Wednesday 22 February 2012

వైద్యో నారాయణో హరి!!

"వీడు మా రెండోవాడండీ, ఏడోక్లాసు. కనబడ్డ అడ్డమైన గడ్డీ తింటుంటాడు. ఇప్పుడు పరీక్షల మధ్యలో విరోచనాలు తెచ్చుకున్నాడు, పొద్దుట్నించి దొడ్లోనే పడి యేడుస్తున్నాడు."

ప్రపంచంలో ఏ డాక్టరుకి ఒక పేషంట్ గూర్చి ఇంత గ్రాండ్ ఇంట్రడక్షన్ ఉండదేమో! నాకంత నీరసంలోనూ నాన్నమీద కోపమొచ్చింది. ఆయన ఒక పెద్దమనిషి, అందునా డాక్టరు ముందు ఇలా నా పరువు దారుణంగా తీసేస్తాడని ఊహించలేదు.

అదో విశాలమైన గది. గది మధ్యన పాతకాలపు టేకుబల్ల, కుర్చీ. పక్కన అద్దాల చెక్కబీరువాలు, వాటినిండా ఏవో పుస్తకాలు. గోడకి ఒకవైపు గాంధీ, నెహ్రూ, నేతాజీ మొదలైన దేశనాయకుల పటాలు. ఇంకోవైపు లక్ష్మి, సరస్వతి, రాముడు, శివుడు వగైరా దేవుళ్ళ పటాలు. గదంతా ఆయుర్వేద మందుల తాలూకా ఘాటైన వాసన.

ఆ పాతకుర్చీలో ప్రశాంత వదనంతో, హుందాగా ఒక అరయ్యేళ్ళ వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆయన శరీరఛాయ తెలుపు, జుట్టు తెలుపు, లాల్చీ తెలుపు. మెడలో రుద్రాక్షలు, నుదుట కుంకుమ బొట్టు. వారు మాఊళ్ళో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.

ఆయన నావైపు గంభీరంగా చూశారు. నా కుడిచెయ్యి తనచేతిలోకి తీసుకుని నాడి పరీక్ష చేశారు. 

"ఎప్పట్నించి?" సూటిగా నాకళ్ళల్లోకి చూస్తూ అడిగారు.

"ఉదయాన్నించి." నీరసంగా నేను.

"ఎన్నిసార్లు?"

ఐదా? ఆరా? గుర్తులేదు, సర్లే! ... "ఐదు."

వైద్యులవారు ఒక్కక్షణం ఆలోచించారు.

"బయటి పదార్ధాలేమన్నా తిన్నావా?"

చచ్చితిని! ఊహించని మలుపు! జవాబేం చెప్పాలి? నిజం చెబితే ఇంట్లోవాళ్ళతో తంటా, చెప్పకపోతే వైద్యానికి తంటా! మందు వికటించి కొత్తరోగానికి దారి తియ్యొచ్చు. హే భగవాన్! ఏమిటి నాకీ క్లిష్టపరిస్థితి!

నాకూ, అక్కకి పాకెట్ మనీ రోజుకి ఐదుపైసలు. ఆరోజుల్లో రిఫ్రిజిరేటర్ల కాన్సెప్ట్ లేదు. చల్లటినీళ్ళ కోసం మట్టికూజాలు, కుండలు కొనేవాళ్ళు. వీటితోపాటు పిల్లలు చిల్లర దాచుకోటానికి మట్టిముంతలు కూడా కొనేవాళ్ళు. పిల్లలు తమ పాకెట్ మనీ మరియూ నాన్నల జేబుల్లో కొట్టేసిన చిల్లర ముంతలో వేసుకునేవాళ్ళు. రోజుకి పదిసార్లైనా ఆ ముంత బరువు ఫీలవుతూ, ముంతని పైకి కిందకి ఆడిస్తూ, నాణేల గలగల శబ్దాన్ని తృప్తిగా, గర్వంగా ఫీలయ్యేవాళ్ళు.

నాకంటూ చిల్లర వేసుకొఏదానికి ఒక ముంత వున్నా, నేనెప్పుడూ అందులో డబ్బులేసుకోలేదు. అలా పైసలు ముంతలో వేసుకుని దాచేసినచో భారత ఆర్ధిక వ్యవస్థ కుంటుబడునని గట్టిగా నమ్మిన కారణాన, నేనెప్పుడూ పొదుపు సలహాలు పాటించలేదు. పైగా పెద్దలమాట విని బుద్ధిగా ముంతలో డబ్బులు దాచుకుంటున్న అక్క ముంత నుండి చీపురుపుల్ల సాయంతో ఐదుపైసల బిళ్ళలు లాగేసేవాణ్ణి. ఎన్నిరోజులు డబ్బులేసినా ముంత నిండట్లేదని పిచ్చిఅక్క తెగ ఫీలయిపోయేది. కొంతమంది అంతే! ఈ పాడులోకంలో దొంగలుంటారనీ, అందునా ఇంటిదొంగలు పరమ డేంజరస్సనీ తెలుసుకోలేని అజ్ఞానప్పక్షులు!

ఇంతేగాక - నా తెలివితేటలతో ఇంకొన్నిట్రిక్కులు డెవలప్ చేశాను. ఇంటికి బంధువులొచ్చినప్పుడు, వాళ్ళ ముందు అమ్మని 'ఐదుపైసలియ్యమ్మా! కొనుక్కుంటా.' అని బ్రతిమాలేవాణ్ణి. విడప్పుడు పైసాకూడా విదల్చని అమ్మ, చుట్టాల ముందు పరువు పోతుందనే భయంతో, పోపులడబ్బాలోంచి ఐదుపైసలు తీసిచ్చేది. ఆ వచ్చిన చుట్టం ఆ ఐదుపైసలకి ఇంకో ఐదుపైసలు జతచేసి 'బాగా చదువుకో బాబూ!' అనేవాడు (అసలు విషయం, ఆయన ఇచ్చేదాకా నేను అక్కణ్ణించి కదిలేవాణ్ణి కాదు).

నిన్న ఇంటికి మా మేనమామ వచ్చాడు. అరిగిపోయిన నా పాత ట్రిక్కు ప్లే చేసి పదిపైసలు గిట్టిచ్చాను. ఒక ఐదుపైసలు పీచుమిఠాయి నోట్లో పెట్టుకుంటుంటేనే కరిగిపోయింది. ఐదుపైసలు కలరు డ్రింకు తియ్యగా, చల్లగా గొంతులోకి జారిపోయింది. కానీ - కొద్ది సమయానికే కడుపులో గుడబిడ, తదుపరి చిత్రవిచిత్ర శబ్దాలు. ఆపై తరచూ పాయిఖానా సందర్శన భాగ్యం. ఇదీకథ! ఇప్పుడు సత్యహరిశ్చంద్రుళ్ళా నిజం చెపితినా, నా పాకెట్ మనీకి కోతపడే అవకాశం ఉంది.

కోర్టులో సాక్ష్యం ఖచ్చితత్వంతో చెప్పాలి. 'ఫలానా సుబ్బారావు నాకు తెలుసు గానీ, వాడిపళ్ళు రాలగొట్టింది మాత్రం నేనుకాదు.' అంటే కోర్టు నమ్మదు. అందుకే అసలా సుబ్బారావెవడో నాకు తెలీదని బల్ల గుద్దాలి. అప్పుడే సాక్ష్యం నమ్మబుల్‌గా ఉంటుంది, కోర్టు కూడా నమ్ముతుంది. అంచేత - నిజాలంటూ చెప్పటం ప్రారంభిస్తే, ఒకటొకటిగా అన్నీ బయటపడతాయని, పొద్దున్నించి ఎవరెన్నిరకాలుగా అడిగినా నేను బయటి తిండి అస్సలు తిననే తినలేదనీ.. తల్లితోడనీ, సరస్వత్తోడనీ నొక్కి వక్కాణిస్తున్నాను.

ఇప్పుడీ వైద్యులవారి వాలకం.. ఆయన లాల్చీ, బొట్టు, పెద్దమనిషి తరహా చూస్తుంటే.. పిల్లలు అబద్దాలు చెబ్తారనీ, అంచేత వాళ్ళని ప్రశ్నలతో వేధించకుండా బుద్ధిగా వైద్యం చేసుకోవాలనే తెలివి వున్నవాడిగా అనిపించట్లేదు. అంచేత - ఇప్పుడు నేను నా తిండి విషయం చెప్పకపోయినట్లయితే, ఇంకేదో మందు ఇచ్చేట్టున్నాడు.

వైద్యులకి రోగలక్షణాలన్నీ చెబితేనే అంతంత మాత్రం వైద్యం చేస్తున్నారు, అట్లాంటిది వాళ్ళని తప్పుదోవ పట్టిస్తే ఇంకే వైద్యం చేస్తారో గదా! అప్పుడు అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. కావున ఒట్టుతీసి గట్టుమీద పెట్టి.. నంగినంగిగా, నసుగుతూ పీచు మిఠాయి, కలరు డ్రింకు రహస్యాన్ని బయటపెట్టాను. నా వెనక నించుని కోపంతో బుసలు కొడుతున్న నాన్నని ఓరగా గమనించాను. ఇప్పుడు నాకు నా రోగిష్టి పొట్టని రక్షించుకోవడమే ప్రధమ కర్తవ్యం. కావున నాన్నకోపం నాకేమంత భయం కలిగించలేదు. 

వైద్యులవారు అర్ధమయ్యిందన్నట్లు తల పంకించారు.

"శివుడూ!" అంటూ పిలిచారు.

శివుడు అనబడే శాల్తీ అప్పటిదాకా గది గుమ్మానికి బల్లిలాగా వేళ్ళాడుతున్నాడు. ముతక పంచె, ఖద్దరు బనీను, స్కేలు బద్దలా పల్చగా ఉన్న ఆవ్యక్తి.. నాకెందుకో ప్రాణమున్న జీవిలా అనిపించలేదు. ఆ గదిలోని బల్ల, కుర్చీ, పటాల్లో ఒకడిగా అగుపించాడు. శివుడికి డాక్టరుగారు ఏదోమందు పేరు చెప్పారు. శివుడు యాంత్రికంగా పక్కగది లోపలికెళ్ళి రెండునిమిషాల్లో ఒక చిన్నపొట్లంతో వచ్చాడు. డాక్టరుగారు పొట్లం విప్పారు. అందులో అచ్చు మిరియాల గింజల్లా ఆరేడు గుళికలు ఉన్నయ్. 

"నోరు తెరు." అంటూ రెండు గుళికలు నానోట్లో వేశారు వైద్యులవారు.

గుళికలు వగరుగా, చేదుగా ఉన్నయ్.

"ఒకగంటలో తగ్గిపోవాలి, తగ్గకపొతే గంట తరవాత ఇంకోరెండు. మజ్జిగన్నం తప్పించి ఏమీ పెట్టొద్దు." అని ఆ పొట్లం నాన్న చేతికిచ్చారు. 

ఇంటికొచ్చే దారంతా నాన్న తిట్లతో నిండిపోయింది.

"దొంగగాడిద కొడకా (కోపంలో నాన్న తననితనే తిట్టుకుంటున్నాడు)! ఈసారి ఐదుపైసలంటూ అడుగు, తాట తీస్తా!" అంటూ తిట్లతో సరిపుచ్చాడు, తన్నలేదు. అమ్మయ్య! నా రోగిష్టి స్టేటస్ నన్ను తన్నుల బారినుండి రక్షించింది.

వైద్యులవారి గుళికలు ఇంటికి చేరుకునేలోపే గుణం చూపించనారంభించాయి. ఉదయం నుండి కడుపులో వస్తున్న రణగొణ ధ్వనులకి తెర పడింది, కొంతసేపటికి వికారం తగ్గిపోయింది, ఇంకొంతసేపటికి ఆకలి కూడా వెయ్యనారంభించింది.

వంటింట్లో అక్క భోంచేస్తుంది. అక్క కంచంలో నాకిష్టమైన దోసకాయ పప్పు, వంకాయ కూర! నాకు ఏడుపొచ్చింది, తరవాత భలే కోపమొచ్చింది. అసలు నాకు రోగమొచ్చినప్పుడు నాకిష్టమైన కూరలు వండటం ఎంతన్యాయం! ఎంత దుర్మార్గం! అన్నం తింటున్న అక్కకేసి కొంచెంసేపు కుక్కచూపులు చూస్తూ కూర్చున్నాను. ఇంక తట్టుకోవటం నా వల్లకాలేదు.

"అమ్మా! ఆకలేస్తుంది. నాక్కూడా పప్పు, వంకాయ కూర." అంటూ వంటింట్లో అక్క పక్కనే పీటేసుక్కూర్చున్నాను.

"విరోచానాలకి పత్యం చెయ్యాలిరా, మజ్జిగన్నం తిను." అంది అమ్మ.

"లేదమ్మా! పత్యం అవసరం లేదుట. డాక్టరుగారు అన్నీ తినొచ్చని చెప్పారు. ఒట్టు, దేవుడితోడు." అన్నాను, అమ్మ నమ్మింది (ఏవిఁటో - ఈ ఒట్లు, ప్రమాణాలు నేను తప్పితే అందరూ నమ్ముతారు)! ఆపై - నాసామిరంగా! దోసకాయ పప్పు, వంకాయకూరతో ఒక పట్టుపట్టాను. కొద్దిసేపటికి నీరసం కూడా తగ్గిపోయింది. 

అటుతరవాత రోగం సంగతే మర్చిపొయ్యాను. యధావిధిగా ముప్పొద్దులా పూర్ణకుంభాలు లాగిస్తూ పరీక్షలు రాశాను. మూడ్రోజులు ఇట్టే గడిచిపొయ్యాయి. క్రమేపి నాపొట్ట ఉబ్బుతూ, అనతికాలంలోనే గుమ్మడికాయ పరిమాణం పొందింది. నిండుగర్భిణీ వలె రొప్పుతూ, ఆపసోపాలు పడసాగాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, గత కొన్నిరోజులుగా నాకు ప్రకృతి నుండి పిలుపు రాలేదు. పొట్టలోకి లోడింగ్ చేస్తున్నానే గాని, అన్‌లోడింగ్ చెయ్యట్లేదు. కారణమేమి చెప్మా? ఓ! అర్ధమైంది, ఇదంతా వైద్యులవారి గుళికల మహిమ. విరోచనాలు కట్టించమంటే అసలు విరోచనమే లేకుండా చేసేశారు!

నా సంకటస్థితిని అమ్మానాన్నలకి చెప్పాను. నాన్న 'శిష్ట్లావారి దగ్గరికి పద' అనంగాన్లే వణుకు పుట్టింది. ఆయన వైద్యం అతివృష్టి, అనావృష్టి టైపేమేమో అని ఓ తీవ్రమైన అనుమానం. ఈసారి మందుగుళికలకి మళ్ళీ వరదలోస్తాయేమో! ఆ నీరసాన్ని భరించడం నావల్ల కాదు, కానీ వెళ్ళక తప్పేట్టు లేదు.

మిత్రులారా! ఆరోజుల్లో నాన్నలు ఈరోజుల డాడీల్లాగా డెమాక్రటిగ్గా ఉండేవాళ్ళు కాదు. వారు చండశాసనులు, పిల్లల హక్కుల్ని నల్లుల్లా నలిపేసే విలన్లు. బెట్టుచేస్తే బాది పడేసేవాళ్ళు, మొండికేస్తే మాడు పగలకొట్టేవాళ్ళు. అమ్మలు మనకి  మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళే గానీ, ఫిజికల్ సపోర్ట్ (అనగా తన్నకుండా అడ్డు పడటం) ఇచ్చేవాళ్ళు కాదు. మహా ఐతే తన్నుల సెషన్ అయిన తరవాత రాజకీయ నాయకుల్లా నాన్న తన్నుల్ని ఖండిస్తారు, అంతే!

బాలల హక్కుల ఉల్లంఘనలో ఘనత వహించిన నా తండ్రి మాట విననిచో, కలుగు విపరిణామములు నాకు అనుభవ పూర్వకముగా తెలియును. కావున నోరు మూసుకుని నా నిర్దయ తండ్రితో వైద్యులవారి వద్దకేగితిని. వారు నన్ను (మళ్ళీ) గంభీరంగా చూశారు. నాన్న నా కొత్తకష్టం చెప్పాడు, ఆయన నా గుమ్మడికాయ బోజ్జని నొక్కినొక్కి చూశారు. 

"పత్యం చెయ్యలేదా?" సూటిగా చూస్తూ అడిగారు.

హతవిధీ! మళ్ళీ క్లిష్టపరిస్థితి. ఈయన నాతో రహస్యాలు కక్కించిగానీ యే వైద్యం చెయ్యడేమో!

"లేదు." నంగిగా నసిగాను.

"శివుడూ!"

స్కేలుబద్ద శివుడు మళ్ళీ రంగంలోకి వచ్చాడు. లోపలి గదిలోకెళ్ళి యేదో పొట్లం తెచ్చాడు. ఈసారి నా నోట్లో ఒక గుళిక మాత్రమే వెయ్యబడింది. ఈ గుళిక అత్యంత తీవ్రమైన చదుగా వుంది. 

"ఇవ్వాళ చారన్నం తప్పించి ఇంకేం పెట్టొద్దు." ఆదేశాలు జారీ చెయ్యబడ్డాయ్.

అటు తరవాత రాయడానికి పెద్దగా ఏమీలేదు. ఈసారి నాన్న నన్ను పెద్దగా తిట్టలేదు, కాకపొతే వీపుమీద విమానం మరియూ హెలికాప్టర్ మోతలు మోగించాడంతే!

ఇంటికొచ్చిన కొద్దిసేపటికే ప్రకృతి పులకించింది. నాకు సుఖప్రసవం అయ్యింది, సంచి ఝాఢించింది. గుమ్మడికాయ ఖాళీ అయ్యి గాలితీసిన బెలూన్లా అయిపొయింది. 'లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్' అని ఎందుకంటారో అర్ధమైంది.

అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఊపిరి పోసుకున్నట్లుగా అనిపించింది. అప్రయత్నంగా భక్తప్రహ్లాద సినిమాలో మంగళంపల్లి మేఘాల్లో తేలియాడుతూ పాడిన 'ఆదియూ అంతము నీవే దేవా' అనే పాట నోట్లోంచి తన్నుకుంటూ వచ్చింది. నారదుడికి అంత ఆనందం ఎందుకో కూడా అర్ధమైంది.

బుద్ధి ఉన్నవాడెవడూ జన్మలో మళ్ళీ పీచుమిఠాయిలు, కలరు డ్రింకులు తాగడు, తాగకూడదు కూడా. కానీ - నాకు బుద్ధి లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఒకసారి జైలుకెళ్తే జైలన్నా, పోలీసులన్నా భయం పోతుందిట. అట్లే - కడుపుని ఎంత ఛండాలం చేసుకున్నా, తగ్గించడానికి వైద్యులవారున్నార్లెమ్మని భరోసా వచ్చేసింది. ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అయ్యింది.

నా ప్రస్థానం పీచుమిఠాయి, కలరు సోడాల్ని దాటుకుని బజ్జీమసాల, ముంతకింద పప్పుల మీదుగా కారం రాసిన మామిడి ముక్కలు, తాటిచాప, జీళ్ళు, పప్పుచెక్కల దాకా కొనసాగింది. నాకు బూతదయ మెండు, స్నేహశీలిని కూడా. అందుకే - ఈ పదార్ధాలపై వాలే ఈగల్ని నా సహచరులుగానూ, నా సహపంక్తిదారులుగానూ భావించాను!

ఇవ్విధముగా నానావిధములైన శ్రేష్టము మరియూ బలవర్ధకమైన పదార్ధాలతో ఆహార నియమాల్ని శుచిగా పాటిస్తూ, బ్రతుకు నిచ్చెనమెట్లు ఒకటొకటిగా ఎక్కుతూ, ఇదిగో - ఇవ్వాళ ఈ స్థాయికి చేరుకున్నాను!