Sunday 28 January 2018

బూతు ఆలోచనలు (revised post)


బూతు అనగా సెక్స్‌కి సంబంధించిన విషయం. వ్యక్తుల మధ్య జరిగే 'సెక్సువల్ ఇంటర్‌కోర్స్' అనే క్రియని 'బూతు' అని అంటారు. బూతుని రిఫర్ చేస్తూ అనే మాటల్ని 'బూతుమాటలు' అంటారు. మన దేశంలో నగ్నత్వం కూడా బూతుగానే చెలామణి అవుతుంది.. కొన్నిదేశాల్లో నగ్నత్వం బూతు కాదు. ఇవన్నీ కల్చర్‌కి సంబంధించిన అంశాలు.

ఇంటర్‌కోర్స్‌ని చిత్రీకరించే సినిమాల్ని 'బూతుసినిమాలు' అంటారు. వీటినే 'నీలిచిత్రాలు' అనికూడా అంటారు.. ఎందుకంటారో తెలీదు. కొందరు 'పోర్న్' అంటారు. మరికొందరు 'ఎడల్ట్ ఫిల్మ్స్' అంటారు. ఈ బూతుసినిమాలు ఎంతో ముఖ్యమైనవి కాబట్టే ఇన్ని పర్యాయ పదాలు ఉన్నట్లుగా తోస్తుంది. ఈ తరహా సినిమాలు తియ్యడం కొన్నిదేశాల్లో 'కళారూపం' కిందకి వస్తుంది. కొన్ని అమెరికా రాష్ట్రాల్లో ఎడల్ట్ ఫిల్మ్ 'ఇండస్ట్రీ'కి చట్టబద్దత ఉంది.

బూతు విషయాలు చర్చకి వచ్చినప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు చదువుతారని/చూస్తారని స్పృహ ఉండాలని విజ్ఞులు వాకృస్తారు. పిల్లల విషయంలో నాకెటువంటి భేదాభిప్రాయం లేదు, వారిని ఈ విషయాల నుండి దూరంగా ఉంచాలని నేను గట్టిగా నమ్ముతాను. భారత ప్రభుత్వం వారు కూడా పజ్జెనిమిదేళ్ళ వయసు లోపు వారిని బూతుకి దూరంగా ఉంచాలని చట్టం చేశారు. ఆపై వయసువారు 'ప్రైవేటు'గా బూతు చూడొచ్చు. ఇందుకు చట్ట ప్రకారం ఆడామగ వివక్షత లేదు.

ఒక నేరాన్ని అంచనా వేసేప్పుడు వ్యక్తిగతం, సమాజగతం అనే అంశాలుగా బేరీజు వెయ్యాలి. వ్యక్తిగతం కన్నా సమాజగతమైన నేరాలు యెక్కువ ప్రమాదకరం. హత్య, దొంగతనం లాంటివి వ్యక్తిగతమైన నేరాలు. అలాగే 'అక్రమ' సంబంధాలు ('సక్రమ' సంబంధం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే 'చట్టపరమైన' సెక్సు సంబంధం) కూడా ఈ కోవకే చెందుతాయి. వీటివల్ల వ్యక్తులకీ, వారి కుటుంబాలకీ నష్టం. సమాజానికి పరిమితమైన నష్టం.

సమాజానికి నష్టం కలిగించే నేరాలు.. దొంగనోట్ల వ్యాపారం, పబ్లిక్ పరీక్షల పేపర్లు అమ్ముకునే వ్యాపారం, రాజకీయమైన అవినీతి, ఓట్ల కోసం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టటం.. ఈ ఘరానా నేరస్తుల లిస్టు చాలా పెద్దది, అది వేరే చర్చ.

మనలో అభిప్రాయాలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని అభిప్రాయాల్ని అనుభవంతో ఏర్పరచుకుంటాం. మిరపకాయ బజ్జీ తింటే కడుపు భగ్గుమంటుంది, ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు భగ్గుమంటాయి.. ఇవన్నీ అనుభవంతో తెలుసుకుంటాం. మేడమీంచి దూకితే కాళ్ళు విరుగుతాయని తెలుసుకోడానికి అనుభవం అవసరం. ఇవేవీ కాకుండా ఆయా సమాజాలకి చెందిన 'నైతికపరమైన' అభిప్రాయాలు మరికొన్ని. ఉదాహరణకి - మన గ్రామీణ సమాజంలో ఆడవారు 'పరాయి' మగాడితో మాట్లాడటం తీవ్రమైన తప్పు. 

ఇప్పుడు నా బూతు కథల అనుభవాల గూర్చి రాస్తాను. నే చదువుకునే రోజుల్లో 'రమణి' అని ఒక 'శృంగార కథల పత్రిక' బాగా పాపులర్. 'రమణి'లో సెక్స్ కథలు చందమామ కథల్లా నిత్యనూతనం. అనగా పాతసంచికలకి రిపీట్ వేల్యూ ఉంటుందని అర్ధం! ఆ విధంగా బూతుకథా యజ్ఞం అవిజ్ఞంగా కొనసాగించాను. ఆ కథలు అన్నేసి చదివినా నాకెప్పుడూ ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాలనిపించలేదు.

ఇప్పుడు నా బూతు సినిమా అనుభవాలు కొన్ని. 1980 లలో విడియో ప్లేయర్లు ఉన్న ఇళ్ళు తక్కువ. ఆ తక్కువ ఇళ్ళల్లో మా ఇల్లొకటి. అమ్మానాన్న తరచుగా అక్క దగ్గరకి వెళ్తుండేవారు. వాళ్ళు లేని రోజుల్లో నా స్నేహితులు మా ఇంటిని నీలిచిత్రాల అడ్డాగా మార్చేసేవారు. మొదట్లో వారితో పాటు నేను కూడా ఆ చిత్రరాజాల్ని ఉత్సాహంగా చూశాను గానీ.. ఆ తరవాత విసుగేసింది - ఎప్పుడూ ఒకటే గోల!

రాత్రుళ్ళు భీభత్సమైన బూతు సినిమాలు చూసిన నేనూ, నా స్నేహితులూ.. పగలు మెడికల్ కాలేజ్ లైబ్రరీలో తీవ్రంగా చదివేవాళ్ళం, క్లాసమ్మాయిల్తో కేంటీన్లో కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పేవాళ్ళం. ఇప్పుడో ప్రశ్న - అసలు ఈ పోర్న్ ఎందుకు చూశాను? వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఒకటే సమాధానం. చిన్నప్పుడు క్రికెట్ ఎందుకు ఆడానో, సినిమాలెందుకు చూశానో, అవధానిగారి ఇంట్లో దొంగతనంగా మావిఁడి కాయలు ఎందుకు కోశానో.. అదీ అందుకే! 

నాకంటూ ఒక ఎకడెమిక్ కెరీర్ ఉంది కాబట్టి, నా ఆలోచనలు ఎల్లప్పుడూ ఎంతో ఉన్నతంగా ఉండేవని చెబితే చెల్లిపొవచ్చు.. చాలామంది ఇలా అబద్దాలే చెబుతారు. మనిషి డెవలెప్మెంట్ స్టేజెస్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఇవన్నీ సిటీ బస్ స్టేజీల్లాంటివి. ఒకటి దాటితేనే ఇంకోటి వస్తుంది. కొందరికి చెప్పుకోడం ఇష్టం ఉండదు, నేను చెప్పుకుంటున్నాను - అంతే తేడా!

బూతు సాహిత్యం చదివినా, బూతు సినిమాలు చూసినా మగాడు మృగాడుగా (దుర్మార్గమైన ఈ పదం తెలుగు మీడియా సృష్టి) మారిపోతాడని కొందరు గట్టిగా వాదిస్తారు. వారి సత్యసంధతని, నిజాయితీని శంకించను. యెవరి అభిప్రాయం వారిది. కొందరిది మతపరమైన సమస్యైతే, మరికొందరిది నైతిక సమస్య. ఇంకొందరిది సమాజ శ్రేయస్సు కోరుకునే నిజాయితీతో కూడిన నిజమైన ఆందోళన అయ్యుండొచ్చు.

కానీ - ఈ అభిప్రాయాలన్నీ ఋజువుకి నిలబడని వారి సొంత అభిప్రాయాలనే అనుమానం నాకుంది. అందుకు నా స్వానుభవం కూడా ఒక కారణం. బూతు సాహిత్యాన్ని, నీలిచిత్రాల్ని ఎంజాయ్ చేసిన నేను చెడిపోనప్పుడు.. ఇంకెవరన్నా ఎలా చెడతారు?! 

నా అనుభవాల్ని జనరలైజ్ చెయ్యడం కరెక్ట్ కాదు. కానీ.. మన సమాజంలో పోర్న్ గాంచడం వల్ల చెడిపోతారంటానిక్కూడా ఋజువు కావాలి కదా? అయితే అందుకు కొందరు సెక్స్ నేరాలు చేసిన 'చెడిపోయిన'వారిని ఉదాహరణగా చూపవచ్చు. కానీ వాళ్ళు పోర్న్ వల్లే చెడిపొయ్యారని నిర్ధారించలేం. పోర్న్ చూసినా ఎఫెక్ట్ కాని నన్ను ఎలాగైతే జెనరలైజ్ చెయ్యకూడదో పోర్న్ చూసి చెడిపోయినవాణ్నీ జనరలైజ్ చెయ్యకూడదు.

సైకాలజిస్టులు కోపాన్ని కంట్రోల్ చేసుకోడానికి 'కథార్సిస్' అనే టెక్నిక్ వాడతారు. ఎగ్రెసివ్ పర్సన్ ఒక భీభత్సమైన ఏక్షన్ సినిమా చూస్తూ ఆ హీరోతో తనని తాను ఐడెంటిఫై చేసుకుని తన ఎగ్రెసివ్ ఫీలింగ్స్ నుండి విముక్తి పొందొచ్చు. దీన్నే 'వెంటిలేషన్' అని కూడా అంటారు. అలా కోపవిముక్తుడైన ఆ వ్యక్తి, ప్రవర్తనలో కొంత సౌమ్యుడుగా మారవచ్చు.

ఇప్పుడు ఇదే లాజిక్‌ని పోర్నగ్రఫీకి తీసుకొద్దాం. పోర్న్ వాస్తవం అనుకునే అమాయకుడు ఉండడు. పోర్న్ నటుల ఇమేజెస్ మెదడుని స్టిమ్యులేట్ చేస్తాయి. చూసేవాడు ఆ నటుల్తో ఐడెంటిఫై చేసుకుని ఆనందం పొందుతాడు. ఇది పూర్తిగా ఫేంటసీ, వెంటిలేషన్ ఆఫ్ సెక్సువల్ డ్రైవ్. జాకీ చాన్ ఫైటింగులు చూసినవాడు రోడ్ల మీద జనాల్ని తన్నడు, తన్నినట్లు తృప్తి నొందుతాడు, ఇదీ అంతే.

నేనిదంతా రాస్తుంది నా ఆలోచనలు మీతో పంచుకోవటానికి తప్ప పోర్న్ ప్రమోట్ చెయ్యటానికి కాదు, దానికి ఆల్రెడీ కోట్లాది అభిమానులున్నారు. మీరొక్కసారిగా ఉలిక్కిపడి నాకు నీతిబోధన కార్యక్రమం మొదలేడ్తే నే చేసేదేంలేదు (ఇప్పుడంతా నీతుల కాలం నడుస్తుంది). బూతు వల్ల తెలుగు సమాజం ఎంతగా చెడిపోయ్యిందో తెలుసుకోటానికి మన దగ్గర సైంటిఫిక్ డాటా లేదని నా అభిప్రాయం. ఋజువు లేకుండా ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది, అంతకుమించి మరేమీ కాదు.

అసలు బూతు అంటే ఏమిటి? 'మనసుని చెడుగా ప్రభావితం చేసి, వ్యక్తిత్వాన్ని చెడగొట్టేది బూతు' అనే విస్తృత నిర్వచనం ఇచ్చేసుకున్నట్లైతే ఈ ప్రపంచంలో మనకి కావలసినంత బూతు ఉండనే ఉంది.

మత చాందసాన్ని ప్రమోట్ చేస్తూ, ఇతర మతాలపై విషం చిమ్మే ఏ పుస్తకమైనా బూతు పుస్తకమే! మనుషుల్ని శతాబ్దాల వెనక్కి తీసుకుపొయ్యే ఏ సాహిత్యమైనా బూతు సాహిత్యమే. సాంప్రదాయాల పేరుతొ తిరోగమన భావాజాలాన్ని ప్రమోట్ చేసే ఏ సినిమా అయినా బూతు సినిమానే.

ఆ విశాల దృష్టితో చూస్తే సినిమాల్లో నగ్నత్వం చూపిస్తే బూతు కాదు. ప్రేమ పేరుతొ హీరో వేసే వెకిలి వేషాలు బూతు. ఆడపిల్లల్ని హీనంగా తీసిపడేసే హీరోగారి పొగరు బూతు.

పాత సినిమాల్లో కూడా బుట్టల కొద్ది బూతు డైలాగులుండేవి.

'ఏమండి! మీరు ఎంతైనా తాగండి, తిరగండి. కానీ ఈ నిర్భాగ్యురాలికి మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి. కనీసం మీ ఇంట్లో పనిమనిషిగానైనా చోటివ్వండి.'

నో డౌట్.. ఇది మాత్రం పచ్చి బూతు డైలాగ్!

(Ramana Yadavalli on 14 June 2014) fb post on 29/1/2018