Wednesday 11 September 2013

ఈరోజు 'ఆంధ్రజ్యోతి'లో నా వ్యాసం.. ప్రతీక పవిత్రతలు వద్దు


తెలుగుతల్లి, భారతమాత... ఇటువంటి విశేషణాత్మక పదాలు ప్రయోగించడం వల్ల భాషని, ప్రాంతాన్ని గౌరవించుకున్నట్లుగా కొందరు సంతోషించవచ్చును. కానీ ఈ పద ప్రయోగాలు భాషా విన్యాసాలు తప్ప మరేదీకాదు. అసలీ పదజాలంలోనే సంకుచిత రాజకీయాలు దాగున్నాయి. ప్రాంతాల పేరుతో, భాష పేరుతో జరిగే శ్రుతి మించిన రాజకీయ కార్యక్రమాల్ని సామాన్యుడు ప్రశ్నించకుండా చెయ్యటం అనే ఒక ఎత్తుగడ ఇందులో దాగుంది. ఇందుకు శివసేన జపించే 'మరాఠీ మానో' ఒక ఉదాహరణ.

అసలు ఒక ప్రాంతాన్ని, భాష దేవతతో పోల్చడం ఎందుకు? ప్రపంచంలో ఎవరికైనా ఒక దేశం ఉంటుంది. వారికి ఆ దేశంలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ దేశానికి ఒక రాజ్యాంగం, క్రిమినల్ జస్టిస్ సిస్టం ఉంటాయి. ఆ సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరునిగా బ్రతకాలంటే ఆ దేశ రాజ్యాంగ ఆదేశిత సూత్రాల్ని పాటించాలి. ఇందులో ఇతరుల హక్కులకి భంగం కలిగించకుండా ఉండటం చాలా ముఖ్యమైనది. తమ దేశంపై గౌరవం, ప్రేమ కలిగిన వారెవరూ నేరాలకి (రాజకీయ నేరాలు కాదు) పాల్పడి జైలుకి వెళ్ళకూడదు. నేరం, నేరపూరిత మసస్తత్వం ఏ సమాజానికైనా హానికరం. జైళ్ళు నిర్వహింపబడేది ప్రజాధనంతో కాబట్టి, నేరాలు సమాజానికి ఆర్థిక భారం కూడా. ఇక అన్నిదేశాలకీ మునిసిపాలిటీల వంటి లోకల్ బాడీలు ఉంటాయి. ఆయా ప్రజలు వాటి నియమ నిబంధనలని పాటిస్తూ సక్రమంగా పన్నులు కడితే వారు ఉత్తమ పౌరులే. ఏ దేశానికైనా ఒక పౌరుడు ఇంతకన్నా చెయ్యగల ఉపకారం మరొకటి లేదు.

అయితే మనదేశంలో కొందరికి ఇది తృప్తినివ్వదు. కొన్ని మతాల్లో దేవుళ్ళు మనిషి రూపంలో ఉంటారు. వారిని పూజించటం వారికి ఒక పవిత్రకార్యం. అందుకని వీరు దేశాలకి, ప్రాంతాలకి కూడా దేవతా రూపం ఇస్తారు. వాటికి అలంకరణ చేస్తారు. పాటలు రాస్తారు. పూజలు చేస్తారు. ఇదంతా ఒక ఆదర్శ ధర్మంగా ప్రచారం చేస్తారు. పన్నులు ఎగ్గొట్టినా ఫరవాలేదు. కుల మతాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన చేసినా ఫరవాలేదు. గొంతు చించుకుని దేశమాతపై భక్తిగీతం పాడుతూ ఒక భజన కార్యక్రమం నిర్వహిస్తే చాలు. వారు నిఖార్సైన దేశభక్తులు!

భాష అనేది ఒక కమ్యూనికేటివ్ స్కిల్. అన్నిరకాల జంతువులు, పక్షులు ఈ కమ్యూనికేషన్ కోసం మాత్రమే భాషని వాడతాయి. ఏ భాషకైనా ఇంతకన్నా మహత్తర ప్రయోజనం ఏముంటుంది? అయితే కొందరు వ్యక్తులకి భాష కూడా దేవతే! ఆ దేవతని కీర్తిస్తూ పాటలు రాస్తారు. పూజలు చేస్తూ గర్విస్తారు!

అసలే మతపరమైన దేవతలతో సమస్యలున్న ఈ దేశంలో... ఈ భాషా దేవతల వల్ల మరిన్ని సమస్యలు తలెత్తటం మినహా చేకూరే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. స్త్రీకి గల అదనపు పవిత్రత ఏమిటి? నేనిక్కడ సామాజిక అంశాలని ప్రస్తావించట్లేదు. శరీర నిర్మాణశాస్త్ర పరంగా జననేంద్రియాలలో మాత్రమే స్త్రీపురుషులకి తేడా ఉంటుంది. ఆడపక్షులు గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఆడజంతువులు గర్భం దాల్చి పిల్లల్ని కంటాయి. ఇవన్నీ బయలాజికల్ విషయాలు. ఎంత ఇష్టపడ్డా మగవాళ్ళు పిల్లల్ని కనలేరు. కాబట్టి మాతృత్వం అనేది ప్రకృతి పరంగా ఒక సహజమైన ప్రక్రియ. అయితే ఈ మాతృత్వానికి కొందరు పవిత్రత అంటగడతారు. అలాగే స్త్రీలు గర్భాన్ని 'నవమాసాలు' మోయడంలో కూడా పవిత్రత ఏమీ లేదు. కుక్కలు, పిల్లులు రెండు నెలలు మోస్తాయి. ఒక్కో జాతికి ఒక్కో పీరియడ్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తక్కువలైతే ప్రమాదం కూడా. ఒక స్త్రీ తన 'పవిత్రమైన' గర్భాన్ని పదకొండు నెలలు మోసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుదామంటే ప్రకృతి ఊరుకోదు.

కొందరు పిల్లల్ని కని, పాలిచ్చి పెంచే ప్రక్రియని పరమ పవిత్రంగా చూస్తారు. కవిత్వం కూడా రాస్తారు. మంచిది. ఎవరి ఆలోచన వారిది. కానీ వారు ఆ స్త్రీ పవిత్రతకి అక్కడితో చెల్లుచీటి ఇచ్చేస్తారు. వారి సాంప్రదాయ సంస్కృతిలో ఆడవారి తెలివితేటలపై, నిర్ణయాత్మక శక్తిపై గౌరవభావం కలిగి ఉండటం కనబడదు. అంటే ఆడవారి పవిత్రత... గర్భం దాల్చడం, పిల్లల్ని కనటం, పాలివ్వటానికి మాత్రమే పరిమితమై ఉంటుందని అర్థం చేసుకోవాలి.

'తల్లి ప్రేమ' కూడా శాస్త్రీయ విశ్లేషణకి నిలబడదు. పిల్లలపై తండ్రుల కన్నా తల్లులే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారనటానికి శాస్త్రీయ ఆధారం లేదు. పిల్లల్ని బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో తండ్రి పాత్ర తల్లికన్నా తక్కువేమీ కాదు. కేవలం గర్భసంచి లేని కారణాన, పిల్లల్ని కనే అవకాశం లేనందున పురుషుని స్త్రీ కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టడం జెండర్ వివక్ష కిందకి వస్తుంది.

మరప్పుడు ప్రాంతానికీ, భాషకీ 'తల్లి' అవసరం ఎందుకు?

విశాలమైన ఒక దేశానికి 'మాత' అంటూ, భాషకి 'తల్లి' అంటూ దేవతా రూపాలు ఇచ్చి పూజించటం అనేది ఒకరకమైన రాజకీయ భావజాల వ్యాప్తి ప్రచారం కోసం మాత్రమే. అలాగే స్త్రీలకి మాత్రమే అవకాశం ఉన్న గర్భం దాల్చే జీవశాస్త్ర అనివార్యతకి పవిత్రతని ఆపాదించటం కూడా ఒక రకం భావజాలానికి సాంస్కృతిక ముసుగు తొడగటం మించి మరేదీ కాదు.

కావున మనం అర్జంటుగా భారత మాత, తెలుగు తల్లి వంటి ప్రతీక భాష వదిలించుకోవాలి. ఇట్లాంటి విషయాల్ని రాజకీయంగానే చర్చించుకోవాలి... పరిష్కరించుకోవాలి తప్ప, లేని పవిత్రతని ఆపాదించటాన్ని ఖండించాలి. అప్పుడే దేశం, ప్రాంతం, భాష మొదలైన విషయాలని ఎమోషనల్‌గా కాకుండా... విషయ పరిజ్ఞానంతో అవగాహన చేసుకోగలం... ఈ భావజాలంతో జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతని ప్రశ్నించగలం.