Sunday, 30 December 2012

రేప్ గూర్చి.. ఒక మంచి కల!


నేర తీవ్రత ననుసరించి శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉండాలని కొందరు వాదిస్తుంటారు. ఇంకొందరు శిక్షలు reformative గా ఉండాలని కోరుకుంటుంటారు. ఎవరి వాదనలు వారివి.

ఒక సమాజానికి నాగరికత ఉంటుంది. ఆ సమాజానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ వ్యవస్థకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అందుకు అనుగుణంగా ఆ సమాజం లేక దేశంలో శిక్షలు ఉంటాయి.. అమలవుతుంటాయి. చైనాలో మరణశిక్షలు ఎక్కువ. యూరప్ లో దాదాపుగా లేవు. ఇది ఆయా సమాజానుగతంగా ఉంటాయి.

ఒక దేశంలో అమ్మాయి చెయ్యి పట్టుకుంటే.. ఆ చేతిని బహిరంగంగా నరికే శిక్ష ఉండొచ్చు. ఇంకో దేశంలో అదే నేరానికి మూణ్ణెల్ల జైలు శిక్ష మాత్రమే ఉండొచ్చు.

అవసరం అనుకుంటే ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోనివాణ్ణి కూడా ఉరి తీసుకుందాం. జేబు దొంగల్ని కూడా కరెంటు షాకులిచ్చి చంపేసుకుందాం. ఇక్కడిదాకా నాకు పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. అయితే నాకు కొన్ని సందేహాలున్నాయి.

ఈ దేశంలో నేరస్తులు, శిక్షని అనుభవించేవారు అధిక శాతం పేదవారు, సామాజికంగా తక్కువ కులం వారు.. అందునా దళితులు.. ఎందుకుంటారు? అనేక జైళ్ళలో పేదవారు, అణగారిన కులాలవారు.. (వారిపై మోపిన నేరానికి పడే శిక్ష కన్నా ఎక్కువకాలం) విచారణ పేరుతొ జైళ్ళలో ఎందుకు మగ్గిపోతున్నారు?

పదిమంది నేరం చేస్తే పదిమందికీ శిక్ష పడేలా ఉండే సమాజం కావాలని కోరుకుంటున్నాను. పైన నేను చెప్పినట్లు.. ఆ శిక్ష ఎలా ఉండాలనేది, ఎంత తీవ్రంగా ఉండాలనేది పూర్తిగా వేరే చర్చ.

ఉదాహరణకి.. రేప్ కేసుల్నే తీసుకుందాం. అత్యాచారానికి గురైన యువతి స్వేచ్చగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వ్గలిగే వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామా? క్రింది స్థాయి పోలీసు అధికారులకి ఈ నేరతీవ్రత గూర్చి, విధివిధానాల గూర్చి మన పోలీస్ ఎకాడెమీల్లో ఎంత శిక్షణనిస్తున్నారు? అసలు ఆ ఆ శిక్షణనిచ్చే ఉన్నతాధికారులకి gender sensitization  ఉందా?

రేప్ బాధితురాలిని పరీక్షించి, నిర్ధారించే వైద్యుని శిక్షణ ఏమిటి? దానికి సరియైన శాంపిల్స్ కలెక్ట్ చెయ్యడంలో సరైన విధానాలున్నాయా? ఆ శాంపిల్స్ చేరినా.. Forensic lab వారు నెలల తరబడి రిపోర్ట్ ఎందుకివ్వరు? చార్జ్ షీట్ మూడు నెలల్లో ఫ్రేం చెయ్యకపోతే నిందితుడికి (బెయిల్ పొందటం ప్రాధమిక హక్కు) స్వేచ్చ వస్తుంది.

ఆ తరవాత తాపీగా, హాయిగా కేసుని ఎలా మాఫీ చేసుకోవాలో నిందితులకి తెలుసు. అట్లా సహకరించే వ్యవస్థ మనకి లేదా? యేళ్ళ తరబడి సాగే కేసులో.. కోర్టులో బాధితురాల్ని క్రాస్ ఎక్జామినేషన్ పేరిట చాలా నీచమైన, అసభ్యమైన ప్రశ్నలడిగే న్యాయవ్యవస్థలో కూడా మనం బ్రతుకుతున్నాం.

అంటే డబ్బు, పలుకుబడి కలవాడు తప్పించుకోడానికి అడుగడుగునా అవకాశాలు పుష్కలం. ఇవేమీ లేని అర్భకుల్ని న్యాయవ్యవస్థ నేరం చేసినవాడిగా నిర్ణయిస్తుంది. మనం కోరుకున్న శిక్షలు పడేది ఈ 'బలహీన నేరస్తులకే'! (నేరస్థుల పట్ల నాకు సానుభూతి లేదు. వాడికి ఉరిశిక్షో, జీవితకాల శిక్షో తరవాత సంగతి). నా బాధల్లా వాడితో బాటుగా అదే నేరం చేసిన తొంభై మంది హాయిగా సమాజంలో పెద్దమనుషులుగా తిరిగేస్తుంటారు.

ఈ వ్యవస్థలోని లోపాలని సరిచెయ్యడానికి చట్టసభలకి కమిట్ మెంట్ అవసరం. అయితే ఆ సభలకి పటిష్టమైన వ్యవస్థలంటే ఇష్టం ఉండదు. ఎవరి ప్రయోజనాలు వారివి. అందుకే వారు వాగాడంబరం ప్రదర్శిస్తారు. ముసలి కన్నీరు కారుస్తారు. టీవీల వారికి ఇదంతా ఓ ఫ్రీ రియాలిటీ షో!

రాత్రి నాకో కల వచ్చింది...

మా ఊళ్ళో ఇద్దరు నిరుపేద, దళిత యువతులు అత్యాచారానికి గురయ్యారు. వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడి పోలీసులు వారితో అత్యంత మర్యాదగా ప్రవర్తించారు. శ్రద్ధగా కేస్ నమోదు చేసుకున్నారు.

ఆ యువతుల కంప్లైంట్ ప్రకారం నిందితుల్ని వెంటనే ఎరెస్ట్ చేశారు. నిందితుల్లో అగ్ర కులస్తులు, మైనారిటీలు, బిసి కులస్తులు, దళితులు.. అందరూ ఉన్నారు. కొందరు రాజకీయ నాయకుల కొడుకులు. ఇంకొందరు బడా ధనవంతుల పిల్లలు.

ఆ యువతుల పిర్యాదుల్ని పకడ్బందీగా నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని ఒక వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టరమ్మ ఏంతో సానుభూతితో బాధితుల్ని అనునయిస్తూ, వారికి ధైర్యం చెబుతూ చాలా సైంటిఫిక్ గా మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. చక్కటి నివేదిక తయారుచేసింది. ఆ మెటీరియల్ ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ వారు నెలలోపే రిపోర్ట్ ఇచ్చేసారు.

ఇదిలా ఉండగా.. నిందితుల తండ్రులు తమ డబ్బుని, అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ.. కేసుని నీరు గార్చడానికి అనేక ప్రయత్నాలు చెయ్యసాగారు. కానీ వారు సఫలీకృతులు కాలేకపోయ్యారు.

ఈ లోగా ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఇన్ కెమెరా విచారణ జరిపి.. నిందితులందరూ నేరస్తులని తేల్చింది. వారికి నిర్దేశిత సెక్షన్ లో కల గరిష్టమైన శిక్ష కూడా విధించబడింది. చట్టం ముందు అందరూ సమానులే! నువ్వు ఏ నేరం చేసినా, ఎంత పెద్దవాడవైనా.. శిక్ష నుండి తప్పించుకోలేవు. ఇది పుణ్యభూమి. ఇదే మా దేశ నీతి! సమాజ గతి!!

అయితే.. దురదృష్టం! తెల్లవారింది. నాకు నిద్ర నుండి మెళుకువ వచ్చింది! కల చెదిరింది. నా కల నిజమైతే ఎంత బాగుండు!!