Friday, 21 October 2016

రీటా బహుగుణ మాతా కీ జై!


భారత రాజకీయాలు క్లిష్టమైనవి, చిత్రమైనవి. కన్నుమూసి తెరిచేంతలో పరిస్థితులు తారుమారవుతుంటయ్. అంచేత ప్రజాసేవయే పరమావిధిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతుంటారు. అయితే - ఈ వలసలు ఎల్లప్పుడూ ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకే జరుగుతుంటయ్. ఇందుకు నాయకులు చెప్పే కారణం వొకేలా వుంటుంది - 'నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు, అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నాం.' ఈ కారణం వింటున్నప్పుడు - అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు గుర్తొచ్చి నవ్వొస్తుంది.

ఇంటర్లో నా స్నేహితుడు యెక్కువగా క్యాంటీన్లోనూ, తక్కువగా క్లాసుల్లోనూ గడిపేవాడు. అటెండెన్స్ కోసం ఒకేరకమైన లీవ్ లెటర్ ఇచ్చేవాడు - 'respected sir, as i am suffering from fever.. ' అంటూ! 'యెప్పుడూ జ్వరమేనా?' అంటూ లెక్చరర్లు విసుక్కునేవాళ్ళు. మావాడు బుర్ర గోక్కునేవాడు, అసలు విషయం - మావాడికి లీవ్ లెటర్ ఇంకోలా రాయడం తెలీదు! డాక్టర్లిచ్చే మెడికల్ సర్టిఫికేట్లూ ఇంతే, అవెప్పుడూ - 'it is to certify.. ' అనే మొదలవుతాయ్!

ఇదే పద్ధతిలో మెజారిటీ జనులు - ఎక్కువమంది ఎక్కువసార్లు నడిచి నలిపేసిన బాటలోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు - బుర్ర ఉపయోగించాల్సిన అవసరం ఉండదు కాబట్టి. రాజకీయ నాయకుల్లో క్రియేటివిటీ చచ్చినప్పుడు వార్తలు చల్లారిన కాఫీలా, వేడెక్కిన విస్కీలా చేదుగా అయిపోతాయి. ఇలాంటి చేదు వార్తల్తో జీవితాన్ని తెలుగు కథా సంపుటిలా నిస్సారంగా గడిపేస్తుండగా -

రీటా బహుగుణ జోషి అనే నాయకురాలి పార్టీమార్పిడి ప్రకటన నాలో సంతోషాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో షీలా దీక్షిత్‌ వల్ల రీటా బహుగుణకి పన్లేకుండాపోయింది. బీజేపిలో చేరడానికి ముందస్తు బేరం మాట్లాడుకుని - దేశభక్తి స్లోగన్లిస్తూ పార్టీ మార్చేసింది. మోడీ పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు చేస్తూ దేశప్రతిష్టని పెంచుతుంటే.. ఆ దాడుల్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ దేశప్రతిష్టని దిగజారుస్తున్నాట్ట! సరే - యెవరు యేం పెంచినా, దించినా.. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల విన్యాసాలేనని మనకి తెలుసు.

నేషనల్ చానెల్స్ (వాస్తవానికి ఇవి ఢిల్లీ చానెల్స్) వీక్షించే ఆంగ్లమేధావులకి రీటా బహుగుణ జోషి పరిచితమే. ఆవిడ అనేకమార్లు ఆవేశంతో ఊగిపోతూ సంఘ పరివార్‌ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది. బహుశా మిస్ జోషిలోని ఈ ఫైర్ అమిత్ షాకి నచ్చిందేమో! అందుకే - ఆమెకి బొకే ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకున్నాడు.

ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు యేమాత్రం లేవని ప్రజలందరికీ (ఒక్క రాహుల్ గాంధీకి తప్ప) తెలుసు. మునిగిపోతున్న పడవలో యెవరు మాత్రం ఎందుకుంటారు? అందుకే తలోదారి చూసుకుంటున్నారు. నాయకులారా! మీరు పార్టీలు మారండి. కానీ - మారేటప్పుడు రీటా జోషిలాగా ఒక గంభీరమైన కారణాన్ని చూపండి. వినడానికీ, చదవడానికి బాగుంటుంది.

'యేవిఁటోయ్ నీకు బాగుండేది? పార్టీలు మారనివాడు రాజకీయ నాయకుడే కాదు. మాకసలు పేపర్ చదివే అలవాటే లేదు. నీకు బాగుండటం కోసం లేని కారణాన్ని మేమెక్కడ వెతుకుతాం? చాలించు నీ అధర్మపన్నాలు!' అంటారా? ఓకే! మీకెలాగూ 'నియోజకవర్గ ప్రజలు.. ' అంటూ ఒక pro forma ఉందిగా! దాన్తోనే పార్టీలు మారెయ్యండి. గుడ్ లక్ టు యు!

(picture courtesy : Google)