Friday 1 July 2011

రావిశాస్త్రిని గాంచిన వేళ


(ఈ పోస్టులోని ప్రతి వాక్యాన్నీ చాలా యిష్టంతో రాసుకున్నాను. దీన్ని రావిశాస్త్రి పుట్టిన్రోజున 'సాక్షి'లో వేశారు. అందుగ్గానూ - పూడూరి రాజిరెడ్డిగారు నాకు ఫోన్ చేసి 'ఒక్క అక్షరం కూడా మార్చను, ప్రచురణకి అనుమతివ్వండి' అని అడగడం నన్ను సంతోష/ఆశ్చర్య పరిచింది.)
రావిశాస్త్రిని గాంచిన వేళ :
"ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలోసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒకుడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలోసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజిరు!.."
ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇలా రాయడం వొక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. ఇది 'మూడుకథల బంగారం'లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం.
ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌస్ సర్జన్సీలో వుండగా 'ఆరుసారా కథలు' చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం.. దిమ్మ తిరిగిపోయింది.
అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరవాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! 'పీజీ ఎంట్రన్స్‌కి ప్రిపేరవ్వాలిగానీ నీకీ రావిశాస్త్రి పిచ్చేమిటి?' అంటూ నా మిత్రులు విసుక్కునేవారు.
ఆరుసారా కథల్తో యెక్కిన మత్తు దిగలేదు, యింకా యెక్కువైంది! ముత్యాలమ్మ, నరసమ్మ, సింహాచలం, మందుల భీముడు, గేదెల రాజు, పీనుగ్గుమాస్తా, అడ్డబుర్ర, దూదిపులి, లచ్చయ్యమ్మ, రాజయోగి పెదనాయన, సూర్రావెడ్డు, సిత్తరలేగ్గాడు, కుక్కమూతి పంతులు.. రావిశాస్త్రి పాత్రలు స్వార్ధంగా, మురికిగా, దుర్మార్గంగా, దారుణంగా, పేదగా, దొంగగా, కంత్రీగా, కసిగా, కుట్రగా, లేకీగా, అలగాగ, అసహ్యంగా, దుఃఖంగా, బాధగా వుంటాయి.
బంగారిగాడి చెల్లి శవం బావిలో తేలినప్పుడూ, వియత్నాం విమల గుడిమెట్ల మీద చనిపోయినప్పుడూ, లచ్చయ్యమ్మ తల్లిని జనాలు రాళ్లతో కొట్టి చంపినప్పుడూ.. అనేక సందర్భాల్లో నన్ను ఘోరంగా యేడిపించిన రావిశాస్త్రి రచనలకి గులామునైపొయ్యాను. ఇంత అద్భుతంగా రాసిన రావిశాస్త్రి యెలా వుంటాడు?
యిప్పుడు నాలో కొత్త ఆలోచన మొదలైంది. విశాఖపట్నం వెళ్ళాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్ళడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను నాకెవరు సాయం చెయ్యగలరు? ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య.
'రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?' నా స్నేహితుడి ప్రశ్న.
'దేవుణ్ని దర్శనం చేసుకోవాలి, కుదిర్తే కాళ్ళ మీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!' నా సమాధానం.
రావిశాస్త్రిని కలవాలనే నా భీభత్స ప్రయత్నాలు కొనసాగుతుండగా - ఒకరోజు రాత్రికిరాత్రే హడావుడిగా విశాఖపట్నం ప్రయాణం! కారణం - నాకు అత్యంత ఇష్టుడైన మా గురువుగారు, సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఈఎన్బీశర్మగారి అవసానదశ. పనిలోపని, రావిశాస్త్రిని కలవడానికి వీలైనంత ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించుకున్నాను.
విశాఖలో ఉదయం ప్రొఫెసర్ శర్మగారినీ, (శర్మగారి సతీమణి, మైక్రోబయాలజీ ప్రొఫెసర్) అన్నపూర్ణ మేడంగారినీ కలిశాను. మనసంతా బరువుగా అయిపొయింది. పొరబాటు చేశాను, శర్మగారిని ఆ స్థితిలో చూడకుండా వుండాల్సింది. ఇహ నా రెండోపని - రావిశాస్త్రిని చూడ్డం. గుండెల్లో బరువు స్థానం ఉత్సాహం ఆవహించింది. దురదృష్టం - ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు కాపలా కాసినా ఆయన్ని చూళ్లేకపొయ్యాను.
కొన్నాళ్ళకి అదృష్టం ధనలక్ష్మి లాటరీ టిక్కెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను 'భలే మంచిరోజు, పసందైన రోజు' అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు దగ్గరకి చేరుకున్నాను.
అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనో పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురు చూడసాగాను. ఒక్కొక్కళ్లుగా సభస్థలానికి చేరుకుంటున్నారు.
'రావిశాస్త్రి రాలేదా?' కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ, బోల్డంత ఆత్రుత.
ఓ పదినిమిషాలకి అరచేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేం కళ్ళద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తిని పోల్చుకున్నాను, ఆయన నాకు అనేక ఫోటోల ద్వారా చిరపరిచితం.. ఆయన రావిశాస్త్రి!
అక్కడున్నవారిలో కొందరు ఆయనకి నమస్కరించారు, ఆయన ప్రతి నమస్కారం చేసుకుంటూ నాకు రెండడుగుల దగ్గర్లోకి వచ్చాడు. క్షణాలు లెక్కపెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురు చూసిన నేను - తీరా ఆయన అంత దగ్గరగా వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను.
కొందరు రావిశాస్త్రితో మాట్లాడ్డం మొదలెట్టారు. నేను గుడ్లప్పగించి రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సమీపంలోనే నిలబడిపొయ్యాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్నని ఆయనకెవరో చెప్పారు.
నావైపు చూస్తూ "మా చెల్లెలు నిర్మల తెలుసా?" నిదానంగా అడిగారు.
"తెలుసు, నిర్మలా మేడమ్ నాకు ఫార్మకాలజి పరీక్షలో ఎక్ష్టర్నల్ ఎక్జామినర్." అని గొంతు పెగుల్చుకుని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే!
రావిశాస్త్రి ప్రక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను), ఒక్కమాటా మాట్లాడలేదు. అక్కడున్నవారు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. 'రాజు - మహిషిని ఎప్పుడు పూర్తిచేస్తారు? 'రత్తాలు రాంబాబుని పూర్తి చెయ్యకుండా ఎందుకు వదిలేశారు?' వంటి రొటీన్ ప్రశ్నలే యెక్కువ. అవన్నీ నా మనసులోనూ మెదలాడే ప్రశ్నలే!
నేను తెలివైనవాణ్ని, అందుకే మాటల్తో నా సమయం వృధా చేసుకోదల్చలేదు. కళ్ళు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు, ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తినీ కలిగిస్తుంది.
ఇప్పుడనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను!? ఆయన రాసిన ప్రతివాక్యం నాకెంతో యిష్టం. పరిసరాల వర్ణనలూ, సంఘటనలూ, పాత్రలూ, సిమిలీలు.. అన్నీ నాకు కొట్టిన పిండి. ఆయన్తో సంభాషణ కలుపుకోడం చాలా చిన్నవిషయం. మరి నేనెందుకు నోరు మెదపలేకపొయ్యాను?!
ఒక అద్భుత సంఘటన చూస్తున్నప్పుడు, మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు.. ఆ దృశ్యసౌందర్యానికి స్పెల్‌బౌండ్ అయిపోయి.. చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆరోజు నాస్థితి అట్లాంటిదేనా?
అయ్యుండొచ్చు!
(posted in fb on 30 Dec 2017)