Friday, 5 May 2017

న్యూస్ చానెళ్ళ వ్యాపారతత్వం


ఇండియా టుడే టీవీలో రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్భయ తలిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. తన కూతురు కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష వెయ్యాలనేది బాధితుల డిమేండ్. నిర్భయ చనిపోవడం కన్నా చంపేసిన విధానం అత్యంత పాశవికం. ఒక వ్యక్తి మరణం యే కుటుంబానికైనా తీరని నష్టం, దాన్ని ఏం చేసినా భర్తీ చెయ్యలేం. కాబట్టి ఆ తలిదండ్రుల వేదనా, కోపం అర్ధం చేసుకోవచ్చు.  

కొద్దిసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. 

రాచరికాలు పొయ్యాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చాయి. ఫలానా నేరానికి ఫలానా శిక్ష అని రాజ్యాంగబద్దంగా రాసుకున్నాం. దీన్ని Code of Criminal Procedure (CrPC) అంటారు. ఒక నేరం జరుగుతుంది, అప్పుడు పోలీసు వ్యవస్థ రంగంలోకి దిగి నేరాన్ని పరిశోధిస్తుంది, నిందితులపై నేరారోపణ చేస్తూ ఛార్జ్ షీట్ తయారుచేసి జుడీషియరీ వ్యవస్థకి సమర్పిస్తుంది. కోర్టు సాక్ష్యాధారాలతో నేరవిచారణ చేస్తుంది. నేరం రుజువైతే నిందితుడు నేరస్తుడవుతాడు, ఆయా సెక్షన్లని బట్టి కోర్టు శిక్ష విధిస్తుంది. తాము నిరపరాధులమనో, శిక్ష మరీ యెక్కువనో పైకోర్టులో అప్పీల్ చేసుకునే అధికారం నేరస్తులకు ఉంటుంది. 

పోలీసుల కేసు పరిశోధన, కోర్టు విచారణ మొదలైన ప్రొసీజర్లు (డాక్టర్లు ఆపరేషన్ చేసినట్లుగా) పూర్తిగా సాంకేతికమైనవి. అవి ఆయా సంస్థలు మాత్రమే చెయ్యగలిన నిపుణతతో కూడుకున్న వ్యవహారం. యే వ్యవస్థా లోపాలకి అతీతం కాదు, ఆయా వ్యవస్థల్లోని లోపాలు కూడా రాజ్యాంగబద్ధంగానే సవరింపబడాలి, ఇంకే రకంగా కాదు. అంచేత CrPC లో కూడా దేశకాల పరిస్థితుల బట్టి, ప్రజాభిప్రాయం మేరకు రాజ్యాంగబద్ధంగా సవరణలు జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణ ఢిల్లీ ఆందోళన తరవాత వచ్చిన Nirbhaya Act

ఇప్పటిదాకా - నేను రాసింది చిన్నవిషయం, పురాతన విషయం. కానీ ఈ మాత్రం జ్ఞానం లేకుండా మన టీవీ చానెళ్లు వార్తల్నీ, చర్చల్నీ వినోదస్థాయికి దించేశాయి, కనీస బాధ్యత లేకుండా తయారయ్యాయి. చిల్లరకొట్టు వ్యాపారం లాగే టీవీ చానెళ్లదీ వ్యాపారమే, వ్యాపారం తప్పు కాదు. కానీ - పోటీతత్వం వ్యాపారతత్వాన్ని యెంత హీనానికైనా దిగజార్చేస్తుందా?!

కోర్టు నిర్భయ కేసు నిందితుల్ని దోషులుగా తేల్చింది. శిక్ష విషయంలో పైకోర్టు ఖరారు చేసింది. ఇది పూర్తిగా సాంకేతిక అంశం. ఈ సమయంలో నిర్భయ తలిదండ్రుల్ని టీవీ స్థూడియోల్లో కూర్చోబెట్టి రెచ్చగొట్టడం రాజదీప్ సర్దేశాయ్ ఆడుతున్న TRP నాటకం, మధ్యతరగతి మేధావుల కోసం వండిన మసాలా కూర. 

టీవీ స్థూడియోలో హత్యల్ని ప్రోత్సాహిస్తాయనేదానికి మన రాష్ట్రంలో వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ మంచి ఉదాహరణ. ఇలాంటి విషయాల్ని అర్ధం చేసుకోవాలంటే కన్నాభిరాన్, బాలగోపాల్, బొజ్జా తారకం వంటి నిపుణులు రాసిన వ్యాసాలు చదవాలి. అయితే ఇవ్వాళ యెక్కువమందికి అభిప్రాయాలే ఉంటున్నాయి కానీ విషయాన్ని చదివి అర్ధం చేసుకునే ఓపిక ఉండట్లేదు. సరీగ్గా వీరికోసమే టీవీ చానెళ్లు చర్చావినోదాన్ని వండి వారిస్తున్నాయి.

'జబర్దస్త్' కామెడీ షో పట్ల ఎవరికీ భ్రమలు ఉండవు, కాబట్టి సమాజానికి హానికరం కాదు. అయితే ఈ టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాలు ఒక హిడెన్ ఎజెండాతో సాగుతుంటాయి, కాబట్టే ఇవి చాలా హానికరం. నాకీ టీవీ చర్చల పట్ల అప్పుడప్పుడూ కోపం వస్తుంటుంది. అలాంటప్పుడు నేను రెండు పన్లు చేస్తాను. ఒకటి - ఇట్లా నాలుగు వాక్యాలు కెలకడం, రెండు - చిత్తూరు నాగయ్యలా దీర్ఘంగా నిట్టూర్చడం!