Tuesday, 9 January 2018

కత్తి మహేశ్ - సామాజిక ప్రయోజనం

కత్తి మహేశ్ - సామాజిక ప్రయోజనం
'సినిమా నటులు మనలాంటి మనుషులే. మనలాగే అన్నం తింటారు, రాత్రవంగాన్లే దుప్పటి కప్పుకుని నిద్రపోతారు.' ఈ విషయం నాకు చిన్నప్పుడు తెలీదు, తరవాత తెలుసుకున్నాను. ఇలా తెలుసుకోడం అనేది వొక పరిణామం. కొందరు - చదువు లేకపోడం, తద్వారా వచ్చే జ్ఞానానికి దూరమైపోడం.. ఇలా అనేక కారణాల వల్ల ఈ పరిణామ క్రమానికి దూరమైపోతారు.
అయితే చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్నంత మాత్రాన జ్ఞానులైపోతారనే గ్యారెంటీ లేదు. గొప్ప చదువులు చదివి కూడా సినిమా నటుల్ని దేవుళ్లుగా భావించేవారి మనస్తత్వం గూర్చి కొంత ఆలోచన చేద్దాం.
సినిమా వొక వ్యాపారం, ఈ వ్యాపారంలో సినిమా హీరో వొక స్టేక్ హోల్డర్. హీరోల యూఎస్పీ పెరగాలంటే తమ సినిమాలకి ఓపెనింగ్స్ వుండాలి, తమని దేవుళ్లా ఆరాధించే వొక మూక కావాలి. అందుకోసం తెలుగు సినిమా హీరోలు అనేక మార్గాలు యెంచుకున్నారు. వాటిల్లో ముఖ్యమైనది - కులతత్వం.
కులాభిమానం అనేది వొక ప్రిమిటివ్ ఎమోషనల్ భావం. దీన్ని తమ వ్యాపారం కోసం వాడుకోడంలో తెలుగు హీరోలు రాటుదేలారు. జ్ఞానాన్ని ఎమోషన్స్ అధిగమిస్తాయి. కాబట్టి గొప్పచదువులు చదివి అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతూ కూడా "జైబాలయ్యా" అంటూ రెచ్చిపొయ్యే కమ్మకులస్తుల్నీ, "జైపవనిజం" అంటూ ఊగిపొయ్యే కాపుకులస్తుల్నీ అర్ధం చేసుకుంటూ.. వారిని వారి అజ్ఞానానికి వదిలేద్దాం.
చదువుకి దూరంగా వుండిపోయిన నిరక్షరాస్యుల హీరోభక్తి పూర్తిగా అమాయకత్వం, అజ్ఞానం. వీరు నా చిన్నతనంలో నాకున్న అమాయకత్వ స్థాయిలోనే మిగిలిపోయిన అభాగ్యజీవులు. వీరిని చూసి జాలిపడదాం.
ఇప్పుడొక సందేహం -
చదువులేకనో, కులాభిమానంతోనో హీరోల్ని తీవ్రంగా అభిమానించే దురభిమానులే అభిమాన మూకలైతే వీళ్ల సంఖ్య చాలా పరిమితంగా వుండాలి, కానీ వాస్తవంగా ఈ మూక చాల పెద్దదిగా వుంది! కారణం యేమైయ్యుండొచ్చు?
తెలుగు రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ కులస్తుల సంఖ్య చాలా యెక్కువ. వీరిలో చదువుకున్నవాళ్లూ యెక్కువే. చదువుకున్న బీసీ, ఎస్సీ కులస్తులు కూడా కొందరు (యెందరో తెలీదు) ఈ వీరాభిమానుల లిస్టులో వున్నారని అర్ధమవుతుంది. చదువూ వుండీ, గోక్కోటానికీ కులమూ లేక - మరి వీళ్లెందుకు హీరోల బానిసల లిస్టులో వున్నారు?!
ఇక్కడే తెలుగు సమాజానికి కత్తి మహేశ్ ప్రయోజనం వుంది. కత్తి మహేశ్, టీవీ చానెళ్లు.. యెవరి లెక్కలు వాళ్లకుండొచ్చు. కానీ చివరాకరికి ఈ ఎపిసోడ్లో వొక సామాజిక ప్రయోజనం వుందని నమ్ముతున్నాను. ఆ రెండు కులాలకి "చెందని" ఆవేశపరులైన అభిమానులు.. కత్తి మహేశ్ లేవనెత్తుతున్న అంశాల పట్ల (తరవాత కొన్నాళ్లకైనా) మనసుపెట్టి ఆలోచించే అవకాశం వుంది. వొక్కసారి ఆలోచించడం మొదలెడితే వీళ్లకి చాలా విషయాల్లో కళ్లు తెరుచుకుంటాయి. ఇది తెలుగు సమాజానికి కలిగే దీర్ఘకాలిక ప్రయోజనం.
మనలో వుండే అమాయకత్వం, అజ్ఞానం వల్ల సినిమావాళ్లని నెత్తిన పెట్టుకుంటున్నాం. సినిమావాళ్లేం పైనుండి వూడిపళ్లేదు. మనందరిలాగా వాళ్లూ మామూలు మనుషులు. వాళ్లక్కూడా దెబ్బ తగిల్తే నెత్తురొస్తుంది, అన్నం తినకపోతే నీరసం వస్తుంది. సినిమా నచ్చితే పదిసార్లు చూసుకుందాం. హీరోల్ని దేవుళ్లుగా భావించడం, వారిచేత తన్నులు తినడం మన మూఢత్వాన్నీ, బానిసబుద్దినీ సూచిస్తుంది.
'మాకివన్నీ అనవసరం, మేం మా హీరోదేవుళ్లకి భక్తులం!' అంటారా? సరే, అలాగే కానివ్వండి - బెస్టాఫ్ లక్!

(fb post)