొదటిసారి సినిమా చూసినప్పుడు, హోటల్లో ఇడ్లీసాంబార్ లాగించిన్నప్పుడు.. ప్రతి అనుభవం చుట్టూ అనేక జ్ఞాపకాలు పెనవేసుకునుంటయ్. నా సైకిల్ టక్కడం వెనుక కూడా పెద్ద కథే వుంది. సైకిల్ కలిగుండటం అదృష్టంగానూ, దాన్ని తొక్కేవారిని గంధర్వులుగానూ భావించేవాణ్ణి. సైకిల్ తొక్కే అవకాశం కోసం అనేక కుట్రలూ పన్నేవాణ్ణి! 

విశ్వం నాకు ఆరోక్లాసులో స్నేహితుడు, చాలా మంచివాడు. విశ్వం అన్నకో డొక్కుసైకిలుంది. సరీగ్గా కాళ్లందని విశ్వం ఆ సైకిల్ని ఎగిరెగిరి పడుతూ తొక్కేవాడు. విశ్వాన్ని చూసి కుళ్ళుకున్నాను, సైకిల్ తొక్కే అవకాశం కోసం విశ్వానికి దగ్గరవ్వాలని నిర్ణయించుకున్నాను.  
                         
స్కూలు టైము తరవాత పేరట్లో ఉన్న ఉసిరి (చెట్టు) కాయలు తీసుకెళ్లి యివ్వటం, వాడి చేతిరాత చాలా బాగుంటుందనడం, నాకన్నా వాడికే లెక్కలు బాగా వచ్చని పొగడటం.. ఇత్యాది ప్రణాళికలు రచించి అమలుపర్చాను. కష్టేఫలి! మొత్తానికి కొన్నాళ్లకే విశ్వానికి మంచి స్నేహితుణ్నైపొయ్యాను. తద్వారా ఆ సైకిల్ తొక్కే అర్హత సంపాదించాను.

సైకిల్ విహారం మబ్బుల్లో తేలిపోతున్నట్లుండేది. ఒకడు సైకిల్ తొక్కుతుంటే ఇంకొకడు సైకిలు సీటు ముందున్న కడ్డీమీద కూర్చోవాలి. నిమిషానికొకసారి పడే చైన్ వేసే బాధ్యత కడ్డీమీద కూర్చునేవాడిది! ఆవిధంగా డివిజన్ ఆఫ్ లేబర్నీ పాటించేవాళ్ళం.
                         
విశ్వం అన్న (సైకిలు సొంతదారుడు) అప్పటికే డిగ్రీలాంటిదేదో చదువుకుని ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన మాకో పన్జేప్పేవాడు. అదేమంటే - ప్రతివారం (శుక్రవారమా?) పొద్దున్న రైల్వే స్టేషన్‌కి సైకిల్ తొక్కుకుంటూ పోయి హిగ్గిన్ బోథమ్స్‌లో ఆంధ్రపత్రిక (సచిత్రవారపత్రిక) కొనే పని. సైకిల్‌కి తాళం లేదు కావున ఒకడు రైల్వే స్టేషన్లోకి వెడితే ఇంకోడు సైకిలుకి కాపలాగా బయటే ఉండాల్సొచ్చేది.    
                 
ఆంధ్రపత్రిక కొని సైకిల్ని వాయువేగంతో, శరవేగంతో తొక్కుతూ (తొందరగా తొక్కేవాళ్ళం అని రాస్తే సరిపోతుంది, కానీ - అంత కష్టపడి తొక్కిన తొక్కుణ్ణి విశేషణాలేమీ జోడించకుండా సింపుల్‌గా రాయటం నాకిష్టం లేదు) ఇంటికి తెచ్చి విశ్వం అన్నకి ఇచ్చేవాళ్ళం. అతను అప్పటికే పోస్టు కార్డుతో రెడీగా ఉండేవాడు. పత్రిక ఒక అరనిమిషం ముందుకీ, వెనక్కీ తిరగేసేవాడు. ఆ తరవాత ఒకే నిమిషంలో ముత్యాల్లాంటి అక్షరాలతో ఆంధ్రపత్రిక సంపాదకులవారికి ఉత్తరం రాసేవాడు.

ప్రతివారం ఒకటే మేటర్! మీ (మా) వారపత్రికలో ఫలాన కధ అద్భుతం. సీరియల్ తదుపరి భాగం కోసం ఇంట్లో అందరం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. వంటింటి చిట్కాలు అమోఘం, అందులో ప్రచురించిన ఫలానా వంటకం మా చెల్లెలు (ఆయనకసలు చెల్లెల్లేదు) తయారుచేసింది. ఆ రుచిని తట్టుకోలేకపోతున్నాం. ఇట్లా పోస్టు కార్డులో వ్యాసం లాంటిది రాసేవాడు.
                             
ఆయన రాసిన పోస్టు కార్డుని తీసుకుని - మళ్ళీ వాయువేగంతో, శరవేగంతో (ఈ విశేషణాలని మీరు తప్పించుకోలేరు) సైకిల్ తొక్కి.. పెద్ద పోస్టాఫీస్ ముందుండే పెద్ద పోస్టుడబ్బాలో వేసేవాళ్ళం. ఇదంతా చాలా పద్ధతిగా నిమిషాల్లో జరిగిపోయేది.
                             
విశ్వం అన్న రాసిన ఉత్తరాలు అప్పుడప్పుడు పబ్లిషయ్యేవి. కానీ - ఆ ఉత్తరం 'పాఠకుల ఉత్తరాలు' శీర్షికలో రెండోదిగానో, మూడోదిగానో ఉండేది! మా ఉత్తరం కన్నా స్పీడుగా యింకెవరన్నా యెలా ఇచ్చేవాళ్లో  నాకర్ధమయ్యేది కాదు. నా శ్రమకి తగ్గ ఫలితం లభించట్లేదని బాధ కలిగేది.  


ఒకరోజు విశ్వం అన్న నాకు అసలు రహస్యం చెప్పాడు.
                             
ఆంధ్రపత్రిక బెజవాడ నుండి పబ్లిషవుతుందిట. బెజవాడవాళ్ళు పత్రిక రిలీజు కాకముందే ఒక కాపీ సంపాదించి, గబగబా ఉత్తరం రాసేసి పత్రిక ఆఫీస్ ముందున్న పోస్ట్ డబ్బాలో వేసేస్తారట, లేదా డైరక్ట్‌గా ఆఫీస్‌లోనే ఇచ్చేస్తార్ట. అంచేత బెజవాడ వాళ్ళు మా గుంటూరు వాళ్ళకన్నా ఎంతో ముందుంటారు. ఔరా! ఈ బెజవాడవాళ్ళు ఎంత తొందరపాటు మనుషులు!!