Tuesday, 6 September 2011

సినిమా డాక్టర్లు
రాముడు మంచిబాలుడు, మన సినిమా డాక్టర్లంతా రాముళ్లే! నున్నగా గీసిన గడ్డం, నూనెరాసి ఒద్దికగా దువ్వుకున్న తల, వెడల్పు ఫ్రేములో సోడాబుడ్డి కళ్ళద్దాలు, డాక్టరు కోటు (యాప్రన్), చేతిలో మందుల తోలు సంచి, శివుడి మెళ్లో పాములా స్టెత్‌స్కోప్.. ఇదీ డాక్టరుగారి వేషం! రౌడీ పాత్రకి బుగ్గన పులిపిరి, అడ్డచారల టీషర్టు, మెళ్ళో కర్చీఫ్ వుంటేగానీ అతగాడు 'రౌడీ' అని ప్రేక్షకులకి తెలీదు. తెలుగు సినిమా డాక్టర్లదీ ఇదే దుస్థితి!

ఐతే - ఈ సినిమా డాక్టర్ గొప్ప ప్రతిభావంతుడు, యెన్నో అద్భుతాలు చెయ్యగలడు. గుమ్మడి ఉత్కంఠతో ఎదురు చూస్తుంటుండగా.. హీరో చెల్లెలి నాడిని అరక్షణం పరీక్షించి, ఇంకో పావుక్షణం ఆలోచించి, ఆమె గర్భవతని తేల్చేస్తాడు! అప్పుడు గుమ్మడి "పాపిష్టిదానా! మన వంశగౌరవం.. కుటుంబప్రతిష్ట.. " అంటూ తన పోర్షన్ డైలాగులు ఆవేశంగా చెప్పేసి గుండె పట్టుకుని కూలబడిపోతాడు. అవమానం తట్టుకోలేక హీరో చెల్లి బావిలో దూకేస్తుంది ('శీలం' కోల్పోయిన ఆడపిల్ల బ్రతకరాదు). బ్యాక్‌గ్రౌండులో గుండెల్ని పిండేసే సన్నాయి వాయిద్యం, ఘంటసాల బూమింగ్ వాయిస్‌తో ఒక హెవీ సాంగ్.

ఈ విధంగా దర్శకుడు తనకిచ్చిన కొద్ది సమయంలో.. కథని భీభత్సమైన మలుపు తిప్పే గొప్పసన్నివేశంలో.. యాంత్రికంగా తనపని తను చేసుకుపొయ్యే క్రమశిక్షణ కలిగిన సినిమా డాక్టర్లది వాస్తవిక దృక్పథం కూడా. తెలుగు ప్రేక్షకలోకం హీరో చెల్లెలు గర్భవతైన తర్వాత వచ్చే గుమ్మడి గుండెపోటు కోసం, ఘంటసాల పాట కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు కనుక ఎక్స్‌రేలనీ, రక్తపరీక్షలనీ సమయం వృధా చెయ్యరు. 

మన సినిమా డాక్టరు సాధించిన మరొక అద్భుత విన్యాసం రక్తమార్పిడి ప్రక్రియ! రక్తం ఇస్తున్నవారి (డోనార్) రక్తం భూమ్యాకర్షణ సిద్ధంతానికి విరుద్ధంగా సెలైన్ స్టాండ్ మీదనున్న సీసాలోకి ఎక్కించడం! దటీజ్ అవర్ సినిమా డాక్టర్! ఈ బాక్సాఫీస్ ఫార్ములానే మన్మోహన్ దేశాయ్ అనే హిందీ దర్శకుడు ఇంకొకడుగు ముందుకేయించాడు. ఆయన 'అమర్ అక్బర్ ఆంథోనీ' అనే సినిమాలో ఏకంగా ముగ్గురు కొడుకుల రక్తాన్ని సెలైన్ స్టాండ్ పైనున్న సీసాల్లోకి పంపి, అక్కణ్ణించి తల్లి ఒంట్లోకి డైరక్టుగా ఎక్కే యేర్పాటు చేశాడు! 

సినిమా డాక్టర్లకి యిలా స్పెషల్ ప్రతిభాపాటవాలున్నా దెబ్బలకి కట్టు కట్టటం సరీగ్గా రాదు. తెల్లటి గాజుగుడ్డకి మధ్యలో ఒకప్పుడు నల్లటి పెద్దమరక (బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో), ఇప్పుడు ఎర్రటి పెద్దమరక (కలర్ సినిమాల్లో) లేకుండా కట్టు కట్టలేడు. 

కాలక్రమేణా సినిమా డాక్టర్ తోలుసంచితో పేషంట్ల ఇళ్ళకి రావటం మానేశాడు, కార్పొరేట్ ఆస్పత్రులొచ్చాయి. ఈ కార్పొరేట్ ఆస్పత్రికి మొదటి పేషంట్ 'ప్రేమనగర్' నాగేశ్వర్రావు. పాపం! వాణిశ్రీ ప్రేమ కోసం నాగేశ్వర్రావు విషం తాగేస్తాడు. హీరోగారు ఎంత పనీపాట లేని ప్రేమికుడైనా 'ప్రేమనగర్' అనే పెద్ద బిల్దింగుకి ఓనర్. సింపుల్‌గా విషం కక్కించేస్తే సన్నివేశం పండదు, తేలిపోతుంది! సన్నివేశం, హీరో, బజెట్ డిమాండ్ చేసిన కారణంగా విషాన్ని కక్కించడానికి బదులుగా ఆపరేషన్ చేసేశాడు సినిమా కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్!   

సినిమాల్లో వాస్తవికతని వెదుక్కునే చాదస్తులు ఎప్పుడూ వుంటూనే వుంటారు. వీరు రేసుగుర్రంలా పరిగెట్టే సినిమాకథని ఫాలో అవ్వలేని అజ్ణానులు. అందుకే 'అప్రధాన' విషయాలపై దృష్టి పెడుతుంటారు. కథకి హీరో చెల్లెలి గర్భం ముఖ్యంగానీ అదెట్లా నిర్ధారింపబడిందన్నది అనవసరం. తల్లీకొడుకుల మమకారాన్ని ఆపే శక్తి భూమ్యాకర్షణ సిద్ధాంతానికి వుంటుందా! 

ప్రియురాలు వాణిశ్రీ కోసం విషం త్రాగి, లక్షలు ఖరీదు చేసే సెట్టులో, ఘంటసాల గొంతుతో దిక్కులు పిక్కటిల్లేలా 'ఎవరికోసం' అంటూ ఒరిగిపోతూ, ఒంగిపోతూ, పడుతూ, లేస్తూ పాడుతుంటే.. కెమెరా ఊగిపోతూ తిరిగిపోతూ.. ఆబ్బ! ఎంత గొప్ప సీను! ఇంత భీభత్స చిత్రీకరణ తరవాత కూడా సాదాసీదాగా విషం కక్కించేసి హీరోని రక్షిస్తే - సత్యజిత్ రే వంటి మేధావులు మెచ్చుకునేవారేమో గానీ.. తెలుగు ప్రేక్షకుడు ఒక్కరూపాయి విదిల్చేవాడా?

తెలుగు దర్శకులు జ్ఞానులు. తెలుగు సినిమా కధలెప్పుడూ రేసుగుర్రాలే, అందుకే అవి ఆగకుండా పరుగులు తీస్తుంటాయి. బెంగాలీ, మళయాళీ సినిమాలు మన పీరుసాయిబు కుంటి జట్కాగుర్రంలా ముక్కుతూ మూలుగుతూ, పడుతూ లేస్తూ నడుస్తుంటాయి.  

కావున చివరాకరికి చెప్పొచ్చేదేమంటే - మన దర్శకుల అభిరుచినీ, ప్రజల అభీష్టాన్నీ మన్నించి.. సినిమా డాక్టర్లు కూడా తమవంతు పాత్ర(ల)ని పోషించారు. మనఇంట్లో, మనరోట్లో నూరిన గోంగూర పచ్చడి మనగ్గానీ ఎవడో పక్కింటోడి కోసం కాదుగాదా! 

(updated on 10/2/2018)