Friday, 5 April 2013

నందుని చరిత - ఘంటసాల ఘనత


నేను చిన్నప్పుడు ఘంటసాల పాటలు వింటూ పెరిగాను. అయితే ఆ పాటలు ఘంటసాల పాడినట్లు అప్పుడు నాకు తెలీదు. ఆ పాటలు రామారావు, నాగేశ్వరరావులే పాడుతుండే వాళ్ళనుకునేవాణ్ని. కొన్నాళ్ళకి ఆ గొంతు ఘంటసాలదని తెలుసుకున్నాను. ఇంకొన్నాళ్ళకి ఘంటసాల గొప్ప గాయకుడని అర్ధం చేసుకున్నాను. అయితే ఘంటసాల విశ్వరూప దర్శనం నాకు 'జయభేరి' సినిమా చూస్తుండగా కలిగింది.

సరే! 'జయభేరి' పాటల గొప్పదనాన్ని ఇవ్వాళ నేను ఇక్కడ రాసేదేమీ లేదు. దాదాపు అన్ని పాటలు (చివర్లో వచ్చే సౌందర్ రాజన్ పాట మినహాయింపు) బాగుంటాయి. బెస్ట్ ఆఫ్ జయభేరి? రకరకాల సమాధానాలు. క్లాసికల్ ప్రేమికులు 'రసికరాజ తగువారము కాదా.. ' చెబుతారు. విరహ ప్రేమికులు 'రాగమయి రావే.. ', 'యమునా తీరమున.. ' అంటుంటారు. నాకైతే 'నందుని చరితము.. ' పాట ఒక అద్భుతంగా తోస్తుంది.

'జయభేరి' చూడనివారి కోసం.. ఈ పాట సందర్భం బ్రీఫ్ గా రాస్తాను. హీరో పేరు కాశీనాథశాస్త్రి. గొప్ప సంగీత విద్వాంసుడు. కళకి క్లాస్ డిస్క్రిమినేషన్ ఉండరాదని నమ్ముతాడు. నమ్మిన సత్యాన్ని ఆచరించగలిగిన సాహసి. అందుకే గురువుని, అన్నావదినల్ని ఎదిరించి వీధి నాటాకాలాడే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.

మహారాజు కాశీనాథుని ప్రతిభని మెచ్చి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాడు. అతను ఇంత స్థాయి పొందడాన్ని సహించలేని రాజగురువు, రాజనర్తకిలు కుట్ర పన్ని తాగుబోతుగా మార్చేస్తారు. ఒకనాడు మహారాజు అజ్ఞాపించినప్పుడు కూడా పాడటానికి నిరాకరిస్తాడు. రాజాగ్రహానికి గురై వీధిన పడతాడు.

గుళ్ళో హరికథ జరుగుతుంటుంది. ఒక 'అంటరానివాడు' జ్వరంతో తీసుకుంటున్న తన కూతురితో కలిసి గుడి బయట నుండే దేవునికి మొక్కుతాడు. ఆగ్రహించిన గుళ్ళో బ్రాహ్మణులు అతన్ని నెట్టేస్తారు. మద్యం మత్తులో అటుగా వెళ్తున్న కాశీనాథశాస్త్రి ఆ తండ్రీకూతుళ్ళకి దేవుని దర్శనం చేయించడానికి విఫలయత్నం చేసి.. తను కూడా గెంటింపబడతాడు.

ఈ అరాచకానికి కాశీనాథశాస్త్రి కలత చెందుతాడు. ఆవేదన చెందుతాడు. మహారాజు కోరినా పాడనని మొరాయించిన ఆ స్వరం ఒక్కసారిగా జీవం పోసుకుంటుంది. ఆవేశంతో పరవళ్ళు తొక్కుతుంది. ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటుంది. అందుకే ఆ మహాగాయకుడు గొంతెత్తి నందుని చరితాన్ని ఆలాపించడం మొదలెడతాడు. ఇదీ పాట సందర్భం. ఇక్కడీ పాట యూట్యూబులో చూడండి.ఈ పాట సందర్భాన్ని పి.పుల్లయ్య పెండ్యాలకి వివరించి ఉంటాడు. పెండ్యాల నాగేశ్వరరావు వరసలు చక్కగా కట్టి ఉంటాడు. ఏ దర్శకునికైనా, సంగీత దర్శకునికైనా ఎన్నో కోరికలుంటాయి. కానీ గాయకులని దృష్టిలో ఉంచుకుని పరిమితులు ఏర్పరచుకుంటారు. డొక్కు కారుని వంద మైళ్ళ వేగంతో నడపితే యాక్సిడెంటవుతుంది.

ఘంటసాల వాయిస్ రేంజ్ అప్పుడే షో రూం డెలివరీ అయిన బెంజ్ కారు వంటిది. ఇక నడిపేవాడి ఓపిక. ఆకాశమే హద్దు. సంగీత దర్శకుడు ఏ బాణీనైనా, ఏ శృతిలోనైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 'ఘంటసాల లక్జరీ' ని ఎస్.రాజేశ్వరరావు దగ్గర్నుండీ అందరూ అనుభవించిన వారే!

మళ్ళీ 'అధికులనీ అధములనీ.. ' పాట దగ్గర కొద్దాం. ఈ పాట ఎత్తుగడే చాలా హై పిచ్ లో ఉంటుంది. అన్యాయానికి స్పందించిన ఒక మహాగాయకుని ఆవేదన, ఆర్ద్రత, ధర్మాగ్రహం.. అంతటినీ ఘంటసాల గీతాలాపనలో గాంచవచ్చు.

నటించింది అక్కినేని నాగేశ్వరరావయినా.. సన్నివేశానికి ఘంటసాల గొంతు పదిరెట్లు ఊపునిస్తుంది. ఈ పాటని నేను చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా.. నాకీ పాట ఒక అద్భుతంగా తోస్తుంది. ('జయభేరి' మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోడానికి ప్రధాన కారకుడు ఘంటసాల అని నా అభిప్రాయం.)

అయితే.. నాకు ఘంటసాలని ఫోటోల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతటి అసమాన ప్రతిభావంతుడు అతి సామాన్యుడిలా, అమాయకంగా కనిపిస్తుంటాడు. ఘంటసాలకి తనెంతటి ప్రతిభాసంపన్నుడో తనకే తెలీనంత అమాయకుడని నా అనుమానం! ఘంటసాల తెలుగు పాటని హిమాలయాలంత ఎత్తున ప్రతిష్టించాడు. ఇది తెలుగువారి అదృష్టం.

మా వేలు విడిచిన మేనమామ ఒకాయనకి పెళ్ళీపెటాకులు లేవు. ఉద్యోగం సద్యోగం లేదు. పనీపాటా లేదు. ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. సాధారణంగా ఇట్లాంటివాళ్లకి ఏదొక హాబీ ఉంటుంది. మా మేనమామకి సినిమా పాటల హాబీ. అదో పిచ్చి. పొద్దస్తమానం ఏవో గ్రామ్ ఫోన్ రికార్డులు వింటూ, వాటిని తుడుచుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. సినిమా పాటల పరిజ్ఞానం చాలానే ఉంది.

ఓ సారి ఆయన ఏదో పెళ్ళిలో కనిపిస్తే అడిగాను. కచేరీల్లో ప్రతి తలకి మాసిన వెధవ ఘంటసాలలా తెగ ఫీలైపోతూ.. 'రాగమయి రావే.. ', 'నీలిమేఘాలలో..' అంటూ సెలెక్టివ్ గా కొన్ని పాటల్నే హత్య చేస్తారేమి! ఆ గార్ధభోత్తములు 'నందును చరితము.. ' జోలికి ఎందుకు పోరు? అని. ఆయన ఒక క్షణం ఆలోచించాడు. ఆపై విషయం తేల్చేశాడు.

"ఆ పాట పాడటం చాలాచాలా కష్టం. శృతి చాలదు. నా లెక్క ప్రకారం 'నందుని చరితము' పాడ్డానికి ఎవడు సాహసించినా.. పాటయ్యేలోపు గిద్దెడు నెత్తురు కక్కుకుని చస్తాడు. చావుకి తెగించి ఎవడైనా ఎలా పాడతాడు?" అన్నాడు.

నిజమే కదా! ఎవరికైనా తమ గానంతో జనాల ప్రాణాలు తియ్యాలనే సరదా ఉంటుంది గానీ.. తమ గానంతో తమ ప్రాణాలకే ఎసరు ఎందుకు పెట్టుకుంటారు?! మామా! నువ్వు కరెక్టుగానే చెప్పావు!

(photos courtesy : Google)