Wednesday, 11 January 2012

రావిశాస్త్రి 'పిపీలికం'

"ఒరే పిపీలికాధమా! నేనవరిననా అడిగేవు? నేను సుఖభోగిని. నీ పాలిట మాత్రం కాలయముణ్ణి! ఇప్పుడు తెలిసిందా నేనెవరో? తెలిసింది కదా! మరి, నువ్వెవరో నీకు తెలుసునా? నీ ముఖం చూస్తే నీకింకా ఏమీ తెలియనట్టే ఉందిలే. నువ్వు ఈ లోకంలో ఒకానొక తుచ్ఛపు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం. అలా జరగాలనేది భగవదాదేశం. అందుచేత, మీ చీమ వెధవలంతా కష్టపడవలసిందే! మీ కష్టమ్మీద మేం సుఖించవలసినదే! మాకు అదే న్యాయం. అదే ధర్మం! కాదన్నవాణ్ణి కాటేసి చంపుతాం. ఇది మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లే. బాగానే ఉంది. మీ నిర్మాణ కౌశలానికి ముగ్ధుణ్ణయేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు నీకిది. పొండి. మరింక దీని సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది. అది మా హక్కు. ఆ హక్కు మాకు వాడూ వీడూ ఇచ్చింది కాదు. భగవంతుడే ఇచ్చాడు. ఇది ఇప్పట్నించీ నా ఇల్లు. బోధపడిందిరా చిన్నోడా. నీకేదో చదువులు చదివి పాఠాలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. ఈ దినానికి నీకీ పాఠం చాలు! మరో పాఠానికి మళ్ళీ రాకు. వచ్చేవంటే మిగతా పాఠాలన్నీ మరో లోకంలో నేర్చుకోవలసి ఉంటుంది. మరందుచేత వేగిరం నడువిక్కణ్నించి."

ఇది తనేవరో తెలుసుకోవాలని తపించిపోయిన చీమ(పిపీలికం)కి, దాని శత్రువయిన పాము చేసిన జ్ఞానోపదేశం. 'పిపీలికం'ని రావిశాస్త్రి 1969 లో రాశాడు. కథని జంతుపాత్రలతో, జానపదశైలిలో అద్భుతంగా నడిపిస్తాడు రావిశాస్త్రి. కథలో కష్టజీవిగా చీమనీ, శ్రమదోపిడీ చేసే వర్గశత్రువుగా పామునీ ప్రతీకలుగా ఎంచుకున్నాడు రావిశాస్త్రి.

కథాంశం 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి.' అన్న సుమతీ శతకం పద్యపాదం నుండి వచ్చింది. పురాతనమైన జంతుపాత్రల కథనం మనకి 'పంచతంత్రం' వల్ల బాగా పరిచయం. చందమామలో కూడా చాలా కథలు వచ్చాయి. అయితే ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇంత ప్రసిద్ధమైన ఈ తరహా రచన (నాకు తెలిసి) మరొకటి లేదు.

పూర్వం కృతయుగంలో శ్యామవనంలో నివసించే ఒకానొక చీమకి "నేనెవర్ని?" అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. తోటి చీమ సలహాపై గోపన్నపాలెం చేరుకుని నిగమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి కలిసి "నేనెవర్ని?" అని అడుగుతుంది. బ్రాహ్మణులకి మాత్రమే చదువు చెప్పాలనుకుని పేదరికంలో మగ్గుతున్న నిగమశర్మ, చదువుకుంటే చీమ సందేహం తీరుతుందంటాడు. అందుకు రోజూ ఒక గిద్దెడు నూకలు ఫీజుగా అడుగుతాడు. ఆ క్షణం నుంచీ ఎద్దులా కష్టపడి గింజగింజ చొప్పున గిద్దెడు గింజలూ ప్రతిదినం గురువుకి సమర్పించి చదువు నేర్చుకుంటుంది. చదువయిపోయిన తరవాత "నువ్వు చీమవి" అని సెలవిస్తాడు నిగమశర్మ.

కొంతకాలానికి చీమకి "అసలు చీమంటే ఏమిటి?" అని మళ్ళీ సందేహం వస్తుంది. నిగమశర్మ సలహాపై జన్నాలపల్లెలో చతుర్వేది అని పిలవబడే వేదవేదాంగవేద్యుడు వద్దకి చేరుకుంటుంది. చతుర్వేదులువారు చీమకి శుద్ధి చేసి, బ్రాహ్మణ్యం ఇప్పించి, తను చేయదలచుకున్న యజ్ఞానికి బంగారం ఫీజుగా ఇమ్మంటాడు. నిగమశర్మ ఫీజు గిద్దెడు నూకలైతే, చతుర్వేదిగారి ఫీజు బంగారం. నిగమశర్మది వీధి చివరి ఇంగ్లీషు మీడియం స్కూలయితే, చతుర్వేదిది కార్పొరేట్ విద్యాసంస్థ! సంవత్సరాల పాటు శ్రమించి రేణువు రేణువు చొప్పున హిరణ్యం సమర్పించుకుంటూ వేదాలు నేర్చుకుంటుంది మన పిచ్చిచీమ. చివరికి వేదసారం 'సోహం' అన్న ఒక్కమాటలో ఉందని చెబుతాడు చతుర్వేది.

బ్రహ్మజ్ఞానం పొంది కూడా తృప్తి నొందని చీమ ఒక మహాఋషిని దర్శిస్తుంది. ఆయన "యోగసాధన చేసి తపస్సు చెయ్యి. జన్మరాహిత్యం సంపాదించి మోక్షం సంపాదించు." సలహా ఇస్తాడు.

"ఏ జీవికైనా జన్మరాహిత్యం ఎందుకు? మోక్షం ఎందుకు?" అని అడిగితే సమాధానం రాదు.

నిరాశతో శ్యామవనంలోని తన పుట్టకి తిరిగొస్తుంది. అక్కడ తమ ఇంటిని ఒక రాక్షసాకారం (పాము) ఆక్రమించుకుని తన సోదర చీమలని తరిమేయ్యటం చూస్తుంది.

"ఇది అన్యాయం. అక్రమం. ఇలా మా ఇంటిని ఆక్రమించటం నీకు న్యాయమేనా?" అని పాముని గౌరవపూర్వకంగానే అడుగుతుంది చీమ.

అప్పుడు పాము బుసబుస నవ్వి చెప్పే మాటలు ఈ కథకి హై లైట్. పాము మాటలతో చీమకి తనెవరో జ్ఞానోదయం కలుగుతుంది.

"నువ్వు తుచ్ఛపు కష్టజీవివి."

తనెవరో పాము ద్వారా గ్రహించిన చీమ.. తన తోటి చీమలకి హితబోధ చేసి, ధైర్యం చెప్పి, వారిని వీరులుగా మార్చి, "రాక్షసాకారపు భగన్న్యాయం" మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడగట్టుకుని రంగంలోకి దిగుతుంది.

తత్ఫలితంగా, శ్యామవనంలో ఓ రాక్షసాకారం విలవిల తన్నుకుని నెత్తురు కక్కుకుని చచ్చింది. భూభారం కొంత తగ్గింది.  

(ఇంతటితో కథ అయిపోతుంది)

శాస్త్రాలు చెప్పని సత్యం, పండితులు దాచిన అసలు విషయం దాని శ్రమని దోపిడీ చేసిన పాము చెబుతుంది. జ్ఞానకాంక్ష కన్నా ఆకలి ఎంత శక్తివంతమైనదో చీమకి తెలిసివస్తుంది. 

వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన 'కథాశిల్పం'లో ఈ కథని విశ్లేషిస్తూ, 'శ్రమదోపిడీని చిత్రించటంతో పాటు భారతీయ వేదాంతం శ్రమదోపిడీకి ఎలా సహకరించిందో, దాన్ని ఎలా ప్రోత్సాహించి, ఒక వ్యవస్థగా తయారుచేసిందో కూడా ఈ కథ సూచిస్తుంది.' అని అభిప్రాయపడ్డారు.

రావిశాస్త్రి 'పిపీలికం' కథావస్తువుని ఈ శైలిలో ఎందుకు రాసి ఉంటాడు? 'మిత్రబేధం'లో కుట్రలకీ, కుతంత్రాలకి నక్కలని, రాజుగా సింహాన్ని ప్రతీకలుగా వాడుకున్నట్లు, తన కథకి అవసరార్ధం కష్టజీవికి ప్రతీకగా చీమనీ, దోపిడీదారుకి సంకేతంగా పామునీ ఎంచుకుని ఉండొచ్చు. 

పాములు చీమల పుట్టని సొంతం చేసుకుంటాయి. ప్రకృతిలో ఇదో సహజ ప్రక్రియ. కాబట్టి రావిశాస్త్రి చెప్పదలచుకున్న విషయానికి ఈ చీమ, పాము సారూప్యం అతికినట్లు సరిపోతుంది. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. కాబట్టే ఈ కథ మన మనసుకి బలంగా హత్తుకుపోయింది.

అసలు రావిశాస్త్రి సరదాగా చందమామకి ఒకకథ రాసి పంపాడనీ.. దాన్ని కొడవటిగంటి కుటుంబరావు చదివి, 'ఇంత పెద్దకథని మా చందమామలో వేసుకోం.' అని పురాణం సుబ్రహ్మణ్యశర్మకి పంపి ఆంధ్రజ్యోతిలో అచ్చేయించాడనీ, మా సుబ్బు గాలివార్త చెబుతుంటాడు. నేను సుబ్బు మాటలు పట్టించుకోను. 

సుబ్బు మాత్రం 'మిత్రమా! యూ టూ బ్రూటస్! ఈ టెల్గు పీపుల్ ద్రౌపది మనసులో ఏముందో రాస్తే జ్ఞానపీఠమిస్తారు. నిన్నగాకమొన్నదాక మన్తో వున్న కుటుంబరావు మనసులో మాట చెబితే నమ్మరు!' అని చిరాకు పడతాడు.

సాహితీ విమర్శకులు, ప్రేమికులు ఈ కథని అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వున్నవాళ్ళు ఈ కథని చదనట్లయితే, అర్జంటుగా చదివెయ్యండి, మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. ఈ కథ చదవనివారిని చదివించే దిశగా మళ్ళించటమే ఈ పోస్ట్ లక్ష్యం.