Saturday 4 February 2012

కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం

"కా.. కా.. " ఒక కుర్రకాకి ఆవేశంగా నృత్యం చేస్తుంది.

ఆ శబ్దానికి ఆ పక్కనే వున్న చెట్టుతొర్రలో నిద్రోతున్న కాకికి నిద్రాభంగం అయింది. ఆ కాకి ముసల్ది. పైగా దానికి షుగరు, బిపి. ఆ రోగిష్టి ముసలికాకి కుర్రకాకిని మందలిస్తూ "కా.. కా.. " అని అరిచింది.

లిపి లేని ఈ కాకుల 'కా' భాష మీకు తెలీదు కావున మీ కోసం 'కా' భాషని అనువదిస్తూ - ఇది స్వేచ్చానువాదం అని మనవి చేసుకుంటున్నాను. 

అది ఖమ్మం పట్టణం, సిపియం రాష్ట్రమహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా పట్టణం నెత్తురుగడ్డయిపోయింది. వీధులన్నీ ఎర్రరంగులోకి మారిపోయాయి. నాయకుల ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా విన్నది ఒక కుర్రకాకి. నేతల ప్రసంగాలకి ఉర్రూతలూగిపోయింది, ఉద్రేకపడిపోసాగింది.

"విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్." అని అరుస్తూ గద్దర్ స్టైల్లో డ్యాన్స్ ప్రారంభించింది.

ముసలికాకి కుర్రకాకికి వరసకి తాతవుతాడు.

"ఒరే మనవడా! ఆగాగు, యాభయ్యేళ్ళ క్రితం నేనూ నీలాగే డ్యాన్స్ చేశా. అప్పుడు మహానాయకులైన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరి - చూస్తేనే వొళ్ళు పొంగిపోయేది. ఆరోజుల్లో ఎర్రరంగంటే ప్రభుత్వాలు గజగజలాడేవి. అప్పట్నించి డాన్స్ చేస్తూనే ఉన్నా. డాన్స్ చేసీచేసీ కీళ్ళనొప్పులు మాత్రం మిగిలాయి. అవే ఉపన్యాసాలు, వినీవినీ చెవుల్లోంచి నెత్తురొచ్చింది. కానీ వీళ్ళు చెబ్తున్న విప్లవం మాత్రం రావట్లేదు." అంటూ 'కా.. కా..' అని దగ్గాడు ముసలికాకి.

కుర్రకాకికి  చిర్రెత్తింది.

"తాతా! నువ్వు పెసిమిస్టువి. ఆ ఎర్రచొక్కాలు చూడు, ఆ చిందులు చూడు. ఆ వేలమంది కార్యకర్తల్ని చూస్తే 'ఉందిలే మంచికాలం ముందుముందునా' అనిపిస్తుంది." అంటూ మళ్ళీ గంతులెయ్యడం మొదలెట్టింది కుర్రకాకి. 

"మనవడా! ఈ పార్టీకి ఈ ఎర్రచొక్కా వాళ్ళు మాత్రమే ఓటర్లు. వీళ్ళే పాడతారు, ఆడతారు. వొక్కోటు కూడా బయట్నుండి పడదు. చారిత్రక తప్పిదాలు చెయ్యటం వీళ్ళకి ఫేషన్. వీళ్ళు బయటకి ఎర్రచొక్కా వేసుకున్నా, లోపల హృదయం మాత్రం పచ్చటి పసుపు."

"నువ్వు కాంగ్రెస్ పార్టీవాడివి. నువ్వు చెప్పేది నేన్నమ్మను. ఉభయ కమ్యూనిస్టులు కలిసి ప్రభంజనం సృష్టించబోతున్నారు."

"కమ్యూనిస్టు పార్టీలు కలవబోతున్నాయా!" అంటూ బోసినోరుతో భళ్లున నవ్వింది ముసలికాకి. కుర్రకాకిని జాలిగా చూస్తూ -

"ఒరే కుర్రఅజ్ఞాని! విను. ఈ కమ్యూనిస్టు పార్టీలకి మునిశాపం వుంది, ఎలక్షన్లలో సీట్లు సర్దుబాటు కాకూడదని! మంగళగిరి అసెంబ్లీ స్థానం, ఖమ్మం పార్లమెంట్ స్థానం వీళ్ళకి రణస్థలం. ఈ రెండు నియోజక వర్గాల్లో గెలుపు అనేది వీళ్ళ లక్ష్యం కాదు. ఒకళ్ళనొకళ్ళు ఓడించుకోవటమే వీరి ఆశయం. ఓడిన తరవాత ఎవరికెక్కువ ఓట్లొచ్చాయో లెక్కలేసుకుని ఊరేగింపులు తీస్తారు! వీళ్ళ సంగతి బాగా గ్రహించిన మిగిలిన పార్టీలు వీళ్ళనసలు పట్టించుకోవటమే మానేశారు."

కుర్రకాకి బాగా డీలా పడింది.

ఇప్పటికే ఎక్కువ మాట్లాడిన రోగిష్టి ముసలికాకి రొప్పసాగింది.

"మనవడా! నాకు కొమ్మ పొమ్మంటుంది, చెట్టు రమ్మంటుంది. నాలిక రుచి చచ్చింది. మటన్ మస్తాన్ దగ్గరకెళ్ళి నే చెప్పానని చెప్పి ఒక మెత్తటి మాంసం ముక్క పట్రా." అంటూ నీరసంగా కళ్ళు మూసుకుంది.

దానికి ప్రతిగా కుర్రకాకి ఏదో అంటుంది.... 

కానీ - ఇప్పటికే చాలా రాశాను, ఇంతటితో నా 'కా భాష' అనువాదం ముగిస్తాను. ఇంకా రాస్తే నన్ను బూర్జువా అనీ, పెట్టుబడిదారుల ఏజంటనీ నాకు అర్ధం కాని గతితార్కిక భౌతిక వాద భాషలో తిడతారు.

నమస్తే! వణక్కం!!