Monday, 30 September 2013

'షావుకారు' చెంగయ్య

మంచి సినిమా అనగానేమి? దాని రంగు, రుచి, వాసన యెట్లుండును? ఈ ప్రశ్నలకి నాకు తోచిన సమాధానం రాస్తాను. ఒక సినిమాని casual గా చూడ్డం మొదలెడతాం, కొద్దిసేపటికి సినిమా చూస్తున్న సంగతి మర్చిపోతాం, ఇంకొద్దిసేపటికి సినిమా కథలో లీనమైపోతాం. ఎదురుగా జరుగుతున్న సన్నివేశాలు మనచుట్టూనే జరుగుతున్నట్లుగా వుంటాయి, సన్నివేశాల్లో పాత్రల మధ్య (passive గా) మనం కూడా వుంటాం. ఈ అనుభూతి కలిగించే ఏ సినిమా అయినా మంచి సినిమానే అవుతుంది. ఈ విషయంలో సలహా కోసం మనం సినీపండితుల వైపు చూడనవసరం లేదు.

నా దృష్టిలో మంచి సినిమా అంటే యేంటో చెప్పాను కదా! ఈ నిర్వచనం ఫాలో అయితే విజయావారి 'షావుకారు' ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే.. ప్రశాంత నదీ తీరాన చెలిచెంతన ఫిల్టర్ కాఫీ తాగుతూ sweet nothings మాట్లాడుకున్నంత హాయిగా వుంటుంది. ఒక పల్లెటూర్లో కొన్నిగంటలపాటు బసచేసిన భావన కూడా కలుగుతుంది. సినిమాలో కనబడే పల్లెవాతావరణం.. పాత్రలు, పాత్రధారుల గూర్చి చాలా రాయొచ్చు. ఇప్పుడంత ఓపిక లేదు కావున.. ప్రస్తుతానికి ప్రధానపాత్ర షావుకారు చెంగయ్యకి పరిమితమవుతాను.

చెంగయ్య షావుకారు. వడ్డీవ్యాపారం చేస్తూ చాలా డబ్బు కూడబెడతాడు (ఈ వడ్డీవ్యాపారం సర్వకాల సర్వావస్థల యందు గిట్టుబాటుగానే వుంటుంది). చెంగయ్యకి పక్కింటి అమ్మాయి సుబ్బులు (షావుకారు జానకి) అంటే ప్రేమ, ఆప్యాయం. ఒక్కోసారి సుబ్బులు, చెంగయ్యలు స్నేహితుల్లాగా ప్రవర్తిస్తారు (సుబ్బులు చెంగయ్యని ఆట పట్టిస్తుంటుంది). డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే చెంగయ్య.. సుబ్బులుకి బంగారు నగ బహుమతిగా ఇస్తాడు. ఈ దృశ్యాలతో చెంగయ్యకి సుబ్బులు పట్ల గల ప్రేమాభిమానాల్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తాడు దర్శకుడు.

చెంగయ్య దగ్గర లౌక్యుడు కూడా. కాబట్టే సున్నం రంగడు (ఎస్వీరంగారావు), పంతులు (వంగర వెంకట సుబ్బయ్య) మాట కాదనలేకపోతున్నట్లుగా.. వరాలు (రేలంగి) తండ్రి శెట్టికి సత్రంలో అంగడి నడుపుకోడానికి మౌనంగా అంగీకరిస్తాడు. వాస్తవానికి సత్రంపై చెంగయ్యకి హక్కు లేదు, అది ఊరుమ్మడి. ఆ విషయం చెంగయ్యకీ తెలుసు. సుబ్బులు తండ్రి రామయ్య (శ్రీవాత్సవ) ఆ నిజాన్నే సాక్ష్యంగా చెబుతాడు. అందుకు రామయ్యపై కక్ష కడతాడు చెంగయ్య. సుబ్బులు అన్న నారాయణ (వల్లభజోశ్యుల శివరాం) తనపై నోరు చెసుకున్నందుకు అవమానంగా భావిస్తాడు, తప్పుడు కేసు బనాయించి నారాయణని జైలు పాలు చేస్తాడు చెంగయ్య.

తను చేస్తున్నదని సరికాదనీ, తప్పు కూడాననే భావన చెంగయ్యని ఇబ్బంది పెడుతుంటుంది. చెంగయ్యలోని ఈ మంచిచెడుల conflict ని దర్శకుడు చాలా జాగ్రత్తగా maintain చేసుకుంటూ వస్తాడు. అందుకే తనలోని guilt feelings లోంచి బయటపడేందుకు.. జరుగుతున్నదానిలో తన తప్పేమీ లేదనీ, ఈ తతంగం మొత్తానికి రామయ్య, నారాయణల ప్రవర్తనే కారణం అనుకుంటూ.. rationalization చేసుకుంటాడు చెంగయ్య.

తీరా తన కొడుకు సత్యం (ఎన్టీరామారావు) కూడా చెయ్యని నేరానికి జైలు పాలయినందుకు తల్లడిల్లిపోతాడు. ఇక్కణ్నించి చెంగయ్యలో self introspection మొదలవుతుంది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలకి లోనవుతాడు. అందుకే ఊరివాళ్ళతో మానసికంగా సంబంధాలు తెంచేసుకుని isolation కోరుకుంటాడు. తన అవసరం ఎవరికీ లేదనీ, తనకీ శాస్తి జరగవలసిందేనని self-reproach కి లోనవుతాడు. depressed state of mind ఉన్నవారిలో ఈ రకమైన ఆలోచన సహజం.

'దొంగలు వచ్చి చంపేస్తారు మామా!' అంటూ సుబ్బులు ఏడుస్తూ వచ్చి చెబుతుంది. తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ.. తప్పు చేసిన తనకి శిక్ష పడవలసిందేనని భావిస్తాడు. అపరాధ భావంలోంచి బయటపడ్డానికి శిక్షకి మించిన పరిహారం మరొకటి లేదు. అందుకే బలవంతంగా సుబ్బులుని పంపేస్తాడు. చివరికి సుబ్బులు ప్రాణానికి ముప్పు ఏర్పడ్డప్పుడు మాత్రమే దొంగలకి తాళం చెవులు సంగతి చెబుతాడు. ఇవి షావుకారు చెంగయ్య వైపు నుండి కథలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు .

ఇంతకీ చెంగయ్య ఎవరు? 'షావుకారు' కథకి నాయకుడా? ప్రతినాయకుడా? రంగడు ద్వారా దొంగబంగారం కొంటాడు. కొడుకులాంటి నారాయణపై కక్షతో దొంగ సాక్ష్యం చెప్పాడు. అందువల్ల చెంగయ్య చెడ్డవాడే అయి ఉండాలి. మరైతే.. రామి (కనకం) దగ్గర చిన్నపిల్లాళ్ళా బావురుమంటాడెందుకు? కావున మంచివాడే అయ్యుంటాడు. అర్ధం కావట్లేదు కదూ?

ఏ మనిషీ పూర్తిగా మంచివాడుగానో, చెడ్డవాడు గానో ఉండడు. పరిస్థితుల బట్టి ప్రవర్తన ఉంటుంది. మంచి చెడ్డలూ మారుతుంటాయి. సుబ్బులుని చిన్నప్పట్నుండి ప్రేమగా పెంచిన చెంగయ్య చెడ్డవాడయ్యే అవకాశం లేదు. పిల్లల్ని, పుస్తకాల్ని ప్రేమించేవారు ఎప్పుడూ మంచివారే (ఈ అభిప్రాయం మాత్రం పూర్తిగా వ్యక్తిగతం.. biased కూడా).

రామయ్య సాక్ష్యం వల్ల తన పరువు పోయిందనే ఉక్రొశం, నారాయణ పెడ మాటల వల్ల కోపం తప్ప (చెంగయ్యది egocentric personality కాదుగానీ.. ఆ traits కొన్ని ఉన్నాయి).. చెంగయ్య మనసులో వేరే దుష్ట భావనలు ఉన్నట్లు తోచదు. జరుగుతున్న పరిణామాల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా ఉంటాడు చెంగయ్య. ఏ క్షణంలోనైనా రామయ్య వచ్చి "ఏంటి బావా ఇదంతా?" అని ఒక చిన్న మాటన్నా జరిగిందంతా మర్చిపోదామన్న ఆత్రుతతో ఉన్నవాడిలా కూడా కనిపిస్తాడు. అయితే రామయ్య చెంగయ్యకి అంత అదృష్టం పట్టనివ్వడు!

నేను షావుకారు చెంగయ్య మనసు చదివేసినట్లు.. ఆయన తరఫున వకాలత్ పుచ్చుకున్నట్లు రాసేస్తున్నాను. ఎందుకంటే నాకు చెంగయ్య మనసు చక్కగా అర్ధమైంది. ఇందుకు కారకులు ఇద్దరు. షావుకారు చెంగయ్య పాత్రని ఎల్వీప్రసాద్ అనే శిల్పి ఎంతో శ్రద్ధగా ఒక అద్భుతమైన శిల్పంగా మలిస్తే.. గోవిందరాజుల సుబ్బారావు ప్రాణం పోశాడు. మహానటుడు ఎలా ఉంటాడు? అచ్చు గోవిందరాజుల సుబ్బారావులా ఉంటాడు!

అవును. గోవిందరాజుల సుబ్బారావు మహానటుడే! కన్యాశుల్కంలో నశ్యం పీల్చుకుంటూ, జంధ్యం సరిచేసుకుంటూ లుబ్దావధానులుగా ఒక పరమలోభిని మనముందు ఆవిష్కరించాడు (గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!). ఇప్పుడీ షావుకారు సినిమాలో సంక్లిష్టమైన చెంగయ్యని మనముందు నిలబెట్టాడు. ఒక పాత్రకి.. ఆ పాత్ర గుణగణాలని దుస్తులుగా తొడిగి.. పాత్రోచితంగా ప్రవర్తిస్తూ.. మనని కథలో లీనమయ్యేట్లు చెయ్యడమే ఒక మంచి నటుడి బాధ్యత. ఆ బాధ్యతని అత్యంత ప్రతిభావంతంగా నెరవేర్చేవాడే మహానటుడు.

నాకీ మధ్య ఒక అనుమానం పట్టుకుంది. నాకు పాతతరం నటుల ప్రతిభ సరీగ్గా తెలీదు. ఏ అంచనా లేకుండా ఒక సినిమా చూస్తాను. ఆ సినిమా బాగా నచ్చుతుంది. నటీనటులు ఇంకా బాగా నచ్చుతారు. అంచేత ఆ సినిమానీ. నటుల్నీ ఆకాశానికెత్తేస్తూ రాసేస్తున్నానా? అని. చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి మొదలైన నటుల విషయంలో నాలో ఈ surprise element  పనిచేసిందా?

కావున నేను ఇకనుండి ఏ నటుడికైనా మార్కులు వేసేప్పుడు పిసినిగొట్టుగా వ్యవహరించవలసిందేనని నిర్ణయించుకున్నాను. షావుకారు సినిమా నచ్చింది. చెంగయ్య పాత్రధారణ చాలా బాగా నచ్చింది. కానీ.. ఇకపై ఇట్లాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలనే సంగతీ గుర్తుంది. అంచేత సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు అభినయాన్ని లెక్కల మేస్టర్లా గుచ్చిగుచ్చి చూస్తూ.. చూశాను.

అయితే 'షావుకారు'ని ఇలా చూడ్డం వల్ల నాకు ఒక నష్టం కలిగింది. చెంగయ్య సుబ్బులుపై వాత్సల్యం కురిపిస్తున్నప్పుడు (సుబ్బులు నా బంగారుకొండ).. రామయ్య ఖచ్చితమైన సాక్ష్యం చెప్పి చెంగయ్య పరువు తీసినప్పుడు (ఏం? ఆమాత్రం నాకు మాట సాయం చెయ్యడా?).. నారాయణ చెంగయ్యపై నోరు పారేసుకుంటున్నప్పుడు (నా కళ్ళ ముందే పెరిగాడు.. వెధవకి ఎంత అహంకారం?).. చెంగయ్య కలిగిన భావాలన్నీ నాక్కూడా కలిగినయ్.

కొడుకు తనని అసహ్యించుకున్నప్పుడు.. 'అనవసరంగా పట్టుదలకి పోయి స్నేహితుని కుటుంబాన్ని కష్టాలు పెట్టానే' అనే అపరాధ భావంతో చెంగయ్య దహించుకుపోతున్నప్పుడు నాక్కూడా బాధగా అనిపించింది. అందుకే ఆయన రామి దగ్గర భోరున విలపించినప్పుడు నాక్కూడా కన్నీరు ఆగలేదు (నేనెందుకిలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను? ఇందర్ని ఏడిపించి ఏం బావుకుందామని? ఏమిటీ నాకీ ఖర్మ?).

ఇలా సినిమా అంతా నన్ను తనతో పాటు ప్రతి సన్నివేశంలో చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఎంతో ఉద్వేగానికి గురిచేశాడు గోవిందరాజుల సుబ్బారావు. ఒక ప్రేక్షకునికి ఇంత అనుభూతిని కలిగించడం ఒక గొప్ప నటుడి ప్రతిభకి తార్కాణం అని అనుకుంటున్నాను. కావున షావుకారు చెంగయ్య పాత్రపోషణ తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటనకి కొండగుర్తుగా భావిస్తున్నాను.

ఇప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. నాకు పల్లెటూరు వాతావరణం తెలీదు. జీవితంలో ఒక్కరోజు కూడా పల్లెజీవితాన్ని అనుభవించి ఎరుగను. వ్యవసాయం తెలీదు. వడ్డీవ్యాపారం అంటే అసలే తెలీదు. అయినా నేను చెంగయ్యతో పూర్తిగా empathize అయ్యాను. (సరీగ్గా ఇలాగే ఫీలవుతూ గుండమ్మ తరఫున 'సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ' రాశాను). కారణం? నేను ప్రధానపాత్రతో identify అయ్యేలా చెయ్యటం అనేది దర్శకుడి ప్రతిభ, నటుడి గొప్పదనం. మంచి సినిమా అంటే ఇలాగే ఉంటుంది.. ఉండాలి కూడా.

ఒక మంచినటుడికి మంచివాడిగానో, చెడ్డవాడిగానో నటించడం పెద్ద కష్టం కాకపోవచ్చు (నటన తెలీనివాడికి ఏదైనా కష్టమే). అటు మంచీ కాకుండా, ఇటు చెడూ కాకుండా.. సందర్భాన్ని బట్టి react అయ్యే 'మామూలు మనిషి'గా different shades చూపిస్తూ నటించాలంటే మాత్రం అసాధారణ ప్రతిభ కావాలి. ఈ ప్రతిభ గోవిందరాజుల సుబ్బారావు దగ్గర పుష్కలంగా ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా చూసిన తరవాత నాకనిపించింది.. గోవిందరాజుల సుబ్బారావు నటన ఒక అద్భుతమైన పూలతోట వంటిది. ఈ తోటకి అనేక ద్వారాలు ఉన్నాయి. కన్యాశుల్కం ఒక ద్వారం.. షావుకారు ఇంకో ద్వారం. ఆ తోటలో ఒక్కో ద్వారం నుండి వెళ్తే ఒక్కోరకమైన పూలు.. అన్నిరకాల పూలూ చూడ్డానికే కాదు.. ఆఘ్రూణించడానిక్కూడా భేషుగ్గా ఉంటాయి.

సందేహం లేదు - ఈ గోవిందరాజుల సుబ్బారావు గొప్ప నటయోధుడు. ఆయన అసమాన నటనా ప్రతిభకి గులామునైపోయి సలాము చేస్తున్నాను.

(posted in fb on 10 Dec 2017)