Thursday 25 April 2013

శంషాద్ బేగం.. ఒక లేడీ రౌడీ సింగర్


ఇవ్వాళ 'హిందూ'లో గాయని శంషాద్ బేగం మరణవార్త చదివి ఆశ్చర్యపొయ్యాను. ఆవిడ ఇంకా ఉందని అనుకోలేదు. ఎప్పుడో చనిపోయిందనుకున్నాను. ఒక వ్యక్తి మరణం గూర్చి ఇంత దుర్మార్గంగా ప్రస్తావించడం తప్పే, క్షమించండి. సూర్యుడు పడమరన మాత్రమే అస్తమిస్తాడని తెలీకపోవడం, ఆ తెలీనివాడి తప్పే అవుతుందిగానీ, సూర్యుడుది కాదు. ఫిల్టర్ కాఫీ అత్యంత మధురంగా ఉండునన్న సత్యం గ్రహించలేకపోవడం, ఆ గ్రహింపలేనివాడి గ్రహపాటే అవుతుంది గానీ, ఫిల్టర్ కాఫీది కాదు. 

'శంషాద్ బేగం మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది, ఆ గానసరస్వతి లేని లోకం చిన్నబోయింది. ఆ స్వరమాధుర్యం దేవుడు ప్రసాదించిన వరం, ఆ గానం నిత్యనూతనం. చిరకాలంగా ఆబాలగోపాలానికి అనిర్వచనీయ ఆనందాన్ని కలిగించిన శంషాద్ బేగం ఇక లేరు అన్న వార్త విని సంగీతాభిమానులు ఖిన్నులయ్యారు.' అంటూ పడికట్టు పదాలతో.. ఏడుస్తూ..  శంషాద్ గూర్చి సంతాపం రాయబోవట్లేదు. శంషాద్ బేగంకి వయసైపొయింది. పోయింది. ఈ సందర్భంగా శంషాద్ పాటొకటి ఇస్తున్నాను. చూడండి.


మనం ఒక వ్యక్తిని చూడంగాన్లే అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. నీటుగా ఉండేవాడు మంచివాడనీ, నాటుగా ఉండేవాడు రౌడీ అనీ.. ఇట్లా. కొందరైతే పేదవారంతా దొంగలేననీ, అలగాజనాన్ని నమ్మరాదనీ కూడా నమ్ముతారు.. ఇది వారి వర్గతత్వ రోగాన్ని సూచిస్తుందేమోగానీ.. మరి దేన్నీ సూచించదు. తెలుగుకవులకి మాత్రం రిక్షా తొక్కువాడు పీడితుడిగా, కారు నడుపువాడు పీడకుడిగా భావిస్తారు. అలా భావిస్తేనే వారికి నమస్కారాలు, పురస్కారాలు లభిస్తాయి. మరికొందరినైతే వ్యక్తి యొక్క అందచందాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇందుకు కారణం బహుశా మన మైండ్ లో ముద్రించుకు పోయిన 'స్టీరియోటైపి' కావచ్చు. ఇది అందరికీ తెలిసిన సంగతే.

నా మైండ్ గొంతుల్ని కూడా స్టీరియోటైప్ చేసేసింది. లతా మంగేష్కర్, లీల, సుశీల.. నాకు చాలా ఇష్టం. వీరి గొంతులో మాధుర్యం, తీపిదనం, లాలిత్యం నన్ను కట్టిపడేస్తాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వలె కనులు మూసుకుని నా స్వప్నసుందరిని గాంచుతూ.. ఆనందపారవశ్యం చెందెదను. నా సుందరి అందాలరాసి, ముగ్ధ, బేల, అమాయకురాలు, పరాయి పురుషుణ్ణి పరాకుగానైనా దరిచేరనీయని గుణవంతురాలు.

భానుమతి, డి.కె.పట్టమ్మాళ్, బెజవాడ రాజారత్నం, శంషాద్ బేగం.. నాకు వీళ్ళ వాయిస్ అంటే భయం. ఇవి చాలా క్లీన్ వాయిస్ లు. వీరి వాయిస్.. వోకల్ కార్డ్స్ ని చీల్చుకుంటూ ఒక సుడిగాలిలా, ఒక సునామీలా.. ఊపిరి తిత్తుల ఫుక్ థ్రాటిల్ తో.. ఫడేల్మని ప్రళయ గర్జన చేస్తూ బయటకొస్తుంది. అసలు వీరి గొంతే ఇలా ఉండగా.. పాడే విధానం మరింత విలక్షణంగా.. చాలా డైనమిక్ గా ఉంటుంది. నాకైతే దందా చేస్తున్న రౌడీ వార్నింగ్ ఇస్తున్నట్లుంటుంది.


మరీ ముఖ్యంగా.. శంషాద్ బేగం పాట వింటుంటే.. 'ఈ ప్రపంచం నాది. దీన్ని నేను శాసిస్తున్నా! ఇక్కడ నా మాటే ఒక వేదం.' అంటూ గర్వంగా డిక్లేర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతే అయితే పర్లేదు. ఇంకా.. 'నాతో వేషాలేస్తే మాడు పగలకోడ్తా' అంటూ ముఖం మీద ఈడ్చి తంతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.

'నీ మొఖం! నీదంతా అతితెలివి. ఆడలేడీసు గొంతులన్నీ ఒకటే. వారికి అవకాశాలొచ్చాయి. దేవుడిచ్చిన స్టోన్ తో పాడారు. దానికంత విశ్లేషణలు ఎందుకు? ఈ మధ్య నీకు ఆడాళ్ళంటే భయం పెరిగిపోతుంది. జస్ట్ ఇగ్నోర్ ఆల్ దిస్. బీ హేపీ!'

'అంతేనంటారా? అలాగైతే ఓకే!'

(photos courtesy : Google)