Thursday, 16 February 2012

హుస్సేన్.. నా ప్రియనేస్తం


"మీరు.. నువ్వు.. హుస్సేన్ కదూ! నన్ను గుర్తు పట్టలేదా?" రోడ్డున వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి ఉత్సాహంగా అడిగాను.

ఎర్రగా, పొడుగ్గా, బక్కపల్చటి ఆకారం. మాసిన గడ్డం, నలిగిన చొక్కా, వెలసిన లుంగీ. నిర్వేదంగా, నిరాశగా, నిర్లిప్తంగా నాకేసి చూశాడు. అతని కళ్ళలో జీవం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ తనే అనుభవిస్తున్నట్లున్నాడు. 

"మిమ్మల్నెలా మర్చిపోతాను?" అన్నాడు.

"హుస్సేన్! నన్ను మీరు అంటున్నావేమిటి! ఇవ్వాళ నిన్ను వదలను. నీతో చాలా కబుర్లు పంచుకోవాలి. పద, అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం." అంటూ పక్కనే ఉన్న హోటల్లోకి దారి తీయబోయాను.

"లేదు, లేదు. ఇప్పుడు నాకు అర్జంటు పనుది. ఈసారి తప్పకుండా.. " అంటూ నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు హుస్సేన్.. నా ప్రియనేస్తం.


హుస్సేన్, నేను మూడోక్లాస్ దాకా కలిసి చదువుకున్నాం. పరీక్షల్లో హుస్సేన్ది ఎప్పుడూ ప్రధమ స్థానమే. ఆ ప్రధమ స్థానానికి, రెండో స్థానానికి మధ్య బోలెడన్ని మార్కుల అంతరం. ఆ రెండో స్థానం కోసం నాకూ, బాబ్జీకీ మధ్య తీవ్రమైన పోటీ. ఈ పోటీ కారణంగా బాబ్జికి నాకు పడేది కాదు. హుస్సేన్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ బాయ్. ఎర్రగా, సన్నగా ఉండేవాడు. లూజు నిక్కరు, నలిగిపోయిన చొక్కా. అల్లరికి ఆమడ దూరం. తక్కువ మాట్లాడేవాడు, అడిగినదానికి సమాధానం చెప్పేవాడు, అంతే.

కొద్దికాలంలోనే నేనూ, హుస్సేన్ మంచి స్నేహితులమైపోయాము. హుస్సేన్ పెన్సిల్ ఎప్పుడూ అంగుళానికి మించి వుండేది కాదు. నా పెన్సిల్ హుస్సేన్ కి ఇచ్చేవాణ్ని. ఇంట్లో పెన్సిల్ పోయిందని అబద్దం చెప్పి, కొత్తపెన్సిల్ కొనుక్కునేవాణ్ని. హుస్సేన్ దగ్గర అన్ని సబ్జక్టులకి పుస్తకాలు వుండేవి కావు. నా టెక్స్ట్‌బుక్స్ హుస్సేన్‌తో పంచుకునేవాణ్ణి. హుస్సేన్ నాకు చదువులో ఎంతో సహాయం చేసేవాడు. 

మా స్కూలు పక్కనే ఒక ఆఫీసు, ఆఫీసు వెనక విశాలమైన ఖాళీ స్థలం. ఆ స్థలంలో ఒక బిల్డింగ్ మొదలు బెట్టి.. పిల్లర్స్, స్లాబ్ వేసి వదిలేసారు. ఆ వదిలేసిన కట్టడమే హుస్సేన్ ఇల్లు. చుట్టూతా గోనెపట్టాలతో కుట్టిన పరదాలు. ఒక మూలగా మూడు రాళ్ళు. ఆ రాళ్ళ మీద మసిబారిన గిన్నె, పొయ్యిలో మంట కోసం పుల్లలు, చిన్న కిరసనాయిలు బుడ్డి, పక్కన రెండు సత్తుప్లేట్లు. పొయ్యికి నాలుగడుగుల పక్కగా పాత రేకుపెట్టె. ఇదీ హుస్సేన్ ఇంటి ఫర్నిచర్!

రేకుపెట్టె పక్కనే ఒక చింకిచాప. ఆ చాపమీద పొద్దస్తమానం ఒక మహిళ పడుకునుండేది. మనిషి అందంగా ఉంటుంది, కానీ ఎముకల గూడుతో తెల్లగా పాలిపోయి వుంటుంది. నీరసంగా, అప్పుడప్పుడూ మూలుగుతూ ఉండేది. ఆవిడ హుస్సేన్ తల్లి. హుస్సేన్ తల్లికి టీ కాచి ఇచ్చేవాడు. ఆవిడ టీ తాగుతుంటే కాళ్ళు పట్టేవాడు. హుస్సేన్ తల్లి ఉర్దూ బాషలో ఏదో చెబుతూ ఏడుస్తుండేది. హుస్సేన్ తమ్ముడు రెండేళ్ళ క్రితం 'విష జెరం' తో చచ్చిపోయాట్ట, బహుశా చనిపోయిన కొడుకు గుర్తొచ్చి ఏడుస్తుందేమో.

హుస్సేన్ స్నేహం నాకు ఎన్నో కొత్తవిషయాలు నేర్పింది. హుస్సేన్ ఇంటి వెనక దట్టమైన తుప్పలు, పొదలు ఉండేవి. ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు కూడా ఉండేవి. హుస్సేన్ ఉసిరిచెట్టు కొమ్మల్ని బలంగా ఊపేవాడు. బోల్డన్ని ఉసిరికాయలు రాలి పడేవి. అవన్నీ ఏరి ఉప్పూ, కారం అద్దుకుని తినేవాళ్ళం. నేరేడు చెట్టెక్కి కాయలు కోసేవాడు. నేరేడుకాయల తినేప్పుడు నాలుక బయట పెట్టి ఎవరి నాలుక ఎక్కువ రంగు మారిందో చూసుకునేవాళ్ళం.

హుస్సేన్ బొంగరం ఆటలో స్పెషలిస్ట్. నాకు బొంగరం అరచేతిలో తిప్పడం నేర్పించాడు. నాకు నలికీసు పాములు, తొండలు అంటే భయం. అవికూడా మనలాంటివేనని, మనని చూసి అవే ఎక్కువ భయపడతాయని ధైర్యం చెప్పాడు. ఆ పక్క ఇంటివాళ్ళ మామిడిచెట్టుకి కాయలు విరగకాసి వేల్లాడుతూ ఉండేవి. చేయి పెడితే చాలు, కనీసం పదికాయలు అందుతాయ్. నేను ఆ మామిడి కాయలు కోసేద్దామని ఉబలాటపడేవాణ్ణి. అలా చెప్పకుండా కాయలు కొయ్యడం దొంగతనం అవుతుందని, దొంగతనం తప్పని హుస్సేన్ వారించేవాడు. నాకన్నా వయసులో కొద్దినెలలు మాత్రమే పెద్ద అయిన హుస్సేన్ నాకు గురువుగా మారిపొయ్యాడు.

మూడోక్లాసు పరీక్షలు దగ్గర పడ్డాయ్. రోజుట్లాగే హుస్సేన్, నేను నేరేడు చెట్టు కొమ్మమీద కూర్చున్నాం. నేరేడు కాయలు తింటూ, హుస్సేన్ చెబుతున్న పాఠాన్ని బద్దకంగా వింటున్నాను. హుస్సేన్ పాఠం చెప్పే విధం అద్భుతంగా వుంటుంది. ముందుగా పుస్తకంలో ఉన్నది పెద్దగా పైకి చదువుతాడు, ఆ తరవాత అర్ధాన్ని వివరిస్తాడు. నాకు ఆ వివరణ చందమామ కథలాగా ఉండేది.

హఠాత్తుగా హుస్సేన్ ఇంట్లోంచి పెద్దగా శబ్దాలు, కేకలు, అరుపులు వినిపించాయ్. హుస్సేన్ మెరుపు వేగంతో చెట్టు దిగి ఇంట్లోకి పరిగెత్తాడు. వెనకగా నేను కూడా హుస్సేన్ తో పాటు పరిగెత్తాను. ఇంట్లో దృశ్యాన్ని చూసి చలించిపోయాను. చాపమీద పడున్న హుస్సేన్ తల్లిని ఆమె భర్త ఎగిరెగిరి డొక్కల్లో తంతున్నాడు. ఆవిడ పెద్దగా ఏడుస్తుంది. ఏడుస్తూనే ఉర్దూలో అతన్ని ఏదో తిడుతుంది. ఆతను ఊగుతున్నాడు, తూగుతున్నాడు, మాటలు ముద్దగా వస్తున్నాయ్. అతను ఏదో కోపంతో భార్యని కొడుతున్నట్లుగా లేడు. భార్యని చంపేంత కసి, క్రోధం అతని కళ్ళల్లో నాకు కనిపించాయి.

పరుగున వెళ్లిన హుస్సేన్ తల్లిమీద బోర్లాపడి, ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి తన్నులు హుస్సేన్ వీపుమీద పడుతున్నయ్. ఆ తన్నుల ధాటికి బాధతో విలవిలలాడిపోతూ, తల్లికి దెబ్బలు తగలకుండా కాస్తున్నాడు. హృదయవిదారకమైన ఆ సంఘటన చూసి భయపడిపోయాను, ఏడుపొచ్చింది.

ఒక్కసారిగా ఇంటికి పరుగు తీశాను. తన్నులు తింటున్న హుస్సేన్ మొహమే కళ్ళ ముందు కదులాడుతుంది. నేనెప్పుడూ ఒకమనిషి ఇంకోమనిషిని అంత దారుణంగా కొట్టటం చూళ్ళేదు. తండ్రి తన్నుల ధాటికి అసలే బక్కగా, పీలగా ఉన్న హుస్సేన్ చచ్చిపోతాడా? దుఖం ఆగట్లేదు. ఏడుస్తున్నాను, పరిగెత్తుతూనే ఏడుస్తున్నాను, ఏడుస్తూనే పరిగెత్తాను.

అటు తరవాత హుస్సేన్ స్కూలుకి రాలేదు. నాకు హుస్సేన్ ఇంటికి వెళ్లాలని ఆరాటంగా ఉండేది. కానీ హుస్సేన్ తండ్రి గుర్తొస్తేనే వణుకొచ్చేది. ఆ భయమే నన్ను వెళ్ళనీయలేదు. పరీక్ష ముందురోజు హుస్సేన్‌ని పరీక్షలకి రమ్మని చెప్పటానికి మా టీచర్ నలుగురు పిల్లల్ని వాళ్ళింటికి పంపించారు. వాళ్ళల్లో నేనూ ఒకడిగా బిక్కుబిక్కుమంటూ వెళ్లాను.

ఇంట్లో హుస్సేన్ లేడు, హుస్సేన్ తండ్రి కూడా లేడు. చాపమీద శవంలా పడున్న తల్లిని హుస్సేన్ గూర్చి అడిగాం. ఆవిడ లోగొంతుకతో నీరసంగా హుస్సేన్ ఏదో 'బేరం'కి వెళ్ళాడని చెప్పింది. బేరం అంటే ఏంటో మాకు అర్ధం కాలేదు. అదే ముక్కని మా టీచర్ కి చెప్పాం. ఆవిడ 'చూశారా! దేవుడు వాడికి గొప్ప తెలివితేటలిచ్చాడు, కానీ చదువుకునే అవకాశం లేకుండా చేశాడు.' అంటూ బాధపడ్డారు. ఆ తరవాత హుస్సేన్ మళ్ళీ ఎప్పుడూ స్కూలు గుమ్మం తొక్కలేదు.

ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకసారి మార్కెట్ సెంటర్లో కనిపించాడు. ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోనట్లు వెళ్లిపొయ్యాడు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు కనిపించాడు. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వకుండా హడావుడిగా వెళ్లిపొయ్యాడు.


ఈమధ్య ఒక పెళ్ళిలో కలిశాడు బాబ్జి. ఐఐటీ చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాట్ట. పక్కన పొట్టిగా, లావుగా వున్న వ్యక్తిని చూపిస్తూ - 

"ఈ శాల్తీని గుర్తుపట్ట్లేదా? మన వాసుగాడు." నవ్వుతూ అన్నాడు బాబ్జి. 

"హల్లో మైడియర్ వాసూ! వెంటనే గుర్తుపట్టనందుకు సారీ బ్రదర్!" అంటూ సంతోషంగా కౌగలించుకున్నాను. 

వాసుకి గుంటూర్లో పుస్తకాల షాపు వుందిట. నాగూర్చి వివరాలు చెప్పాను. తరవాత మా టీచర్ల గూర్చి కొంత సంభాషణ నడిచింది.

"వాసు! నీకు హుస్సేన్ ఎక్కడున్నాడో తెలుసా?" ఉన్నట్టుండి అడిగాడు బాబ్జి.

ఒక్కసారిగా వాసు మొహం మారిపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ -

"లేదు. మన మూడోక్లాసు పరీక్షలప్పుడే హుస్సేన్ తండ్రి యెటో వెళ్లి పొయ్యాడు. పాపం! ఆ వయసులో తల్లిని  పోషించాటానికి నానా తిప్పలు పడ్డాడు హుస్సైన్. అరటి కాయలు అమ్మాడు, సున్నం బొచ్చెలు మోశాడు. కొన్నాళ్ళకి తల్లీకొడుకుల్ని బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయించాడు, తల్లిని తీసుకుని ఎక్కడికెళ్ళాడో! ఆమధ్య సత్తెనపల్లిలో ఫుట్‌పాత్ మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటే చూశానని మా తమ్ముడన్నాడు, నాకయితే తెలీదు." అన్నాడు వాసు.

"పాపం! హుస్సేన్." అన్నాడు బాబ్జి.

"హుస్సేన్ చదువులో మీఇద్దరికన్నా ముందుండేవాడు, వాడే గనక చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేవాడు కదూ." నెమ్మదిగా అన్నాడు వాసు.

"అవును వాసు! నువ్వు చెప్పింది నిజం. హుస్సేన్ గుర్తొచ్చినప్పుడల్లా నాకూ అదే అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి గిల్టీగా కూడా ఉంటుంది. ఇదంతా హుస్సేన్ కే చెప్పాలనిపిస్తుంది. కానీ హుస్సేన్ ఎందుకో నన్ను ఎవాయిడ్ చేస్తున్నాడు బాబ్జి." అన్నాను.

బాబ్జి ఒక్కక్షణం ఆలోచించాడు.

"నువ్వూ, వాసు కేవలం అతని చదువు గూర్చే మాట్లాడుతున్నారు, కానీ చదువొక్కటే జీవితం కాదు గదా. ఇంటర్తో చదువాపేసిన వాసు కూడా హాపీగానే ఉన్నాడు. కానీ నా బాధల్లా హుస్సేన్ బాల్యం గూర్చే. అతని బాల్యం చాలా ఘోరంగా చిదిమెయ్యబడింది. తండ్రి చేసిన తప్పులకి హుస్సేన్ జీవితం బలైపోయింది, సో సాడ్. అన్నివిధాలా అర్హత వుండికూడా, జీవితంలో ఏ అవకాశం లేకుండా చేసిన సమాజం పట్ల ద్వేషం పెంచుకున్నాడేమో. హుస్సేన్ నిన్నెందుకు ఎవాయిడ్ చేస్తున్నాడో నేనర్ధం చేసుకోగలను." అన్నాడు బాబ్జి.

ఇంటికి వస్తూ బాబ్జి చెప్పిన పాయింట్ ఆలోచించాను.

హుస్సేన్ ఆలోచనలు కూడా బాబ్జి చెప్పినట్లే ఉన్నాయా? మా అందరికన్నా తెలివైనవాడై ఉండికూడా ఎన్నో బాధలు పడ్డాడు. తనకి జరిగిన అన్యాయానికి ఈ సమాజం పట్ల ఏహ్యభావం ఏర్పర్చుకున్నాడా? నేనూ ఆ సమాజంలో భాగాన్నే కదా. అందుకనే నాతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదా? నా శుష్కవచనాలు హుస్సేన్‌కి సంతోషం కలిగించకపోవచ్చు. పైగా చికాకు, కోపం తెప్పించవచ్చునేమో కూడా.

చదువు నాకు సమాజంలో ఉన్నత స్థాయిని ఇచ్చింది. నా జీవితం సంతోషమయం. ఇప్పుడు నాకు నా చిన్ననాటి స్నేహితులతో అలనాటి మధుర క్షణాలు నెమరువేసుకోవడం హాయినివ్వవచ్చు. కానీ - హుస్సేన్ కి మానిన గాయం మళ్ళీ రేపినట్లు అవ్వచ్చు. కడుపు నిండినవాడు ఆహ్లాదంగా, సరదాగా కబుర్లు చెప్పగలడు. కానీ నాతో కబుర్లు పంచుకోవటానికి హుస్సేన్‌లో కొద్దిపాటి ఆనందం అయినా మిగిలుండాలి గదా. అసలంత విశాల హృదయం హుస్సేన్‌కి ఎందుకుండాలి?

నేను హుస్సేన్ నా ప్రియనేస్తం అనుకున్నాను. కానీ హుస్సేన్‌ని బాబ్జిలాగా అర్ధం చేసుకోలేకపోయాను. అందుకే, ఇప్పుడు హుస్సేన్ గూర్చి వాకబు చెయ్యడం మానుకున్నాను.  

(picture courtesy : Google)