Saturday 9 July 2011

కొ.కు. 'ఐశ్వర్యం' - చలం ప్రస్తావన

గుంటూరులో రాతగాళ్ళ వాతావరణం నాకంతగా కనిపించలేదుగానీ తెనాల్లో బాగా కనిపించింది. ఎదురింటి శేషాచలం దగ్గిర చలం పుస్తకం ఒకటి తీసుకున్నాను చదువుదామని.
       
"చదవక చదవక ఆ బూతు కథలే చదువుతున్నావ్?" అన్నాడు బాబాయి.
       
"బూతులేని సాహిత్యం ఎక్కడుంది బాబాయ్? నీ బీరువాలో ఆ మనుచరిత్ర ఏమిటి? బూతుకథలు కావూ ?" అన్నాను .
       
"అవి అంత తేలిగ్గా అర్ధమవుతాయా? వసుచరిత్ర, ఆముక్తమాల్యదా తీసి చదివి అర్ధం చెప్పు చూద్దాం."
       
"అందులో వాటికన్న ఇది మంచిది. ఇందులో ఉండే బూతు చక్కగా అందరికీ అర్ధమవుతుంది."
                     
బాబాయి కొంచెం ఆలోచించి "బూతు ఉంటే ఉంది. నీతి కూడా ఉండాలిగా. ఆ చలం కథల్లో నీతి లేదు." అన్నాడు.
                     
"నీతి లేకేం బాబాయ్? ఉంది. నువ్వొప్పుకునే నీతి కాదేమో?"
                     
"ఒప్పుకోవటానికి వీల్లేని నీతిని అవినీతి అంటారు. ఆమాత్రం తెలీదురా?" అన్నాడు బాబాయ్.
                   
"నిజమే బాబాయ్, కాని ఒకరి నీతి ఒకరికి అవినీతి కావచ్చు. నన్నడిగితే పురాణాలన్నీ బూతూ, అవినీతీనూ. కుంతి అడ్డమైనవాళ్ళకూ పిల్లల్ని కనటమూ నాకు బాగాలేదు. వ్యాసుడు వెధవముండలకు కడుపులు చెయ్యటమూ, వాళ్ళ సంతానం దేవతాంశంతో పుట్టినవాళ్ళని చెప్పటమూ నా బుద్ధికి దారుణంగా ఉంది. ద్రౌపదికి అయిదుగురు మొగుళ్ళు! ఈ ఛండాలమంతా ఉంది కనక భారతం సాహిత్యం కాదని నేనంటున్నానా? చలం కథల్ని నువ్వు కొట్టెయ్యకూడదు."
                   
"అయితే ఈ దిక్కుమాలిన కథలను భారతంతో పోలుస్తావా?"
                   
"ఎందుకు పోలుస్తానూ? భారతంలో ఉండే మనుషులూ, వాళ్ళ బుద్ధులూ, కష్టాలూ, సుఖాలూ, ఆచారాలూ - ఏవీ నాకర్ధం కావు. ఇందులో నాకు తెలిసిన మనుషుల జీవితమూ, బుద్ధులూ, ఆచారాలూ ఉన్నాయి. నాకిదే మంచి సాహిత్యంగా కనిపిస్తుంది."
                       
"నీతో మాట్లాడుతూ కూర్చుంటే అయినట్టే. అవతల పేపర్లు దిద్దుకోవాలి." అంటూ బాబాయి తప్పుకున్నాడు. నాకు ప్రశాంతంగా కూర్చుని "పాపం!" చదువుకునే అవకాశం దొరికింది.

(కొడవటిగంటి కుటుంబరావు నవల 'ఐశ్వర్యం' నుండి)
   కుటుంబరావు సాహిత్యం.
   మొదటి సంపుటం.
   ప్రధమ ముద్రణ - జనవరి, 1982.  
   పేజీలు .. 143 - 144  
   రచనా కాలం .. 1965 - 66 .  
   సంపాదకుడు - కేతు విశ్వనాథరెడ్డి .
   విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ .

(photos courtesy : Google)