Friday 9 September 2011

సాంబారు.. ఒక చెరగని ముద్ర




ప్రతిమనిషికీ తన ఇంటలెక్చువల్ స్థాయి, అభిరుచిలననుసరించి కొన్ని మధుర స్పృతులు, అనుభవాలు మదిలో నిక్షిప్తమైపోతాయి. అది కొందరికి తమ ఇష్టదైవం పాదపద్మముల దర్శనభాగ్యమైతే, మరికొందరికి ఇష్టసఖి ప్రేమగా తొలిసారి లాలనగా పిలిచినప్పుడు కలిగే పులకరింతా, పలవరింతా, థ్రిల్లింతా కావొచ్చు. 

నాకన్ని గొప్ప అనుభవాల్లేవు, పెద్ద ఇమేజినేషనూ లేదు. అభిరుచి అంటే అర్ధం తెలీదుగానీ - రుచి అంటే అర్ధం తెలుసు. అందుకే చిలకలూరిపేట పద్మనాభ హోటల్ సాంబారిడ్లీ వడ నా మదిలో చెరగని ముద్రేసింది. కాబట్టే - నిన్నమొన్న జరిగినట్లు అనిపిస్తుంది.  
                      
ఓ సారి ఒంగోలు వెళ్లేప్పుడు అల్పాహారం కోసం చిలకలూరిపేటలో ఓ హోటల్ ముందు కారాపాడు నా డ్రైవర్, పేరు పధ్మనాభ హోటల్. పదిపదిహేను దాకా టేబుళ్ళు, డజన్లకొద్దీ కుర్చీలు. కూర్చునే ప్లేస్ కోసం వెయిట్ చేస్తూ ఓ పక్కన్నిలబడి అక్కడి వాతావరణాన్ని గమనించసాగాను. 

దాదాపు అందరూ ఇడ్లీ, వడ సాంబారు తింటున్నారు. ఓ పక్కన పెద్ద ఇత్తడి గంగాళాలు నాలుగైదు నిలబెట్టి ఉన్నయ్. వాటినిండా పొగలు గక్కుతూ చిక్కటి సాంబారుంది. వంటగదిలోంచి పెద్దపాత్రల్లో వేడివేడి ఇడ్లీలు, గారెలు మోసుకొచ్చి ఓ గంగాళంలో పడేస్తున్నారు. అవన్నీ సాంబారులో పూర్తిగా మునిగేట్లుగా ఒకతను పెద్ద చిల్లుల గరిటెతో వాటిని నొక్కుతున్నాడు. 

ఇంకో గంగాళంలో సాంబారు పీల్చుకుని ఉబ్బిపోయున్న ఇడ్లీల్నీ, గారెల్నీ స్టీలు హస్తంతో పక్కనే వున్న టేబుల్ మీద వరుసగా పేర్చబడున్న ప్లేట్లల్లోకి.. ఇడ్లీ, గారెలు ఏమాత్రం విరక్కుండా, చెదిరిపోకుండా అత్యంత లాఘవంగా మారుస్తున్నాడు ఇంకొకతను.      

విమానం నడపటం సంక్లిష్టమైన పని. ఆ పనికి అలవాటైపోయిన పైలట్ దాన్ని మెకానికల్‌గా చేసేస్తాడు. చూసేవారికి అదేమంత గొప్పపనిగా అనిపించదు. సాంబారిడ్లీల్ని పేర్చే వ్యక్తి కూడా పైలట్ల కోవలోకే వస్తాడని అనిపించింది. కొద్దిసేపు అతణ్ణి ఎడ్మైరింగ్‌గా చూస్తుండిపోయాను.    

అమ్మయ్య! ఇప్పుడు నాకో కుర్చీ దొరికింది. ఆర్డర్ తీసుకోకుండానే (అక్కడందరూ ఫస్ట్ గేర్ సాంబారుతోనే వేస్తారేమో) నాముందుకు పొగలు గక్కుతున్న ఇడ్లీవడ సాంబారు వచ్చి చేరింది. అంతదారుణమైన వేడితో సాంబారిడ్లీ తినే ధైర్యం లేనందున, కొంచెం వేడి తగ్గాక తిందామని నిర్ణయించుకుని - ఆ హోటల్ వాతావరణాన్ని మరొకసారి పరికించాను. 

అంతమంది ఏకాగ్రతగా ఒకేసారి ఇడ్లీవడ సాంబారు తినడం ఆశ్చర్యంగా వుంది. ఇదేమన్నా ఇడ్లీవడ సాంబారు తినే కార్ఖానానా! వీళ్లంతా సినిమాల్లో నలుగురిని వందమందిగా చూపే గ్రాఫిక్ వర్క్‌లాగా అనిపిస్తున్నారు.          

సాంబారు వేడి తగ్గినందున - తిండం మొదలెట్టాను. అద్భుతం, అమోఘం అంటూ యేవో పడికట్టు పదాల రొటీన్ వర్ణనలు తప్ప, రుచుల్ని వివరిస్తూ రాయడం నాకు చేతకాదు. కాబట్టి ఇడ్లీవడ సాంబారు రుచి గొప్పగా వుందని చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాను. 

(updated on 15/2/2018)