Friday, 3 February 2012

విగ్రహామా! భవిష్యత్తు నీదే

టీవీలో విగ్రహాల కూల్చివేత దృశ్యాల్ని చూస్తున్నాను. శ్రీశ్రీ విగ్రహం దెబ్బతింది, గుండె బరువెక్కింది.

"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ సుడిగాలిలా వచ్చాడు సుబ్బు.

"సుబ్బూ! శ్రీశ్రీ విగ్రహం ధ్వంసం చేశారు, దిగులుగా వుంది." అన్నాను. 

ఒకక్షణం ఆలోచించాడు సుబ్బు.

"నాకీ విగ్రహాల సంస్కృతి పట్ల గౌరవం లేదు. అందుకే శ్రీశ్రీ  విగ్రహంపై దాడి నన్ను బాధించట్లేదు. సమాజానికి రిలవెంట్ అయినంత కాలం శ్రీశ్రీ ప్రజల గుండెల్లో వుంటాడు, లేకపోతే లేదు. పని గట్టుకుని  శ్రీశ్రీ విగ్రహాన్ని టాంక్ బండ్ పై పోషించడం అనవసరమని నా అభిప్రాయం."

ఇంతలో కాఫీ  వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ మాట్లాడసాగాడు సుబ్బు.

"ఈ విగ్రహాలనేవి ఒక ప్రాంతానికీ, కాలానికీ సంబంధించిన సాంఘిక, రాజకీయ భావాల ఆధిపత్య ప్రదర్శన. పుస్తకాల్లో లిఖించబడే చరిత్ర వలే విగ్రహాలు కూడా శిల్పులతో చెక్కించబడే చరిత్ర. స్టాలిన్, సద్దాం విగ్రహాలు ఇందుకు ఉదాహరణ. రాజ్యాధికారం మారినప్పుడు ఈ విగ్రహాలు సహజంగానే నేలకొరుగుతాయి. బుద్దుడి విగ్రహాన్ని కూలగొట్టి తాలిబన్లు అప్పటి దేశరాజకీయాన్ని చరిత్రలో లిఖించారు." 

"అయితే ఈ విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వంసం.. అంతా చరిత్రేనంటావ్." అన్నాను.

"కరెక్ట్, అంతేకాదు.. ఈ విగ్రహాల నిర్మాణం, కూల్చివేతలు భవిష్యత్తులో మరింతగా యెక్కువవుతయ్." అన్నాడు సుబ్బు.

"ఎందుకని?" అడిగాను. 

"విగ్రహ నిర్మాణం వ్యక్తిపూజ, కూల్చివేత వెంటిలేషన్ ఆఫ్ ఏంగర్. ఈ రెంటిదీ హీరోకీ, విలన్ కీ వున్న సంబంధం. విలన్ లేని హీరో వుండడు, హీరో లేని విలన్ వుండడు. నిర్మాణ సంస్కృతి వుంటేనే ధ్వంస సంస్కృతీ వర్ధిల్లుతుంది." అంటూ ఆగాడు సుబ్బు. 

"అంటే ఈ రెండు సంస్కృతులూ ఘర్షిస్తూ వుంటాయన్నమాట." అన్నాను. 

"అవును. విగ్రహంలో చాలా సెంటిమెంట్ వుంటుంది, ఎమోషనూ వుంటుంది. భవిష్యత్తులో విగ్రహాల రాజకీయాలు ఇలా కూడా వుండొచ్చు.. ఒకచోట ఒక వర్గం విగ్రహ ముట్టడి, ప్రతిగా ఇంకో వర్గం ఇంకో విగ్రహం ముట్టడి. బందీలైన విగ్రహాలు గజగజ. హోస్టేజ్ క్రైసిస్. టీవీ లైవ్ షోలు, టాక్ షోలు. ఉద్రిక్త పరిస్థితులు, పోలీస్ లాఠీ చార్జ్, కాల్పులు, హాహాకారాలు, మృతులు, నష్ట పరిహారాలు."

"రోజూ ట్రాఫిక్ జామ్ లన్నమాట!"

"ఇంకెక్కడి ట్రాఫిక్! ప్రజలు నగరాల్ని ఖాళీచేసి ఊరు బయట  గుడారాల్లో నివసిస్తుంటారు. నగరాలన్నీ ఖాళీ, నిర్మానుష్యం, వీధులన్నీ వందల విగ్రహాలు. కుక్కలు, కాకులు కూడా చంపబడతాయ్!"

"మధ్యలో అవేం చేశాయి?" ఆశ్చర్యపొయ్యాను.

"కుక్కలు కాలెత్తి విగ్రహాల్ని అపవిత్రం చేస్తాయి. కాకులకి విగ్రహాల తలలంటే భలే ఇష్టం. అందుకే వాటిపై రెట్టలేసి తమ ఆనందాన్ని చాటుకుంటయ్." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! నీకింత ఇమేజినేషన్ వుందనుకోలేదు." మెచ్చుకోలుగా అన్నాను.

"గాడిద గుడ్డేం కదూ! విల్ స్మిత్  సినిమా 'అయామ్ లెజెండ్' నేపధ్యంతో, జాక్ లండన్ 'ఐరన్ హీల్' క్లైమేక్స్ ని వినిపించాను. అంతే!" అంటూ టైమ్ చూసుకున్నాడు.

"ఔరా! కాపీ క్యాట్! " అన్నాను.

"మధ్యలో పిల్లులేం చేశాయి మిత్రమా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు!

updated and published in FB on 9/3/2018