Thursday 2 April 2015

"గోంగూరా, వంకాయ తినొచ్చా?"




"డాక్టర్‌గారు! గోంగూర, వంకాయ తినొచ్చా?"

"తినొచ్చు."

"తినొచ్చా!"

"తినొచ్చు."

"తినొచ్చా!!!"

"తినొచ్చు."

"మా ఇంటిదగ్గరోళ్ళు తినొద్దంటున్నారండీ!"

"నేన్చెబుతున్నాగా, తినొచ్చు!"

"తినొచ్చా!!!!!!!!!!!!!!"

ప్రాక్టీస్ మొదలెట్టిన కొత్తలో నాకీ గోంగూర వంకాయల గోల అర్ధమయ్యేది కాదు, చిరాగ్గా కూడా వుండేది!

కొన్నాళ్ళకి -

అతను నా క్లాస్‌మేట్, మంచి స్నేహితుడు. జనరల్ ప్రాక్టీస్ చేస్తాడు, బాగా బిజీగా వుంటాడు. సైకియాట్రీ కేసులకి కన్సల్టంట్‌గా నన్ను పిలిచేవాడు, పన్లోపనిగా ఒక కప్పు కాఫీ కూడా ఇచ్చి కబుర్లు చెప్పేవాడు. ఆ రోజుల్లో నాకసలు వర్క్ వుండేది కాదు, కాబట్టి పిలవంగాన్లే వెళ్ళేవాణ్ని. నా స్నేహితుడిది భీభత్సమైన ప్రాక్టీస్. కన్సల్టేషన్ గది ముందు పెద్ద గుంపు, తోపులాటలు!

కన్సల్టేషన్ చాంబర్లో డాక్టర్‌కి ఎదురుగానున్న కుర్చీలో కూర్చునేవాణ్ని. అతను పేషంట్లని చకచకా చూసేస్తుండేవాడు. నాకు జనరల్ ప్రాక్టీస్ తెలీదు. అంచేత - డాక్టర్ని, పేషంట్లని ఆసక్తిగా గమనిస్తుండేవాణ్ని.

డాక్టర్ మందులు రాశాక చాలామంది పేషంట్లు అడిగే ప్రశ్నలు దాదాపుగా ఒకటే!

"గోంగూర, వంకాయ తినొచ్చా?"

"వద్దు, మానెయ్!"

"దుంపకూరలు?"

"వద్దు, మానెయ్!"

"తీపి?"

"వద్దు, మానెయ్!"

"నీచు?"

"వద్దు, మానెయ్!"

"పాలు, పెరుగు?"

"పాలు మంచిదే! పెరుగు వాడకు, మజ్జిగ మాత్రం బాగా తాగాలి."

నా మిత్రుడి సలహాలు నాకర్ధమయ్యేవి కాదు, ఆశ్చర్యంగా వుండేవి. కాఫీ తాగుతున్న ఒక శుభ సమయాన -

"వంకాయ, గోంగూర, పాలు, పెరుగు.. ఏవిటిదంతా?" అడిగాను.

"దీన్నే పథ్యం అందురు." అంటూ పెద్దగా నవ్వాడు నా స్నేహితుడు. 

ఒకక్షణం ఆలోచించి - "మొదట్లో నాకూ అర్ధమయ్యేది కాదు. పథ్యం లేని వైద్యం పన్జెయ్యదని పేషంట్ల నమ్మకం. వాళ్ళు 'అడిగారు' అంటేనే అవి 'తినకూడనివి' అనర్ధం!" అన్నాడు.

"పేషంట్లని ఎడ్యుకేట్ చెయ్యొచ్చు కదా!"

"ఎందుకు చెయ్యకూడదు? చెయ్యొచ్చు. ప్రయత్నించాను, వల్లకాక వదిలేశాను!"

"ఎందుకని?" ఆసక్తిగా అడిగాను. 

"వాళ్ళని పథ్యం విషయంలో ఎడ్యుకేట్ చెయ్యాలంటే మనకి బోల్డంత సమయం వృధా. ఎంత చెప్పినా పథ్యంలేని వైద్యంపై వారికి నమ్మకం వుండదు. వాళ్ళా గోంగూర, వంకాల్లాంటివి కొన్నాళ్ళపాటు తినకపోతే కొంపలేమీ మునిగిపోవు. కాబట్టి మనమే వాళ్ళ రూట్లోకి పోవడం సుఖం."

"కానీ - సైంటిఫిక్‌గా కరక్టు కాదు కదా?" అన్నాను.

"డెఫినిట్‌గా కాదు, ప్రాక్టికల్‌గా మాత్రం కరక్ట్! వాళ్ళు మన్దగ్గరకొచ్చేది వైద్యం కోసం, పథ్యం గూర్చి చర్చలక్కాదు! అంచేత - వాళ్ళతో వాదనలు అనవసరం." నవ్వుతూ అన్నాడు నా మిత్రుడు.

నాకతని వాదన కన్విన్సింగ్‌గా అనిపించలేదు. పథ్యం అనేది అతని వైద్యం USP పెంచుకోడానికి వాడుకుంటున్నట్లుగా అనిపించింది. కానీ నా మిత్రుడు చెప్పిందాట్లో - 'వాళ్ళు అడిగేవి తినకపోతే కొంపలేమీ మునగవు' అన్న మాట నాకు బాగా నచ్చింది.

నేను చేసేది స్పెషాలిటీ ప్రాక్టీస్, జనరల్ ప్రాక్టీసంత కష్టం వుండదు. కానీ - గోంగూర, వంకాయల విషయంలో నేనంటూ ఒక స్టాండ్ తీసుకోకపోతే నా పేషంట్లు నాకసలు వైద్యమే తెలీదనుకునే ప్రమాదముంది! అంచేత - నేను నా ప్రాక్టీసులో మధ్యేమార్గంగా ఒక స్పష్టమైన అస్పష్ట విధానాన్ని ఎన్నుకున్నాను. 

అదేమిటనగా -

"గోంగూరా, వంకాయ తినొచ్చా?"

"తినకపోతే మంచిదే! తిన్నా నష్టంలేదు!"

పేషంట్లకి ఈ సలహా అర్ధం కాక.. బుర్ర గోక్కుంటూ బయటకి నడుస్తారు! 

అస్పష్టమైన సలహాలివ్వడం సైకియాట్రిస్టులకి అలవాటే లేండి

(posted in fb on 29 Dec 2017)