Tuesday 17 January 2012

కథల్ని వండడం ఎలా?

"నాన్నోయ్! ఆకలి, నూడిల్స్, అర్జంట్." మా అబ్బాయి బుడుగు ఆర్తనాదం! న్యూస్‌పేపర్ చదువుతూ ప్రపంచ రాజకీయాల్ని తీవ్రంగా ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడ్డా.

మావాడికి గుండెపోటులాగా 'ఆకలిపోటు' అనే రోగం వుంది, హఠాత్తుగా ఆకలి కేకలు వినిపిస్తాడు. నా భార్య ఇంట్లో లేదు, వంటావిడ ఇంకా రాలేదు. 'ఖర్మరా బాబు' అని సణుక్కుంటూ నూడిల్స్‌గా పిలవబడుతున్న వానపాముల్ని పోలిన పదార్ధ తయారీ కార్యక్రమం మొదలెట్టాను.

నాకు రెండే రకాల వంటకాలు వచ్చు. ఒకటి నూడిల్స్, రెండు ఆమ్లెట్. 'క్రీస్తుపూర్వం నుండి వంటకాలు రుచి చూస్తున్నాను, మరి ఇంతకాలం వంటెందుకు నేర్చుకోలేకపొయ్యానబ్బా!' ఆలోచనలో పడ్డా. వెంటనే అనుబంధ ప్రశ్న. 'అనేకరకాల రచనలు చదుతున్నాను గదా, మరి నేను రచయితని ఎందుకు కాలేకపోయ్యాను?' ఇదేదో తీవ్రంగా యోచించవలసియున్నది.

కథలు రాయాలంటే, ముందుగా మంచికథలు పుంజీలకొద్దీ చదివి, ఒక లోతైన అవగాహనతో రాయాలని పెద్దలు వాకృచ్చారు, ఒప్పుకుంటున్నా. మరి వంట బాగా చెయ్యాలంటే అనేక రుచులు తెలిసుండాలా?

మంచి కథకుడు కావాలంటే ప్రపంచ సాహిత్యాన్ని మధించాలని చెప్పాడు శ్రీశ్రీ. ఆ మధించే ప్రోగ్రాంలో మనం ముసిలాళ్ళయిపోవచ్చు. మంచి తెలుగు రాయాలంటే మంచి ఇంగ్లీషు చదవమని రావిశాస్త్రికి సలహా ఇచ్చాడు శ్రీశ్రీ! హాయిగా గుప్పిడి బిగించి గుప్పుగుప్పుమంటూ దమ్ము కొడుతూ ఎన్నయినా సలహాలిస్తాడు శ్రీశ్రీ. చదవలేక చచ్చేది మనమే కదా! ఒకవేళ చచ్చీచెడీ చదివినా, చివరాకరికి మన బ్రతుకు 'చదవేస్తే ఉన్న మతి కాస్తా పోయింది లాగా అయిపోవచ్చు!

నాకు వంటవాళ్ళు రచయితలు ఒకానొకప్పుడు అన్నదమ్ములనీ, మన్‌మోహన్ దేశాయ్ సినిమాలోలా యాక్సిడెంటల్‌గా తప్పిపొయ్యారనీ అనిపిస్తుంది. మంచి పాఠకుడు మంచి కథకుడు అవగలడా? మంచి కథకుడు మంచి పాఠకుడు అవుతాడా? తిండియావ గలవాడు మంచి వంటవాడు అవుతాడా? గొప్ప వంటవాళ్ళు మంచి తిండిపోతులా? అసలీ వంటకీ, రచనలకి గల సంబంధం యేమి?

విషయం కాంప్లికేట్ అయిపోతున్నందున - నా మేధావిత్వాన్ని తగ్గించుకుని, సింపుల్‌గా చెప్పటానికి ప్రయత్నిస్తాను. అందుకొరకు ఒక ఈక్వేషన్ -

వంట = కథ
మంచి వంట = మంచి కథ
చెత్త వంట = చెత్త కథ
వంటవాడు = రచయిత
భోంచేయువాడు = పాఠకుడు
తిండిపుష్టి గలవాడు = విపరీతంగా చదివే అలవాటున్నవాడు
తిండిపోతు = యేదిబడితే అది చదివి బుర్ర పాడుచేసుకునేవాడు

ప్రస్తుతానికి కథలు, రచనలు పక్కనబెట్టి వంటగూర్చి మాట్లాడుకుందాం. మీకు వంటంటే ఆసక్తి ఉందా? వంట చెయ్యడం మొదలెడాదామని అనుకుంటున్నారా? అయితే మీక్కొన్ని రుచులు తెలుసుండాలి. ఉదాహరణకి గుత్తివంకాయ కూర (ఇది నాకు అత్యంత ఇష్టమైనది కాబట్టి, ఇవ్వాల్టికిదే ఉదాహరణ).

అసలు గుత్తొంకాయ కూర రుచి తెలీకుండా గుత్తొంకాయ ఎలా చేస్తారు? చెయ్యలేరు. కాబట్టి ఆ గుత్తొంకాయని ఎప్పుడోకప్పుడు తినుండాలి. తిన్నారా? రుచి తెలుసుకున్నారా? ఇహనేం! ఆలశ్యం చెయ్యకుండా వెంటనే గుత్తొంకాయ వంట మొదలుపెట్టెయ్యండి.

ఇప్పుడు మీక్కావలసింది - నవనవలాడే పొట్టివంకాయలు, సెనగపొడీ, పచ్చిమిర్చి, ఉప్పూకారం వగైరా. ముందుగా వంకాయలకి నిలువుగా నిక్ ఇచ్చి, సెనగపొడి కూరండి. స్టవ్ వెలిగించండి, బాండీలో నూనె వేసి మరిగించండి. ఇప్పుడు వంకాయల్ని నూనెలో వేసి దోరగా వేయించండి, తరవాత ఉప్పూకారం చల్లండి. అంతే - గుత్తొంకాయకూర రెడీ! ఇప్పుడు కూరని పొయ్యి మీద నుండి దించండి. కొత్తిమీర, కరివేపాకు వెయ్యండి. రుచి చూడండి. రుచిగా లేదా? ఆయుర్వేద మందులా ఉందా? డోంట్ వర్రీ! గొప్పగొప్పోళ్ళ వంట మొదట్లో ఇలాగే తగలడుతుంది!

వండటంతో పని పని పూర్తవదు. ఇప్పుడు మీరు మీ కూరని రుచి చూడమని చుట్టపక్కాలు, దారినపోయే దానయ్యలు.. ఇలా కనిపించిన వారందర్నీ రిక్వెస్ట్ చెయ్యండి. అవసరమైతే బ్రతిమాలండి, వీలయితే బలవంతం చెయ్యండి, కుదిరితే బెదిరించండి. తప్పులేదు. వాళ్ళు మీ హింస భరించలేక చచ్చినట్లు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు.

'గుత్తొంకాయ రుచి కుదిరింది గానీ కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుండేది.' అనే మొహమాటపు కామెంట్లనీ, 'నీబొంద. ఈ ఫెవికాల్ పేస్టుని గుత్తొంకాయ అనికూడా ఈమధ్య అంటున్నారా?' అనే శాపనార్ధాల కామెంట్లని చిరునవ్వుతో స్వీకరించండి.

తప్పులు, పొరబాట్లు నోట్ చేసుకోండి. ఈసారి వండినప్పుడు మాత్రం గుత్తొంకాయ కూర ఇంతకన్నా బెటర్‌గా ఉండాలని గుర్తుంచుకోండి. ఇట్లా వచ్చీరాని వంట మొదలెట్టడం వల్ల మనకో గొప్ప మేలు చేకూరుతుంది. ఈరోజు నుండి మీపేరు కూడా వంటవాళ్ళ లిస్టులో నమోదయిపోతుంది.

వంటకం తినేవాడు, చేసేవాడు వేరువేరుగా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు మీ దృష్టికోణం మారుతుంది. నిన్నటిదాకా ఇతరుల వంట తిని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీ ఆలోచన 'ఈ వంకాయకూర నా కూర కన్నా బాగుంది. ఈ వంటవాడి కిటుకు ఏమై ఉంటుందబ్బా!' అంటూ సాటి వంటవాళ్ళ ఫార్ములా గూర్చి సీరియస్‌గా ఆలోచించటం మొదలెడతారు. ఈ జిజ్ఞాసే భవిష్యత్తులో మిమ్మల్ని మంచి వంటగాడిగా నిలబెడుతుందని గుర్తుంచుకోండి.

సో - మీ ప్రయాణం గుత్తొంకాయతో మొదలై - పులిహోర, ఉప్మాపెసరట్టు మీదుగా పెరుగావడలు దాటుకుంటూ 'ఎక్కడికో వెళ్ళిపోతుంది'. మీ విజయానికి కారణం? ఒక సాధారణ వంటకంతో మొదలెట్టి, ఏకాగ్రతగా దాన్నే ఇంప్రోవైజ్ చేస్తూ, తప్పులు రిపీట్ చెయ్యకుండా, అందరి వంటకాలని రుచి చూస్తూ, తద్వారా మీ వంటకాన్ని మెరుగు పరుచుకోవటం. ఇది చాలా సింపుల్ ప్రిన్సిపుల్! ఈ పద్ధతే ఫాలో అవుతూ ఇంకొన్ని వంటకాలు నేర్చుకోవటం ఇప్పుడు సులభం. ఇక్కడో ముఖ్యమైన పాయింట్ - బేసిక్స్ తెలుసుకుని త్వరగా మీ వంట మీరు ప్రారంభించాలి. బెస్టాఫ్ లక్.

ఇంకో సలహా. కొందరు దుష్టులకి దూరంగా ఉండండి. ఈ దుష్టులు మంచి రుచులు తెలిసిన తిండిపుష్టి గలవారు. మీచేత అనేకరకాల వంటకాలు తినిపిస్తారు. హైదరాబాద్ బిరియాని, మొఘలాయ్, తండూరి, చెట్టినాడ్, చైనీస్ - ఇట్లా అనేకరకాల, అత్యంత రుచికరమైన వంటలని, ది బెస్ట్ రెస్టారెంట్లలో తినిపిస్తారు. ది బెస్ట్ చెఫ్ లని పరిచయం చేస్తారు. ఆ వంటకాల గూర్చీ, ఆ వంటోళ్ళ గూర్చి మీకు కథలు కథలుగా చెబుతారు. వంట చెయ్యటం ఎంత పవిత్ర కార్యమో, ఎంత నైపుణ్యం కావాలో మీకు సోదాహరణంగా వర్ణిస్తారు.

తత్ఫలితంగా మీకు వంట పట్ల అపార భక్తిప్రవృత్తులు కలుగుతాయి. అందువల్ల మీరు కనీసం వంటిల్లు వైపు కన్నెత్తి చూడాలన్నా వణికిపోతారు. ఒకవేళ వెళ్ళినా, గ్యాస్ స్టవ్ వెలిగించటానికి కూడా భయం. ఇంకా మొండిగా గుత్తొంకాయకూర వండుదామని ఉపక్రమించినా - అప్పటికే మీమీద బలంగా పనిచేస్తున్న స్వదేశీ, విదేశీ వంటల ప్రభావం వల్ల మీ గుత్తొంకాయకూర కాస్తా 'వంకాయ తండూరి గుత్తి చౌచౌ కూర'గా రూపాంతరం చెందుతుంది. మీకు అన్ని రుచులు తెలుసు కాబట్టి, మీకూరకి మీరే సున్నా మార్కులు వేసేసుకుని, ఇంకెప్పుడూ వంట చెయ్యరాదని తీర్మానించేసుకుంటారు. ఇందుమూలంగా ఈ సమాజం ఒక వంటవాడిని కోల్పోతుంది.

ఇప్పుడు మనం ఈ వంటల చర్చని తెలుగు కథలు, రచయితల మీదకి మళ్ళిద్దాం. నాకు హైస్కూల్ రోజుల నుండి తెలుగు పత్రికలు చదివే అలవాటుంది.  థాంక్స్ టు చందమామ, ఆంధ్రపత్రిక అండ్ ఆంధ్రప్రభ. ఈ అనుభవంతో చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఒక వ్రాతపత్రిక నడిపాను. వెల ఐదు పైసలు.

నా స్నేహితుడు ఫణిగాడి తండ్రి వారణాసి సుబ్రహ్మణ్యంగారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్. ఆయన డబడబా టైపు కొడుతుండేవాడు. ఆయన వాడి పడేసిన కార్బన్ పేపర్లని డస్ట్ బిన్లోంచి సేకరించేవాళ్ళం. చేతులు నొప్పెట్టాలా (వెలిసిపోయిన కార్బన్లు కావున పెన్సిల్ని ఒత్తిపట్టి రాయాల్సొచ్చేది) ఠావుల నిండా కథలు రాసి, ఆ కాపీలని చుట్టుపక్కల ఇళ్ళల్లోవాళ్ళకి అమ్మేవాళ్ళం (అంటగట్టేవాళ్ళం).

మా రచనా బాధితులు మమ్మల్ని 'ఒరే! ఇంత చిన్నవయసులోనే ఇంత జబ్బపుష్టితో కథలు రాస్తున్నారు. పెద్దయ్యాక చాలా గొప్పకథలు రాస్తారు.' అని దీవించేవాళ్ళు. ఐదు పైసల పత్రికపై వచ్చిన లాభాలతో పుల్లైస్, పీచు మిఠాయి కొనుక్కునేవాళ్ళం. ఆవిధంగా చిన్నతనంలొనే వంట ప్రారంభించాను, లాభాలు గడించాను!

పెద్దయ్యాక - గుంటూరు మెడికల్ కాలేజీ మ్యాగజైన్ కోసం 'ప్రేమ పిచ్చిది, గుడ్డిది, కుంటిది..!' అని ఒక కథ రాశాను. అయితే అప్పటికే తెలుగు కథ మీద నాకు గౌరవం పెరిగిపోయి, 'నేను ఏ కథా రాయక పోవటమే తెలుగు సాహిత్యానికి నేను చెయ్యగల సేవ' అనే నిర్ణయానికి వచ్చేశాను. కానీ, మ్యాగజైన్ కోసం కథ రాయక తప్పలేదు. ఈ కథాకమామిషు తరవాత వేరేగా రాస్తాను.

రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూళ్ళేం గనుక, నా కథ నాకు మొగుళ్ళా కనిపిస్తుందని ముందే తెలుసు గనుక, అచ్చులో పడ్డ నా కథని నేనింతవరకూ చదవలేదు - అసలు పట్టించుకోలేదు! కారణం - 'కథలని చదువుటలో వున్న హాయి, రాయుటలో లేదని, నిన్ననే నాకు తెలిసింది' అని 'బుద్ధిమంతుడు'లో నాగేశ్వర్రావులా పాడుకుంటున్న కారణాన!

మరి నాకళ్ళకి కనిపించిన రాజు ఎవరు? ఏమీ తెలీని రోజుల్లోనే కట్టల కొద్దీ కాగితాలు ఖరాబు చేసిన నన్ను, కాగితం మీద కలం పెట్టటానికి కూడా చలిజ్వరం వచ్చినవాళ్ళా వణికిపోయేట్లు చేసిన ఆ పెద్దమనిషి ఎవరు? ఇంకెవరు! రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథశాస్త్రి! ఈ రావిశాస్త్రి నిర్దయుడు, స్వార్ధపరుడు. తెలుగు కథలని వెయ్యికిలోమీటర్ల ఎత్తుకి తీసికెళ్ళి, వేరెవ్వరూ దరిదాపులకి కూడా రాకుండా, చుట్టూతా పెద్ద కంచెని వేసుకున్నాడు. నావంటి అర్భకులు ఆ ఎత్తు, ఆ కంచె చూసి ఝడుసుకున్నారు!

మెడిసిన్ చదివేవాళ్ళకి సాహిత్యాభిలాష ఒక లక్జరి. ఎంట్రెన్స్లో చచ్చీచెడీ సీటు సంపాదించాం కనుక కొంచెం రిలాక్స్ అవుదాం అనుకునేలోపుగానే, ఎనాటమి అనే ఒక దుష్టదుర్మార్గ పరీక్ష వచ్చేస్తుంది. అటు తరవాత పెథాలజీ అనే ఒక రాక్షసి వస్తుంది. ఇట్లా రక్కసుల సంతతి మనమీద విడతలుగా దాడిచేసి, మనలో గుజ్జు లాగేసి టెంకని మిగులుస్తాయి. చాలాసార్లు 'ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ పాపిష్టి బ్రతుకు! ఈ నికృష్ట జీవితం' అని పాడుకోవలసి వచ్చేది. ప్రేమనగర్ సినిమాలో నాగేశ్వర్రావు పాడంగాన్లే వాణిశ్రీ వచ్చింది, నాకు మాత్రం పిశాచ పరీక్షలొచ్చేవి!

నాకు డిగ్రీ చదివే స్నేహితులు కూడా వున్నారు. వారి పరీక్షల పీడన, బాదరాయణం వుండేదికాదు. ఎక్కువగా రాజకీయ సాహిత్య చర్చలు చేస్తుండేవాళ్ళు. వాళ్ళమధ్య 'మౌనమే నీ మూగభాష' అంటూ పాడుకోవటం నాకు ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు చాలాసార్లు ఒకపేరు ప్రస్తావించేవాళ్ళు, ఆపేరు రావిశాస్త్రి! అసలీ శాస్త్రి సంగతేంటో తేల్చాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళ దగ్గర రావిశాస్త్రి 'బాకీకథలు' బాకీగా తీసుకున్నాను.

'ఎవడు వీడు? ఎచటివాడు? ఇటువచ్చిన శాస్త్రివాడు' అనుకుంటూ రావిశాస్త్రి పుస్తకం తెరిచాను. ఒక కథ చదవంగాన్లే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కథ అంటే ఇలాకూడా ఉంటుందా! తెలుగు ఇలాకూడా రాస్తారా! కొన్నిసంవత్సరాలుగా రుచీపచీ లేని మజ్జిగన్నం తిన్నవాడికి వున్నట్టుండి పులిహోర, గారెలు, దోసావకాయతో భోజనం రుచి తగిలితే ఎలా ఉంటుంది?! అప్పుడు సరీగ్గా నాకలాగే అనిపించింది. అన్ని కథలు చకచకా చదివిన తరవాత పుస్తకం మూసి ఆలోచనలో పడ్డాను.

ఇప్పటిదాకా తెలుగులో నేచదివింది అరటి, ఆవు కథలు. అవి అవడానికి కథలేమోగానీ గొప్పకథలు మాత్రం కాదు. రావిశాస్త్రి విస్కీ తాగుతాడు, మనకి తన 'రచనలు' అన్న విస్కీ పోస్తాడు. ఆల్కహాల్ ఎడిక్షన్ లాగానే రావిశాస్త్రి రచనలు కూడా ఒక ఎడిక్షనే! ఆల్కహాల్ని మానిపించటానికి సైకియాట్రిస్టులు ఉన్నారు. ఈ రావిశాస్త్రి ఎడిక్షన్‌కి డీ-ఎడిక్షన్ ఫెసిలిటీ లేదు!

తిరపతి లడ్డు తిన్నవాడికి ఇంకే లడ్డూ రుచిగా ఉండదు. బెజవాడ బాబాయ్ హోటల్లో ఇడ్లీ తిన్న తరవాత ఇంకెక్కడా ఇడ్లీ నచ్చదు. ఈ రుచులు ఎంత కమ్మగా ఉంటాయంటే, మనం వండటానికి ప్రయత్నం చెయ్యాలన్నాకూడా భయమేస్తుంది. వెరీ డిస్కరేజింగ్, కొండకచొ ఇంటిమిడేటింగ్.

ఈ అల్టిమేట్ రుచులు టేస్ట్ చెయ్యనివాడు అదృష్టవంతుడు. తానేదో వంటగాడిని అనుకుంటూ ఏదోకటి వండుతూనే ఉంటాడు. అలా వండగా వండగా వాడే ఓ మంచి వంటోడు అవ్వచ్చేమో! తినగ తినగ వేము తియ్యగానుండు! ఏదో ఒకటి - కథలు రాసీరాసీ కొన్నాళ్ళకి వాడే గొప్పరచయిత అవ్వొచ్చేమో!

కాబట్టి - కథలు రాయడం మొదలెడదామనుకునే మిత్రోత్తములారా! అనుభవంతో చెబుతున్నాను - మీరు రావిశాస్త్రిని చదవద్దు, చాలా డేంజరస్ రచయిత. అట్లని అసలు చదవకుండా ఉండొద్దు. వార పత్రికల్లో కథలు ఫాలో అవ్వండి, చాలు. ఎందుకంతే - అసలేం చదవకపోయినా కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చు. ఫిజిక్స్ కొంచెం కూడా తెలుసుకోకుండా ప్రయోగాలు చేస్తే - న్యూటన్ సూత్రాల్నే మళ్ళీ కనిపెట్టే డేంజరపాయం ఉంది! అట్లాగే సాహిత్యంలో నిరక్షరాస్యులమైతే, కన్యాశుల్కాన్ని (ఆల్రెడీ గురజాడ రాశాడని తెలీక) మళ్ళీ రాసే ప్రమాదం ఉంది, జాగ్రత్త!

"నాన్నోయ్! ఎంతసేపు? నాకు ఆకలేస్తుంది." బుడుగు గావుకేక.

"బుడుగమ్మా! వచ్చెవచ్చె, ఇదిగో నీ నూడిల్స్." అంటూ నూడిల్స్ సర్వ్ చేశాను.

ఉఫ్! అలవాటు లేని పని, పూర్తిగా అలసిపోయాను. మీకో రహస్యం చెబుతున్నాను, ప్రపంచంలో అన్నిపనుల్లోకల్లా కష్టమైనది నూడిల్స్ వంటకం!

ఇప్పుడు నాకో మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. ఖర్మఖర్మ! ఈ వంటావిడ ఇంకా రాలేదు. అవున్లేండి, వంట నేర్చుకోవాల్సిన రోజుల్లో కడుపునిండా తినడం మించి ఏమీ చెయ్యలేదు. హాయిగా తిని పడుకోవాల్సిన రోజుల్లో వండుతున్నాను, ఆ మాత్రం కష్టంగా ఉండదూ మరి!