Wednesday 15 May 2013

పిల్లల పాట్లు.. 'పింక్ ఫ్లాయిడ్' పాట


సమాజం అనగా వ్యక్తుల సమూహం. వ్యక్తుల అవసరాలు, మారుతున్న ఆలోచననా ధోరణుల ప్రభావంతో సమాజంలో మార్పుచేర్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుచేర్పుల వల్ల సమాజం ఏ దిశగా సాగుతుందనేది చూసేవాడి ద్రుష్టికోణాన్ని అనుసరించి ఉంటుంది.

నా చిన్నప్పుడు 'చదువు' అనగా జ్ఞానం. జ్ఞానం రెండు విధాలు. పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం. (అనుభవ జ్ఞానం లేకుండా కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్న వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం లేదు.) ఈ జ్ఞానమే వ్యక్తుల మెరుగైన ఆలోచనా సరళినికి మూలం. ఈ జ్ఞానమే సమాజ హితానికి పునాది. చివరగా.. ఈ జ్ఞానం భుక్తి కోసం కూడా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు 'చదువు' అనగా పుస్తక జ్ఞానం మాత్రమే. ఈ చదువుతోనే మెరుగైన జీవితం, సుఖమయ జీవనం సాధ్యం. చదువు ఎంత ఎక్కువ చదివితే అంత గిట్టుబాటు. మంచి చదువు.. మంచి ఉద్యోగం.. మంచి జీతం.. మంచి పెళ్లి సంబంధం.. మంచి జీవితం. జీవితానికి ఇంతకన్నా అర్ధం లేదు.. పరమార్ధమూ లేదు. అందుకే చదువే సర్వస్వం. చదువే లోకం.

నీ పిల్లల్ని చదివించడం.. అందుకు తగిన ప్రణాళికల్ని రచించడంలోనే నీ ప్రతిభాపాటవాలు వెల్లడవుతాయి. నువ్వు బాగా చదువుకున్నావా? అందులో గొప్పేముంది! నీ పిల్లల్ని బాగా రాపాడించి గొప్ప చదువుల్లో ప్రవేశపెట్టలేకపోయ్యావ్. అంచేత నువ్వో వెధవ్వి. ఇంకా నీతో మాటలు కూడానా! తప్పుకో.

'అయ్యా! నా పిల్లలకి చదువబ్బలేదు. నా భార్య నన్ను రోజూ అసహ్యించుకుంటుంది. చుట్టపక్కాలు గేలి చేస్తున్నారు. నాకు బతకాలని లేదు. చావాలని ఉంది.' దానికేం భాగ్యం! తప్పకుండా చద్దువులే. కాకపొతే ఈ చావుక్కూడా అక్కడో పెద్ద క్యూ ఉంది. నువ్వెళ్ళి ఆ వరసలో నిలబడు.


మీ పిల్లల్ని రోజుకి ఇరవై గంటలు చదివిస్తాం. మిగిలిన నాలుగ్గంటలు కూడా చదువుకు వినియోగించుకోవాలనుకుంటే.. మేం పిలిపించే వ్యక్తిత్వవికాస నిపుణులు టిప్స్ చెప్పెదరు. మీ పిల్లాడిని మా స్కూలుకే పంపండి. మా దగ్గర MBBS సీటు గ్యారంటీ పథకము కూడా కలదు. మీ పిల్లవాని భవిష్యత్తు బంగారు బాటలో పెట్టండి.

సరే! ఈ విషయం పట్ల నా అభిప్రాయాల్ని స్పష్టంగా వివరిస్తూ "కోడి విలాపం! (బ్రాయిలర్ విద్యార్ధుల కథ కూడా.. !)" అని ఓ టపా రాశాను. ఓపికున్నవారు చదువుకోవచ్చు. ఇప్పుడీ టాపిక్ మీద కొత్తగా రాసేదేమీ లేదు.

'పాపం! పిల్లలు.' అని నాకనిపించినట్లే 'పింక్ ఫ్లాయిడ్' అనే ఓ బ్రిటీష్  రాక్ బ్యాండ్ క్కూడా మూడు దశాబ్దాల క్రితం అనిపించింది.

వాళ్ళు సంగీతకారులు కావున బోర్డింగ్ స్కూళ్ళని నిరసిస్తూ 1979 లో ఓ పాట రిలీజ్ చేశారు. ఆ రోజుల్లో 'ఎనదర్ బ్రిక్ ఇన్ ద వాల్' (గోడలో మరొక ఇటుక' అని నా స్వచ్చమైన అనువాదం) పాట ఓ సెన్సేషన్.

గుంటూర్లో రేడియో BBC మ్యూజిక్ చానెల్ తుఫానులో మృత్యుఘోషవలె తెరలుతెరలుగా వచ్చేది. ట్రాన్సిస్టర్ని చెవికి ఆనించుకుని (చెవులు రిక్కించి వినడం అంటే ఇదేనా?).. కళ్ళు మూసుకుని దీక్షగా వినేవాణ్ని.

'పింక్ ఫ్లాయిడ్' సౌండ్ బాగుంటుంది. పాడే విధానం ఇంకా బాగుంటుంది. వీరి పాటల్లో 'సామాజిక స్పృహ' కూడా ఉంటుంది.

ఈ విడియో చూడండి.




విడియో అచ్చు ఇప్పటి మన కార్పోరేట్ విద్యాసంస్థలు అనబడే చదువుల దుకాణాల గూర్చి తీసినట్లుగా ఉంది కదూ! ప్రస్తుతం మన పిల్లల్ని ఈ దుష్టదుర్మార్గ కార్పోరేట్ బూచిగాళ్ళ నుండి కాపాడుకునే మార్గం లేదు.

అంచేత.. మనం 'ఎవరో రావాలి.. నీ హృదయం కదిలించాలి.' అంటూ ప్రేమనగర్లో వాణిశ్రీలా వీణ పాట పాడుకోవాలి.. లేదా వేళ్ళు నొప్పెట్టేలా కీ బోర్డు నొక్కుతూ టపా అయినా రాయాలి. అంతకు మించి చేసేదేం లేదు. నాకు వీణ తెలీదు. కాబట్టి రెండోది చేస్తున్నాను.

ఈ 'పింక్ ఫ్లాయిడ్' రికార్డ్ నా దగ్గర ఉండేది. నా స్నేహబృందంతో మైసూర్ కేఫ్ లో వేడివేడి ఇడ్లీసాంబార్ కడుపారా లాగించి.. నిద్ర ముంచుకొస్తుండగా.. అరమోడ్పు కన్నులతో ఈ పాట మళ్ళీమళ్ళీ వినేవాణ్ని.

సరే! ఎలాగూ ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారుగా. ఇంకొంచెం ఓపిక చేసుకుని.. 'పింక్  ఫ్లాయిడ్' లైవ్ పెర్ఫార్మెన్స్ విడియో కూడా తిలకించి ఆనందించండి.




(photos courtesy : Google)