Wednesday 18 September 2013

ఎండే డొక్కల ఘోష


మిత్రులారా! గత నెల రోజులుగా సీమాంధ్ర వార్తాపత్రికలు (ఇప్పుడు పత్రికలు ప్రాంతాల వారిగా ఎడిషన్లు వేస్తున్నాయి), సీమాంధ్ర చానెళ్ళు (ఇక్కడ cable network వాళ్ళు తెలంగాణా వార్తలు చూపించే టీవీ చానెళ్ళని తీసేశారు) చూసిన మీదట ఎంతో విజ్ఞానవంతుడినయ్యాను.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాదులో చార్మినార్, గోల్కొండ మాత్రమే ఉండేవి. ఆ ఊరంతా రాళ్ళూరప్పలు, కొండలు గుట్టలు. అట్లాంటి దిక్కుమాలిన హైదరాబాదును మన సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు అహోరాత్రులు కష్టించి, శ్రమించి (తమతమ నియోజక వర్గాల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ) ఎంతగానో అభివృద్ధి చేశారు.

మనం సినిమా స్టూడియోలు కట్టాం, IMAX సినిమా హాళ్ళు కట్టాం, నెక్లెస్ రోడ్డు నిర్మించాం.. ఇలా ఎన్నని చెప్పను? తినటానికి తిండి కూడా లేని తెలంగాణా వాళ్లకి KFC రుచి కూడా చూపించాం. తెలంగాణా నాయకులు కృతజ్ఞత లేనివారు. అందుకే అభివృద్ధి అంతా అయ్యేదాకా వేచి చూసి.. ఇవ్వాళ మనని వెళ్లిపొమ్మంటున్నారు. ఎంత అన్యాయం! ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? కుదరదు. కుదరదు కాక కుదరదు. నేను సైతం.. నేను సైతం సమైక్యాంధ్రకి సమిధ నౌతాను.

ఇవ్వాళ మా ఊళ్ళో 'మండే గుండెల ఘోష' ఏర్పాటయ్యింది. మండే గుండె అంటే హార్ట్ ఎటాక్ అనుకునేరు! కాదు.. కోపంతో గుండె మండుతుంది అని అర్ధం. సమైక్యాంధ్ర కోసం మొక్కవోని దీక్షతో పోరాడుతున్న, అలుపెరుగని ప్రజానాయకుడు పరకాల ప్రభాకర్. ఆయన మన తెలుగు వాడవటం మనం చేసుకున్న అదృష్టం. ఇవ్వాళ సభకి ఆయన కూడా వస్తున్నాట్ట. అంతటి గొప్పనాయకుణ్ణి దర్శించుకునే భాగ్యం జీవితంలో నాకింత తొందరగా వస్తుందనుకోలేదు. ఏమి నా భాగ్యము!

'తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది' అని పాడుకుంటూ.. ఆత్రంగా, హడావుడిగా, వడివడిగా మండే గుండెల ఘోష సభ వద్దకి వెళ్లాను. అక్కడ విపరీతంగా జనం ఉన్నారు. వేదిక మరీ చిన్నదిగా ఉంది. కళ్ళజోడు మర్చిపోయ్యాను. సరీగ్గా కనపడి చావట్లేదు. కొద్దిగా ముందుకెళ్తాను. ఇక్కడ జనాలందరూ బక్కగా, పీలగా ఉన్నారు. పాపం! హైదరాబాదు పోతుందేమోనన్న బాధలో వీరంతా ఆహారం మానేసినట్లున్నారు.

తమ్ముళ్ళూ! చెల్లెళ్ళూ! మీ సమైక్య స్పూర్తికి నా కడుపు తరుక్కుపోతుంది. మీ కోరిక నెరవేరుతుంది. మీ కష్టాలు ఈడేరుతాయి. ఏడవకండేవకండి.. చింత యేల? మన చెంత ముఖ్యమంత్రి ఉన్నాడు, గజల్ శ్రీనివాస్ ఉన్నాడు, పరకాల ప్రభాకర్ ఉన్నాడు, అశోక్ బాబు ఉన్నాడు.

వేదిక ఇంకా సరీగ్గా కనపడి ఛావట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తాను. అబ్బా! ఏమిటీ బీద వాసన? ఛీ.. ఛీ.. ఇదేదో ఆకలి కంపులా ఉందే! అందుకే చాలా రోతగా ఉంది. ఎంత హైదరాబాదు కోసం అయినా.. ఇంత దరిద్రపుగొట్టు వాతావరణాన్ని తట్టుకోడం నా వల్ల కావట్లేదు. వేదికపై ఎవడో బక్కచిక్కిన నాయకుడు ఆవేశంగా ఉపన్యాసం చెబుతున్నాడు. వేదికపై నా అభిమాన నాయకుడు పరకాల ప్రభాకర్ లేడేమిటి? కొంపదీసి ఆయన ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోయాడా ఏమిటి? అయ్యో! ఏమి నా దౌర్భాగ్యం!

అప్పుడు పడింది నా దృష్టి వేదికపైనున్న banner పై. ఆ banner పై 'మండే గుండెల ఘోష' అని లేదు. 'ఎండే డొక్కల ఘోష' అని రాసి ఉంది. సభ పేరు మార్చారా? ఖర్మ.. ఖర్మ. అడ్రెస్ సరీగ్గా తెలుసుకోకుండా వస్తే ఇదే తంటా.

పక్కనున్న చింకిపాతరగాణ్ని అడిగాను.

"ఇది సమైక్యాంధ్ర సభ కాదా?"

వాడు నావైపు నీరసంగా చూశాడు.

"బాబూ! అన్నం తిని చాల్రోజులయ్యింది. నీరసంతో చచ్చేట్లున్నాను. ప్రభుత్వానికి మా ఘోష వినిపించరూ?"

"ఆ సంగతి తర్వాత చూద్దాంలే. ముందు నేనడిగిందానికి సమాధానం చెప్పు. ఇది సమైక్యాంధ్ర సభ కాదా?" మళ్ళీ అడిగాను.

"కాదు బాబు! కాదు. ఇది 'ఎండే డొక్కల ఘోష' సభ. మా సభలో రైతులున్నారు. రైతు కూలీలున్నారు. ఈ సభని మేం సంవత్సరం పొడుగూతా జరుపుకుంటూనే ఉంటాం. కాకపొతే మీడియావాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు." అన్నాడు.

"సర్లే! మీరెందుకు సభ జరుపుకుంటే నాకెందుకు? ఇంతకీ గుండె మంట ఘోష సభ ఎక్కడ?" విసుగ్గా అడిగాను.

నేనడిగిన ప్రశ్న ఆ బక్క వెధవకి నచ్చినట్లు లేదు. కొద్దిసేపు ఆలోచించాడు. ఆ తరవాత నీరసంగా నవ్వాడు.

"బాబూ! నా కుటుంబం వీధిన పడ్డానికి కారణం ఎవరనుకుంటున్నావు? ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు, డాక్టర్లు. వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. ఏ యేటికా యేడు రెక్కలు ముక్కలవుతున్నాయే గానీ రూపాయి రాబడి లేదు. రైతు పని పూర్తిగా అయిపొయింది బాబు. అందుకే నా కొడుక్కి నా గతి పట్టకూడదనుకున్నాను. అప్పు చేసి మరీ వాణ్ని ప్రైవేటు స్కూల్లో చదివించాను. స్కూలువాళ్ళు పరీక్షలనీ, పుస్తకాలనీ వాయిదాల పద్ధతిలో వేలకివేలు వసూలు చేశారు బాబు."

ఎవడు వీడు? కొంపదీసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బ తియ్యడానికి కోదండరాం పంపించిన గూఢచారి కాదు గదా?

చింకిపాతర చెబుతూనే ఉంది.

"నాది పాడు జన్మ బాబు! నాలాంటోడు పుట్టినప్పుడే చావాల. దరిద్రం వదిలిపోద్ది. పోయినేడాది నా కొడుక్కి జరం వచ్చింది. అదేదో డెంగూ జరమన్నారు. బిల్లు లక్ష రూపాయలైంది. ఉన్న ఒక్క ఎకరవూ అయినకాడికి అమ్మేసి ఆస్పత్రి ఫీజులు కట్టా. ఒక్క ఎయ్యి రూపాయలైనా తగ్గించమని డాక్టర్ల కాళ్ళ మీద పడ్డా. కసాయోడికైనా జాలి గుండె ఉంటదేమో గానీ.. డాక్టర్లకి ఉండదని అర్ధమైంది. అన్నీ పొయ్యి ఇదిగో ఇలా ఒట్టి మనుషులం మిగిలాం బాబు!" అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

వీడెవడో తలతిక్క వెధవలా ఉన్నాడు. నేనదిగిందేమిటి? వీడు చెప్పేదేమిటి?

"సమైక్యాంధ్ర సభ ఎక్కడ?" అసహనంగా, తీవ్రంగా అడిగాను.

ఆతను హఠాత్తుగా ఎర్రటి కళ్ళతో నన్ను చూశాడు.

"నా కొడుకు చదివిన స్కూల్ ఓనరు, అతని స్నేహితులైన ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు.. నా కొడుక్కి వైద్యం చేసిన డాక్టర్లు ఆ పక్క వీధిలో పొట్టి శ్రీరాములు బొమ్మ పక్కన సభ పెట్టుకున్నారు. అదేదో గుండె మంటంట. అటుగా పో!" ఈసడించుకున్నట్లుగా అన్నాడు వాడు.

నాక్కోపమొచ్చింది. గాలొస్తె ఎగిరిపోయ్యేట్లు ఉన్నాడు. వీడికెంత రోషం! దౌర్భాగ్యుడు. అందుకే తినడానికి తిండి కూడా లేకుండా ఛస్తున్నాడు. అయినా ఈ అలగా వెధవని పట్టించుకునేదెవరు?

నేను నా 'మండే గుండెల ఘోష సభ' కోసం పరుగుపరుగున బయల్దేరాను.. ఆలస్యమైతే నా అభిమాన నాయకుడు పరకాల ప్రభాకర్ ఉపన్యాసం తప్పిపోతానేమోనన్న ఆదుర్దాతో!

(picture courtesy : Google)