Friday 2 November 2012

గురజాడ మహాశయా! మీకు ప్రమోషనొచ్చింది


మనుషులు రెండురకాలు - ఆడ, మగ. సినిమాలు రెండురకాలు - మంచిసినిమా, చెత్తసినిమా. అలాగే వేడుకలు రెండురకాలు - ఒకటి అధికారికం, మరోటి అనధికారం. అనగా ప్రభుత్వ లాంచనాలతో, అధికార దర్పంతో జరపబడేది అధికారిక వేడుక. ప్రభుత్వ ప్రమేయం లేకుండా డబ్బుగలవారి వితరణతో అట్టహాసంగా జరపబడేది అనధికార వేడుక.

ఉదాహరణకి ఉగాదినే తీసుకుందాం. ప్రభుత్వం ఉగాదినాడు 'అధికారయుతం'గా పంచాంగ పఠనం ఏర్పాటుచేస్తుంది. ఆ పంచాంగం వింటుంటే అప్పుడెప్పుడో లక్ష్మణకుమారుడు పాడిన 'సుందరి నీవంటి దివ్యస్వరూపము ఎందెందు వెదకిన లేదుకదా!' అనేపాట గుర్తొస్తుంది. రాజకీయపార్టీలు వారి పార్టీఆఫీసుల్లో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసుకుంటాయి. ఇది అనధికారిక కార్యక్రమం. ఆయా ఆఫీసుల్లో అన్ని రాజకీయ పక్షాలకి 'ఉందిలే మంచికాలం ముందుముందునా!' అంటూ శ్రవణకర్త అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు.

'అధికారిక కార్యక్రమం' అంటే నా ఈడువారికి వెంటనే గుర్తొచ్చేది గాంధీ జయంతి. మర్చిపోవటానికి అదేమన్నా సాదాసీదా బాదుడా! ఆ సందర్భంగా ఊళ్ళో మునిసిపల్ స్కూళ్ళు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ పిల్లల్ని ఉదయం నుండి గంటల తరబడి మండుటెండలో, ఓపెన్‌గ్రౌండ్‌లో కూర్చోబెడతారు. మంత్రిగారు తాపీగా వచ్చి గాంధీజయంతి సందర్భాన జాతికి పునరంకితమవుతానని ప్రకటించుకుంటారు.

పాపం! గాంధీ ఎవరో తెలీని ఆ పిల్లలు ఎండకి సొమ్మసిల్లి, విలవిలలాడిపోతారు. అంతేనా? ఆరోజు మాంసాహారం దొరకదు, బ్రాందీ విస్కీలు అసలే దొరకవు. ఆ ఒక్కరోజూ అవి ముట్టినవాడు మహాపాపి! అందుకే ఆరోజు టీవీ చానెల్‌వాడు ఈ ఏక్ దిన్ కా పాపుల్ని పట్టే పనిలో బిజీగా వుంటాడు!

'కళాబంధు' స్పూర్తిగా ఇప్పుడు వీరకళోద్ధారకులు ఎకాడెమీలు  ఏర్పాటు చేస్తున్నారు. తమ కళాతృష్ణ తీర్చుకోవటానికి పొగాకు కంపెనీలు, పత్తి వ్యాపారస్తులు, మిర్చి కమిషన్  ఏజంట్లు, క్వారీ యజమానులు, బెల్ట్ షాపుల నిర్వాహకుల చందాలతో (దీన్నే 'స్పాన్సర్‌షిప్' అనికూడా అంటారు) అవార్డు ప్రదానోత్సవం అంటూ ఒక రియాలిటీ షో నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్నవారిని పిలిచి 'సావిత్రి అవార్డు', 'ఘంటసాల అవార్డు' అంటూ సత్కరిస్తారు. ఇదో ప్రొఫెషన్ అంటాడు మా సుబ్బు. మంచిదే కదా! కూటికోసం కోటివిద్యలు.

కొంతకాలంగా పాతతరం రచయితలు, కళాకారుల్ని గుర్తు చేసుకోవడం ఒక తంతుగా జరపబడుతుంది. అందుకోసం జయంతులు, వర్ధంతులు మంచి అవకాశం. అసలు ఈ పుట్టిన్రోజులు, చచ్చిన్రోజుల గోల నాకు చికాకుని కలిగిస్తుంది. ఈ రెండ్రోజులు హడావుడి చేస్తే.. మిగిలిన అన్ని రోజులూ వీరిని మర్చిపోవడానికి పాస్‌పోర్ట్ లభించినట్లేమో!

ఎప్పుడో చనిపోయిన ఈ కవులు, కళాకారుల పేరిట ప్రస్తుతం జరపబడుతున్న హడావుడిని బట్టి స్థూలంగా మూడు తరగతులుగా విభజించుకోవచ్చు. అందరికన్నా దిగువున జనతా కేటగిరీ కవులు. వీరికోసం ఆరోజున పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. అంతే, ఇంకేమీ ఉండదు. వీరికన్నా పైస్థాయి డీలక్స్ కేటగిరీ. వీళ్ళు ప్రముఖులేగానీ, ప్రభుత్వ గుర్తింపు ఉండదు. వీరు అనధికార ఫ్రొఫెషనల్ సంస్థల కార్యక్రమాలకి పెన్నిధి. అత్యున్నతమైనది డీలక్స్ కేటగిరీ. వీరు ప్రభుత్వ అధికార లాంచనాల్నీ, కార్యక్రమాల్ని అందుకుంటారు.

కాలానుగుణంగా మారుతున్న రాజకీయ అవసరాలననుసరించి జనతాక్లాస్ కవి డీలక్స్ స్థాయికి ఎగబాకుతాడు. డీలక్స్‌ని సూపర్ డీలక్స్‌కి పంపాలని తెలుగుభాషా సేవకులు లాబీయింగ్ చేస్తుంటారు. ఇందులో కులాలు, ప్రాంతాలు గణనీయపాత్ర పోషిస్తుంటాయి. తెరవెనుక కాంగ్రెస్పార్టీ మార్కు రాజకీయాలు కూడా జరపబడతాయి.

క్రికెట్ ఆటలో వందపరుగులు చేస్తే సెంచరీ సాధించాడంటారు. ఆ ఆటగాడికి ఇదో గొప్ప ఎచీవ్‌మెంట్. ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొడతారు. ఇప్పుడిది సాహిత్యంలో కూడా వచ్చేసింది. నాకైతే ఈ వంద సంఖ్యకున్న పవిత్రత ఏమిటో అర్ధం కాదు. తొంభైతొమ్మిది సంఖ్య ఎందుకంత పనికిరానిదై పోయిందో కూడా తెలీదు.

ఇవ్వాళ నేనుతిన్న మసాలాదోశకి కూడా వందేళ్ళ తరవాత వందేళ్ళు నిండుతాయి గదా! మరప్పుడు ఈ నూరేళ్ళ ఆబ్సెషన్ ఎందుకు? ఇదొక మార్కెటింగ్ టెక్నిక్కా? అప్పటిదాకా ప్రశాంతంగా వాయించబడే మేళతాళాలు తాళికట్టే సమయయానికి కొంపలు మునిగిపోయే హడావుడి చేసినట్లు.. ఈ రచయితల వందో సంవత్సర హడావుడి మేళాలు వినలేకపోతున్నాను.

ఈ వందేళ్ళ జయంతులు, వర్ధంతులు పురస్కరించుకుని పుణ్యజీవులకి ధన్యజీవులుగా ప్రమోషన్ కల్పించబడుతుంది. విప్లవకవి శ్రీశ్రీని అభ్యదయకవిగా మార్చేసి సిపియంవారు తమ ఖాతాలోకి వేసేసుకున్నారు (మతమార్పిడి పీడనకు చచ్చినవారు కూడా అతీతులు కారు). రేపు శ్రీశ్రీ భావకవిగా మార్చబడి ప్రభుత్వం ఖాతాలోకి కూడా నెట్టబడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎల్లుండి చెగువేరాలాగా టీషర్టుల మీద దర్శనమిస్తూ ఒక ఫేషన్ ఐకాన్ అయిపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరంలేదు.

ఇప్పుడు గురజాడకి ప్రభుత్వం ప్రమోషనిచ్చింది. ఆయన జయంతి ప్రభుత్వం అధికారయుతంగా జరిపిస్తుందట! అనగా కొన్ని కోట్లరూపాయిలు బజెట్ విడుదలవుతుంది. ఇక గురజాడకి డిజైనర్ షర్టులు, షేర్వానీలు వేసేస్తారు. అమెరికా తెలుగుసంఘాలకి ప్రీతిపాత్రుడైపోతాడు (ఎచట డబ్బు ఉండునో అచట కళలు పోషించబడును). సందుగొందుల్లో కంచువిగ్రహాలు ప్రతిష్టిస్తారు.

వచ్చీరాని తెలుగులో గౌరవ ముఖ్యమంత్రిగారు మనకి గురజాడవారి గొప్పదనాన్ని వివరిస్తారు. తదుపరి కళాకారులు 'కన్యాశుల్కం' ప్రదర్శిస్తారు. ప్రభుత్వ కనుసన్నల్లో మెలిగే కవులు, కళాకారులు ఘనంగా సత్కరింపబడతారు. ఇట్లా నిధులు ఖర్చయ్యేదాకా అనేకానేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రమేణా గురజాడ దేవుడైపోతాడు. ఆయన రచనల మంచిచెడ్డలు చర్చించబూనడం దైవదూషణ అయిపోతుంది. ఆవిధంగా అధికారయుతంగా గురజాడ సాహిత్యం.. తద్వారా తెలుగుభాష ఉద్దరింపబడుతుంది!
                                 
అసలు రచయితల్ని పురస్కరించటం అంటే ఏమిటి? శిలావిగ్రహాలు ఏర్పాటు చెయ్యటమెందుకు? 'మహాప్రస్థానం' చదవకుండా శ్రీశ్రీకీ, 'కన్యాశుల్కం' తెలీకుండా గురజాడకి అర్పించే నివాళి యేమి!? నాకు ఈ హడావుడి చూస్తుంటే  చిన్నప్పడు చదివిన భమిడిపాటి రాధాకృష్ణ 'కీర్తిశేషులు' నాటకం గుర్తొస్తుంది.

ఒక కవి పేదరికంలో మగ్గిపోతుంటాడు. చచ్చిపోయాడని పుకారు పుడుతుంది. కవిగా ఆయనేం రాశాడో ఆ ఊరివారికి తెలీదు. అయితే ఆయనకి శిలావిగ్రహం కట్టించాలని ఊళ్ళో 'పెద్దమనుషులు' చందాలు పోగేస్తారు. ఇంతకీ - ఆ కవి చావడు. ఏదోరోగం నుండి 'చచ్చి' బ్రతుకుతాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దమనుషులు ఆందోళనకి గురవుతారు. వసూలు చేసిన చందాలు తిరిగివ్వడానికి మనసొప్పదు. అంచేత ఆ కవి చావాల్సిందేనని ఒత్తిడి చేస్తారు. నాకు గుర్తున్నమటుకు 'కీర్తిశేషులు' కథ ఇది. గురుదత్ కూడాఈ సబ్జక్టుతో ఓ సినిమా తీశాడు.

ఒక కవికి నిజమైన నివాళి ఏమిటి? ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ, జ్ఞానపీఠలు కాదు. వారి ఇలాకాల్ని సన్మానించడం అసలే కాదు. వారు చేసిన కృషి సమాజ పురోగమనానికి తోడ్పడాలి. వారి రచనలు సమాజాన్ని ప్రభావితం చెయ్యాలి, విస్తృతంగా చర్చింపబడాలి. ముఖ్యంగా యువత ఆ రచయితని ఓన్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మన యువత కులసంఘాల రాజకీయాల్లో, సినిమానటుల అభిమానంలో పీకల్లోతు మునిగిపోయి క్షణం తీరిక లేకుండా వున్నారు.

గురజాడని చదివేవాళ్ళ సంఖ్య పెరగడం అటుంచండి, తగ్గిందని అనుకుంటున్నాను. ఇవ్వాళ నూటికి తొంభైమందికి గురజాడ ఎవరో తెలీదు. కొందరైతే గురజాడ సాహిత్యాన్ని చదవకుండానే చదివామని చెప్పుకుంటారు. ఇలా క్లైం చేసుకోవడం వారికో ఓ స్టేటస్ సింబల్. ఆంధ్రదేశంలో ఒకరోజు అమ్ముడయ్యే విస్కీసీసాల సంఖ్య - గత వందేళ్ళల్లో అమ్ముడయిన 'కన్యాశుల్కం' కాపీలకన్నా ఎక్కువని అనుకుంటున్నాను. జనాలకి గురజాడ రచనలకన్నా విస్కీ నిషాలోనే మజా ఎక్కువగా ఉందేమో, మంచిదే!

(picture courtesy : Google)