Tuesday 15 January 2013

చదువే ఒక రోగం!


అమెరికా వాసియైన డా.రావ్.పి.పచ్చిపులుసు తెలుగోత్తేజంతో ఇండియాకి తిరిగొచ్చిన విధం "డా.రావ్ కష్టాలు" అనే పోస్టులో చదివారు. ఆ విధంగా మాతృభూమిపై మమకారంతో తన సొంత ఊరైన గుంటూరులో ఆస్పత్రి ఓపెన్ చేశాడు డా.రావ్.

గుంటూరులో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతూ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లోనే ఉంటాయి. ఆ వీధిలోనే ఓ కాంట్రాక్టర్ రెడ్డిగారు ఈ మధ్య కొత్తగా ఐదంతస్తుల మేడ కట్టారు. డా.రావ్ తన సైకియాట్రీ ఆస్పత్రి కోసం అందులో మొదటి అంతస్తు అద్దెకి తీసుకున్నాడు.

ఇండియాలో తన కార్యాలు చక్కబెట్టిన వెంకట్రావంటే డా.రావ్ కి ప్రత్యేక అభిమానం. పైగా తన క్లాస్మేట్. అంచేత వెంకట్రావుకి హాస్పిటల్ ఎడ్మినిష్ట్రేటివ్ వ్యవహారాలు అప్పగించాడు. సైకియాట్రీలో డిప్లొమా ఉన్న ఒక డాక్టర్ని అసిస్టెంట్ గా కూడా నియమించుకున్నాడు. వెంకట్రావ్ ఆస్పత్రి ప్రారంభానికి మంచి ప్రచారం కల్పించాడు. అందువల్ల మొదటి రోజే పేషంట్లతో ఆస్పత్రి కళకళ లాడుతుంది.

ఆ రోజు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించాడు డా.రావ్. మనసంతా హాయిగా, ప్రశాంతంగా ఉంది. 'కల నిజమాయెగా.. కోరికలు తీరెగా.. ' అని పాడుకుంటూ తన ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో వెయిటింగ్ హాల్లో ఉన్న పేషంట్లని చూసుకుని తృప్తిగా తల పంకించాడు.

కన్సల్టేషన్ చాంబర్లో తన రివాల్వింగ్ చైర్ లో కూర్చున్నాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. నర్స్ లోపలకోచ్చింది.

"చూడండి సిస్టర్! నాకు పేషంట్లు దేవుడితో సమానం. డబ్బు ప్రధానం కాదు. నేను చాలా ఎకడెమిక్. వారికి సరైన సలహా ఇవ్వడమే నా కర్తవ్యం." అని చిన్నపాటి లెక్చర్ ఇచ్చాడు. నర్స్ వినయంగా తలాడించింది.

"మొదటి పేషంటుని పంపండి." నర్సుకి చెప్పాడు.

"నమస్కారం డాక్టర్ గారు!" అంటూ ఓ నడివయసు జంట లోపలకొచ్చింది. పక్కన ఓ పధ్నాలుగేళ్ళ కుర్రాడు. బెదురు చూపులు చూస్తూ లోపలకోచ్చాడు. ఇంతలో పక్క గదిలోంచి హడావుడిగా డా.వెంకట్రావొచ్చాడు.

"వీరు మా బావమరిదికి తెలిసినవాళ్ళు. ఈయన మిర్చి కమిషన్ వ్యాపారం చేస్తాడు. వాళ్ళబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉందిట. నీ సలహా కోసం వచ్చారు." అని డా.రావ్ కి చెప్పి.. "అన్ని విషయాలు వివరంగా చెప్పండి. సార్ చాలా పెద్ద డాక్టరు గారు." అని వారికి భరోసా ఇచ్చి నిష్క్రమించాడు వెంకట్రావ్.

ఆ జంట డా.రావ్ ని ఎగాదిగా చూశారు. తెల్లగా, బక్కగా, బట్టతలతో, కళ్ళజోడుతో అచ్చమైన, స్వచ్చమైన అనాసిన్ మాత్రల ప్రకటనలో కనబడే డాక్టర్లా ఉన్న డా.రావ్ రూపం వారికి తృప్తినిచ్చింది.

"నమస్తే! కూర్చోండి." అంటూ ఎదురుగానున్న కుర్చీల్ని ఆఫర్ చేశాడు డా.రావ్.

డా.రావ్ టేబుల్ మీదనున్న కేస్ షీట్ పై బుల్లి అక్షరాలతో 'శ్రీరామ' అని రాసుకుని వాళ్ళకేసి చూశాడు. భర్తకి నలభైయ్యేళ్ళు ఉండొచ్చు. ఎత్తుగా, చామన చాయగా ఉన్నాడు. అతని భార్య ఎర్రగా, పొట్టిగా, బొద్దుగా ఉంది. కంగారుగా, ఆందోళనగా కూడా ఉంది. వారి పిల్లవాడు బక్కగా, పొట్టిగా ఉన్నాడు. ముఖానికి మందపాటి కళ్ళజోడు కూడా ఉంది. ఆ అబ్బాయి ముఖంలో ఇందాకటి బెరుకు తగ్గింది. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా పరాకుగా ఉన్నాడు.

కుర్చీలో పూర్తిగా కూర్చోక ముందే ఆ పిల్లాడి తల్లి చెప్పడం మొదలెట్టింది.

"డాక్టరు గారు! మా అబ్బాయికి ఈ మధ్య చదువు మీద ఏకాగ్రత తగ్గింది సార్! చదువు కోకుండా దిక్కులు చూస్తున్నాడు. అసలే పరీక్షలు దగ్గర కొస్తున్నాయ్. నాకు భయంగా ఉంది." అంటూ కంగారు పడసాగింది.

"అప్పుడే ఫైనల్ ఎక్జామ్స్ మొదలయ్యాయా!" అడిగాడు డా.రావ్.

"అబ్బే! దానికింకా చాలా టైముందండి. ఇవ్వాళ శుక్రవారం. వీక్లీ టెస్ట్ దగ్గర కొచ్చేస్తుంది." అన్నది ఆ ఇల్లాలు.

డా.రావ్ కి వీక్లీ టెస్ట్ అంటే ఏంటో అర్ధం కాలేదు. తనదైన ధోరణిలో నెమ్మదిగా చెప్పసాగాడు.

"చదువులో కాన్సంట్రేషన్ లాప్స్ కి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఉదయాన్నే మీ అబ్బాయితో గేమ్స్ ఆడించండి."

ఆవిడ హడావుడిగా అందుకుంది.

"గేమ్స్ ఆడటం మా ఇంటా వంటా లేదు. అయినా ఆ పాడు గేమ్స్ ఆడితే టైం వేష్టయిపోదూ? మా అబ్బాయి ఉదయాన్నే మూడింటికే లేస్తాడు. అయిదున్నర దాకా చదువుకుంటాడు. గబగబా తయారై ఆరింటికల్లా స్కూల్ కి వెళ్ళిపోతాడు. ఉదయం ఆరున్నర నుండి రాత్రి పదిన్నర దాకా స్కూల్లోనే ఉంటాడు."

డా.రావ్ కి కొద్దిగా కళ్ళు తిరిగాయి. ఎందుకైనా మంచిదని టేబుల్ పై చేతులు పెట్టుకున్నాడు.

"అంతసేపు స్కూల్లో ఏం చేస్తాడు?" ఆశ్చర్యంగా అడిగాడు.

తల్లి ఉత్సాహంగా చెప్పసాగింది.

"సాయంత్రం ఆరింటి దాకా రెగ్యులర్ స్కూల్. తరవాత ఎనిమిదింటి వరకు స్టడీ అవర్స్. ఆ తరవాత పదిన్నర దాకా ట్యూషన్. పదకొండింటికి ఇంటికొస్తాడు. ఇంట్లో కనీసం పన్నెండుదాకా అయినా చదువుకోవాలి గదా! కానీ చదవడు. ఒకటే దిక్కులు చూస్తుంటాడు. కునికిపాట్లు పడుతుంటాడు. అప్పటికీ నేను అరుస్తూనే ఉంటాను."

"ఏం బాబు? చదువు కష్టంగా తోస్తుందా?.. " ఆ అబ్బాయిని అడగబోయాడు డా.రావ్.

అప్పటిదాకా నిరాశగా, నిర్లిప్తంగా ఎటో చూస్తున్న ఆ కుర్రాడు నిదానంగా రావ్ వైపు తల తిప్పాడు. సందేహిస్తూ ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు.

ఆ కుర్రాడు సమాధానం చెప్పేలోగా తల్లి అందుకుంది.

"అబ్బే! అదేం లేదండి. మావాడు పొద్దస్తమానం చదువులోనే బతుకుతుంటాడు. మొన్నామధ్య మంటల జొరంతో కూడా రోజంతా చదివాడు. మా బాబుకెప్పుడూ ఫస్ట్ మార్క్ వస్తుందండీ!"

డా.రావ్ అయోమయంగా చూసాడు. ఇంతలో డా.వెంకట్రావ్ వచ్చి పక్కగా నున్న సోఫాలో కూర్చున్నాడు. జరుగుతున్న సంభాషణ ఫాలో అవ్వసాగాడు.

"ఫస్ట్ మార్కులోచ్చేట్లయితే ఇక చదువుకోకపోవడం ఏంటి?" డా.రావ్ ధర్మసందేహం.

ఈసారి తండ్రి అందుకున్నాడు.

"మావాడికి ఎప్పుడూ 99.9 మార్కులోస్తాయి సార్! మొన్న స్లిప్ టెస్ట్ లో 99.8 మాత్రమే వచ్చాయి. ప్రిన్సిపాల్ మమ్మల్ని పిలిపించి పిల్లాడికి చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని హెచ్చరించాడు."

డా.రావ్ కి అంతా గందరగోళంగా ఉంది. కేస్ షీట్ పై 'శ్రీరామ' తరవాత ఏ రాయాలో అర్ధం కాకుండా ఉంది.

"అంత సమయం చదువుకోవటం సరియైన పధ్ధతి కాదు. మీరు బాబుకి కల్చరల్ యాక్టివిటీస్ పట్ల ఆసక్తి కలిగేట్లు చేస్తే మంచింది." నిదానంగా, మెల్లగా ఆన్నాడు డా.రావ్.

తలిదండ్రులకి అర్ధం కాలేదు. డా.రావ్ ధోరణి వాళ్లకి అనుమానం కలగజేసింది. బాగా చదువుకోడానికి మందివ్వమంటే ఆటలు, పాటలు అంటాడేంటి!

"ఈ రోజుల్లో, ఈ కాంపిటీషన్లో కనీసం వంద మార్కులైనా రాకపోతే మా అబ్బాయి భవిష్యత్తు పాడైపోతుంది డాక్టర్ గారు. మా అబ్బాయి అమెరికా వెళ్ళి మంచి పొజిషన్లో స్థిరపడాలని మా కోరిక. మీరు పెద్ద అమెరికా డాక్టరు. అందుకే మీమీదే ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం. మా బాబుని మీరే రక్షించాలి సార్!" దుఖంతో గొంతు రుద్దమవుతుండగా.. ఆ మహాఇల్లాలు అసలు సంగతి చెప్పేసింది.

డా.రావ్ నొసలు చిట్లించాడు. "మీ పిల్లవాణ్ణి అంతసేపు చదువులో.. " అంటూ చెప్పబోతుండగా.. అప్పటిదాకా ఈ సంభాషణని ఫాలో అవుతున్న వెంకట్రావ్ రంగంలోకి దిగాడు.

"నువ్వు వాళ్లకి ఏదోటి ప్రిస్క్రైబ్ చేసి పంపు. తరవాత మాట్లాడతాను." అంటూ ఇంగ్లీషులో డా.రావ్ కి చెప్పాడు.

"ఏం రాయమంటావ్? పిల్లవాణ్ని చదువుతో హత్య చేసే కార్యక్రమం నడుస్తుంది. ఆ స్కూల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను." ఇంగ్లీషులోనే అన్నాడు డా.రావ్ కోపంగా.

వెంకట్రావ్ హడావుడిగా టేబుల్ మీదనున్న ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఒక ఖరీదైన బి కాంప్లెక్స్ టానిక్ పేరు గెలికాడు.

"డాక్టర్ గారు మీ బాబుకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని విపరీతంగా పెంచే మందు చెప్పారు. వారు చెప్పిన మందునే నేను రాసిస్తున్నాను. ఈ మందు బాబు చదువుకునే సమయంలో గంటకి రెండు స్పూన్లు చొప్పున నీళ్ళతో కలిపి తాగించాలి. వంకాయ, గోంగూర లాంటివి పెట్టకండి. మజ్జిగ ఇవ్వండి. పెరుగు దగ్గ్గరకి రానీయొద్దు." అంటూ జాగ్రత్తలు చెప్పి, మందుల చీటీ వాళ్ళ చేతులో పెట్టాడు.

ఆ కాగితాన్ని చూసుకుని తల్లి ఆనంద పడిపోయింది. తండ్రికి మాత్రం అమెరికా డాక్టర్ కన్నా గుంటూరు డాక్టరే నచ్చాడు. ఇద్దరూ తమ నిర్వికార, నిశ్శబ్ద కొడుకుతో నిష్క్రమించారు.

గదిలో రెండు నిముషాలు నిశ్శబ్దం.

కొంతసేపటికి "సారీ!" అన్నాడు వెంకట్రావ్.

'ఎందుకిలా చేసావ్?' నాగేశ్వర్రావు బి.సరోజాదేవిని చూసినట్లు చూసాడు డా.రావ్.

"మిత్రమా! మొదటి కేసుతోనే నువ్వు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. గుంటూరులో పిల్లల్ని రోజుకి ఇరవై గంటలు చదివిస్తుంటారు. ఆ మిగిలిన నాలుగ్గంటలు కూడా ఎలా చదివించాలా అని తలితండ్రులు ప్లాన్లు వేస్తుంటారు. ఈ కేస్ ఆ రకం ప్లాన్లేసే బ్యాచ్! రోజంతా మాట్లాడినా కూడా ఈ కేస్ పూర్వాపరాలు నీకర్ధమయ్యే చాన్స్ లేదు. నువ్వు చెప్పే సైకాలజికల్ యాస్పెక్ట్స్ వాళ్ళు ఒప్పుకునే అవకాశమూ లేదు. అంచేత ఏదో రాసిచ్చేశాను. నీకు టైం సేవయ్యింది. వాళ్ళూ శాటిస్ఫై అయ్యారు." ఫ్రాంక్ గా చెప్పాడు వెంకట్రావ్.

అంతా శ్రద్ధగా విన్నాడు డా.రావ్. కొద్దిసేపు ఆలోచించాడు.

"పిల్లలు చదువు పేరిట ఇంత ఘోరంగా హింసింపబడుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది?" క్యూరియాస్ గా అడిగాడు డా.రావ్.

'అమ్మయ్య! ఈ మెంటల్ డాక్టర్ నన్ను అపార్ధం చేసుకోలేదు.' అనుకుంటూ నిట్టూర్చాడు వెంకట్రావ్. ఆపై అమాయకుడైన  తన స్నేహితుణ్ని జాలిగా చూశాడు.

"నువ్విక్కడే ఉంటావుగా! నిదానంగా అన్నీ తెలుస్తాయిలే!" అంటూ ఏదో ఫోన్ వస్తే పక్క గదిలోకి వెళ్ళాడు వెంకట్రావ్.

బుర్ర గోక్కుంటూ.. కాలింగ్ బెల్ నొక్కుతూ.. "నెక్స్ట్" అన్నాడు నర్సుతో డా.రావ్!


(pictures courtesy : Google)