Saturday, 27 May 2017

'సూపర్ కాప్'పంజాబ్ 'సూపర్ కాప్' గిల్ వృద్దాప్యంతో చనిపొయ్యాట్ట. ఈ సూపర్ కాప్‌ల పట్ల మధ్యతరగతి మేధావుల్లో ఆరాధనా భావం వుంది. అయితే వారి ఆరాధనలో కొంతభాగం సూపర్ కాప్ సృష్టించినవారికి చెందాలని డిమేండ్ చేస్తున్నాను. యెవరా సృష్టికర్తలు? యేమా కథ?

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగర్ బత్తీ అయితే పాలకులకీ ప్రజలకీ అనుసంధానమైనది పోలీసు వ్యవస్థ. కాబట్టే పోలీసు వ్యవస్థని పాలకులు తమ కనుసన్నల్లో నడుచుకునేట్లు చూసుకుంటారు. అప్పుడు పోలీసు వ్యవస్థ నేరాల్ని అదుపు చేస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' అదుపు అయ్యుంటుంది, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' నిస్పాక్షికత అయ్యుంటుంది.

రాజకీయ వ్యవస్థలో అధికార పక్షం, ప్రతిపక్షం వైరిపక్షాలని అనుకుంటాం గానీ, వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకటే! చదరంగంలో నలుపు తెలుపు పావులకున్న తేడా మాత్రమే వుంటుంది. అధికారంలో ఉన్నవారిని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు అధికార పక్షం  రాజకీయ చదరంగం అడుతుంటాయి. ఇవన్నీ దాయాదుల మధ్య పొలం గట్టు తగాదాలు.. ప్రజలకి యే మాత్రం సంబంధం లేని వ్యవహారాలు.

ఇలా రాజకీయ పక్షాలు ఒకళ్ళకొకళ్ళు హేపీగా నిప్పెట్టుకొంటుండగా.. ఒక్కోసారి నిప్పు కాస్తా మంటగా మారి.. ఆపై అగ్నిప్రమాదంగా మారిపోయి.. పరిస్థితి చెయ్యి దాటిపోతుంది (ఇందుకు ఇందిరా గాంధీ - భింద్రన్‌వాలె ఉదంతం ఒక ఉదాహరణ). 

అప్పుడు పాలకులు కొత్త ఎత్తుగడలేస్తారు. అగ్నిప్రమాదాన్ని అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్‌ని దించుతారు. ఆ ఫైర్ ఫైటరే కనిపించని నాలుగో సింహమైన సాయికుమార్! బోనులోంచి బయటకొచ్చిన ఈ నాలుగో సింహానికి సింహం హక్కుల పట్ల తప్పించి ఇతరుల హక్కుల పట్ల నమ్మకం వుండనందున.. మానవ హక్కుల్ని విచ్చలవిడిగా హరించేస్తూ.. యథేచ్ఛగా మారణ కాండ సాగిస్తూ.. పరిస్థితిని 'అదుపు'లోకి తెస్తుంది. 

ఇప్పుడో ధర్మసందేహం. అసలీ కనిపించని నాలుగో సింహం సాయికుమార్ దేనికి? పాలకులే ప్రత్యక్షంగా రంగంలోకి దిగొచ్చుగా? దిగొచ్చు, కానీ సాయికుమార్ పద్ధతుల్తో ప్రభుత్వాలకి ఇబ్బందులున్నాయ్, తేడా వొస్తే వ్యవహారం బెడిసికొడుతుంది. అలాంటి తేడానే వస్తే సాయికుమార్‌నే బలిపశువు చేసి ప్రజాస్వామ్య విలువల్ని 'కాపాడొచ్చు' - ఇదొక win win situation, అందుకని!

పాలకులకి పోలీసు వ్యవస్థని వాడటంలో ఖచ్చితమైన పద్దతులున్నాయి. పోలీసు వ్యవస్థ పద్ధతిగా - అస్మదీయుల పట్ల అక్కినేని నాగేశ్వరరావు కన్నా సున్నితంగా వుంటుంది, తస్మదీయుల పట్ల ఆర్.నాగేశ్వరావు కన్నా క్రూరంగా వుంటుంది. ఈ సూత్రం గుర్తుంచుకుంటే పోలీసు వ్యవస్థ - గోరక్షకులు, శ్రీరామసేన, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పట్ల వేరువేరుగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

'సూపర్ కాప్' సాయి కుమార్ బోనులో సింహంలాంటివాడు, రాజ్యం అవసరమైనప్పుడు మాత్రమే బోను తలుపులు తెరుస్తుంది. అందుకే అతను 1984 లో ఢిల్లీలో కనపళ్లేదు, 2002 లో గుజరాత్‌లోనూ కనపళ్లేదు. ఎందుకు కనపళ్ళేదో ఈ పాటికే మీకు అర్ధం అయ్యుంటుంది, కాబట్టి విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.

(fb post 27/5/2017)