Saturday 7 September 2013

ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలేనా?


మన దేశంలో ప్రస్తుతం నడుస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీలు చాలా కీలకమైనవి. అవి అనుక్షణం ప్రజాభిప్రాయాల్ని ప్రతిబింబించాలి, ప్రజాశ్రేయస్సే ప్రధమ కర్తవ్యంగా భావించాలి. రాజకీయ పార్టీలకి ప్రజాసేవకి మించిన పవిత్ర కార్యం మరొకటి ఉండరాదు. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రాధమిక సూత్రాలు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రాజకీయ పార్టీల రాజకీయాలు ఈ ప్రాధమిక సూత్రాలని అనుసరించి ఉంటున్నాయా అన్నది ప్రశ్నార్ధకం. ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయ పార్టీల కార్యాచరణ లేనప్పుడు అవకాశవాదమే పార్టీల విధానం అయిపోతుంది. రాజకీయాల్ని చదరంగం ఆటలో ఎత్తుల్లాగా మార్చేసుకున్నప్పుడు ప్రజాశ్రేయస్సు వెనక్కి వెళ్ళిపోతుంది.

ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో.. తెలంగాణాకి వ్యతిరేకం కాదు అని ఒక పార్టీ, మీరు తండ్రి వంటి పాత్ర (?) పోషించండి అని మరొక పార్టీ ఢిల్లీలో తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. తీరా ఢిల్లీ నుండి నిర్ణయం వెలువడ్డాక, తాము వెలువరించిన అభిప్రాయానికి కట్టుబడి ఉండవలసిన బాధ్యత నుండి తప్పుకుని, భుజాలు తుడిచేసుకున్నాయి.

ప్రస్తుతం ఎన్జీవో నాయకులు తెర ముందుకు వచ్చారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే పాత రోజుల్లో జరిగే పెళ్ళిళ్ళు గుర్తొస్తున్నాయి. పూర్వం పెళ్లి సంబంధంలో కట్నకానుకలు ఒక పెద్దమనిషి సమక్షంలో మాట్లాడుకునేవారు. కట్నం చెల్లింపులో తేడా వచ్చి పీటల మీద పెళ్లి ఆగిపోయినప్పుడు.. అసలు పెద్దమనిషి మాయమైపోతాడు. కొత్త పెద్దమనుషులు సరికొత్తగా రంగప్రవేశం చేస్తారు. తామే అసలైన పెద్దమనుషులమని హడావుడి చేస్తారు.. ఇప్పుడు మన ఎన్జీవో నాయకుల్లాగా!

ఎన్జీవో సంఘాలు రాజకీయ వ్యవస్థలో భాగం కాదు. రాజకీయ నిర్ణయాల్ని అమలు చెయ్యడానికి రాజ్యంగ పరంగా ఏర్పడ్డ ప్రభుత్వ వ్యవస్థలో వారు భాగం. అనగా రాజకీయ నిర్ణయాలతో వారికి సంబంధం లేదు (ఆ నిర్ణయాలు వారి సర్వీసు హక్కులకి భంగం కలిగిస్తున్నప్పుడు తప్పించి). వారు ఇన్నాళ్ళు జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నారు. నిర్ణయం వెలువడ్డాక రాజకీయ పార్టీలని పక్కన బెట్టి ఉద్యమం తలకెత్తుకున్నారు.

తాము విభజనకి అనుకూల నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు సమ్మె బాట పడతారనే అవగాహన రాజకీయ పార్టీలకి లేదా? అదే నిజమైతే ఉద్యోగుల అభిప్రాయాల్ని అంచనా వెయ్యలేని రాజకీయ పార్టీల అసమర్దత ఇవ్వాళ స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలకి ముందుండి నడిపించవలసిన రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యులైన రాజకీయ పార్టీలు.. ఉద్యోగ సంఘాల అడుగు జాడల్లో నడవాల్సి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థ వైఫల్యంగా భావించాలి.

ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రజల ఎజెండా ఉద్యోగ సంఘాలు నిర్ణయించలేవు.. నిర్ణయించజాలవు. రాజకీయ వ్యవస్థ వైఫల్యం వల్లనే ఇవ్వాళ ఒక ప్రాంత ప్రజలకి ఎన్జీవో సంఘ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు హీరోల్లా కనిపిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి బాగానే ఉన్నా, ఈ ధోరణి భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

(photo courtesy : Google)