Monday 5 November 2012

భానుమతి వద్దు! రాజసులోచనే ముద్దు!!


అబ్బ! బుర్ర వేడెక్కిపోయింది. భార్యాభర్తల మధ్య తగాదా కేసు. చాలా టైం పట్టింది. ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మనసంతా చికాగ్గా అయిపోతుంది. లాభం లేదు. ఒక మంచి తెలుగు సినిమా పాట చూసి రిలాక్స్ అవ్వాలి.

ఈ వేడెక్కిన బుర్రని చల్లార్చుకోడానికి నాకు యూట్యూబ్ పాత పాటలు ఎంతో ఉపయోగపడతాయి. నాకు కొత్త పాటలు తెలీదు. అంచేత పాత పాటల్లోనే తిరుగుతుంటాను.




'మనసున మల్లెలు మాలలూగెనే.. ఎంతహాయి ఈరేయి.. ఎంత మధురమీ హాయి!' మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడిన ఈపాట నాకు చాలాచాలా ఇష్టం. ఇప్పటికి వెయ్యిసార్లు విని ఉంటాను. అయినా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. ఎప్పుడువిన్నా మనసంతా హాయిగా, తేలిగ్గా అయిపోతుంది.

అంచేత ఇప్పుడు మళ్ళీ 'మనసున మల్లెలు మాలలూగెనే.. ' వినడం మొదలెట్టాను. కంప్యూటర్ మానిటర్ పై పాటని చూస్తూ తన్మయత్వం, పరవశం చెందుచుండగా..

"రవణ మావా! కాఫీ." అంటూ సుబ్బు వచ్చాడు.

శబ్దం చెయ్యొద్దన్నట్లుగా చూపుడువేలు నోటివద్ద పెట్టుకుని సైగచేస్తూ.. అరమోడ్పు కన్నులతో పాట వినడంలో పూర్తిగా మునిగిపొయ్యాను. పాట అయిపోయింది. తపస్సులోంచి అప్పుడే బయటకొచ్చిన మునివలే ఫీలయ్యాను. గదంతా నిశ్శబ్దం.. ప్రశాంతత.

"ఆహాహా ఏమి ఈ భానుమతి గానమాధుర్యము! ఒక ప్రేయసి తన ప్రియుడి కోసం ఎంత అద్భుతంగా పాడింది! ఈపాట విన్నవాడి జన్మధన్యం. విననివాడి ఖర్మం. సందేహము వలదు. ఈ భూప్రపంచంలో ఇంతకన్నా గొప్పపాట లేదు. ఇకముందు రాదు కూడా!" తన్మయత్వంతో అన్నాను.

"నేనలా అనుకోవడం లేదు." సుబ్బు గొంతు విని ఉలిక్కిపడ్డాను.

కర్కశంగా సుబ్బుని చూశాను. ఈ దరిద్రుడి వల్ల నాజీవితంలో నేనుపొందే చిన్నచిన్న ఆనందాలు కూడా కోల్పోతున్నాను. వీడు మొన్న నీలం తుఫాన్లో కొట్టుకుపొయినా బాగుండేది.

"నువ్వు కోపంతో అలా పిచ్చిచూపులు చూడనవసరం లేదు. భానుమతి పాట అద్భుతం. ఒప్పుకుంటున్నాను. కానీ నాదృష్టిలో 'సడిసేయకోగాలి.. ' ఇంతకన్నా అద్భుతం." అన్నాడు సుబ్బు.




"నువ్వు చెబుతుంది 'రాజమకుటం' పి.లీల పాడిన పాట గురించేనా? ఆపాట గూర్చి నువ్వు చెప్పేదేముంది? చాలా మంచి పాట. నాక్కూడా చాలా ఇష్టం. మాస్టర్ వేణు సంగీతం అమోఘం. కానీ ఆపాటని భానుమతి పాటతో పోలిక తేవడం నీ పూర్ టేస్ట్ సూచిస్తుంది. నా స్టేట్మెంట్ ఖండిద్దామనే దుగ్ద తప్ప నీవాదనలో పసలేదు." చికాగ్గా అన్నాను.

ఇంతలో కాఫీ వచ్చింది.

"నాది ఇంటలిజెంట్ టేస్ట్ అనుకుంటున్నాను. పూర్ టేస్ట్ ఎలానో చెబితే విని సంతోషిస్తాను." కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"మల్లీశ్వరి బి.ఎన్.రెడ్డి అద్భుతసృష్టి." అన్నాను.

"మరి రాజమకుటం ఎవరి సృష్టో!" నవ్వాడు  సుబ్బు.

"దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారిన.. "

"నా 'సడిసేయకోగాలి.. ' కూడా అక్కణ్ణుండే జాలువారింది మిత్రమా!" అందుకున్నాడు సుబ్బు.

"సరే! నీ సడిసేయకోగాలి నా మనసునమల్లెల కన్నా ఎలా ఎక్కువో నువ్వే చెప్పు. ప్రూవ్ యువర్ పాయింట్!" అన్నాను.

"అలా అడిగావ్ బాగుంది. రెండు పాటలు రాసింది కృష్ణశాస్త్రే. కానీ రాయడంలో ఎంత తేడా చూపించాడో గమనించు. మల్లీశ్వరి పాట సబ్జెక్టివ్ గా ఉంటుంది. రాణీవాసంలో మగ్గిపోతున్న మల్లి ఎంతోప్రయత్నం మీద తనబావ నాగరాజుని తుంగభద్ర ఒడ్డున కలుసుకుని.. ఆనందంతో పరవశం చెందుతూ.. తన భావాల్నికవితాత్మకంగా పాట రూపంలో వర్ణిస్తుంది. అద్భుతమైన పాటే! కానీ మనమెవరం? మగాళ్ళం. మన దృష్టికోణం మగవాడివైపు నుండి ఉండాలి." అన్నాడు సుబ్బు.


"అంటే!" ఆసక్తిగా అడిగాను.

"రాజమకుటం పాట విను. 'సడిసేయకోగాలి.. సడిసేయబోకే! బడలి ఒడిలో రాజు పవలించేనే!' ప్రియుడు అలసిసొలసి ఉన్నందున గాలిని శబ్దం చెయ్యొద్దని అడుగుతుంది. అతన్ని రారాజు, మహారాజుగా భావిస్తుంది. తనకంటూ ఏమీ కోరుకోదు. ఏమగాడికైనా కావలసింది తనకోసం వరాలు కోరుకునే నిస్వార్ధ నారీమణిగానీ, తన భావాలు అందంగా వ్యక్తీకరించే కవియిత్రి కాదు. కవిత్వం కడుపు నింపదు. అందుకే రామారావు అదృష్టానికి రాజనాల కుళ్ళుకుంటాడు." అంటూ నవ్వాడు సుబ్బు.

"నేనీ ఏంగిల్లో ఆలోచించలేదు." ఆలోచనగా అన్నాను.


"గాలికూడా శబ్దం చెయ్యరాదంటూ మనని అపురూపంగా చూసుకునే యువతి భార్యగా వస్తే ఎంత సుఖం! రోజూ గుత్తొంకాయ, దోసకాయ పప్పు చేయించుకుని కడుపునిండా భోంచెయ్యొచ్చు. ఎన్నిసార్లడిగినా విసుక్కోకుండా ఫిల్టర్ కాఫీలిస్తుంది. ఈరోజుల్లో ఎన్నిలక్షలు పోసినా ఒక్కరోజుకూడా ఇంతసుఖం దక్కదు." అన్నాడు సుబ్బు.

"భానుమతికేం తక్కువ?" నేనివ్వాళ భానుమతిని వదలదల్చుకోలేదు.

"ఏమీ తక్కువ కాదు. అన్నీ ఎక్కువే. అసలు భానుమతి, రాజసులోచన మొహాల్ని నువ్వెప్పుడన్నా పరిశీలనగా చూశావా? మనమేం చెప్పినా నమ్మేట్లుగా.. అమాయకంగా, బేలగా ఉండే రాజసులోచనతో.. తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎసెర్టివ్ గా ఉండే భానుమతిని పోల్చడానికి నీకు బుర్రెలా వచ్చింది? బుద్ధున్న ఏమగాడైనా రాజసులోచనని వదులుకుంటాడా!" అన్నాడు సుబ్బు.

"నువ్వు భానుమతిని మరీ తక్కువ చేస్తున్నావు." ఓడిపోతున్నాని తెలిసి కూడా బింకంగా అన్నాను.

"రవణ మావా! నేను భానుమతిని తక్కువ చెయ్యట్లేదు. ఆవిడొక అద్భుతనటి. బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆవిడకి శతకోటి వందనాలు. భానుమతి స్థాయి మనకన్నా లక్ష మెట్లు ఎక్కువనే చెబుతున్నాను. ఆడవారిలో తెలివి ఆటంబాంబు కన్నా ప్రమాదకరమైనది. వారికి ఎంతదూరంలో ఉంటే మనకంత మంచిది. తెలివైన యువతిని కట్టుకుని బాగుపడ్డ మగాడు చరిత్రలో లేడు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.


"నేను చరిత్ర చదువుకోలేదు సుబ్బు!" నవ్వుతూ అన్నాను.



"బి.ఎన్.రెడ్డిది కూడా నా అభిప్రాయమే! అందుకే పాటల చిత్రీకరణలో చాలా తేడా చూపాడు. 'మల్లీశ్వరి'లో భానుమతి పాట పాడినంతసేపూ రామారావు పక్కనే కూర్చునుంటాడు. పైగా భానుమతి తనమీదకి ఒరిగినప్పుడు ఆవిడ బరువు కూడా మోస్తాడు. ఎంత ఘోరం! అదే 'రాజమకుటం' పాట చూడు. హాయిగా రాజసులోచన ఒడిలో తల పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. తనకి లభించిన ఈ ప్రమోషన్ రామారావుకి కూడా సంతోషం కలిగించినట్లుంది." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.


"ఇన్నాళ్ళు భానుమతి పాటే అద్భుతమనుకున్నానే!" డిజప్పాయింటింగ్ గా అన్నాను.

వెళ్ళబోతూ ఆగి, వెనక్కితిరిగి అన్నాడు సుబ్బు.

"ఇవన్నీ పబ్లిగ్గా చెప్పే మాటలు కాదు మిత్రమా! యే అందర్ కి బాత్ హై! ఇప్పుడైనా ఎవరన్నా అడిగితే భానుమతి పాటే గొప్పని చెప్పు. లేకపోతే నిన్నో పురుష దురహంకారిగా భావించే ప్రమాదముంది. అసలే రోజులు బాలేవు!" అంటూ నిష్క్రమించాడు మా సుబ్బు.

(photos courtesy : Google)