Thursday, 5 January 2012

మా సుబ్బారెడ్డి మామ

"అల్లుడూ! అర్జంటుగా రా! నీతో చానా విషయాలు మాట్లాడాల." అని కబురంపాడు మా సుబ్బారెడ్డి మామ.

సుబ్బారెడ్డి మామ మాట నాకు శాసనం. ఆఫీసుకి సెలవు పడేసి హడావుడిగా మాఊరికి బయల్దేరాను. మా ఊరు గుంటూరు టౌనుకి దగ్గర్లో వుంటుంది. ఒకప్పుడు పల్లెటూరు, ఇప్పుడు పట్నంలో కలిసిపోయింది.

సుబ్బారెడ్డి మామ ఆజానుబాహుడు, నల్లటి శరీరం, తెల్లటి జుట్టు, బుర్రమీసాల్తో గంభీరంగా వుంటాడు. ముతక ఖద్దరు గుడ్డతో బనీను, దానికో పెద్దజేబు, జేబులో పొగాక్కాడలు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని బావమరిది కోటిరెడ్డికి ఇచ్చుకుని ఇంట్లోనే వుంచుకున్నాడు. రెండోఅమ్మాయి భర్త బెంగుళూర్లో ఇంజనీర్.

సుబ్బారెడ్డి నాకు మేనమామ. నేను చిన్నతనంలో మా నాయన్ని కోల్పోయాను. దిక్కుతోచని స్థితిలో వున్న మా కుటుంబాన్ని మా మామ అన్నివిధాలుగా ఆదుకున్నాడు, నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది మామ చలవే. మామ సాయం లేకపోతే నేను మాఊళ్ళో ఏ గొడ్లో కాసుకుంటూ వుండేవాణ్ని. నాకు సుబ్బారెడ్డి మామంటే అమితమైన గౌరవం, వల్లమాలిన అభిమానం.

ఒకప్పుడు మామ పొద్దున్నే సద్దిబువ్వ తిని పొలానికెళ్ళి రైతువారీ పనుల్లో బిజీగా వుండేవాడు. మా వూరు పట్నంలో కలిసిపొయ్యాక వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లరూపాయిల ధనరాసులుగా మారిపొయ్యాయి. మా సుబ్బారెడ్డి మామ తెలివిగా, అవసరానికి మేర భూముల్ని కొద్దికొద్దిగా అమ్ముతూ గుంటూర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాడు. పెద్దమనవడికి డొనేషన్ కట్టి డాక్టర్ కోర్స్ చదివిస్తున్నాడు. ఈమధ్య శ్మశానం అభివృద్ధికీ, గుడి నిర్మాణానికి చందాలిచ్చి పుణ్యాత్ముడని పేరూ సంపాదించాడు.

ఊరికి చేరుకునేప్పటికి సాయంత్రం ఏడయింది. "ఏవిఁరా! మీమామ పిలిస్తేగానీ మనూరు గుర్తుకు రాదా?" అంటూ అత్త నవ్వుతూ పలకరించింది. టీవీలో ఏదో రాజకీయ చర్చ చూస్తున్న సుబ్బారెడ్డి మామ అల్లుడు కోటిరెడ్డి నన్నుచూసి ముఖం అటుగా తిప్పుకున్నాడు, మనసు చివుక్కుమంది. యేదో పనుండి మామ బయటకి వెళ్ళాట్ట, అన్నం తినే వేళకి వచ్చాడు. నన్ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు.

భోజనాలకి నేను, మామ, కోటిరెడ్డి పీటల మీద కూర్చున్నాం. ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు, మామకి అట్లా కింద కూర్చుని తినడమే ఇష్టం. నాటుకోడి ఇగురు, గారెలు, చేపల పులుసు. అన్నీ నాకిష్టమైనవే! అందులో మా అత్త చేతివంట. అత్త కొసరికొసరి వడ్డిస్తూ తినిపించింది.

భోజనాలు అయ్యాక వరండాలో నవ్వారు మంచాల మీదకి చేరాం. మామ పొగక్కాడ సాపు చేసుకుంటూ అసలు విషయంలోకి వచ్చాడు. 

"రవణారెడ్డి! ఈమధ్యన మన కోటిరెడ్డి కొత్త ఆలోచనలు చెప్తా ఉండాడు. ఏది చేసినా నీతో ఆలోచన సెయ్యకుండా ఏదీ సెయ్యను. నువ్వూ, కోటిరెడ్డి ఒక మాటనుకుంటే నాకు దైర్నం." అంటూ చుట్ట కట్టటం మొదలెట్టాడు.

"అన్నా! ఏందా ఆలోచన?" ఆసక్తిగా కోటిరెడ్డిని అడిగాను.

కోటిరెడ్డి ఒకక్షణం ఆలోచించి మాట్లాడాడు. 

"తమ్ముడూ! మన్దగ్గర డబ్బుంది, ఊళ్ళో మంచిపేరుంది. ఈ రోజుల్లో ఇయ్యి మాత్రమే సరిపోతయ్యా? సరిపోవు. డబ్బున్నోడికి పలుకుబడి కూడా వుంటేనే అందం చందం. మరి పలుకుబడి యాడుంది? డబ్బులో వుందా? లేదు. మరెందులో వుంది? అధికారంలో ఉంది. మరా అధికారం యాడుంది? అధికారం రాజకీయ నాయకుల చేతిలో వుంది. ఆ అధికారం, వోదా ముందు మన్డబ్బు చిత్తుకాయితంతో సమానం! ఆ యవ్వారవే యేరు."

నాకు విషయం అర్ధమైంది. కోటిరెడ్డి రాజకీయాల్లో దిగాలనుకుంటున్నాడు. సుబ్బారెడ్డి మామకి నా సలహా కావాలి. నేనడ్డం కొడతానని కోటిరెడ్డి అనుమానం. ఆలోచిస్తూ మౌనంగా వుండిపొయ్యాను.

చుట్ట నోట్లో పెట్టుకుంటూ నావైపు చూస్తూ "ఏమిరా! ఉలుకూ పలుకూ లేకుండా అట్లా కూకున్నావ్?" అన్నాడు మామ.

"మామా! ఈ యవ్వారం మీరూమీరు మాట్లాడుకోండి. మధ్యన నేన్దేనికి?" పొడిగా అన్నా.

మామ పెద్దగా నవ్వాడు. "ఏందిరో! అయిదరాబాదు నీళ్ళు బాగా వంటబట్టినయ్యే. పరాయోడిలా గుట్టుగా మాట్లాడతా వున్నావు. సదువుకున్నోడివి, తెలివైనోడివి, మనోడివనీ నిన్ను అర్జంటుగా పిలిపిస్తిని. నువ్వేంది ఎనకా ముందాడతా వున్నావు?" అంటూ అగ్గిపుల్ల వెలిగించి చుట్టకొనకి నిప్పంటించాడు.

మామ ఈమాట అనంగాన్లే నాకు చాలా సంతోషమేసింది. ఇంక నేను నా మనసులో మాట సూటిగా చెప్పొచ్చు, కోటిరెడ్డి ఏమనుకుంటాడోనని సందేహం అనవసరం.

"రాజకీయాలకి బయట వుంటూ చేసే విశ్లేషణ వేరు, రాజకీయాన్ని ఒక కెరీర్‌గా ఎంచుకునేప్పుడు చెయ్యాల్సిన ఆలోచన వేరు. మన రాజకీయ అవసరాలు, ఆయా పార్టీ భవిష్యత్తుల్ని అంచనా వేసుకోవాలి. ఒక పార్టీ ఫిలాసఫీ గొప్పగా ఉండొచ్చు, ఆపార్టీని నడిపించే నాయకుడూ మంచోడయ్యుండొచ్చు. కానీ మనకి అవకాశాలివ్వని పార్టీ ఎంత మంచిదైనా మనకి అనవసరం."

నా మాటల ధోరణికి కోటిరెడ్డి మొహం చిట్లించాడు.

"ఆపరా నాయనా, ఆపు నీసోది. బావా! ఈడు భయస్తుడు. అవకాశాలు చూసుకోటానికి ఇదేమన్నా ఉద్యోగమా! ఇదంతా నాకనవసరం. మనకి మన కులపోళ్ళ పార్టీ వుంది, ఇంకోపార్టీ గురించి ఆలోచిస్తే ఎంత నామర్దా!" అన్నాడు కోటిరెడ్డి.

"నువ్వు తగ్గు, ఆణ్ణి చెప్పనీ." అంటూ కొటిరెడ్డి వైపు చూస్తూ చుట్టపొగ గుప్పున వదిలాడు సుబ్బారెడ్డి మామ.

నేను మాట్లాడసాగాను. "మామా! ఒప్పుకుమంటున్నాను. రాజకీయాల్లో మనకి మనోళ్ళ పార్టీనే ఫస్ట్ చాయిస్. కానీ ఆలోచించు. సపోజ్ మనం రాజకీయంగా మన పార్టీలో దిగాం అనుకుందాం. అప్పుడేమవుద్దీ? ఎలక్షన్ల దాకా పార్టీకయ్యే ఖర్చు మన్చేతే పెట్టిస్తారు. పోనీ సీటు గ్యారంటీనా అంటే అదీ వుండదు. టిక్కెట్లిచ్చేప్పుడు కులాలు, మతాలు లెక్కేలేస్తారు. చివరాకరికి టిక్కెట్టు ఇంకెవరికో ఇవ్వొచ్చు."

మామామని ఎట్లాగైనా రాజకీయాల్లోకి దించాలని పట్టుదలగా వున్నాడు కోటిరెడ్డి.

"యేందిరా నువ్వు! మనోడి పార్టీలో చేరటానికి నువ్విట్టా లాభనష్టాలు లెక్కేస్తావేంది. బావా! నాకీలెక్కలు అనవసరం. నేను మనోడి పార్టీలో చేర్తన్నా, ఎలక్షన్ల గెల్చి ఎమ్మెల్యేనైతా. ఈ రవంణారెడ్డిగాడితో నాకు మాటలేంది?"

ఆరిపోయిన చుట్ట ముట్టించుకుంటూ నాకేసి చూశాడు మామ.

"మామా! నా దృష్టిలో రాజకీయాలు పేకాటతో సమానం. వందమంది ఆరిపోతే ఒక్కడు పైకొస్తాడు. వున్న వూళ్ళో దర్జాగా హాయిగా కాలుమీద కాలేసుకుని బతుకుతున్నాం. రాజకీయాల్లోకి దిగితే ఆ వొచ్చే పదవేందో గానీ, విమర్శలు మాత్రం దారుణంగా ఎదుర్కోవాలి. ఇయ్యన్నీ మనకి అవసరమా?" అన్నాను.

"థూ నీయవ్వ! నువ్వసలు మడిసివేనా! పిరికిముండాకొడుకులు ఎంత సదూకుంటే మాత్రం యేం లాభం, గుండెకాయలో ధైర్నం లేనప్పుడు." కయ్యిమన్నాడు కోటిరెడ్డి.

"అన్నా! ఎందుకు నామీద కోపం జేస్తావ్! మామ అడగబట్టే కదా నేజెబుతుండా! ఈ రాజకీయాలు రొచ్చుగుంటలాంటివి. పార్టీని నీ చేతిలో పెడుతున్నామంటారు, పార్టీకి నువ్వే దిక్కంటారు. నీచేత గాడిద చాకిరి చేయించుకుంటారు. తీరా ఎలక్షన్ల సమయానికి వాళ్ళేసే కూడికలు, తీసివేతల్లో నీకు టికెట్ రాకపోవచ్చు. ఇట్లా దెబ్బ తిన్నోళ్ళని ఎంతమందిని చూళ్ళేదు. ఎవరో ఎందుకు? మన కిష్టారెడ్డిని చూడు. పాపం! పొలమంతా అమ్ముకున్నాడు, అప్పులపాలయ్యాడు. ఈ రాజకీయాల్లో ఏదయినా జరగొచ్చు. ఏదీ జరక్కపోవచ్చును కూడా! ఏదైతే అదైంది, పోతేపోయింది వెదవ డబ్బేగదా అనుకుంటే ఇందులోకి దిగు." అంటూ చెప్పదం ముగించాను.

"శెబాస్ అల్లుడు! ఇషయం ఇడమర్చి సెప్పావ్!" మెచ్చుకోలుగా అన్నాడు సుబ్బారెడ్డి మామ.

ఆవేశంతో ఊగిపోయాడు కోటిరెడ్డి. "రే రవణారెడ్డిగా! నీలాంటి ఎదవనాకొడుకు మన కుటుంబంలో ఉంటం మా దరిద్రం రా! గుడిసేటి నాయాలా." అంటూ అరిచాడు.

"ఏందిరా పెద్దంతరం చిన్నంతరం లేకండా నాముందే నోరు లేస్తా ఉండాది. ఆడి ఆలోసెన ఆడు సెప్పాడు, ఇందులో నేకేంది నెప్పి." అంటూ ఆరిపోయిన చుట్టని పడేశాడు సుబ్బారెడ్డి మామ.

కోటిరెడ్డి పెద్దగా అరుస్తూ విసురుగా వెళ్ళిపోయాడు.

నాకు బాధేసింది. కోటిరెడ్డి నన్ను అంతేసి మాటలంటాడని ఊహించలేదు. రాత్రంతా కలతనిద్ర. మామాఅల్లుళ్ళ మధ్య అనవసరంగా ఇరుక్కున్నానేనోమోనన్న భావన నన్ను సరీగ్గా నిద్ర పోనీయలేదు. రకరకాల ఆలోచనలు.

'ఏదో ఒకరకంగా డబ్బు గడించి అధికారమే పరమావధిగా రాజకీయాల్లోకొస్తున్నారు. ఇప్పుడున్న నాయకులేమన్నా ఆకాశం నుండి వూడిపడ్డారా! నా మధ్యతరగతి నేపధ్యం, ఉద్యోగ మనస్తత్వంతో అనవసరంగా కోటిరెడ్డిని నిరుత్సాహపరిచానా? ఏమో!'

-----

గుంటూరు నుండి హైదరాబాదుకి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ఉదయానే ఐదున్నరకుంది. ఇంక వుండాలనిపించట్లేదు. తెల్లారుఝాము నాలుగింటికి లేచి బట్టలు సర్దుకుంటుంటున్నాను. నెమ్మదిగా నా గదిలోకొచ్చాడు సుబ్బారెడ్డి మామ.

"ఏమిరా అల్లుడూ! ఇంకో నాలుగు దినాలు వుండి పోవచ్చుగదా! ఆడేమి కొంపలు మునిగిపోతున్నాయి."

"మామా! ఆఫీసులో అర్జంటు పని, రాత్రే ఫోనొచ్చింది. ఇప్పుడు బయల్దేరితే ఆఫీస్ టైంకి అందుకోవచ్చు."

నా కళ్ళల్లోకి చూశాడు సుబ్బారెడ్డి మామ.

"అల్లుడూ! అర్ధమయ్యింది, నీ మనసుకి కష్టం కలిగింది. ఈ రాజకీయాల్లోకి దిగితే ఉన్నది వూడుద్దని నాకూ తెలుసు. కానీ కోటిరెడ్డికి రాజకీయం పిచ్చ పట్టింది. మరీ బడాయికి పోతా ఉండాడు. ఎన్ని సుట్లు సెప్పినా బుర్రకెక్కట్లా. నన్నేమన్లేక పెళ్ళాన్ని తిడతా ఉండాడు. గట్టిగా సెబుదామంటే.. పిల్లనిచ్చుకున్నానాయే. కడుపు సించుకుంటే కాళ్ళమీద పడుద్ది. నీసేత ఆ నాలుగు ముక్కలు సెప్పిస్తే, అయ్యడ్డం పెట్టుకుని ఆణ్ణి కొన్నాళ్ళు ఆపొచ్చు. అందుకే నిన్ను అడావుడిగా పిలిపించా."

నేను ఆశ్చర్యపొయ్యాను. నేనేదో తెలివైనోణ్ణననుకుని రాత్రి రాజకీయాల గూర్చి క్లాస్ పీకా. మామ తను చెప్పదలిచింది నాతో చెప్పిచ్చాడు. తను మంచోడిగా మిగిలాడు. ఎటోచ్చి కోటిరెడ్డి దృష్టిలో సైంధవుణ్ణి నేనే! ఇంత తెలివైన సుబ్బారెడ్డి మామకి రాజకీయాలొద్దని తప్పు సలహా చెప్పానా!

"అల్లుడూ! నిన్న కోటిరెడ్డన్న మాటలు మనసులో పెట్టుకోమాక." అంటూ చటుక్కున నా రెండు చేతులు పట్టుకున్నాడు మామ.

నాకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. "ఎంత మాటన్నావ్ మామా! నీ కోసం నేను చావటానిక్కూడా సిద్ధం! అట్లాంటిది నీకోసం మాట పడ్డం ఎంతపని? అవసరమైతే మళ్ళీ కబురంపు." అని మామ కాళ్ళకి నమస్కరించి రైల్వే స్టేషన్ కి బయలుదేరాను.