Thursday, 5 March 2015

సిటీ బ్యూటిఫుల్


నిన్న డాక్టర్ కేశవరెడ్డి 'సిటీ బ్యూటిఫుల్' చదివాను. సీరియల్‌గా వచ్చినప్పుడు ఈ నవల మొత్తంగా చదివానని అనుకున్నాను గానీ.. కొన్ని భాగాలు మిస్సయ్యానని చదువుతుంటే అర్ధమైంది. 'సిటీ బ్యూటిఫుల్' సీరియల్‌గా చదవడానికి అస్సలు బాగోదు, ఏకబిగిన చదివితేనే మజా!

ఈ మధ్యన వరసగా 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్', 'మూగవాని పిల్లనిగ్రోవి', 'చివరి గుడిసె', 'మునెమ్మ'ల్ని చదివేశాను. పల్లె వాతావరణంతో నాకు పరిచయం లేదు, దళితుల జీవితం పట్ల కనీస అవగాహన లేదు. అంచేత ఆ నవలల్ని అర్ధం చేసుకుంటూ నిదానంగా చదవాల్సి వచ్చింది. అయితే 'సిటీ బ్యూటిఫుల్' మెడికల్ స్టూడెంట్ కథ కావడం కారణాన - ఇబ్బంది పడకుండా హాయిగా చదివేశాను.

ఇప్పుడు 'సిటీ బ్యూటిఫుల్' గూర్చి కొన్ని ఆలోచనలు -

దేవీదాస్‌ని చదువుతుంటే ఫిలిప్ గుర్తొచ్చాడు. సోమర్సెట్ మామ్ 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్' ప్రధానపాత్ర ఫిలిప్. మెడిసిన్ చదువు మధ్యలో ఆగిపోతున్నందుకు ఫిలిప్ కూడా దేవీదాస్ లాగే క్షోభ పడతాడు. ఫిలిప్ తన క్లబ్ ఫుట్ (వంకర పాదం) గూర్చి బాధ పడితే, దేవీదాస్ ఎడమచేతి వాటం గూర్చి చికాగ్గా వుంటాడు. కొద్దిసేపు 'క్రైమ్ ఎండ్ పనిష్‌మెంట్'  కూడా రాస్కల్నికోవ్‌ కూడా గుర్తొచ్చాడు. కానీ రాస్కల్నికోవ్‌ది మరీ దుర్భరమైన అసహాయ స్థితి.

డాక్టర్ కేశవరెడ్డి గొప్ప స్టోరీ టెల్లెర్. చార్ల్స్ డికెన్స్, జాక్ లండన్ వంటి ప్రతిభావంత రచయితలకి మల్లె కేశవరెడ్డీ మనని సులువుగా కథలోకి లాక్కెళ్ళిపోతాడు. అలా లాక్కెళ్లి మనల్ని పాత్రల మధ్యన వదిలేస్తాడు. అంచేత - ఆయా పాత్రలతో పాటుగా మనం కూడా ఏడుస్తాం, నవ్వుతాం, కోపగించుకుంటాం. బీ కేర్ఫుల్! ఈ గొప్పరచయితలు మనల్ని తమ అధీనంలోకి తీసుకుని పెట్టే అవస్థలు అన్నిన్ని కావు!

'సిటీ బ్యూటిఫుల్' కొన్ని గంటల పాటు సాగిన దేవీదాస్ ఆలోచనల సమాహారం. అవి చదువుతూ అనుభవించాల్సిందే గానీ - ఆ ఉద్వేగాన్ని 'ఫలానా' అంటూ వివరించడం కుదరదు. నా దృష్టిలో - ఈ రచన 'అంపశయ్య'తో పోల్చదగ్గ మాస్టర్ పీస్. ఇంకా చెప్పాలంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ (ఇంతకన్నా వర్ణించడానికి నాదగ్గర భాష లేదు).

'సిటీ బ్యూటిఫుల్‌' చదివేప్పుడు ఒక విషయం నాకర్ధం కాలేదుమెడికల్ కోర్సు మొదట్లో ఎనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ అనే మూడు సబ్జక్టులు వుంటాయి. వీటిని ప్రి - క్లినికల్ సబ్జక్టులు అంటారు. తరవాత ఆస్పత్రిలో రెగ్యులర్ పోస్టింగ్ (బెడ్‌సైడ్ టీచింగ్ కోసం) వేస్తారు. అంటే - ఎనాటమీ పాసయ్యేదాకా స్టూడెంట్‌కి ఆస్పత్రితో ఏ సంబంధమూ వుండదు. అందువల్ల ప్రి - క్లినికల్ బ్లాకులు ఆస్పత్రికి సంబంధం లేకుండా విడిగా, దూరంగా వుంటాయి (గుంటూరు మెడికల్ కాలేజి కేంపస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కేంపస్‌లు వేరువేరుగా వుంటాయి).

'సిటీ బ్యూటిఫుల్‌'లో ఎనాటమీ డిపార్ట్‌మెంట్ హాస్పిటల్ ఆరో అంతస్తులో వున్నట్లుగా వుంది, ఇది నాకర్ధం కాలేదు. కేశవరెడ్డి ప్రస్తావించిన పాండిచేరీ హాస్పిటల్ నేనెప్పుడూ చూళ్ళేదు. అంచేత - పాండిచేరీ గవర్నమెంటు సర్వీసులో స్థిరపడ్డ నా స్నేహితుడు డాక్టర్ రమణమూర్తికి ఫోన్ చేశాను. అతని సమాచారం మేరకు - కేశవరెడ్డి చదివిందీ, నవల్లో ఆయన రాసిందీ - JIPMER గూర్చి. అక్కడ ఎనాటమీ డిపార్ట్‌మెంట్ అలానే వుంటుందిట, ఇంకా అలానే వుందిట!

ఇంకో సమాచారం - ఆ రోజుల్లో కెమిస్ట్రీ కూడా ఒక సబ్జక్టుగా (PPF - 'ప్రి ప్రొఫెషనల్ కోర్స్' అనేవాళ్ళు) వుండేది. అటు తరవాత డెబ్భైలలో ఈ కోర్స్ ఎత్తేశారు (నేనూ ఈ కోర్స్ చదవలేదు). కావున - డెబ్భైల తరవాత డాక్టర్ కోర్సులో చేరినవారికి దేవీదాస్, లావణ్యల 'కెమిస్ట్రీ ఆఫ్ లవ్' ఇన్ కెమిస్ట్రీ లేబ్ అర్ధం అయ్యే అవకాశం లేదు.

'సిటీ బ్యూటిఫుల్' చదివే సాధారణ పాఠకుల కోసం (విషయం సులభంగా అర్ధమవడానికి) మెడికల్ కోర్సు గూర్చి కొద్దిపాటి సమాచారం ఇస్తే బాగుండేది. కారణం - 'మూగవాని పిల్లనగ్రోవి' చదివేప్పుడు వ్యవసాయం సంగతులు తెలీక నేను చాలా ఇబ్బంది పడ్డాను. అటువంటి ఇబ్బందే మెడికల్ కోర్స్ తెలీని పాఠకులకి ఈ నవల చదివేప్పుడు కలుగుతుందని నా అనుమానం.

(picture courtesy : Google)