Sunday 28 January 2018

తెలుగు పత్రికల మెడికల్ వార్తల స్థితి

ఒక తెలుగు వార్తాపత్రికలో నిన్న మాంసాహారం యెక్కువగా తింటే పెద్ద పేగు కేన్సర్ 'వస్తుందనీ', అదే పత్రిక ఇవ్వాళ మాంసాహారంతో క్యాన్సర్ 'దూరం' అని రాసిందనీ మిత్రులు ఫోటోలు పెట్టారు. ఈ పోస్టుకి ప్రేరణ ఆ ఫోటోలే.
ఇలాంటి వార్తల పట్ల నాకున్న అవగాహన -
మెడికల్ రీసెర్చ్ మెథడాలజీలో డాటా కలెక్షన్లో ప్రధాన విషయంతో పాటు అనేక ఇతర విషయాల్ని పొందుపరచి విషయ సేకరణ చేస్తారు. ఈ రీసెర్చ్‌లో అనేక రకాలైన స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ లేని సమాచారం కూడా వచ్చేస్తుంది. అసలు విషయం కన్నా ఈ కొసరు విషయాలు సర్దాగానూ, ఆసక్తికరంగానూ వుంటాయి. శాకాహారులకి కిడ్నీ జబ్బులు ఎక్కువని ఒక డాటా చెబితే ఇంకో డాటాలో శాకాహారులకి కిడ్నీ జబ్బులు తక్కువని వస్తుంది. ఫలానా స్టడీలో ఇలా తేలిందని సోర్స్‌ని కోట్ చేస్తూ ఆసక్తికరంగా రాయడానికి ఇంగ్లీషు మెయిన్ స్ట్రీమ్ జర్నల్స్‌కి మెడికల్ జర్నలిస్టులు వుంటారు. వాళ్లకి ఆయా మెడికల్ జర్నల్స్‌తో కాపీరైట్ తాలూకా ఒప్పందాలుంటాయి. అయితే - ప్రొఫెషనల్ డాక్టర్లెవరూ ఈ వార్తల్ని సీరియస్‌గా తీసుకోరు. ఈ స్టడీస్ ఫలితాలు అనేకసార్లు రేప్లికేట్ అయ్యి, ప్రతిష్టాత్మకమైన మెడికల్ జర్నల్స్‌లో కన్సిస్టెంట్‌గా రిపోర్ట్ అయితేగానీ డాక్టర్లు పట్టించుకోరు.
ఇప్పుడు తెలుగు పత్రికల మెడికల్ వార్తల స్థితి -
నేను తెలుగు వార్తాపత్రికలు చదివి చాలా సంవత్సరాలే అయింది. అయినా - ఈ తెలుగు మెడికల్ వార్తా జర్నలిస్టుల పట్ల ఇలా అనుకుంటున్నాను (నా అవగాహన తప్పని నా జర్నలిస్టు మిత్రులు చెబితే 'సారీ' చెప్పడానికి రెడీ). ఈ జర్నలిస్టులకి కనీసస్థాయి మెడికల్ అవగాహన వుండదు. ఇంగ్లీషు పత్రికల్లో పబ్లిషైన గాలివార్తల్ని తెలుగులోకి అనువదించడం మాత్రమే వీరికి తెలిసిన విద్య. వార్తకి సోర్స్ మాత్రం చచ్చినా ఇవ్వరు (తస్కరించిన వార్త కాబట్టి కాపీరైట్ సమస్యలొస్తాయి). ఈ వార్తల్ని వాళ్ల బాసుల ఆజ్ఞననుసరించి ఫిల్లింగ్ అప్ న్యూసుగా ప్రచురిస్తుంటారు. అంచేత ఈ బాపతు వార్తలకి విశ్వసనీయత వుండదు, కనుక మనం పట్టించుకోరాదు.
ఇదంతా యెందుకు చెబుతున్నానంటే - 'ఫలానా పేపర్లో ఫలానా తింటే ఫలానా రోగం వస్తుందని రాశారు! నిజమేనా?' అంటూ నన్ను కొందరు అడుగుతుంటారు. వారికిదంతా చెబితే అర్ధమవుతుందో లేదో తెలీదు, అంచేత సమాధానం దాటవేస్తాను. ఇది చదివాక తెలుగు మెడికల్ వార్తల డొల్లతనాన్ని మీరుకూడా అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

(FB post)