Tuesday, 5 December 2017

మాయాబజార్

నా దృష్టిలో 'మాయాబజార్' వొక కార్టూన్ సినిమా.
తెలుగువాళ్లకి ఇదే యెక్కువ, యెంత చెట్టుకి అంతే గాలి!

'మాయాబజార్' నాకూ ఇష్టమే, ఒకప్పుడు చాలాసార్లు చూశాను. ఆ సినిమా పట్ల అయిష్టతతోనో, వ్యతిరేకతతోనో ఈ రాతలు రాయట్లేదని గుర్తిస్తే సంతోషం. ఆ సినిమా గూర్చి "మంచిగా" కాక ఇంకెలా చర్చించినా మనోభావాలు దెబ్బతిని గుండెలు బాదుకునేవారు ఈ రాత చదవకపోడం మంచిదని నా సలహా. ఇదొక పాయింటాఫ్ వ్యూ మాత్రమే.
ఒక సినిమా మనకి యెందుకు నచ్చుతుంది?
ఇందుకు అనేక కారణాలున్నా, ముఖ్యమైంది - emotional identity. వ్యక్తుల కుటుంబం, స్నేహితులు, పరిసరాలు, అనుభవాలు.. ఇవన్నీ సినిమాకొక emotional identity నిస్తాయి. We are greatly influenced by this emotional identity. ఈ అనుభవం మనకి మాత్రమే సొంతం. ఈ variables లో ఏది మారినా మనకా సినిమా నచ్చదు.
ఇందుకు ఉదాహరణ - ఓ ఇరవై సంవత్సరాల కుర్రాడికి 'మాయాబజార్' చూపిస్తే, సినిమా మనకి (50 to 70 age group) నచ్చినంత గొప్పగా వుండదు.. విసుగ్గా కూడా అనిపించొచ్చు. కారణం - అతనికి సావిత్రి, ఎస్వీ రంగారావు, ఘంటసాల తెలీదు. నా పిల్లలు 'మాయాబజార్' చూడరు, ఓ నిమిషం చూసి విసుక్కుంటారు. అంతేకాదు - ఆ రోజుల్లో ఈ ముసలి సినిమా యెట్లా ఇష్టపడ్డారా అని బోల్డంత ఆశ్చర్యపోతారు.

మాయాబజార్ - 2
'మాయాబజార్' టైముకి నేను పుట్టలేదు. నా మేనమామలు, అన్నయ్య స్నేహితులు ఫలానా సినిమాలు ఫలానాందుకు బాగున్నాయి అని మాట్లాడుకోడం విన్నాను. ఆ రకంగా మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ.. చూడకముందే మంచిసినిమాలు అని మెదడులో conditioning జరిగిపోయింది.
పాత సినిమాలతో నాకు అనేక అనుభవాలు. స్కూలెగ్గొట్టడాలు, సినిమాకి వెళ్లడం కోసం వేసిన దొంగవేషాలు, అమ్మతో సినిమా గూర్చి ధర్మసందేహాలు.. ఇవన్నీ నాకు అత్యంత ఇష్టమైన జ్ఞాపకాలు. ప్రతి వ్యక్తి బుర్రలో వొక సినిమాతో పాటు, దానికి సంబంధించిన అనేక స్పృతులు పెనవేసుకునుంటయ్. వీటన్నింటినీ emotional investment అనుకోవచ్చు.
ఒక ఉదాహరణ - మాధవపెద్ది సత్యం మా గుంటూరు బ్రాడీపేట వాసి, నాన్నకి పరిచయం. స్నేహితుల కోసం మాధవపెద్ది హార్మోనియం పెట్టెతో అనేక పాటలు, పద్యాలు పాడతాడనీ.. ఆ గంభీర స్వరానికీ, బక్కపల్చని ఆకారానికీ అస్సలు సంబంధం వుండదనీ నాన్న చెబుతుంటే నోరు తెరుచుకుని వినేవాణ్ని. అందువల్ల వివాహ భోజనంబు పాట వింటున్నప్పుడు నాన్న గుర్తొస్తాడు! అంటే జ్ఞాపకాలు వొక emotional thread, అవి ఫెవికాల్ గమ్ములాగా మనల్ని వదలవు, అంబుజా సిమెంట్ గోడలా ధృఢంగానూ వుంటాయి.
యెప్పుడైతే వొక సినిమా వెనుక ఇంత కథుందో.. అప్పుడు మనం bias అయిపోతాం. Objective assessment కి అర్ధం మర్చిపోతాం. ఆ సినిమా గొప్పది అని బుర్రలో ప్రతి న్యూరాన్‌లో imprint అయిపోయి వుంటుంది. ఇవ్వాళ ఆ పాత సినిమాలో ఫలానా సన్నివేశం బాలేదని చెబితే వొప్పుకోం.

మాయాబజార్ - 3
పాతసినిమాలు ఇప్పటి తరానికి యెందుకు నచ్చవో కొత్తసినిమాలు నాకు అందుకే నచ్చవు. ఇప్పటి హీరోల హావభావాలు నాకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొన్నాళ్లక్రితం వొక మాజీహీరో కొడుకు సినిమాకెళ్లాను. అతని మొహంలో chronic constipation భావం తప్ప మరేమీ కనిపించలేదు. ఇంకో హీరో కొడుకు మొహంలో rectal examination చేయించుకుంటున్న ఫీలింగ్ కనిపించింది. నా పిల్లలకి నచ్చిన ఈ హీరోలు నాకు నచ్చకపోడానికి కారణం emotional detachment. ఇవ్వాల్టి సినిమాలు మంచివే అయ్యుండొచ్చు, కానీ నాకు నచ్చవు. ఇవ్వాల్టి హీరోలు మంచినటులే అయ్యుండొచ్చు, కానీ నాకు నచ్చరు. ఇందుక్కారణం - emotional investment లేకపోడం!
'మాయాబజార్' కార్టూన్ సినిమా యెందుకయింది?
అది ఫక్తు కార్టూన్ కేరక్టర్ల సినిమా కాబట్టి! కార్టూన్ కేరక్టర్‌కి గూగుల్ అర్ధం ఇస్తున్నాను - a person or portrayal lacking in depth or characterized by exaggerated or stereotypical features. "in the films, Bond is a cartoon character"
'మాయాబజార్' యేమిటి?
వొట్టి చందమామ మార్క్ చిన్నపిల్లల కథ. ఒకవైపు పూర్తి మంచివాళ్లు, ఇంకోవైపు పూర్తి చెడ్డవాళ్లు, పాటలు పద్యాలు, మాయలు మంత్రాలు.. పైసా వసూల్ సినిమా. విజయా బ్యానర్, నటీనటుల ఇమేజ్, ఘంటసాల సంగీతం.. ఇంతకుమించి ఇంకేమీ లేదు. ఈ conditioning లేనందువల్ల ఇప్పటి తరం ప్రేక్షకులకి మాయాబజార్ పట్టదు.
మరప్పుడు 'మాయాబజార్‌'ని యెందుకంతలా పొగట్టం?
మా ఊళ్లో లెనిన్, స్టాలిన్, మావోలకి జయంతి/వర్ధంతి సభలు జరుగుతుంటయ్. వక్తల వయసు కనీసం డెబ్భై! వింటుంటే ఉద్రేకం వస్తుంది, ఆవేశం వస్తుంది. సమావేశం అయ్యాక వక్తలు యెవరింటికివాళ్లు వెళ్లి బీపీ, షుగర్ మాత్రలేసుకుని అన్నం తిని నిద్రోతారు. ఇవో పిండప్రదాన కార్యక్రమాలు.
పాతసినిమా అభిమానులూ అంతే! యాభైయ్యేళ్లనీ, సష్టి పూర్తనీ యేవో రాసుకుని లేదా మాట్లాడుకుని తృప్తినొందుతారు (వీళ్లు పొయ్యాక ఈ సినిమాల్ని తల్చుకునేవాళ్లు వుండరని నా అనుమానం). వీళ్లపట్ల నాకు వ్యతిరేకత లేదు, కానీ ఆశ్చర్యంగా వుంటుంది.

మాయాబజార్ - 4
disclaimer -
I am not writing this to spoil the party of మాయాబజార్ fans, just recording my random thoughts on movies.
ఇప్పుడు కొద్దిసేపు నా పీజీ రోజుల అనుభవం. అక్కడంతా నానాజాతి సమితి, అన్ని రాష్ట్రాలవాళ్లూ వుండేవాళ్లు. సినిమాల్లో సామాజిక కోణం/ప్రయోజనం, సన్నివేశ బలం, పాత్రల స్వభావం అంటూ వారాంతాల్లో మేధోమధనం సాగేది (దీనికింకో పేరు intellectual masturbation).
బెంగాలీయుడైన సమిత్ రాయ్ సత్యజిత్ రే, రుత్విక్ ఘటక్, మృణాల్ సేన్ సినిమాల గూర్చి విశ్లేషణ చేస్తుంటే యెంతసేపైనా వినాలనిపించేది. శశిధరన్ పేరలల్ సినిమాకి అదూర్ గోపాలకృష్ణన్ ప్రాముఖ్యత గూర్చి తన మళయాళీ ఇంగ్లీషులో చెప్పేవాడు. ఇక మా తారానాధ్ కన్నడం ప్రపంచ భాషనీ, సంస్కృతానిక్కూడా మాతృకనీ నమ్మిన భాషా తీవ్రవాది. గిరీశ్ కర్నాడ్, గిరీశ్ కాసరవెళ్లి అంటూ కన్నడీయుల పేర్లతో చర్చని డామినేట్ చేసేవాడు. ఇంక హిందీవాళ్లయితే చెప్పనక్కరలేదు.
నేనెంత ఆలోచించినా జాతీయస్థాయి తెలుగు పేర్లు తట్టేవి కావు. ఒకసారి "మాయాబజార్" అన్నాను. మా ES కృష్ణమూర్తిగాడు పెద్దగా నవ్వాడు - "అది తమిళంలో వచ్చింది, బొత్తిగా పిల్లల సిన్మాగా!" అన్నాడు. "మిస్సియమ్మ వొక absurd comedy" అని కూడా తేల్చేశాడు. నాకింక సినిమాలేం మిగల్లేదు. మనం గొప్పగా చెప్పుకునే సినిమాలు రాష్ట్రం దాటితే వీసమెత్తు విలువ చెయ్యవని అర్ధమైంది. దాసరి గూర్చి చెబుదామంటే అవి నాటకాలో సినిమాలో తెలీదు! రాఘవేంద్రరావు soft porn తప్ప ఇంకే సిన్మాలూ తియ్యలేదాయె! విశ్వనాథ్ సిన్మాలన్నీ పిలక బ్రామ్మలు, వాళ్ల 'పవిత్ర' సాంప్రదాయాలే! బాపురమణలకి 'రామాయణం' తప్ప ఇంకోటి పట్టలేదు! ఇంకేం చెప్పాలి?
అప్పుడు నాకు తట్టిన సినిమా 'రోజులు మారాయి'. భూమిలేని పేదరైతుల సమస్యల్నీ, వడ్డీవ్యాపారంలో మోసాల్నీ, కులాంతర వివాహాల్నీ, కరణం మున్సబుల కుట్రల్నీ ప్రతిభావంతంగా చర్చించిన సినిమా 'రోజులు మారాయి'. ఆనాటి సామాజిక రాజకీయ సమస్యల్ని అద్దం పట్టి చూపిన సినిమా 'రోజులు మారాయి'.
విజ్ఞులైన స్నేహితులు అర్ధం చేసుకోవాల్సింది - ఇక్కడ మనకి నచ్చిన తెలుగు సినిమాలు అనేకం వున్నా అవతలివాడు పథేర్ పాంచాలి, చెమ్మీన్, అంకుర్, సంస్కారలతో కొడ్తుంటే యేవీ మనని రక్షించలేవు. అట్టి దుస్థితిలో నన్ను కాపాడింది 'రోజులు మారాయి'. అందుగ్గానూ 'రోజులు మారాయి'కి రుణపడి వున్నాను.
ఉపసంహారం -
నేను పాత తెలుగు సినిమాలకి వ్యతిరేకిని కాను. సినిమా అనేది వొక వ్యాపారం. ఇష్టమైనవాడు చూస్తాడు, లేపోతే లేదు. తెలివితక్కువ్వాడు బోల్డంత టైమ్ వృధా చేసుకుంటూ ఇలాంటి రాతలూ రాస్తుంటారు, తెలివైనవాడు వీటిని చదవకుండా 'లైక్' కొట్టేస్తాడు! అదీ సంగతి!
(అయిపొయింది)

(fb post written in 4 instailments)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.