Friday 21 October 2016

రీటా బహుగుణ మాతా కీ జై!


భారత రాజకీయాలు క్లిష్టమైనవి, చిత్రమైనవి. కన్నుమూసి తెరిచేంతలో పరిస్థితులు తారుమారవుతుంటయ్. అంచేత ప్రజాసేవయే పరమావిధిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతుంటారు. అయితే - ఈ వలసలు ఎల్లప్పుడూ ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకే జరుగుతుంటయ్. ఇందుకు నాయకులు చెప్పే కారణం వొకేలా వుంటుంది - 'నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు, అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నాం.' ఈ కారణం వింటున్నప్పుడు - అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు గుర్తొచ్చి నవ్వొస్తుంది.

ఇంటర్లో నా స్నేహితుడు యెక్కువగా క్యాంటీన్లోనూ, తక్కువగా క్లాసుల్లోనూ గడిపేవాడు. అటెండెన్స్ కోసం ఒకేరకమైన లీవ్ లెటర్ ఇచ్చేవాడు - 'respected sir, as i am suffering from fever.. ' అంటూ! 'యెప్పుడూ జ్వరమేనా?' అంటూ లెక్చరర్లు విసుక్కునేవాళ్ళు. మావాడు బుర్ర గోక్కునేవాడు, అసలు విషయం - మావాడికి లీవ్ లెటర్ ఇంకోలా రాయడం తెలీదు! డాక్టర్లిచ్చే మెడికల్ సర్టిఫికేట్లూ ఇంతే, అవెప్పుడూ - 'it is to certify.. ' అనే మొదలవుతాయ్!

ఇదే పద్ధతిలో మెజారిటీ జనులు - ఎక్కువమంది ఎక్కువసార్లు నడిచి నలిపేసిన బాటలోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు - బుర్ర ఉపయోగించాల్సిన అవసరం ఉండదు కాబట్టి. రాజకీయ నాయకుల్లో క్రియేటివిటీ చచ్చినప్పుడు వార్తలు చల్లారిన కాఫీలా, వేడెక్కిన విస్కీలా చేదుగా అయిపోతాయి. ఇలాంటి చేదు వార్తల్తో జీవితాన్ని తెలుగు కథా సంపుటిలా నిస్సారంగా గడిపేస్తుండగా -

రీటా బహుగుణ జోషి అనే నాయకురాలి పార్టీమార్పిడి ప్రకటన నాలో సంతోషాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో షీలా దీక్షిత్‌ వల్ల రీటా బహుగుణకి పన్లేకుండాపోయింది. బీజేపిలో చేరడానికి ముందస్తు బేరం మాట్లాడుకుని - దేశభక్తి స్లోగన్లిస్తూ పార్టీ మార్చేసింది. మోడీ పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు చేస్తూ దేశప్రతిష్టని పెంచుతుంటే.. ఆ దాడుల్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ దేశప్రతిష్టని దిగజారుస్తున్నాట్ట! సరే - యెవరు యేం పెంచినా, దించినా.. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల విన్యాసాలేనని మనకి తెలుసు.

నేషనల్ చానెల్స్ (వాస్తవానికి ఇవి ఢిల్లీ చానెల్స్) వీక్షించే ఆంగ్లమేధావులకి రీటా బహుగుణ జోషి పరిచితమే. ఆవిడ అనేకమార్లు ఆవేశంతో ఊగిపోతూ సంఘ పరివార్‌ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది. బహుశా మిస్ జోషిలోని ఈ ఫైర్ అమిత్ షాకి నచ్చిందేమో! అందుకే - ఆమెకి బొకే ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకున్నాడు.

ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు యేమాత్రం లేవని ప్రజలందరికీ (ఒక్క రాహుల్ గాంధీకి తప్ప) తెలుసు. మునిగిపోతున్న పడవలో యెవరు మాత్రం ఎందుకుంటారు? అందుకే తలోదారి చూసుకుంటున్నారు. నాయకులారా! మీరు పార్టీలు మారండి. కానీ - మారేటప్పుడు రీటా జోషిలాగా ఒక గంభీరమైన కారణాన్ని చూపండి. వినడానికీ, చదవడానికి బాగుంటుంది.

'యేవిఁటోయ్ నీకు బాగుండేది? పార్టీలు మారనివాడు రాజకీయ నాయకుడే కాదు. మాకసలు పేపర్ చదివే అలవాటే లేదు. నీకు బాగుండటం కోసం లేని కారణాన్ని మేమెక్కడ వెతుకుతాం? చాలించు నీ అధర్మపన్నాలు!' అంటారా? ఓకే! మీకెలాగూ 'నియోజకవర్గ ప్రజలు.. ' అంటూ ఒక pro forma ఉందిగా! దాన్తోనే పార్టీలు మారెయ్యండి. గుడ్ లక్ టు యు!

(picture courtesy : Google)

Sunday 16 October 2016

ట్రంపుని సమర్ధిస్తూ..


ఇప్పుడే కాఫీ తాగాను. టీవీలో తెల్లజుట్టు, ఎర్ర టైతో ట్రంప్ యేదే చెబుతున్నాడు. పాపం, మీడియా ట్రంపుని పచ్చడి పచ్చడి చేస్తుంది. నాకెందుకో ట్రంపుని చూస్తే యెడారిలో దారితప్పిన మదపుటేనుగు గుర్తొచ్చి, జాలేసింది. ఊరికే జాలిపడి వొదిలెయ్యకుండా కొద్దిసేపు ట్రంప్ కేసుని ప్రెజెంట్ చేస్తాను. 

మొన్న ఒబామా భార్య చేసిన ఎన్నికల ప్రసంగం చూశాను. ట్రంప్ వ్యక్తిగతంగా చెడ్డవాడు అని ఆమె చాలా ఉద్వేగంగా చెప్పింది. కొన్నాళ్ళుగా ట్రంప్ తమపై రకరకాలుగా 'చెయ్యేశాడని' అనేకమంది ఆడవాళ్ళు డైలీ సీరియల్లా చెబుతున్నారు. ఈ ఆరోపణలన్నీ ఎన్నికల తరవాత ఆవిరైపోతాయని అందరికీ తెలుసు.

అమెరికల్ ఓటర్లు తమ అధ్యక్షులవారికి స్వచ్చమైన మనస్సు, పవిత్రమైన దేహం అర్హతలుగా ఉండాలని భావిస్తున్నారా? స్త్రీలు, పురుషులు - వారి మధ్య సంబంధాలు నైతికతకి సంబంధించిన అంశాలు. రాజకీయాల్లో నైతికతకీ, వ్యక్తిగత నైతికతకీ కనెక్షన్ ఉంటుందా? నాయకులు అవినీతిపరుడైతే కొద్దిగా ఇబ్బంది. కులవాదో, మతవాదో అయితే ఇంకా ఇబ్బంది. మాంఛి వయసులో ఉండగా విచ్చలవిడిగా యెడాపెడా తిరిగితే - అందువల్ల ప్రజలకేం ఇబ్బంది?! 

ఆ మాటకొస్తే స్త్రీల విషయంలో చెగువేరాక్కూడా నెగెటివ్ మార్కులే పడతాయి, స్నానం చెయ్యకపోవడం అతనికున్న అదనపు అర్హత (చదువుము - మోటర్‌సైకిల్ డైరీస్)! ప్రపంచంలో అత్యధికులు అసహ్యించుకున్న హిట్లర్ యూదులు, కమ్యూనిస్టుల జోలికెళ్ళాడు గానీ.. ఆడవాళ్ళ జోలికెళ్ళిన ఆధారాల్లేవు.

'మూడుకథల బంగారం' సూర్రావెడ్డు అందరు దేవుళ్ళకీ 'నిచ్చెబక్తుడు'. తన భక్తివల్లే దొంగనోట్ల వ్యాపారం సాఫీగా సాగిందని నమ్ముతాడు. ధార్మికతనీ, ధర్మాన్ని తీవ్రంగా నమ్మిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్‌కౌంటర్లనే చట్టవ్యతిరేక హత్యల్ని భక్తిగా, నిష్టగా కొనసాగించారు. గురువారం, శనివారం పచ్చి చికెన్ ముక్క కూడా ముట్టని డాక్టర్లు.. అన్నివారాలూ పేషంట్లని శ్రద్ధగా దోచుకుంటుంటారు.

'అనంతం' సాక్షిగా స్త్రీలపట్ల శ్రీశ్రీ వైఖరి అర్ధం అవుతుంది. రావిశాస్త్రి శ్రీశ్రీకి శిష్యుడు. సాహిత్యంలో ప్రపంచస్థాయి రచయితలకీ, కవులకీ క్రమశిక్షణ అన్న పదానికి అర్ధం కూడా తెలీదు. ఉదయాన్నే లేచి వాకింగ్ చేసుకుని, టిఫిన్ చేసి, కాఫీ త్రాగాక రాస్తే - అది 'రామకోటి' అవుతుంది గానీ గొప్పసాహిత్యం యెంతమాత్రం కానేరదని అంటాడు మా సుబ్బు.

అందువల్ల - రాజకీయాల్లో రాణించి, ఒట్లేసిన ప్రజలకి కొద్దోగొప్పో మేలు చెయ్యడానికీ, వ్యక్తిగత జీవితానికీ సంబంధం లేదు. అమ్మాయిల గూర్చి ఆలోచించని టోనీ బ్లేయెర్ అమెరికాని ఇరాక్ యుద్ధంలోకి నెట్టి ప్రపంచానికి ఘోరమైన నష్టాన్ని కలిగించాడు. హిట్లర్, టోనీ బ్లేయెర్‌ల ఉదాహరణల్తో చూస్తే - వందమంది అమ్మాయిల్ని ప్రేమించినా పర్లేదు గానీ, యుద్ధాన్ని ప్రేమిస్తే మాత్రం ప్రపంచానికి చచ్చేచావొస్తుందని తోస్తుంది.

ఇప్పుడు అమెరికా ఎన్నికల గూర్చి అమెరికాతోపాటు మనదేశంలో కూడా యెక్కువ చర్చ నడుస్తుంది. మనవాళ్ళు కొత్త అధ్యక్షుడి మిడిల్ ఈస్ట్ పాలసీ, పాకిస్తాన్‌తో స్నేహాల గూర్చి ఆలోచిస్తున్నారు. మనం అమెరికన్ ఓటర్లకి మల్లే వ్యక్తిగత అంశాల పట్ల పెద్దగా పట్టించుకోం. ఇందుకు కారణం - మనం మన నాయకుల నుండి స్వచ్చమైన సౌశీల్యతని ఆశించకపోవడం అవ్వచ్చు లేదా రాజకీయ కార్యాచరణకి, వ్యక్తిగత అలవాట్లకి సంబంధం లేదనే మెచ్యూర్ థింకింగ్ కలిగుండటం కావచ్చు.

ట్రంప్ తనకి నచ్చినట్లు జీవించాడు. ప్రెసిడెన్షియల్ కేండిడేట్‌నవుతానని కల్లోకూడా ఊహించి వుండడు. ట్రంపెడు ఆశల్తో ఉన్న ట్రంపుకి తన గతం ఒక గుదిబండగా మారింది. అందుకు మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారం కూడా కారణం. అసలు ట్రంప్ వల్లే ఈసారి ఎన్నికలకి ఇంత గ్లామర్ వచ్చిందని నా అభిప్రాయం.

ఎన్నికల్లో - కుటుంబ విలువలు, వ్యక్తిగత వర్తన గూర్చి అమెరికాలో చర్చనీయాంశం అయినట్లు భారద్దేశంలో కాకపోవడం మాత్రం ఒక ఐరనీ! చూద్దాం, అమెరికా ప్రజల ఆలోచన యెలా ఉండబోతుందో! 

ముగింపు - 

కాఫీ ఎఫెక్ట్ అయిపోయింది. ట్రంపూ! ఇక నీ గోలేదో నువ్వే పడు, నాకు సంబంధం లేదు!

Sunday 9 October 2016

విదేశీజీవనం - స్వదేశీభక్తి


ఈమధ్య పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయ్. విజ్ఞులైన కొందరు తమ దేశభక్తిని ప్రకటించుకుంటూ, యెదుటివాడి దేశద్రోహాన్ని 'యెండగడుతూ'.. వాతావరణం గందరగోళంగా వుంది. అయితే - అమెరికాలో స్థిరపడిన నా స్నేహితుల్లో కూడా భారతీయ దేశభక్తి తీవ్రంగా ఉప్పొంగడం నన్ను ఆశ్చర్యపరిచింది. అంతే కాదు - నేను వారి దేశభక్తి ముందు ఓడిపోతున్నాను! ఇదేదో ఆలోచించవలసిందే! 

నా స్బేహితులు - 1980 లలో గుంటూరు మెడికల్ కాలేజి వదిలేశారు. మన దేశంలో - డాక్టర్లు తమ వృత్తిలో గౌరవంగా బ్రతికే పరిస్థితులు (సాధారణ పౌరుడితో పోలిస్తే) అప్పుడు, ఇప్పుడు, యెప్పుడూ ఉన్నాయి. అయినా - 'డటీ ఇండియా, డటీ పీపుల్' అనీ కొందరూ.. 'వర్కింగ్ కండీషన్ ఆర్ నాట్ గుడ్ మేన్' అనీ ఇంకొందరూ అమెరికా వలస వెళ్ళిపొయ్యారు. వాళ్ళు యెందుకెళ్ళినా - డాలర్ల కోసం, మరింత సుఖమయ జీవనం కోసం వెళ్ళారని నేను అనుకుంటున్నాను. కొంతకాలానికి వారు తమ భారత పౌరసత్వాన్ని వదిలేసుకుని, అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆనాటి నుండి టెక్నికల్‌గా వారు భారతీయ పౌరులు కాదు. ఇలా - యెవరికి నచ్చిన దేశంలో వారు స్థిరపడొచ్చు, ప్రశ్నించే హక్కు యెవరికీ లేదు.

ఇప్పుడు కొద్దిసేపు హిందీ సినిమాల గూర్చి - 

ఆరోజుల్లో మన్‌మోహన్ దేశాయ్ అనే పెద్దమనిషి మంచి మసాలా సినిమాలు వండేవాడు. ఆయన బాక్సాఫీస్ ఫార్ములా ఒకటే! తల్లీకొడుకులు, అన్నదమ్ములు సినిమా మొదట్లో విడిపోతారు. సినిమాలో అక్కడక్కడే తిరుగుతుంటారు గానీ.. కొన్ని హిట్ సాంగ్స్, మరికొన్ని ఫైటింగులు అయ్యేదాకా కలిసేవాళ్ళు కాదు. ఈలోపున వారిలోవారికి (తప్పిపోయినవారి కోసం) ప్రేమ వరదలై పారుతుంటుంది. 

నిజజీవితంలో - అమ్మతో, అన్నదమ్ముల్తో సర్దాగా మాట్లాడతాం. అంతేగానీ సినిమాల్లోలా ఓవరేక్షన్ చెయ్యం. యెందుకంటే మనం యెవ్వర్నీ మిస్ అవ్వట్లేదు, అందరూ మనమధ్యే వున్నారు. ఒకవేళ - సినిమాల్లోలా మనం కూడా విడిపొయ్యినట్లేతే - ఆ పాత్రల్లాగే ఓవరేక్షన్ చేసేవాళ్ళమా? బెటర్ కంట్రీ, బెటర్ లివింగ్ కోసం అమెరికా వలసపొయ్యి.. అక్కడి పౌరసత్వం తీసుకున్నాక.. తాము కోల్పోయిన పుట్టింటి కోసం మనవాళ్ళు ఓవరేక్షన్ చేస్తున్నారా? 

సరే! పాపం - అమెరికావాళ్ళు మాత్రం యేం చెబుతారు? వారికి తెలీకుండానే వారిలో పుట్టింటి పట్ల భక్తిభావం సహజంగానే తన్నుకొస్తుందని అనుకుందాం. అప్పుడు వాళ్ళు అమెరికా అధ్యక్ష ఎన్నిక సమయంలో - 'పాకిస్తాన్‌కి సహాయం ఆపేస్తామని హామీ ఇచ్చినవారికే ఓటేస్తాం' అని డిమేండ్ పెట్టొచ్చు. వారలా పెట్టినట్లు నాకైతే తెలీదు, యెవరికైనా తెలిస్తే చెప్పగలరు.

ఇది చదివిన నా అమెరికా స్నేహితులు - 'దేశభక్తి నీ ఒక్కడి సొత్తు కాదు' అని కోపగించుకోవచ్చు, వారి కోపాన్ని ఒప్పుకుంటున్నాను. అయితే - ఈ దేశంలోని రోగులకి నాకు చేతనైనంత మేరకు సాయం చేస్తూ, వారిచ్చిన సొమ్ముతోనే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, ఈ దేశానికి యెంతోకొంత ఉపయోగపడుతున్ననని (మీరు అమెరికా దేశానికి ఉపయోగపడుతున్నట్లు) నమ్ముతున్నాను. అందుకనే - మీకు "మా దేశం" పట్ల గల దేశభక్తికి మిక్కిలి ఆశ్చర్యపడుతున్నాను, అదీ సంగతి! 

(picture courtesy : Google) 

Friday 7 October 2016

భాషాభిమానులారా! నశించండి


"జై పాతాళభైరవి."

"నరుడా! యేమి నీకోరిక?

"తెలుగుభాష అంతరించిపోవాలి తల్లీ!"

".............."

"తల్లీ! యెందుకు తటపటాయిస్తున్నావ్?"

"నరుడా! ఒక సందేహం!"

"యేంటి తల్లీ?"

"తెలుగుభాష యెడల నీకు యెందుకంత కోపమో తెలుసుకోవచ్చా?"

"నా కోపం తెలుగుభాషపై కాదు తల్లీ, తెలుగు భాషాభిమానులపైన! తెలుగు భాష అంతరించిపోతే గానీ ఈ భాషాభిమానులు అంతరించిపోరు! అదీ నా లాజిక్."

"అటులైన ఒక సవరణ సూచించెద."

"చెప్పు తల్లీ!"

"తెలుగుభాషని అటులనే ఉండనిచ్చి, తెలుగు భాషాభిమానులు అంతరించిపొయ్యేట్లుగా వరమిస్తా! అభ్యంతరం లేదుగా?"

"వండర్ఫుల్, నీ అమెండ్‌మెంట్ సూపర్! ఈ రోజునుండి తెలుగు భాషాభిమానులు అంతరించిపొయ్యే వరం ప్రసాదించు తల్లీ!"

"తధాస్తు."

"థాంక్యూ పాతళభైరవి!" 

Thursday 6 October 2016

డోంటాక్ రబ్బిష్


"ఏవాఁయ్ సుబ్బారావ్! ఏదో లోన్ తీసుకుని ఎగ్గొట్టావనీ.. బేంక్ నోటీసొచ్చిందనీ.. "

"డోంటాక్ రబ్బిష్, భారత ఆర్ధిక వ్యవస్థని ప్రశ్నిస్తావా? బేంకుల morale దెబ్బతింటుంది."

"మొన్నామధ్య నువ్వు దొంగరైలెక్కావనీ.. పట్టుకున్న టీసీ కాళ్ళావేళ్ళాపడ్డావనీ.. "

"డోంటాక్ రబ్బిష్, Indian railways ని ప్రశ్నిస్తావా? రైల్వే ఉద్యోగుల morale  దెబ్బతింటుంది."

"ఉప్మాలో ఉప్పు తక్కువైందని నీ భార్యని బాదిపడేశావనీ.. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందనీ.. "

"డోంటాక్ రబ్బిష్, వివాహ వ్యవస్థని ప్రశ్నిస్తావా? నా భార్య morale  దెబ్బతింటుంది." 

"పక్కింటామెకి కన్ను కొట్టావనీ.. ఆమె నీ గూబ గుయ్యిమనిపించిందనీ.. "

"డోంటాక్ రబ్బిష్, ఇరుగుపొరుగుల సంబంధాన్ని ప్రశ్నిస్తావా? మా పక్కింటావిడ morale  దెబ్బతింటుంది."

"ఇదేవిఁటాయ్! యేవఁడిగినా morale అంటావ్!"

"డోంటాక్ రబ్బిష్, నాకు ప్రాణం కన్నా morale ముఖ్యం."

Wednesday 5 October 2016

దేశభక్తి


"ఒరే సుబ్బిగా! ఇలా రా." 

"నవఁస్కారాలండె!"

"పాకిస్తాన్ తెలుసు కదా?"

"అంటే యాఁందండె?"

"అది మన శత్రుదేశం."

"అంటే యాఁందండె?"

"మనం దానికి బుద్ధి చెప్పాం."

"అంటే యాఁందండె?" 

"మనిషన్నవాడు తిన్నా తినకపోయినా పవిత్రమైన దేశభక్తి కలిగుండాలి."

"అంటే యాఁందండె?" 

"ఒరే ఈడియట్! నీకసలు బుర్రుందా?"

"సిత్తం, కూల్నాకొడుకునండె! సదూకోలేదండె!" 

"అందుకే అన్నారు.. 'విద్యలేనివాడు వింతపశువు' అని."

"అయ్‌బాబోయ్! పశువులంటే గేపకవొఁచ్చింది.. ఆటికి కుడితెట్టాలా.. వొత్తానండె!" 

"పోరా పో! నువ్వూ వాటిల్లో వొకడివే!"

"నన్నట్టా పొగడమాఁకండె! యెంతైనా మేం తవఁరుగోరి తర్వాతే కదండె!"

Tuesday 4 October 2016

అర్నబ్ గోస్వామి - ఎన్టీఆర్


"సుబ్బూ! ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరక్కపోతే అర్నబ్ గోస్వామి గుండెపగిలి చస్తాడేమో!" అన్నాను.

"డోంట్ వర్రీ! అర్నబ్ గోస్వామి ఎన్టీఆర్ అంతటివాడు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"ఎన్టీఆర్‌కీ, అర్నబ్‌కీ సంబంధం యేవిఁటోయ్!" ఆశ్చర్యపొయ్యాను.

"వుంది. ఎన్టీఆర్ భీముడిగా వేశాడు. తొడగొట్టి దుర్యోధనుణ్ని సవాలు చేస్తూ 'ధారుణి రాజ్యసంపద' అంటూ ఘంటసాల స్టోన్లో ఆవేశంతో ఊగిపొయ్యాడు. మనం యెగబడి చూశాం." అన్నాడు సుబ్బు.

"అవును, అయితే?!"

"అదే ఎన్టీఆర్ దుర్యోధనుడిగా వేసి చాంతాడంత డైలుగుల్తో పాండవుల్ని విమర్శించాడు. అదీ యెగబడి చూశాం." అన్నాడు సుబ్బు.

"అవును, అయితే?!"

"ఎన్టీఆర్ డబ్బుల్దీసుకుని భీముడిగా వేసి దుర్యోధనుణ్ని సవాల్ చేశాడు, మళ్ళీ డబ్బుల్దీసుకుని దుర్యోధనుడిగా వేసి భీముణ్ని తిట్టాడు. అంటే - ఎన్టీఆర్ డబ్బులవైపు, మనం ఎన్టీఆర్ వైపు." నవ్వాడు సుబ్బు.

"అవును, అయితే?!"

"ఎన్టీఆర్ ప్రొఫెషనల్ యాక్టర్ - స్టూడియో సెట్టింగుల్లో భీభత్సంగా నటించి.. ఆ తర్వాత కార్లో ఇంటికెళ్ళి అన్నం తిని హాయిగా నిద్ర పొయ్యాడు."

"అవును, అయితే?!"

"అర్నబ్ గోస్వామీ అంతేకదా? అతని దేశభక్తుడి వేషానికి రెమ్యూనరేషన్ నెలకి కోటి రూపాయలని వొక వార్త."

"సినిమా నటుల్ని టీవీ యాంకర్లతో పోల్చకూడదేమో!"

"ఎందుకు పోల్చకూడదు? కాలం మారింది, ఇప్పుడు ప్రజలకి వినోదం ఇంట్లోకే వచ్చేసింది. అర్నబ్ గోస్వామి తొడగొట్టి దేశద్రోహుల్ని సవాల్ చెయ్యడం ఎన్టీఆర్ నటనలాగా జనాలకి కిక్కిస్తుంది." అన్నాడు సుబ్బు.

"అవున్నిజం." అన్నాను.

"కాబట్టి బ్రతక నేర్చిన అర్నబ్ గోస్వామి గుండె పగిలి చస్తాడని విచారము వలదు. రేపు యుద్ధమేఘాలు తొలగిపొయ్యాక, 'పైనుండి' వచ్చు అదేశానుసారం - ఆయనే ఒక ఉన్మాద శాంతికపోతం కాగలడు. అప్పుడు అట్టు తిరగబడుతుంది." నవ్వుతూ ముగించాడు సుబ్బు.