Wednesday, 24 May 2017

తీవ్రవాద గొట్టంగాళ్ళు


సినిమాలు తీసేవాళ్ళు అదృష్టవంతులు. సినిమాగా ఓ కథని అనుకుంటారు, నెలల తరబడి ప్రణాళికలేస్తారు, తరవాతే తాపీగా సినిమా తీస్తారు. ఈ సౌకర్యం టీవీల వాళ్లకి లేదు, ఎందుకంటే వాళ్లకి ప్రతిరోజూ ఒక సినిమానే! రోజూ ఏదొక juicy story పట్టుకోవాలి, దాన్నుండి రోజంతా జ్యూస్ పిండుతూ టెంపో maintain చెయ్యాలి.

వాస్తవానికి మనం న్యూస్ చానెల్స్ అని పిల్చుకుంటున్నవి న్యూస్ చానెల్స్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ - వీటిల్లో ఆవేశం ఉంటుంది గానీ వార్తలుండవు. న్యూస్ ఏంకర్లుగా మనం పీల్చుకుంటున్నవాళ్ళు ఏంకర్లు కాదు, బఫూన్లు!

యెలా చెప్పగలవ్? 

సింపుల్! ఈ దేశంలో యేటా వేలాదిమంది పిల్లలు పోషకాహార లోపాల్తో చనిపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇవి చాలా పెద్దవార్తలు కావాలి. కానీ టీవీల వాళ్లకి ఇవసలు వార్తలే కాదు!

మరి వీరికి వార్తలేమిటి?

పేజ్ 3 వారి అసహజ మరణాలు! ఇవి మాత్రం వారాల తరబడి లాగుతారు. వీటితో ప్రజలకేం సంబంధం? తెలీదు!

శశి థరూర్ భార్య సునంద పుష్కర్ చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేశారు. ఈలోగా టీవీల వాళ్ళు 'మర్డర్' మిస్టరీని తమదైన శైలిలో పీకి  పాకం పెట్టారు. తరవాత పోలీసులు కేసు కోర్టుకి పంపారు. విషయం అక్కడితో అయిపొయింది. 

ఈమధ్య అర్ణబ్ గోస్వామి అనే కేకాగ్రేసరుడు సొంతదుకాణం పెట్టాడు. ఈ దుకాణానికి అధిపతి ఎన్డీయే నాయకుడు, శశి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంట్ సీటుపై కన్నేసినవాడు. అందువల్ల మన కేకల మాంత్రికుడు అర్జంటుగా సునంద పుష్కర్ కేసు యెత్తుకున్నాడు, ఆధారాలంటూ  యేవో పాత టేపులు వినిపించి శశి థరూర్ ఒక 'హంతకుడు' అని తేల్చేశాడు. 

తేల్చేసిన దరిమిలా - గోస్వామి తన తీవ్రవాద గొట్టం గాళ్లనీ థరూర్ మీదకి తోలాడు. గొట్టాలకి సమాధానం చెప్పకపోతే శశి థరూర్ పారిపోతున్నాడు అంటాడు! చెబితే మీడియాపై దాడి అంటాడు! అంటే ఇదో win-win situation అన్నమాట!

ప్రభుత్వ సేవలో పూర్తి స్థాయిలో పునీతం అయిపోడం, సైన్యాన్ని కీర్తించడమే దేశభక్తికి పరాకాష్టగా ప్రచారం చెయ్యడం కేకాధాముడి ఛానెల్ పాలసీ! అందుకే సంఘపరివార్ శక్తులు అరుంధతి రాయ్ ఇచ్చిందని ప్రచారం చేసిన (లేని) ఇంటర్వ్యూ ఆధారంగా, ఆమెపై తట్టల కొద్దీ బురద చల్లే ప్రోగ్రామ్ రోజువారీగా తలెత్తుకున్నాడు. 

అర్ణబ్ గోస్వామి వాచాలత్వాన్నీ, రౌడీయిజంనీ గొప్ప జర్నలిజంగా భావించేవాళ్లు.. ఈ చౌకబారు ట్రిక్కుల్ని ఆసక్తిగా చూసే చౌకబారు వీక్షకులు వున్నంతకాలం మనం ఈ చెత్తని భరించక తప్పదు. ఆలస్యంగానైనా ఈ చెత్త కొట్టుకుపోతుంది భావిస్తున్నాను.

(fb post 24/5/2017)