Tuesday, 21 April 2015

తప్పు చేశావ్ మైకీ!వయసుతో పాటు మనుషులకి ఇష్టాయిష్టాలు కూడా మారుతుంటాయ్. నాకు ఒక వయసులో సినిమాలంటే చాలా ఇష్టం, ఇప్పుడు చాలా కొద్దిగా మాత్రమే ఇష్టం. అప్పుడప్పుడు ఏదైనా సినిమా చూద్దామనిపిస్తుంది. కానీ ఆ 'ఏదైనా' సినిమా ఎలా వుంటుందో తెలీదు. తీరా చూశాక తలనొప్పి రాదని గ్యారెంటీ లేదు, అప్పుడు బోల్డెంత సమయం వృధా అయిపోయిందని బాధపడాలి. అంచేత నేనెప్పుడూ కొత్తసినిమా చూసే ధైర్యం చెయ్యను, ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్ళీ చూస్తాను. ఆ క్రమంలో ఈ మధ్య నేను బాగా ఇష్టపడే 'గాడ్‌ఫాదర్ పార్ట్ 2' మళ్ళీ చూశాను.

ఈ సినిమా నాకెందుకు బాగా నచ్చింది?

గాడ్‌ఫాదర్ పార్ట్ 2 చూస్తుంటే నాకు ఒక మంచి నవల చదువుతున్నట్లుగా అనిపిస్తుంది, క్రమేపి కథలో లీనమైపోతాను. ఆ దృశ్యాలు నాముందు జరుగుతున్నట్లుగా, వాటిలో నేనూ ఒక భాగం అయినట్లుగా అనిపిస్తుంది. ఇలా అనిపించడం మంచి సినిమా లక్షణం అని ఎవరో చెప్పగా విన్నను.

ఒక సినిమా హిట్టైతే, ఆ సక్సెస్‌ని మరింతగా సొమ్ము చేసుకునేందుకు హాలీవుడ్ వాళ్ళు దానికి సీక్వెల్ తీస్తుంటారు. ఈ గాడ్‌ఫాదర్ పార్ట్ 2 కూడా అలా తీసిందే. సాధారణంగా ఇట్లా తీసిన సీక్వెల్స్ అసలు కన్నా తక్కువ స్థాయిలో వుంటాయి. అయితే, గాడ్‌ఫాదర్ పార్ట్ 2 అందుకు మినహాయింపు.

చదువుకునే రోజుల్లో - నేనూ, నా స్నేహితులు నిశాచరులం. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం పిశాచ లక్షణమా? లేక పూర్వజన్మలో మేం రాత్రిళ్ళు గోడలకి కన్నాలేసే దొంగలమా? అన్నది ఆలోచించవలసి వుంది. ఏది ఏమైనప్పటికీ - మేమంతా పగలు కంటే రాత్రిళ్ళే హుషారుగా వుండేవాళ్ళం! పరీక్షలుంటే టెక్స్టు పుస్తకాలు, లేకపోతే శ్రీదేవి బుక్ స్టాల్ అద్దె పుస్తకాలు రాత్రిపూట మా ఆహారం. సెక్సు పుస్తకాల దగ్గర్నుండి, ఇంగ్లీషు క్లాసిక్స్ దాకా - దేన్నీ వదిలేవాళ్ళం కాదు.

మేం చదివిన కొన్ని ఇంగ్లీషు నవలలు సినిమాగా వచ్చేవి. నవలకీ, సినిమాకీ మధ్య జరిగిన మార్పుల గూర్చి తీవ్రచర్చలు జరిగేవి. ఆ ప్రాసెస్‌లో మేరియో పూజో 'గాడ్‌ఫాదర్' నవలని చదివేశాం. చదవడమంటే అట్లాఇట్లా కాదు - పిప్పిపిప్పి చేశాం, పొడిపొడి చేశాం. 'ఆహా! నేరసామ్రాజ్యం ఎంత గొప్పది!' అని సిసీలియన్ల మాఫియా నేరాలకి ముచ్చటపడుతూ - వారి నేర విలువలకీ, నిజాయితీకీ అబ్బురపడుతూ - సినిమా చూసి మరింతగా ఆనందించాం.

కారణాలు గుర్తులేవు గానీ, నేను గాడ్ ఫాదర్ పార్ట్ 2 ని కొన్నేళ్ళపాటు మిస్సయ్యాను. ఆ తరవాతెప్పుడో చూశాను. గాడ్‌ఫాదర్ కన్నా గాడ్‌ఫాదర్ పార్ట్ 2 బాగుందనిపించింది. అందుక్కారణం - తండ్రీ కొడుకుల కథని ముందుకు వెనక్కీ తీసుకెళ్తూ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా నెరేట్ చేసిన విధం. ఈ విధానాన్ని నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అంటార్ట. క్వింటిన్ టరాంటినో సినిమాలు చూస్తే ఈ విధానం గూర్చి ఇంకా బాగా తెలుస్తుంది.

సరే! నలభయ్యేళ్ళ తరవాత గాడ్‌ఫాదర్ పార్ట్ 2 గూర్చి రాయడానికి ఏముంటుంది? తెలుగు టీవీ చానెళ్ళవారిలా అల్ పచీనో, రాబర్ట్ డీ నీరో గొప్ప నటులనో.. కొప్పోలా మంచి దర్శకుడనో అరిగిపోయిన మాటల్తో సినిమా గూర్చి చెప్పే పని చెయ్యబోవట్లేదు. 


గాడ్‌ఫాదర్ పార్ట్ 2 చూసినప్పుడల్లా, చివర్లో నాకు మనసు భారంగా అయిపోతుంది. అందుకు కారకుడు ఫ్రీడో కార్లియోనె! అమ్మయ్య! గాడ్‌ఫాదర్ పార్ట్ 2 గూర్చి రాయడానికి నాకో పాయింట్ దొరికింది. ఇప్పుడు ఫ్రీడో పట్ల నా సానుభూతి ఎందుకో రాస్తాను.

డాన్ వీటో కార్లియోనెకి ముగ్గురు కోడుకులు, ఒక కూతురు. పెద్దవాడు సాని డైనమిక్ ఎండ్ డేషింగ్. రెండోవాడు ఫ్రీడో మంచివాడు - కొద్దిగా అమాయకుడు, ఎక్కువగా అసమర్ధుడు. అందుకే శత్రువులు తండ్రిని కాల్చేప్పుడు చేతిలో తుపాకీ ఉంచుకుని కూడా తిరిగి కాల్చలేకపోతాడు. ఇక మూడోవాడైన మైకేల్ గూర్చి చెప్పేదేముంది? రెస్టారెంట్‌లో సొలొజొని చంపడంతో అతని ప్రతిభేంటో లోకానికి అర్ధమైపోతుంది.

సాని, వీటో కార్లియోనిల మరణం తరవాత మైకేల్ డాన్ అవుతాడు. జూదగృహాలు, వ్యభిచార గృహాల మీద పర్యవేక్షణ వంటి చిన్నపనులు ఫ్రీడోకి అప్పజెబుతాడు మైకేల్. వీటో కార్లియోని దత్తపుత్రుడైన టామ్ హేగన్‌ మైకేల్‌కి కుడిభజం. తననెవరూ సీరియస్‌గా తీసుకోకపోవడం ఫ్రీడోని అసంతృప్తికి గురి చేస్తుంది. మైకేల్ ప్రత్యర్ధి హైమన్ రాత్ మనిషి జాని ఓలాకి సమాచారం (?) ఇస్తాడు (అది తన కుటుంబానికి ప్రమాదం అని ఫ్రీడోకి తెలీదు). ఫలితంగా బెడ్రూములో మైకేల్ మీద హత్యాయత్నం జరుగుతుంది.

కొన్నాళ్ళకి ఇంటిదొంగ ఫ్రీడోనేనని మైకేల్ అర్ధం చేసుకుంటాడు. క్యూబాలో ఫిదేల్ కేస్ట్రో నాయకత్వంలో తిరుగుబాటుదారులు బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేసేప్పుడు - 'ఫ్రీడో! అది నువ్వేనని నాకు తెలుసు!' అని చెవిలో చెబుతాడు మైకేల్. తమ్ముడు తనని బ్రతకనివ్వడని భయపడి న్యూయార్క్ పారిపోతాడు ఫ్రీడో. ఫ్రాంక్ పెంటంగలి వల్ల సెనెట్ కమిటీ విచారణని ఎదుర్కునే కష్టాల్లో పడతాడు మైకేల్. పారిపోయిన ఫ్రీడోని న్యూయార్క్ నుండి పిలిపించి కేసుకి కావలసిన సమాచారం రాబడతాడు మైకేల్.

ఫ్రీడో ఇద్దరు సమర్ధులైన సోదరుల మధ్య పుట్టిన అమాయకుడు, అందుకే జానీ ఓలాని నమ్మాడు. అతనో ఫూల్, ఈడియట్. ఆ విషయం మైకేల్‌కీ తెలుసు. కుటుంబంలో సోదరుల మధ్య పోటీ వుంటుంది, వారిలోవారికి తమకన్నా సమర్ధులైనవారి పట్ల ఈర్ష్యాసూయలు వుంటాయి. దీన్ని 'సిబ్లింగ్ రైవల్రీ' అంటారు. జరిగినదానికి బాధ పడుతూ ఫ్రీడో కూడా అలాగే మాట్లాడతాడు. ఫ్రీడో మాటల్ని పట్టించుకోకుండా - జన్మలో నీ మొహం నాకు చూపించొద్దంటాడు మైకేల్. 


ఇక్కడ దాకా బాగానే వుంది. మైకేల్‌ వద్దన్నాక తమ్ముడికి దూరంగా ఎక్కడో తన బ్రతుకు తను బ్రతికేవాడు ఫ్రీడో. కానీ మైకేల్ దుర్మార్గుడు. ఈ విషయాన్ని మైకేల్ భార్య కే బాగా అర్ధం చేసుకుంటుంది, అందుకే అతన్ని అసహ్యించుకుని వదిలేస్తుంది. తల్లి బ్రతికున్నంత కాలం ఫ్రీడోని ఏమీ చెయ్యొద్దని ఆదేశిస్తాడు మైకేల్. అసలు మైకేల్‌కి ఫ్రీడోని చంపాల్సిన అవసరం ఏమిటి!?

తల్లి మరణించినప్పుడు - ఫ్రీడోని క్షమించమని చెల్లి ప్రాధేయపడటంతో ఫ్రీడోని చేరదీస్తాడు మైకేల్. కానీ - అతన్దంతా నటన, చెల్లెల్ని కూడా నమ్మించి మోసం చేస్తాడు మైకేల్. అర్భకుడైన అన్నని చంపడానికి ఇన్ని నాటకాలా! మైకేల్ తన తండ్రిలాగా మనుషుల్ని నమ్మడు, అన్నలాగా ఎమోషనల్ కాదు. అతనికన్నీ వ్యాపార ప్రయోజనాలే తప్ప విలువలు శూన్యం. అందుకే - ఫ్రీడోతో మంచిగా వున్నట్లుగా నమ్మించి చంపించేస్తాడు మైకేల్. ఫ్రీడో చావుతో సినిమా ముగుస్తుంది, సరీగ్గా ఇక్కడే నా మనసు భారంగా అయిపోతుంది!

ఈ సినిమాలో ఎట్లా చూసుకున్నా ఫ్రీడో హత్య సమర్ధనీయం కాదు. ఫ్రీడోకి తమ్ముడంటే ప్రేమ, కలలో కూడా అతనికి హాని తలపెట్టడు, పెట్టేంత సమర్ధత కూడా లేనివాడు. అట్లాంటి ఫ్రీడోని నమ్మించి, ఫిషింగ్ చేస్తున్నప్పుడు వెనకనుండి తలలోకి తుపాకీతో కాల్చి చంపించడం.. చాలా దుర్మార్గం కదూ!

సిసిలియన్లు మన తెలుగు వాళ్ళలాగే కుటుంబ వ్యవస్థపై నమ్మకం కలవాళ్ళు. సొంత మనుషుల్ని చంపడం వారి ఆలోచనలకి, నియమాలకి విరుద్ధం. వీటో కార్లియోని తప్పు చేసినవారిని క్షమించగలడు, మైకేల్‌కి క్షమించడం అన్న పదానికి అర్ధం తెలీదు. అందుకే అన్నని చంపడానికి వెనకాడలేదు!

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల, మారియో పూజోలు ఈ అన్యాయమైన, అనవసమైన హత్య మైకేల్ చేత ఎందుకు చేయించారో అర్ధం కాదు. ఈ గిల్ట్ ఫీలింగ్ వల్లనే కావచ్చు - గాడ్‌ఫాదర్ పార్ట్ 3 లో అన్నని హత్య చేయించినందుకు మైకేల్ గిల్టీగా ఫీలవుతుంటాడు. నా అనుమానం ఆ గిల్ట్ మైకేల్‌ది కాదు - ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో పూజోలది అని!

ఇంతటితో నేను రాద్దామనుకున్న పాయింట్ పూర్తయ్యింది. గాడ్‌ఫాదర్ పార్ట్ 2 సినిమా చూడనివాళ్ళకి ఈ పోస్ట్ విసుగ్గా అనిపించొచ్చు. అందుకు సారీ చెప్పుకుంటున్నాను. నేను సినిమాలు చూసే వయసులో వచ్చిన సినిమా కాబట్టి - ఒక కేరక్టర్ గూర్చి నా అభిప్రాయం వివరంగా రాయగలిగాను. ఇప్పుడైతే నాకు నవల చదివే ఓపికా, సమయం లేవు. చర్చించుకోడానికి స్నేహితులూ లేరు. సినిమా చూడాలనే ఆసక్తీ లేదు. అందువల్ల - ఇదే సినిమా ఈ పాతికేళ్ళల్లో వచ్చినట్లైతే బహుశా నేను చూడను కూడా చూసేవాణ్ని కాదేమో!  

(posted in fb o 3/2/018)