Friday 11 January 2013

ఘంటసాలా! ఓ ఘంటసాలా!

"ఘంటసాల గొప్పేంటో నాకర్ధంకాదు. ఆయనకా స్వరం దేవుడిచ్చిన వరం, అందులో పదోవంతు వాయిస్ నాకున్నా ఆంధ్రదేశాన్ని ఊపేసేవాణ్ణి." అనేవాడు నా స్నేహితుడు.

"నిజమేకదా!" అనుకునేవాణ్ణి.

మరి మన తెలుగువారిలో ఘంటసాలంతటి చక్కటి గాత్రం కలవారెవరూ లేరా? ఉండొచ్చు. ఘంటసాలకున్నంత శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం కలవారు ఇంకెవరూ లేరా? ఉండొచ్చు. మరి మనం ఘంటసాలనే ఇంకా ఎందుకు తలచుకుంటున్నాం? ఇందులో మతలబు ఏమిటి? విషయం నా స్నేహితుడు చెబుతున్నంత సింపుల్ కాదు.

సినిమా పాటలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమా అనేది దృశ్యరూపం. తెరపై సన్నివేశాలు నడుస్తుంటయ్, పాత్రధారులు నటిస్తుంటారు. ప్రేక్షకులు కథలో లీనమైపోతారు, వున్నట్లుండి పాట మొదలవుతుంది. అప్పటిదాకా తన గొంతుతో మాట్లాడిన పాత్రధారి హఠాత్తుగా గాయకుని గొంతులోకి మారిపోతాడు. ప్రధాన నటుడు సినిమాలో యెక్కువసేపు కనపడతాడు, ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి అతనికి కావలసినంత సమయం ఉంటుంది. ఆ సౌలభ్యం గాయకులకి ఉండదు, వారి సమయం పాటకే పరిమితం. ఆ కొద్దినిముషాల్లోనే నటుణ్ణీ, సన్నివేశాన్నీ ఎలివేట్ చెయ్యగలగాలి.

నా వాదనకి ఉదాహరణగా 'పాండురంగ మహత్యం' పాటని ప్రస్తావిస్తాను. కాళ్ళు కోల్పోయిన పుండరీకుడు 'అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా, ఆవేదన తీరు రోజు ఈ జన్మకి లేదా' అంటూ తలిదండ్రుల కోసం పరితపిస్తూ పాడతాడు. పాట చివర్లో 'అమ్మా! నాన్నా!' అంటూ ఆర్తనాదాలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తాడు.

సినిమాకి ఎంతో ముఖ్యమైన ఈ సన్నివేశాన్ని గొప్పగా ఆవిష్కరించడంలో ఘంటసాల గాత్రం పాలు చాలా ఎక్కువ. మిగిలిన కొద్దిపనీ పూర్తిచెయ్యడం రామారావుకి చాలా ఈజీ అయిపోయింది. ప్రతిభావంతుడైన గాయకుడు సన్నివేశస్థాయిని ఎంతగా ఎలివేట్ చెయ్యగలడో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ.

పాత తెలుగు సినిమాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. నే చెప్పేవిషయం అర్ధమవుతుంది. ఘంటసాల స్వరం కథలో ఇమిడిపోతుంది, కథని ముందుకు నడిపిస్తుంది. ఇదేమంత సామాన్యమైన విజయం కాదు. అయితే ఘంటసాల గానం ఈ పనిని ఫిల్టర్ కాఫీ తాగేసినంత అవలీలగా, అలవోకగా చేసేసింది - దటీజ్ ఘంటసాల! 

(fb post 8/6/2017)