Wednesday, 29 April 2015

నాయుడు (రావిశాస్త్రి పాత్రలు -1)

పేరు : నాయుడు

వృత్తి : దొంగనోట్ల ముఠాకి 'బోకరు'. అంటే - దొంగనోట్లని చెప్పి చిత్తు కాయితాలిచ్చి మోసం చేసే ముఠాకి "ఎర్రిపీర్ల"ని తెచ్చే పని. 

అడ్రస్ : 'మూడు కథల బంగారం'లో బంగారిగాడి కత.

రూపురేఖలు : 'సిలక్కట్టూ కళ్ళీలాల్సోడు, యాపయ్యేళ్ళోడు'.

నాయుడి దగ్గర రాజ్యం గూర్చీ, రాజ్యస్వభావం గూర్చీ 'తీరీలు, సిద్దాంతాలు' చాలానే వున్నాయి.  

ఓపాలి బంగారిగాడికి ఏటి సెప్పేడంటే -

"(దొంగలం) మనం సోరీలూ సీటింగులూ సెయ్యడానికి మనకి అతాట్టి ఏటుంది? అతాట్టీ ఏటీ లెద్దు. రాజు రాజ్జెం జెయ్యడానికి ఆడికి అతాట్టి ఏటుంది? జెబ్బలఁవేఁ ఆడికి అతాట్టి. ఆ బలవేఁ ఆడు సేసీ పనులన్నింటికి అధాటీ! ఆ అతాట్టితో ఆడు ఏటి జేస్తడు? పన్నులేస్తాడు, పరిపాలిస్తాడు. అయితే, పెజల్ని పరిపాలిచ్చడానికి ఇన్ని పన్నులక్కర్లెద్దు. కానీ ఆడు అక్కర్లేని పన్నులొసూల్జేసి ఆడు బావుపడి ఆడి సపోటర్సుని బాగుజేస్తాడు. ఆడి సపోటర్సూ అంటే ఆళ్ళెవుళ్ళు? ఆళ్ళంతా కూడా ఆళ్ళ జెబ్బల బలమ్మీదే ఆ రాజుని నిలబెట్టినోళ్ళన్నమాట. మనం మన దొంగరాబడి ఓటాలేసుకున్నట్టె ఆళ్ళు కూడా ఓటాలేస్సుకుంటారన్నమాట. మనకీ అళ్ళకీ తేడా యేటంటే మనం రాస్యంగా ఓటాలేసుకుంటాం. ఆళ్ళు బాగాటంగ ఏసిస్సుకుంటారు. అయితే పెజలంతా కలిసి పెజల డబ్బు మీరిలా ఓటాలేసీసుకోడం ఏట్రా లంజాకొడకల్లారా అని తిరగబడకుండా ఉండానికి రాజుకి రొండుకళ్ళూ కాళ్ళూ సేతులూ ఉన్నయ్యి. కళ్ళు పోలీసోళ్ళు. మిల్ట్రీ కాళ్ళూ సేతులు.

కళ్ళేటి సేస్తయంటే కనిపెడుతుంటయి. ఎక్కడ ఎవుడు మన అతాట్టిని అటకాయిస్తడు, ఎక్కడ ఎవుడు ఏ అల్లరి సేస్తన్నాడు, ఎవుణ్ని మనం ఒప్పుడు అణిసెయ్యాల? ఇల్లాటియన్ని కళ్ళు కనిపెట్టి రాజుకి ఓర్తలు సేరేస్తుంటయ్యన్నమాట. సిన్నసిన్న టకాయిఁప్పులైతే పితూరీలే అయితే పోలీసోళ్ళే సరదీసుకుంటరు. టకాయిఁప్పు దిరుగుబాటైతే రాజు అప్పుడు ఫీల్డులోకి మిల్ట్రీ దిఁచ్చతుడన్నమాట. కళ్ళు లేపోతే రాజు గుడ్డోడన్నమాటే గదా మరి! మరిఁక్క కాళ్ళూ సేతులూ దెబ్బదినీసినయ్యంటే ఆడి అతాట్టి పొయ్యినట్టే గదా మరి. అందకే కళ్ళూ కాళ్ళూ సేతల సంరచ్చన కోసరం రాజులు కోట్లు కర్సు సేస్తుంటరు. డబ్బెవుడిది? పెజల్ది! ఆ డబ్బుతో పాతెయ్యడం ఒవుళ్ని? పెజల్ని!"

దొంగలు పోలీసులకి లంచం ఎందుకిస్తారు? ఎందుకో నాయుడికి బాగా తెలుసు.

"అతాట్టి లేకండా మనం సోరీలు సేసి రాజుని యెతిక్కరిస్తం గాబట్టి ఆడి దెబ్బకి మనం దొరక్కుండా ఉండాలంటే మనం ఆడి కళ్ళు కప్పాల. ఆడి కళ్ళు ఒవుళ్ళు? పోలీసోళ్ళు. ఆళ్ళకి నువ్వు కళ్ళు అప్పగలవా? కప్పలెవ్వు. ఎంచేత? ఆళ్ళు తెల్లార్లెగిస్తే దొంగలమద్దే తిరుగులాడతారు. నువ్వు దొంగతనం సేయిస్సి ఇయ్యాళ కనబడకండబోయినా మరి నాలుగు దినాలకైనా కానరాకుండా పోవు. అంచేత్త ఆళ్ళ కళ్ళు కప్పలేం. కప్పలేనప్పుడు ఏటి జెయ్యాల? ఆలోసిచ్చాల. ఆలొసిచ్చి, కళ్ళకి బెత్తెడు కిందిని పెతీవోడికీ నోరున్నట్లుగనే పెతి పోలీసోడిక్కూడా నోరుంటదని దెలుసుకుని ఆ నోటికి లంచఁవనే కంచం అందిచ్చాల. అందిచ్చగనే కన్ను కూసింతసేపు మూసుకుంటది. కాకపోతె ఉంకో దిక్కుకి తిరుగుద్ది. ఆ టయాంల మన పన్లు మనం సక్కబెట్టుకోవాల. అంచేత, ఏంటంటే : సోరీయే అవనీ సీటింగే అవనీ లేపొతె కొట్టాటే గానీ, మనం మన పన్లు సాటుగా సేసుకోడవేఁగాదు పోలీసోడి సపోటుతో ఆడికి సెప్పి సేసుకోడం బెస్టు. సపోటు లేకండా పన్లు మనం సేసుకుంటే సేసుకొవ్వొచ్చు. కానీ, దొరికిపొయిన్నాడు పాతాలలోకానికి పయనం కాడానికి మూటా ముల్లే సరుదుకు సిద్ధంగ ఉండాల్సిందే! పుల్లూ పాఁవుఁలూ ఏనుగులు పగోణ్ని మరిసిపోవంట. పోలీసోడు గూడా అంతే."

ఇన్ని విషయాలు గ్రహించాడు కనుకనే నాయుడు సూర్రావెడ్డు పట్ల చాలా గౌరవంగా మెసలుకుంటాడు. సీను సస్సెస్‌ఫుల్‌గా జరిపించీసి తన ఓటా తనుచ్చేసుకుని మరింక కనపడ్డు. 

నాయుడూ! నీ తెలివికి హేట్సాఫ్ మేన్! 

P.S. - *italics belong to రావిశాస్త్రి