Monday, 26 November 2012

పిల్ల సందేహాలు - పిడుగు సమాధానాలు


అప్పుడు నాకు పదేళ్ళు. అమ్మానాన్నల మధ్య కూర్చుని 'కన్యాశుల్కం' సినిమా చూస్తున్నాను (అవునురే! పదేళ్ళ వయసులో ఏ ఎన్టీవోడి సినిమానో చూసుకోక - కన్యాశుల్కాలు, వరకట్నాలు నీకుందుకురా? అయ్యా! సినిమాలు చూచుట అనేది పరమ పవిత్రమైన కార్యము. మనం ప్రతిరోజూ ఎంతమంది దేవుళ్ళకి మొక్కట్లేదు? అట్లే, అన్నిరకముల సినిమాలు చూడవలెననీ, ఎన్ని సినిమాలు చూచినచో అంత పుణ్యము లభించునని నా ప్రగాఢ విశ్వాసము).

తెర మీదకి ఎవరెవరో వస్తున్నారు. ఏవిటేవిటో మాట్లాడుతున్నారు. సినిమా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. కనీసం ఒక్క ఫైటింగు కూడా లేదు. సినిమా పరమ బోర్!

ఉన్నట్టుండి సావిత్రి 'లొట్టిపిట్టలు' అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టింది. అట్లా చాలాసేపు నవ్వుతూనే ఉంది. ఎందుకంత పడీపడీ నవ్వుతుంది? నాకర్ధం కాలేదు.

"అమ్మా! సావిత్రి ఎందుకట్లా నవ్వుతుంది?"

"సావిత్రి మధురవాణి వేషం వేస్తుంది. మధురవాణి వేశ్య!" అంది  అమ్మ.

ఓహో అలాగా! వేశ్యలు పెద్దగా నవ్వెదరు.

అంతలోనే ఇంకో సందేహం.

"వేశ్య అంటే?"

అమ్మ చిరాగ్గా మొహం పెట్టింది. ఒక క్షణం ఆలోచించింది.

"వేశ్య అంటే సంపాదించుకునేవాళ్ళు." అంది.

ఓహో అలాగా! సంపాదించుకునేవారిని వేశ్యలు అందురు.

ఇప్పుడింకో సందేహం.

"అమ్మా! నాన్న సంపాదిస్తున్నాడుగా. మరి నాన్న కూడా వేశ్యేనా?"

అమ్మ చిటపటలాడింది.

"నీ మొహం. అన్నీ కావాలి నీకు. నోర్మూసుకుని సినిమా చూడు." అంటూ కసురుకుంది.

నా మొహం చిన్నబోయింది.

          *                     *                   *                    *                        *                    
మళ్ళీ చిన్నప్పుడే!

అది మధ్యాహ్నం. సమయం సుమారు మూడు గంటలు. అమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకునే సమయం. బియ్యంలో మట్టిగడ్డలు ఏరుతూ, తిరగలి తిప్పుతూ, ఊరగాయ పచ్చడికి ముక్కలు తరుగుతూ లోకాభిరామాయణం చెప్పుకుంటుంటారు. నేనా కబుర్లు ఆసక్తిగా వినేవాణ్ని.

ఆరోజు ఎదురింటి విజయక్కయ్య, పక్కింటి భ్రమరాంభ పిన్ని, రెండిళ్ళవతల ఉండే గిరిజత్తయ్య చెవులు కొరుక్కుంటున్నారు. ఒక చెవి రిక్కించి అటు వేశా.

"చూశావా భ్రమరా! ఎంత అమాయకత్వంగా ఉండేవాడు. అంతా నటన! నంగి వెధవ. చదువుకున్నాడు గానీ ఏం లాభం? నేనైతే చెప్పుతో కొట్టే్దాన్ని." అంది విజయక్కయ్య.

"పాపం! ఆ పిల్ల ఎంత అమాయకురాలు! ఈ మధ్యనే పెళ్ళికూడా కుదిరిందట. ఇట్లాంటి దరిద్రుల్ని గాడిద మీద ఊరేగించాలి." అంది గిరిజత్తయ్య.

కొంతసేపటికి నాకర్ధమైనదేమనగా.. వీధి చివర శంకరం గారింట్లో  స్కూల్ మాస్టరు రంగారావు అద్దెకుంటారు. ఆయన వాళ్ళావిడ ఇంట్లోలేని సమయమున పనిమనిషి చెయ్యి పట్టుకున్నాట్ట. అదీ సంగతి!

విషయం అర్ధమైంది గానీ.. మర్మం అర్ధం కాలేదు.

ఒక సందేహము బుర్ర తొలుచుచుండెను.

"విజయక్కయ్యా! మాస్టారు పనిమనిషి చెయ్యి పట్టుకుంటే ఏమవుతుంది?" అడిగాను.

అమ్మ నోర్మూసుకోమన్నట్లు గుడ్లురుమింది.

విజయక్కయ్య సిగ్గు పడుతూ చెప్పింది.

"మగవాడు ఆడవాళ్ళ చెయ్యి పట్టుకోకూడదు. చాలా తప్పు." అంది.

ఓహో అలాగా! మగవాడు ఆడవారిని ఎక్కడైనా పట్టుకొనవచ్చును గానీ.. చెయ్యి మాత్రం పట్టుకొనరాదు!

ఇప్పుడింకో సందేహం.

"మరయితే ఆ గాజులమ్మేవాడు ఇందాక మీఅందరి చేతులూ పట్టుకున్నాడుగా?"

నా డౌటుకి విజయక్కయ్య తికమక పడింది. భ్రమరాంభ పిన్ని చీరకొంగు అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంది.

అమ్మ కసురుకుంది.

"వెధవా! అన్నీ పనికిమాలిన ప్రశ్నలు. అయినా ఆడాళ్ళ మధ్య నీకేం పని? అటుపొయ్యి ఆడుకో పో!"

నా మొహం మళ్ళీ చిన్నబోయింది!

(photo courtesy : Google)