Wednesday 14 September 2011

వానకథే.. ఆగిపోయింది!


ఉదయం నుండీ విడవకుండా ఒకటే వర్షం. చల్లగాలి రివ్వున వీస్తూ ఒళ్ళంతా జివ్వుమనిపిస్తుంది. ఆకాశం ముసుగేసుకున్నట్లు ముసురుపట్టి నల్లనల్లగా వుంది. దూరంగా చెట్టుకింద బక్కచిక్కిన వీధికుక్క తన దిక్కులేనితనాన్ని గుర్తు చేసుకుంటూ దీనంగా ఏడుస్తుంది. ఆ పక్కగా ఇద్దరు పిల్లలు - అన్నాచెల్లెళ్ళలా వున్నారు.. వర్షమెప్పుడు తగ్గుతుందాని ఎదురు చూస్తున్నారు.

వర్షం ఎంతందంగా వుంది! బహుశా చెట్లకి, చేమలక్కూడా వర్షం అంటే ఇష్టం కాబోలు - 'ఇంకా కురువు, ఇంకా కురువు' అంటున్నట్లు తలలూపుతూ నాట్యం చేస్తున్నాయి. నా చిన్నతనంలో వర్షంలో తడుస్తూ స్కూల్నుండి ఇంటికి రావడం నాకింకా గుర్తుంది. నేనూ, అక్కా కాగితం పడవల్ని నిండుగా ప్రవహిస్తున్న కాలవల్లోకి వదిలి, ఆ పడవల్తో పాటే పరుగులు తీసేవాళ్ళం. అదో చిన్నపాటి పడవల పందెం! ఇంటికి రాంగాన్లే అమ్మ హడావుడిగా తల తుడిచేది.  
                
ఇప్పుడు వర్షంలో తడిచే రోజులు పొయ్యాయి, చూసి మాత్రమే ఆనందించే రోజులొచ్చేశాయి. ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ యేదైనా రాస్తే యెలా వుంటుంది? భేషుగ్గా వుంటుంది. ఏం రాయాలబ్బా!  

'చిటపట చినుకులు పడుతూ ఉంటే.. ' అని రాస్తే? అరె - ఆత్రేయ ఎప్పుడో రాసేశాడే! 'వానకాదు వానకాదు వరదారాజా' అని రాస్తే? అరెరే - కె.వి.రెడ్డి సినిమానే తీసేశాడే! అసలివన్నీ కాదు గానీ - వాన నేపధ్యంతో బరువైన కథ రాసి పడేస్తాను. హోల్డాన్! పద్మరాజు 'గాలివాన' ఎవరికిద్దాం? 

'నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు' అన్నారు పెద్దలు. నేను రాయదల్చుకున్న కథలు, కవితలు రెండుమూడు జీవితకాలాలు లేటు. ఏమిటీ అన్యాయం? నేనేం చేశానని నాకీ శిక్ష? లేటుగా పుట్టడమే నా పాపమా? నాకెందుకో - నాకు మంచిపేరు రాకుండా చెయ్యాలనే కుట్రతో కవులు, రచయితలు హడావుడిగా వానపై రాసేసి, రాయడానికి నాకేమి మిగలకుండా చేసేశారనే అనుమానంగా వుంది. 

ఇంతలో - ఫెడేల్మంటు పిడుగుపడ్డ శబ్దం, కళ్ళు చెదిరే మెరుపు. లిప్తపాటు కళ్ళు మూసుకుని తెరిచాను. ఎదురుగా ఎవరో వ్యక్తి! మనిషి అస్పష్టంగా కనపడుతున్నాడు. కొంపదీసి మెరుపు దెబ్బకి కళ్ళు పోయ్యాయా!   

ఆ అస్పష్ట ఆకారం కొద్దిసేపు నన్ను పరికించి, పలకరించింది - "ఏమిటలా చూస్తున్నావ్? నన్నే గుర్తు పట్టలేదా? సర్లే - నేనే చెప్పేస్తాన్లే, నేన్నీ ఆత్మని."

కొంపదీసి వీడు దెయ్యం కాదుగదా? నాకు భయమేసింది. అయినా బింకంగా అడిగాను - "ఈ ఆత్మలొచ్చి మాట్లాట్టం నాకేం కొత్తకాదులే. నాకు తెలుగు సినిమాలు కొట్టిన పిండి, ఎన్ని సినిమాల్లో ఈ ఆత్మల్ని చూళ్ళేదు! కానీ నేనిప్పుడు అర్జంటుగా ఒక రచన చెయ్యాలి. నువ్వొచ్చిన పనేంటో తొందరగా చెప్తే నా పని నే చేసుకుంటాను." 
               
"నేనొచ్చిందీ ఆ పనిమీదే! చూడు నాయనా! నీగూర్చి నువ్వు శ్రీశ్రీ, రావిశాస్త్రిలా ఫీలవుతున్నావేంటి! వర్షం రావడం, వర్షంలో కాఫీ తాగడం, ఆ మాత్రానికే గొప్ప మూడ్ వచ్చెయ్యడం - తప్పు నాయనా! ఫీలవ్వడానిక్కూడా ఓ హద్దుండాలి." 

నాకు సర్రున కోపం వచ్చింది. "నిజం చెప్పు, నువ్వసలు నాఆత్మవేనా? తెలుగు సాహిత్యంలో శాస్వతంగా నిలిచిపోయ్యే గొప్పరచన చెయ్యబోతుంటే, ఇలా నిరుత్సాహ పరుస్తావా?"   
      
"నీకు విషయం తక్కువ, బిల్డప్పు ఎక్కువ. ఒప్పుకుంటున్నాను. నువ్వు మసాలా దోసె, సాంబార్ల గూర్చి బాగానే రాశావు. కానీ - అంతమాత్రానికే ఇంత పోజు పెట్టెయ్యకురా అబ్బీ!"
                
"నా గూర్చి నువ్వేమనుకున్నా నాకనవసరం."

"తెలుగు సాహిత్యానికి నీలాంటి అరకొరగాళ్ళతో పెద్ద చిక్కొచ్చి పడింది. నాలుగు కథలు చదవడం, రెండు కథలు రాసి పడెయ్యడం - పెద్ద సాహిత్యకారుల్లా ఫీలవ్వడం."

"నువ్వైంతయినా మాట్లాడుకో, నేను మాత్రం నోరిప్పను." అన్నాను. 
               
"ఏంటి కాఫీ తాగి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?" అంటూ నాభార్య వచ్చింది. 
               
అప్పటిదాకా ప్లీడర్లా పాయింట్ల మీద పాయింట్లు వేస్తూ వాదిస్తున్న ఆత్మగాడు 'కెవ్వు'మంటూ మాయమైపోయాడు.
               
'వార్నీ! భార్యంటే భర్తలకే కాదు, ఆత్మలక్కూడా భయమమన్నమాట!' ఆశ్చర్యపోయా.
              
ఇంతలో వర్షం ఆగిపోయింది. కథ రాసే మన మూడూ ఆవిరైపోయింది.
              
మిత్రులారా! ఈ వెధవ ఆత్మగాడి మూలానా తెలుగులో ఒక గొప్పవర్షం కథ వెనక్కిపోయింది. అందుగ్గానూ మిక్కిలి చింతిస్తున్నాను. ఈసారి వర్షం రావాలేగానీ - కథ రాయకుండా నన్నేఆత్మా ఆపలేదని ప్రకటిస్తున్నాను.