Friday 1 March 2013

టెర్రరిజం - కేండిలిజం


"మిత్రమా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"సుబ్బూ! టెర్రరిస్టులు దుష్టులు, దుర్మార్గులు.. పేట్రేగిపోతున్నారు. నా కడుపు మండిపోతుంది. ఇవ్వాళ సాయంకాలం సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన ఉంది. మనం వెళ్ళాలి." అన్నాను. 


"టెర్రరిస్టు దాడుల్ని కొవ్వొత్తులతో నిరసించడం ఎప్పుడూ ఉండేదేలే! దీన్నే 'కేండిలిజం' అందురు. నాకీ కొవ్వొత్తుల్తో నిరసనేంటో తెలీదు. కొవ్వొత్తి పట్టుకునే ఓపికా లేదు. ఈసారి 'కేండిలిజం'కి వస్తాన్లే!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"దుర్మార్గుడా! నీకోసం మళ్ళీమళ్ళీ టెర్రరిస్టు దాడులు జరగాలని కోరుకుంటున్నావా? నీకా అవకాశం లేదు. క్రికెట్ మ్యాచ్‌కి ఎంతటి భారీ భద్రత ఉందో తెలుసుగా?" అడిగాను.

"ఆ క్రికెట్ మ్యాచ్‌లో ఏమీ జరగదు, ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసు. ఇది సామాన్య ప్రజల ఆగ్రహం నుండి రక్షించుకోడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తు. ఎంత బుర్ర తక్కువ దొంగైనా ఓ ఇంట్లో దొంగతనం చేస్తే.. కొన్నాళ్ళదాకా ఈ వీధి మొహం చూడడు. బాంబులు పెట్టేవాడు ఇంకా తెలివిగా ఉంటాడు కదా!" అన్నాడు సుబ్బు.

"అంటే నిఘా వద్దంటావా?" చికాగ్గా అన్నాను.

"కావాలి, చాలా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కావాలి. అయితే.. ప్రస్తుతం ఉన్న నిఘా ఒక స్పెషల్ డ్రైవ్ వంటిది. ఆ క్రికెట్ మ్యాచ్ రోజు స్టేడియం ఏరియా తప్పించి, మిగిలిన అన్ని ప్రాంతాలు చాలా వల్నరబుల్ గా ఉంటాయి!" అంటూ నవ్వాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. సిప్ చేస్తూ.. ఆలోచిస్తూ.. నిదానంగా చెప్పసాగాడు.

"స్కూల్ బస్ ప్రమాదం జరిగితే.. కొన్నాళ్ళపాటు స్కూల్ బస్సుల ఫిట్నెస్‌పై తీవ్ర నిఘా, ప్రైవేటు బస్సులపై ఇంకొంతకాలం నిఘా! జోకేంటంటే.. లంచం తీసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగులే ఈ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తారు! అసలు డ్రైవ్ సరీగ్గా లేనప్పుడే స్పెషల్ డ్రైవ్ లు అవసరం. లోగుట్టు ఏమనగా.. మన రాజకీయ వ్యవస్థ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. తాము భద్రంగా ఉన్నామనే భ్రమలో ప్రజల్ని ఉంచేందుకు.. తమ యత్రాంగంతో ఇలా 'అతి' చేయిస్తుంటుంది!"

"మన పోలీసు బలగాల సంఖ్యాబల ప్రదర్శన ఉగ్రవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాయి." నవ్వుతూ అన్నాను.

"అలాగా! అందుకనేనా? మనవాళ్ళు రైళ్ళ సంఖ్య పెంచమని గోల చేస్తుంది?" సుబ్బు కూడా నవ్వాడు.

"సుబ్బు! నీ వాదన నీదే కదా. దీనికి సమాధానం చెప్పు. అమెరికాలో 9/11 తరవాత మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగలేదు. అదెలా సాధ్యం?" బాగా అరిగిపోయిన ప్రశ్నని కొత్తగా సంధించాను.

"మన దేశాన్ని అమెరికాతో ఎలా పోలుస్తావ్? ఆ మాటకొస్తే ఏ దేశాన్నీ అమెరికాతో పోల్చలేవు. ఆ దేశమే ఒక ఆక్రమిత ప్రాంతం. బ్రతుకుతెరువు కోసం ఎందరో, ఎన్నో దేశాల నుండి వెళ్లి అక్కడ సెటిలయ్యారు. అందుకే ఆ ప్రభుత్వానికి పౌరులపై నిఘా పెట్టగల అవకాశం ఉంది, వనరులూ ఉన్నాయి." అన్నాడు సుబ్బు.

"ఆ మాత్రం మనం చెయ్యలేమా?" అడిగాను.

"చెయ్యలేకేం? భేషుగ్గా చెయ్యొచ్చు. అప్పుడు మన బజెట్‌లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి నిధులుండవు. ఉన్న సొమ్మంతా పోలీసు, రక్షణ శాఖలకి కేటాయించాలి. స్కూళ్ళు మూతబడతాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ పాడుబడిపోతాయి. సాధారణ జ్వరాలు, దగ్గులక్కూడా చస్తుంటాం. పేదరికంలో మగ్గిపోతుంటాం. అప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్లే." అన్నాడు సుబ్బు.

"అదెలా?" ఆశ్చర్యంగా అడిగాను.

"ఉగ్రవాదం అసలు లక్ష్యం ఒక దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీసి.. ఆ దేశ ఆర్ధిక ప్రగతిని నిరోధించడమే. ఒక అసమర్ధ రాజకీయ నాయకత్వం మాత్రమే ప్రజల సొమ్ముని దేశరక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం సింహభాగం ఖర్చు పెడుతుంది." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు అమెరికాక్కూడా ఇదే సమస్య రావాలి గదా?" కుతూహలంగా అడిగాను.

"రాదు, ఎందుకంటే అమెరికా తెలివిగా ఆయుధ వ్యాపారం చేస్తుంటుంది. ఈ ఆయుధాల వ్యాపారం సజావుగా సాగేందుకు దేశాల మధ్య యుద్ధం సృష్టించడం అమెరికన్ ప్రభుత్వం పాలసీ! వనరుల సమీకరణ కోసం చమురు యుద్ధాలూ చేస్తుంది!" అంటూ నవ్వాడు సుబ్బు.

"ఆయుధ వ్యాపారం కోసం కుతంత్రాలకు పాల్పడ్డం అన్యాయం!" అన్నాను. 

"అవును, అన్యాయమే!" అన్నాడు సుబ్బు. 

"మరప్పుడు టెర్రరిస్టు దాడుల్ని యెలాఆపాలి?" అడిగాను.

"టెర్రరిస్టు దాడుల్ని నిరోధించేందుకు కావలసింది దేశప్రజల సంక్షేమం పట్ల నిబద్దత కలిగున్న రాజకీయ నాయకత్వం. ఈ టెర్రరిస్టు దాడులు దేశ రాజకీయ వ్యవస్థ వైఫల్యానికి మూల్యం." అంటూ ఖాళీ కప్ టీపాయ్‌ మీద పెట్టాడు సుబ్బు.

"ఏమిటోయ్ నీ గోల? రాజకీయ నాయకుల్ని ఆడిపోసుకోడం ఒక ఫేషనైపోయింది." విసుక్కున్నాను.

"హోటల్లో చల్లారిన ఇడ్లీలిస్తేనే పోట్లాడతాం. కానీ కాజువ్ల్‌గా ఓట్లేసి రాజకీయ పార్టీలకి అధికారం కట్టబెడుతున్నాం. వీళ్ళు కాశ్మీర్ సమస్యని పట్టించుకోరు. పాకిస్తాన్‌తో ఎలా వ్యవహరించాలో స్పష్టత ఉండదు. ఈ రాజకీయ వ్యవస్థ తన పని నిజాయితీతో చేస్తే.. అప్పుడు వైఫల్యం ఎదురైనా ప్రజల మద్దతు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా?" అన్నాడు సుబ్బు.

"సర్లే! నీతో వాదించే ఓపిక లేదు. సాయంకాలం కొవ్వొత్తుల నిరసనకి వెళ్తున్నా. భాధ్యత గల భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా అది నా విధి!" నొక్కి పలుకుతూ అన్నాను.

"మీ 'కేండిలిజం' వాళ్ళకి నా తరఫున ఓ సలహా ఇవ్వు." నొసలు వెక్కిరిస్తున్నట్లు పెట్టాడు సుబ్బు.

"సలహానా!" ఆశ్చర్యపోయాను.

"అవును. అక్కడ డాక్టర్లుంటారు.. రోగుల్ని మోసం చెయ్యొద్దని చెప్పు. ప్లీడర్లుంటారు.. సాక్ష్యాలు తారుమారు చెయ్యొద్దని చెప్పు. వ్యాపారస్తులుంటారు.. ట్యాక్సులు సక్రమంగా కట్టమని చెప్పు. ప్రభుత్వోద్యోగులుంటారు.. లంచాలు మెయ్యొద్దని చెప్పు. జర్నలిస్టులుంటారు.. నిజాయితీగా రిపోర్ట్ చెయ్యమని చెప్పు. సినిమా యాక్టర్లుంటారు.. వెకిలి పాత్రలు వెయ్యొద్దని చెప్పు. వీళ్లంతా మన దేశానికి టెర్రరిజం కన్నా ఎక్కువ నష్టం కలిగిస్తున్నారు." అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మా సుబ్బు!

వర్షం వెలిసినట్లైంది!

(photo courtesy : Google)