Tuesday, 1 January 2013

తెలుగు సినీహీరోల విధి (రేప్ నేపధ్యంలో)


కొందరు దేశం ముందుకు పోతుందంటారు. ఇంకొందరు వెనక్కి పోతుందంటారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ కోణాల నుండి రోజూ అనేక విశ్లేషణలు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. నేను ఆర్కెలక్ష్మణ్ కామన్ మేన్ లాంటివాడిని. అంచేత నాకు మాత్రం దేశం స్థిరంగానే ఉందనిపిస్తుంది!

ఒక్కో దేశానికి ఒక్కో సమస్య. ఏ సమస్యనీ ఇంకో సమస్యతో పోల్చడానికి లేదు. మనది అన్నం సమస్యయితే  అమెరికా వాడిది ఆయుధాల సమస్య. సరే! ఈ సమస్యలతో కాపురం చేస్తూ.. వాటి పరిష్కార మార్గాలకై అన్వేషణ చేస్తూ.. మానవ సమాజం, నాగరికత ముందుకు పురోగమిస్తుంది. అయితే ఆ పురోగమనం అంగుళాల్లో ఉందా.. అడుగుల్లో ఉందా అన్నది కూడా చర్చనీయమే! ఇక్కడి దాకా నాకు పేచీ లేదు.

ఐతే.. కొన్ని  అమానవీయ  సంఘటనలు  విన్నప్పుడు  గుండె  కలుక్కుమంటుంది. ఢిల్లీలో జరిగిన రేప్ మనని వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబంలో సొంత మనిషి చనిపోయినంత దుఖం. ఇలాంటి సంఘటనలు మనిషి మనుగడకే ప్రమాదం. ఇవి ఇక ఎంత మాత్రం జరగరాదు.

కారంచేడు, చుండూరు మారణ హోమాలకి ఈ దేశ చరిత్రలోనే మూలాలున్నాయి. రైతుల అత్మహత్యలు ఈ దేశరాజకీయ పార్టీల క్షమించరాని నిర్లక్ష్యం కారణంగా ఉంది. కానీ.. పాశవికంగా రేప్ చేసి.. హత్య చెయ్యడం, చేతబడి పేరుతో సజీవ దహనాలు, ఏసిడ్ దాడులు మన అజ్ఞానానికి, అహంకారానికి, దుర్మార్గత్వానికి ప్రతీకలు.

సామాజిక, రాజకీయ అవగాహనతో చక్కటి విశ్లేషణలు చేస్తూ.. ప్రజాసంక్షేమం గూర్చి ఆలోచన చేస్తున్న మేధావులకి మన దేశంలో కొదవ లేదు. దురదృష్టవశాత్తు.. వారి ఆలోచనలు చేరవలసిన వారికి చేరడం లేదు. నేర మనస్తత్వం కలవాడు ఇవేవీ పట్టించుకోడు. వాడికి చదువు లేకపోవచ్చు. ఉన్నా పత్రికలు చదవకపోవచ్చు.

మన సమాజంలో  చాలా స్పష్టమైన డివిజన్  ఉంది. చదువుకునే అవకాశం లేక, ఆ చదువు ఇచ్చే జ్ఞానం పొందే అవకాశం లేనివారు ఒక కేటగిరీ. చదువుకున్నప్పటికీ.. ఆ చదువు.. తమ ఉద్యోగ అర్హతగా మాత్రమే చదివే డిగ్రీ రాయుళ్ళు. వీరిది ఇంకో కేటగిరీ. రెండో ప్రపంచయుద్దం ఎందుకు జరిగిందో కూడా తెలీని 'విద్యావంతుల్ని' నేను చూశాను. ఇది కూడా నిరక్షరాస్యతే!

మానవ సమాజం గూర్చి కనీస అవగాహన లేని వారిలో నేర మనస్తత్వం ఎక్కువగా ఉండి ఉండొచ్చు.. అని అనుకుంటున్నాను. వీరిని ఎడ్యుకేట్ చెయ్యడానికి ఆవేశంతో లక్ష బ్లాగులు రాసినా మనకి మిగిలేది వేళ్ళ నొప్పి  మాత్రమే! అయితే వీరిని చాలా ప్రతిభావంతంగా ఎడ్యుకేట్ చెయ్యొచ్చు. ఎలా? ఎలానో చెప్పడానికి.. నేను ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం గూర్చి మాత్రమే ప్రస్తావిస్తాను.

మనం తెలుగువాళ్ళం. మనకి భయంకరమైన సినిమా పిచ్చి. ఒకప్పుడు తమిళ తంబిలకీ పిచ్చి ఉండేది. ఇప్పుడు మనం వారిని దాటేసేశామా? సరే! ఎవడి పిచ్చి వాడికానందం. నేను సినిమా చూసేవాళ్ళని ఎగతాళి చేస్తున్నానని అనుకోకండి. ఒకప్పుడు నేనూ ఆ పిచ్చలో బ్రతికినవాణ్ణే.

సినిమాలు చూడ్డం అనేదేమీ దేశ సేవ కాదు. దురద పెడితే వీపు గోక్కోడం లాంటిది. అయితే మనకున్న ఈ దురద రోగాన్నే వైద్యం కింద మారిస్తే ఎలా ఉంటుంది?! ఇక్కడ రోగాన్నే వైద్యానికి ఉపయోగించుకోవడం.. అనగా  ఈ సినిమా పిచ్చినే వాడుకుంటూ సమాజాన్ని ఎడ్యుకేట్ చెయ్యాడానికి ప్రయత్నం జరగాలి. (అట్టడుగు సమాజంలో సినిమా హీరోల రీచ్, పెనిట్రేషన్ గణనీయంగా ఉంటుంది.)

ఇప్పుడు నా నమ్మకానికి కారణమైన ఉదాహరణని మీకు చెబుతాను. నేను హౌజ్ సర్జన్సీ  చేసే రోజుల్లో ఒక పేషంటుతో పాటు ఎక్కువమంది ఎటెండెంట్స్ వచ్చినప్పుడు.. అంతమంది జనాల  మధ్య వైద్యం చెయ్యవలసిన ఇబ్బందిని తప్పించుకోవటానికి.. ఒక చిన్న ఎత్తు వేసేవాళ్ళం. 'అర్జంటుగా బ్లడ్ కావాలి. బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళి మీ బ్లడ్ శాంపిల్స్ పరీక్షకివ్వండి.' అని చెప్పంగాన్లే.. ఒక్క నిముషంలో వార్డ్ మొత్తం ఖాళీ అయిపొయ్యేది! ముఖ్యమైన కుటుంబసభ్యులే మిగిలేవాళ్ళు. హాయిగా వైద్యం చేసుకునేవాళ్ళం. ఈ ఉదాహరణ ఎందుకు రాస్తున్నానంటే ఒకప్పుడు రక్తం ఇవ్వాలంటే ఒణికి పొయ్యేవాళ్ళం అని చెప్పడానికి.ఇప్పుడు ధైర్యంగా రక్తదానాన్ని వలంటీర్ చేస్తున్నారు. కారణం.. చిరంజీవి. లక్షమంది మేధావులు లక్ష వ్యాసాలు రాసి ఉండవచ్చు. ప్రచారానికి ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి ఉండొచ్చు. కానీ.. రక్తదానం విషయంలో సామాన్య జనంలో ఉండే సందేహాలు తొలగించడంలో చిరంజీవి పాత్ర చాలానే ఉంది. ఇందుకు మనం చిరంజీవిని హృదయపూర్వకంగా అభినందించాలి. తమ అభిమాన అన్నయ్య కోసం తమ్ముళ్ళు క్యూలో నించుని మరీ రక్తం ఇచ్చారు. దీనికి విపరీతమైన ప్రచారం వచ్చింది. రక్తదానంపై  చాలామందికి అపోహలు తొలిగిపొయ్యాయి. 


అంతర్జాతీయంగా నటీనటులు అనేక రాజకీయ సమస్యలపై ప్రజల, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి ఎరస్టులకి కూడా వెనుకాడట్లేదు. జార్జ్ క్లూనీ అంతటి పెద్ద నటుడే నిరసన తెలుపుతూ సూడాన్ ఎంబసీ ముందు బేడీలు వేయించుకున్నాడు. ఆస్కార్ ఎవార్డ్ విన్నర్ సీన్ పెన్ చాలా చురుకైన రాజకీయవాది. హిందీ నటుడు బలరాజ్ సహానీ  కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. ఎమర్జన్సీలో దేవానంద్, కిషోర్ కుమార్లు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.

నేనయితే అల్ప సంతోషిని. తెలుగు నటీనటుల దగ్గరనుండి గొప్ప పొలిటికల్ ఏక్టివిటీ ఆశించట్లేదు. సినీనటులు అద్దాల మేడల్లో ఉంటారు. వారి సమస్యలు వారివి. ప్రభుత్వాలు వారిపై ఆదాయపు పన్ను దాడి లాంటి అనేక ఎత్తుగడలతో  నియంత్రించవచ్చు. కాబట్టి వీరు గిరిజనుల భూమి సమస్య, మూలపడుతున్న ప్రజారోగ్యం లాంటి హాట్ టాపిక్స్ జోలికి వెళ్ళనవసరం లేదు. అమీర్ ఖాన్ లాగా సాఫ్ట్ టార్గెట్స్ ని ఎంచుకుని.. ఒక గొప్ప  సోషల్ యాక్టివిస్ట్  పోజులు కూడా కొట్టవలసిన అవసరం కూడా లేదు.

మహేష్ బాబు కోకకోలాతో కోట్లు సంపాదించాడు. మంచిది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి. అంచేత ఇంకా సంపాదించుకోమనే నా సలహా. జూనియర్ ఎన్టీఆర్ కూడా నవరత్న ఆయిల్ తో పాటుగా ఇంకొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉండాలని కోరుకుంటున్నాను.

అయితే.. వరంగల్ లో విద్యార్ధినులపై ఏసిడ్ దాడి జరిగినప్పుడు.. మన పాపులర్ హీరోలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడినట్లయితే సమాజానికి చాలా మంచి జరిగేదని నా అభిప్రాయం. ఆ ఇంపాక్ట్  చాలా బలంగా ఉంటుంది. మన తెలుగు సినిమా హీరోలు ఎందుకనో తమకి మాత్రమే సాధ్యమయ్యే ఎవేర్ నెస్ కార్యక్రమాలు  చెయ్యట్లేదు!

మన హీరోలు స్త్రీలపై అత్యాచారాలకి వ్యతిరేకంగా (ప్రకటనల తరహాలో) సందేశమివ్వాలి. వారి సందేశానికి ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం కల్పించాలి. చిరంజీవి కల్పించిన రక్తదాన కాంపెయిన్ వంటిది.. స్త్రీలపై అత్యాచార వ్యతిరేకతలో కూడా జరగాలి. మన హీరోలు అత్యాచారాల్ని వ్యతిరేకించే యువతకి రోల్ మోడల్ గాను.. బ్రాండ్ ఎంబాసిడర్లు గానూ వ్యవహరించాలి. తమ అభిమానుల్ని ఈ కాంపెయిన్ లో పాల్గొనేలా మోటివేట్ చెయ్యాలి. ఇది ఈ సమాజ పౌరులుగా హీరోల ప్రాధమిక బాధ్యత. నటులు ఈ విధంగా చేసే విధంగా తెలుగు సమాజం కూడా వారిపై వత్తిడి తీసుకురావాలి.

సరే! మన హీరోలు కల్పించే ప్రచారం మూలాన.. 'సమాజంలో ఆడవారిపై దాడులు ఏమాత్రం  తగ్గలేదు.' అనుకుందాం. అంటే దానర్ధం.. 'ఫలానా హీరోని సినిమాలో ఐతే సరదాగా చూస్తాం. అంతేగానీ.. మాకు నీతులు బోధించడానికి అతనెవరు?' అనుకున్నారనుకోవాలి.

అప్పుడు మన మాస్ ప్రేక్షకులు తెలివైనవాళ్ళని.. వాళ్ళు చూపించే అభిమానం కేవలం వినోదపరమైందేనని.. అనవసరంగా తెలుగు హీరోల ప్రభావాన్ని అతిగా అంచనా వేసుకుని.. టైం వేస్ట్ చేసుకున్నామని అర్ధమౌతుంది. ఇదీ నాకు శుభవార్తే! ప్రజలు 'కేవలం వినోద సాధనంగా సినిమాల్ని చూస్తామే తప్ప.. వాస్తవప్రపంచంలో మా సొంత అభిప్రాయాలు మాకున్నయ్!' అని చెబుతుంటే అది శుభవార్త గాక మరేమవుతుంది?

చివరి తోక..

ఈ పోస్ట్ లో వార్తాపత్రికలు చదవని.. సినిమాలు విరివిగా చూసే వ్యక్తుల్ని ఎడ్యుకేట్ చెయ్యడం గూర్చి మాత్రమే రాశాను. కేవలం వీరు మాత్రమే భావి నేరస్థులనే అభిప్రాయం నాకు లేదు. కానీ వీరు మన సమాజంలో చాలా ముఖ్యమైన సెక్షన్. నేను క్లాస్ బయాస్డ్ కాదు. గమనించగలరు.