Saturday 20 April 2013

ఆనంద నిలయం.. ఎంతో ఆహ్లదకరం!


అతను బార్లో పూటుగా తాగాడు. నాటుగా తిన్నాడు. నీటుగా లేచాడు. తూలుతూ బార్ బయటకొచ్చాడు. ఆ పక్కగా ఆపి ఉన్న ఆటోని పిలిచాడు. ఆటోవాలా తెగ సంతోషించాడు. 'ఈ తాగుబోతెదవ దగ్గర ఫుల్లుగా నొక్కేద్దాం!' అనుకున్నాడు. ఆశ్చర్యం! అతగాడు తూలుతూనే ఆటోవాలాతో గీచిగీచి బేరం చెయ్యసాగాడు. చివరాకరికి ఆటోవాలానే ఓడిపొయ్యాడు. చచ్చినట్లు మామూలు రేటుకే బేరం ఒప్పుకున్నాడు. బార్లో బోల్డు ఖర్చు చేసిన ఒక తాగుబోతు ఆటో దగ్గర అంతలా బేరమాడేమిటి? ఆశ్చర్యంగా ఉంది కదూ!

మనిషి జిరాఫీలా అరున్నరడుగులున్నా.. దున్నపోతులా నూటరవై కిలోలున్నా.. అతన్ని శాసించేది మాత్రం కొబ్బరికాయంత మెదడు మాత్రమే! అందులోనే మన ఆలోచనల కంట్రోలింగ్ సెంటర్ నిక్షిప్తమై ఉంటుంది. అర్ధరూపాయి మాట కోసం అరవై కోట్ల ఆస్తులొదిలేసుకున్న పెదరాయుళ్ళూ.. అదే అర్ధరూపాయి కోసం కుత్తకలు కోసే కత్తుల రత్తయ్యలు.. ఇలా మనుషుల ఆలోచనలని రకరకాలుగా శాసించేది ఈ మెదడే! హిట్లర్ లాంటి దౌర్భాగుల్ని, గాంధీ (సోనియా గాంధి కాదు) వంటి ఉన్నతుల్ని సృష్టించింది కూడా ఈ మెదడే!


మెదడులో మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేందుకు 'ప్లెజర్ సెంటర్' ఉంటుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. బ్రహ్మ మన నుదుటిరాత రాసినట్లు.. ప్లెజర్ సెంటర్లలో కూడా ఫలానా అని 'రాసిపెట్టి' ఉంటుంది. మన తాగుబోతుకి ప్లెజర్ సెంటర్లో 'తాగుడు' అని రాసిపెట్టి ఉంది. కాబట్టే బార్లో బారెడు బిల్లు బోలెడు సంతోషంగా చెల్లించాడు. తాగుడికే అంత ఖర్చు చేసిన వాడికి డబ్బంటే లెక్కుండదనుకుని ఆటోవాలా పప్పులో కాలేశాడు! ఆ తాగువాడు తాగుడుకి మాత్రమే ఖర్చు చేస్తాడు. అంతా ప్లెజర్ సెంటర్ మహిమ! ఈ ప్లెజర్ సెంటర్ న్యూరో ఎనాటమి ఒక భారతం. అదిక్కడ అనవసరం (అసలు సంగతి.. సైన్స్ విషయాలు తెలుగులో రాయడం నాకు రాదు).

ఇందాకట్నుండి ప్లెజర్ సెంటర్ అని రాసినప్పుడల్లా.. నాకదేదో మసాజ్ పార్లర్లాగా, పబ్బులాగా ధ్వనిస్తుంది. అంచేత 'ప్లెజర్ సెంటర్' ని తెలుగులోకి అనువాదం చేసి రాస్తాను. 'ప్లెజర్' అనగా ఆనందం. 'సెంటర్' అనగా కేంద్రము. 'ఆనంద కేంద్రము'. నాకు ఇది కూడా నచ్చలేదు.. ఏదో 'పాలకేంద్రము'లా అనిపిస్తుంది. అంచేత ఇకనుండి 'ఆనంద నిలయం' అంటూ (పన్లోపని.. మా ఆనందభవన్ కూడా గుర్తొచ్చేలా) స్వేచ్చానువాదం చేసి రాస్తాను.

ప్రతి మనిషి మెదడులో ఈ ఆనంద నిలయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే.. ఒక్కో ఆనంద నిలయానికి ఒక్కో థీమ్ ఉంటుంది. అయితే ఈ థీమ్ యొక్క మంచీచెడూ, నైతికానైతికత అనేది చూసేవాడి దృష్టి, సమాజ విలువల్ని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు మచ్చుకు కొన్ని ఆనంద నిలయాల థీమ్స్ పరిశీలిద్దాం.

సుఖమయ జీవనానికి డబ్బు చాలా అవసరం. అయితే.. అవసరాలకి మించి ఎంతో ఎక్కువగా సంపాదించిన తరవాత కూడా.. చాలామందికి డబ్బు సంపాదన పట్ల శ్రద్ధ తగ్గక పొగా.. ఇంకా పెరుగుతుంది! ఇలా మరింత శ్రద్ధగా డబ్బు సంపాదనకి పునరంకితమవ్వడం చూస్తే.. డబ్బు సంపాదన కూడా టెండూల్కర్ పరుగుల దాహం వంటిదని అర్ధమౌతుంది. అంటే వారి ఆనంద నిలయం డబ్బు సంపాదన!

మా మేనమామ మంచి ఆస్తిపరుడు. పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు. ఆయన శరీరం డెబ్భైయ్యేళ్ళ క్రితంది. వేసుకునే బట్టలు పదేళ్ళ క్రితంవి. గీసుకునే బ్లేడు మూడేళ్ళ క్రితంది. రుద్దుకునే టూత్ బ్రష్షు రెండేళ్ళ క్రితంది. ఇప్పుడు మీకు జంధ్యాల సినిమా, కోట శ్రీనివాసరావు జ్ఞప్తికొస్తే అది మా మేనమామ తప్పేగానీ.. జంధ్యాలది కాదు. బుద్ధి లేక.. మొన్నామధ్య బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోమని ఆయనకి సలహా ఇచ్చాను. 'ఎందుకు? డబ్బు దండగ. షుగరుంటే ఒంటేలుకి చీమలు పడతయ్యి గదా!' అన్నాడు. పిసినారితనమే మా మేనమామ ఆనంద నిలయం!


నాకో అన్నయ్య ఉన్నాడు. ఆయనకో ముఖ్యస్నేహితుడున్నాడు. అతను చాలా మంచివాడు. అయితే గత నాలుగున్నర దశాబ్దాలుగా ప్రతిరోజూ పేకాడతాడు. పేక లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు వంటిదని అతని ప్రగాఢ నమ్మకం. అతని భాష కూడా పేక భాషే! ఎదైనా డబ్బు టాపిక్ వచ్చినప్పుడు ఐదు ఫుల్ కౌంట్లంటాడు. లేదా పది మిడిల్ డ్రాపులంటాడు. చంద్రునికో మచ్చలా ఆయనకి 'పేకాట' అనేది ఒక మచ్చ. కాకపోతే ఈయన మచ్చ పెద్ద సైజు పిడకంత ఉంటుంది. ఆ పిడకే ఆయనకి ఆనంద నిలయం.

నా స్నేహితుడొకడు మితభాషి. బాగా చదువుకున్నవాడు. ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నతోద్యోగి. అయితే అతని ఆనందనిలయం 'పరాయి స్త్రీ' లలో దాగుంది. అతని పరాయి స్త్రీల సాంగత్య యత్నం ఒక యజ్ఞం స్థాయిలో ఉంటుంది. అందుకోసం ప్రాణాలకి కూడా తెగిస్తాడు. మొన్నామధ్య వడదెబ్బతో ఆస్పత్రిలో చేరాడు. ఎల్లప్పుడూ చల్లని ఏసీ (అదీ ప్రభుత్వ సొమ్ముతో) ఉండే మావాడికి వడదెబ్బ!

ఆస్పత్రికి పరామర్శగా వెళ్ళిన నాకు రహస్యంగా చెప్పాడు. అతగాడికి ఎప్పాయింట్మెంట్ ఇచ్చిన ఒక స్త్రీ రత్నం కోసం.. ఎర్రటి ఎండలో బస్టాండు ముందు తిండితిప్పలు మానేసి మరీ పడిగాపులు కాశాడు. ఆ స్త్రీ రత్నం రాలేదుగానీ.. మావాడికి జ్వరం మాత్రం వచ్చింది. నా స్నేహితుడికి ప్రేమగా, ఆప్యాయంగా పళ్ళరసం తాగిస్తున్న అతని భార్యని చూస్తే జాలేసింది!

ఆనంద నిలయాలు అంటూ వ్యసనాల్ని కూడా హైలైట్ చేస్తూ రాస్తున్నానని మీరనుకోవచ్చు. అయితే మన మెదడు.. సమాజం మంచిచెడ్డలు నిర్ణయించక ముందే అభివృద్ధి చెందింది. దానికి సభ్యత, సంస్కారం వంటి క్లిష్టమైన పదాలు అర్ధం కావు. కానీ అది మనని శాసిస్తుంది. ఫ్రాయిడ్ ఈడ్, సూపర్ ఈగో అంటూ కొంతమేరకు విశ్లేషించాడు గానీ.. ఇప్పుడెవరు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.

మనకి నచ్చని ఆనంద నిలయాల్ని వ్యసనం అన్న పేరుతో చిన్నచూపు చూస్తాం. స్టాంప్ కలెక్షన్, కాయిన్ కలెక్షన్ వంటి వాటిని ఏ చూపూ చూడం. అయితే సాహిత్యసేవ, ప్రజాసేవ, కళాసేవ వంటి వాటిని గ్లోరిఫై చేస్తాం. కొందరు వారిని ఆరాధిస్తారు కూడా. కానీ ఇవి కూడా వ్యసనాలకి 'ఆదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్' గా నాకు అనిపిస్తుంది.

శ్రీశ్రీని గుప్పిలి బిగించి దమ్ము లాగుతూ, పెగ్గు మీద పెగ్గు మీద బిగిస్తూ 'మహాప్రస్థానం' రాయమని మనం అడిగామా? లేదే! మరాయన ఎందుకంత కష్టపడిపోతూ 'మహాప్రస్థానం' రాశాడు? మనం వద్దన్నా శ్రీశ్రీ రాయడం ఆపేవాడా? ఖచ్చితంగా ఆపేవాడు కాదు. పైగా.. 'నీదీ ఒక బ్రదుకేనా? కుక్కా, నక్కా.. సందులో పంది!' అంటూ తన పాళీతో మన కంట్లో పొడిచేవాడు!


ఆ మాటకొస్తే గద్దర్ ని పాటలు పాడమని మాత్రం ఎవరడిగారు? పాడొద్దంటే మాత్రం ఆయన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఆవేశం ఉప్పొంగగా.. 'అరెరె.. ఈ పాట నాదిరా.. ఆ గోచి నీదిరా! ఈ పల్లె నాదిరో.. ఆ బ్లాగు నీదిరో!' అంటూ స్టేజి ఊగిపొయ్యేట్లు చిందులెయ్యడా? దటీజ్ ఆనంద నిలయం!

ఆయన ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి నాయకుడు. తొమ్మిదేళ్ళపాటు కనీసం నిద్ర కూడా పోకుండా అలుపెరుగని ప్రజాసేవ చేశాడు. 'నాకు ప్రజాసేవలో తనివి తీరలేదు. ఇంకా చేస్తాను. ఇంకోక్క అవకాశం ఇవ్వండి. ప్లీజ్!' అంటూ ఈ వృద్ధాప్యంలో, ఈ మండుటెండలో వేల కిలోమీటర్లు నడవటమేమిటి! ఆ ప్రజానాయకుడి తపన కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆయన చేతిలో ఏమీ లేదు. అంతా ఆనంద నిలయంలోనే ఉంది!

కావున మిత్రులారా! ప్రతి మెదడుకీ ఓ ఆనందనిలయం ఉంటుంది. అది ఆ వ్యక్తికి శిలాశాసనం. ఆయా సమాజాల్లోని కట్టుబాట్లు, సంస్కృతిని అనుసరించి ఆ ఆనందనిలయాల మంచిచెడ్డలు నిర్ణయించడతాయని మొదట్లోనే చెప్పాను. అయితే వ్యక్తి ఇష్టాయిష్టాల్ని గౌరవించడంలో సమాజానిక్కూడా కొన్ని సమస్యలుంటాయి. నా స్నేహితుడు స్త్రీ సేవ చెయ్యని యెడల.. సమాజసేవ చేసేవాడేమోనని నేననుకుంటుంటాను. అలాగే వైస్ వెర్సా.

మొన్నామధ్య నా వైద్య స్నేహితుడొకడు నన్ను వందోసారి అడిగాడు.

"నీ బ్లాగ్ చదవాలంటే ఏం చెయ్యాలి?"

"నీకో నమస్కారం. నా బ్లాగ్ చదవద్దు." అన్నాను.

స్నానం చెయ్యడానిక్కూడా టైమ్ లేనంత బిజీ ప్రాక్టీసున్న అతను నా బ్లాగ్ చదవడం అసంభవం. కానీ గత కొంతకాలంగా అతను నన్నలాగే పలకరిస్తున్నాడు.

నా సమాధానానికి అతను హర్టయ్యాడు. అంచేత తను చదవని నా బ్లాగ్వాపకం చెడ్డదని నిరూపించ నడుం కట్టాడు.

"అసలు నువ్వు బ్లాగులెందుకు రాస్తున్నావు?" సూటిగా చూస్తూ అన్నాడు.

"పని లేక.. " నాకీ సమాధానం చెప్పడం సంతోషాన్నిస్తుంది.

"నీకు పన్లేదంటే నేన్నమ్మను. చెప్పు. బ్లాగులెందుకు రాస్తున్నావు?" పోలీసువాడు 'లైసన్సుందా?' అనడిగినట్లు రెట్టించి అడిగాడు.

వదిలేట్టు లేడు. ఒక క్షణం ఆలోచించి "ఆనంద నిలయం!" అన్నాను.

"అంటే?" మొహం చిట్లించాడు.

"ఏం లేదు." అంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాను.


(photos courtesy : Google)