Wednesday, 14 November 2012

గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!

                                                  - 1 -

అమ్మానాన్నలతో  సినిమాకి  రెడీ  అయిపొయ్యాను.

"అమ్మా! ఏం సినిమాకెళ్తున్నాం?"

"కన్యాశుల్కం."

"పేరేంటి అలా ఉంది! ఫైటింగులున్నాయా?"

"ఉండవు. నీకు నచ్చదేమో. పోనీ సినిమా మానేసి ఆడుకోరాదూ!"

ఫైటింగుల్లేకుండా సినిమా ఎందుకు తీస్తారో! నాకు చికాగ్గా అనిపించింది. అయితే నాకో నియమం ఉంది. సినిమా చూడ్డనికి వచ్చిన ఏ అవకాశమూ వదలరాదు. నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూసి తీరాలి. ఇది నా ప్రతిజ్ఞ!

అమ్మానాన్నల మధ్య కూర్చుని సినిమా చూశాను. సినిమా హాల్లో  అమ్మానాన్నల మధ్యసీటు కోసం నాకు అక్కతో చాలాసార్లు తగాదా అయ్యేది. బొమ్మ తెరపై వెయ్యడానికి ముందు హాల్లో లైట్లు తీసేసి చీకటిగా చేస్తారు. ఆ చీకటంటే నాకు చచ్చేంత భయం. అటూఇటూ ఇంట్లోవాళ్ళుంటే.. మధ్యన కూర్చుని సినిమా చూడ్డానికి ధైర్యంగా ఉంటుంది. అదీ అసలు సంగతి!

'కన్యాశుల్కం' సినిమా ఎంతసేపు చూసినా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకస్సలు నచ్చలేదు. అయినా సావిత్రి ఉండవలసింది రామారావు పక్కన గదా? మరి ఎవరెవరితోనో చాలా స్నేహంగా మాట్లాడుతుందేమి! తప్పుకదూ!

పైపెచ్చు ఒక ముసలాయనకి పిలక దువ్వి, నూనె రాస్తుంది. నాకు ఇది మరీమరీ నచ్చలేదు. ఎన్టీరామారావు ఎంత పక్కన లేకపోతే మాత్రం సావిత్రి అంతగా సరదాలు చెయ్యాలా?

ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుందే! ఎక్కడ చూశానబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఈ ముసలాయన మా నందయ్యగారే! అదేంటి! నందయ్యగారు సినిమాల్లో వేషాలు కూడా వేస్తారా? ఉన్నట్లుండి నాకు సినిమా ఆసక్తిగా మారింది. బలవంతానా ఆపుకుంటున్న నిద్ర మాయమైంది. నందయ్యగారు యాక్షను బానే చేశారు. మరి సావిత్రితో తన పిలకకి నూనె ఎందుకు పెట్టించుకున్నాడబ్బా!

'ఎవరా నందయ్య గారు? ఏమాకథ?'

ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకుముందు కూడా బల్లగుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను.

మా బ్రాడీపేట మూడవ లైను మొదట్లో.. అనగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నందయ్యగారి ఇల్లు. పక్కన మాజేటి గురవయ్యగారి ఇల్లు. ఆ పక్కన ముదిగొండ భ్రమరాంబగారి ఇల్లు. చింతలూరివారి ఆయుర్వేద వైద్యశాల. దాటితే డాక్టర్ ఆమంచర్ల చలపతిరావుగారి ఇల్లు. ఎదురుగా ఇసుకపల్లి వేంకట కృష్ణమూర్తిగారి ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది.

సాయంకాలం సమయానికి ఈ అరుగులన్నీ పురోహితులతో కళకళలాడుతుండేది. గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వాతావరణం చాలా సందడిగా, కళకళలాడుతుండేది. ఊళ్ళో ఎవరికైనా పూజలు, వ్రతాలకి  పురోహితుల అవసరం వచ్చినప్పుడు అక్కడే ఎప్పాయింట్ మెంట్లు ఖరారయ్యేవి.

మంజునాథ రెస్టారెంట్ పక్కనే ఉన్న నశ్యం షాపు ఆ సమయంలో చాలా బిజీగా ఉండేది. పొడుంకాయ ఫుల్లుగా నింపడానికి ఐదు పైసలు. పొడుగ్గా ఉండే కాడ చివర బుల్లి గరిటె. ఆ గరిటెతో చిన్నజాడీలోంచి నశ్యాన్ని లాఘవంగా స్కూప్ చేస్తూ పొడుంకాయ నింపడం అద్భుతంగా ఉండేది. ఆ నశ్యం నింపే విధానం అబ్బురంగా చూస్తూ నిలబడిపొయ్యేవాడిని.

నశ్యం పట్టు పడుతూ.. సందడిగా, సరదాగా కబుర్లు చెప్పుకునే పురోహితులు ఒక వ్యక్తి కనపడంగాన్లే ఎలెర్ట్ అయిపోయేవారు. నిశ్శబ్దం పాటించేవారు. వినయంగా నమస్కరించేవారు. ఆయనే నందయ్య గారు.

నందయ్యగారింట్లో ఆడామగ అనేక వయసులవారు ఉండేవారు. ఇంటి వరండాలో చెక్కబల్లపై నందయ్యగారు కూర్చునుండేవారు. తెల్లటి తెలుపు. నిగనిగలాడే గుండు. ఒత్తైన పిలక. చొక్కా వేసుకొంగా ఎప్పుడూ చూళ్ళేదు. పంచె మోకాలు పైదాకా లాక్కుని, ఒక కాలు పైకి మడిచి కూర్చుని ఉంటారు. మెళ్ళో రుద్రాక్షలు. విశాలమైన నుదురు. చేతులు, భుజాలు, నుదుటిపైనా తెల్లటి వీభూది. పంచాంగం చూస్తూ వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తుండేవారు.

ఇంటికి వచ్చినవారు నందయ్యగారికి వినయంగా నమస్కరించేవారు. పెద్దవాళ్ళు నాలాంటి పిల్లకాయల చేత ఆయన కాళ్ళకి నమస్కారం చేయించేవాళ్ళు. మహానుభావుల కాళ్ళకి నమస్కరిస్తే చదువు బాగా వంటబడుతుందని అమ్మ చెప్పింది. చదువు సంగతి అటుంచి.. కనీసం మా లెక్కల మాస్టారి తన్నులైనా తప్పుతయ్యేమోననే ఆశతో నందయ్యగారి కాళ్ళకి మొక్కేవాణ్ని.

మళ్ళీ మన 'కన్యాశుల్కం' లోకి వద్దాం. సినిమా అయిపొయింది. అమ్మానాన్న రిక్షాలో కూర్చున్నారు. యధావిధిగా నా ఉచితాసనంపై కూర్చున్నాను. ఏదో గొప్ప కోసం గంభీరంగా ఉంటుందని 'ఉచితాసనం' అని రాస్తున్నానుగానీ.. అసలు సంగతి రిక్షాలో నా ప్లేస్ కాళ్ళు పెట్టుకునే చోట.. అమ్మానాన్న కాళ్ళ దగ్గర.

మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. అంచేత రిక్షా సీటుపై ఎవరు కూర్చున్నా.. నా పర్మనెంట్ ప్లేస్ మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరే! ఆ విధంగా పెద్దయ్యేదాకా రిక్షా సీటుపై కూర్చునే అవకాశం పొందలేకపోయిన నిర్భాగ్యుడను.

"సినిమాలో మన నందయ్యగారు భలే యాక్టు  చేశారు." అన్నాను.

నాన్నకి అర్ధం కాలేదు.

"నందయ్యగారా! సినిమాలోనా!" అన్నాడు నాన్న.

"అవును. సావిత్రి ఆయన పిలకకేగా నూనె రాసింది." నాన్నకి తెలీని పాయింట్ నేను పట్టేసినందుకు భలే ఉత్సాహంగా ఉంది.

నాన్న పెద్దగా నవ్వాడు.

"నువ్వు చెప్పేది లుబ్దావధాని గూర్చా! ఆ పాత్ర వేసినాయన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు. ఆయన గొప్పనటుడు. బాలనాగమ్మలో మాయల మరాఠీగా వేశాడు. దడుచుకు చచ్చాం." అన్నాడు నాన్న.

నమ్మలేకపోయాను. నాన్న నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఛ.. ఛ! నాన్న అలా చెయ్యడు. బహుశా నాన్న నందయ్యగారిని గుర్తుపట్టలేకపోయ్యాడా? అలాంటి అవకాశం లేదే! నాన్నకి నందయ్యగారు బాగా తెలుసు. నందయ్యగారు నాన్నని 'ఏమిరా!' అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఆలోచనలతోనే ఇంట్లోకొచ్చిపడ్డా. నాన్నకిష్టమైన, నాకు అత్యంత అయిష్టమైన కాకరకాయ పులుసుతో నాలుగు ముద్దలు తిన్నాను. నాన్న చాలా విషయాల్లో డెమాక్రటిక్ గా ఉండేవాడు. కానీ ఎందుకో కాకరకాయ పులుసు విషయంలో హిట్లర్ లా వ్యవహరించేవాడు. వారంలో ఒక్కసారైనా ఇంట్లోవాళ్ళం నాన్నకిష్టమైన కాకరకాయ పులుసుతో శిక్షించబడేవాళ్ళం.

కాకరకాయ పులుసు కడుపులో తిప్పుచుండగా.. నందయ్య గారి ఆలోచన మనసులో తిప్పుచుండెను. ఆలోచిస్తున్న కొద్దీ.. ఈ లుబ్దావధాని, గోవిందరాజుల సుబ్బారావు, నందయ్యగార్ల ముడి మరింతగా బిగుసుకుపోయి పీటముడి పడిపోయింది.

అటు తరవాత నందయ్యగారి సినిమా వేషం సంగతి నా అనుంగు స్నేహితుడైన దావులూరి గాడి దగ్గర ప్రస్తావించాను. వాడు నాకన్నా అజ్ఞాని. తెల్లమొహం వేశాడు. పరీక్షల్లో నాదగ్గర రెగ్యులర్ గా కాపీకొట్టే సాగి సత్తాయ్ గాడు మాత్రం నేనే కరక్టని నొక్కివక్కాణించాడు. ఏవిటో! అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది!

                                                     - 2 -

కాలచక్రం సినిమారీల్లా గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను పెద్దవాడనైనాను. రిక్షాలొ కాళ్ళ దగ్గర కూచోకుండా సీటు మీదే కూర్చునే ప్రమోషనూ వచ్చింది. నా సాహిత్యాభిలాష చందమామ చదవడంతో మొదలై ఆంద్రపత్రిక, ప్రభల మీదుగా కథలు, నవలలదాకా ప్రయాణం చేసింది.

ఈ క్రమంలో కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకమనీ, అది సినిమాగా తీశారనీ తెలుసుకున్నాను. లుబ్దావధానిని నందయ్యగారిగా పొరబడ్డందుకు మొదట్లో సిగ్గు పడ్డాను. అటుతరవాత నవ్వుకున్నాను. నేనెందుకు తికమక పడ్డాను!?

కొన్నాళ్ళకి కన్యాశుల్కం నాటకం చదివాను. నాటకం గూర్చి అనేకమంది ప్రముఖుల వ్యాఖ్యానాలూ చదివాను. తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం ప్రాముఖ్యత గూర్చి ఒక అంచనా వచ్చింది. సినిమా మళ్ళీ చూడాలని.. పెరిగిన వయసుతో, పరిణిత మనసుతో హాల్లోకి అడుగెట్టాను.

సినిమా మొదలైన కొంతసేపటికి సినిమాలో పూర్తిగా లీనమైపొయ్యాను. కారణం.. గోవిందరాజుల సుబ్బారావు అద్భుత నటన. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు. లుబ్దావదానిగా గోవిందరాజుల సుబ్బారావు నటించాడనడం కన్నా..  ప్రవర్తించాడు అనడం కరెక్ట్.

గోవిందరాజుల సుబ్బారావు వృద్దుడయినందున లుబ్దావధాని ఆహార్యం చక్కగా కుదిరందని కొందరు అంటారు. వాస్తవమే అయ్యుండొచ్చు. అయితే ఇది నటుడికి కలసొచ్చిన ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం.

వృద్ధాప్యంలో 'డిమెన్షియా' అనే మతిమరుపు జబ్బు మొదలవుతుంది. ఎదుటివాడు చెప్పేది అర్ధం చేసుకుని చెప్పడానికి సమయం పడుతుంది. శరీర కదలికల వలె మానసికంగా కూడా నిదానంగా రియాక్ట్ అవుతుంటారు. ఎటెన్షన్ మరియు కాన్సంట్రేషన్ తగ్గడం చేత ఒక్కోసారి అర్ధం కానట్లు చేష్టలుడిగి చూస్తుండిపోతారు. ఇవన్నీ మనకి సినిమా లుబ్దావధానిలో కనిపిస్తాయి.

నా తికమక నటుడిగా గోవిందరాజుల సుబ్బారావు సాధించిన విజయం. అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. ఆయన మరీ అంత సహజంగా పాత్రలోకి దూరిపోయి అద్భుతంగా నటించేస్తే తికమక పడక ఛస్తానా! అంచేత 'నేరం నాదికాదు! గోవిందరాజుల సుబ్బారావుది.' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను!

యూట్యూబులోంచి ఆయన నటించిన సన్నివేశం ఒకటి పెడుతున్నాను. చూసి ఆనందించండి.చివరి తోక..

శ్రీ ముదిగొండ పెదనందయ్యగారు :  వేదపండితులు. ఘనాపాఠి. ఆరాధ్యులు. సంస్కృతాంధ్ర పండితులు.

కృతజ్ఞతలు..

ఈ పోస్టులో నేను రాసిన ఇళ్లేవీ ఇప్పుడు లేవు. అన్నీబహుళ అంతస్తుల బిల్దింగులుగా మారిపోయ్యాయి. పోస్ట్ రాస్తున్న సందర్భాన నా మెమరీని రిఫ్రెష్ చేసిన మిత్రుడు ములుగు రవికుమార్ (నందయ్యగారి మనవడు) కి కృతజ్ఞతలు.

(photos courtesy : Google)