Friday 11 October 2013

తెలంగాణా! ఎందుకు?


"సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." బాధగా అన్నాను.

కాఫీ తాగుతున్న సుబ్బు చిన్నగా నవ్వాడు.

"నేనైతే అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుండి తెలంగాణా ప్రాంతంపై ప్రేమ పుట్టుకురాలేదు. ఆ పార్టీకి తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత ఏర్పడింది." అన్నాడు సుబ్బు.

"అంటే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని చీలుస్తుందా?" అన్నాను.

"ముందు నువ్వా 'తెలుగు జాతి' అంటూ పరుచూరి బ్రదర్స్ మార్కు డైలాగులు కొట్టడం ఆపు. రాజకీయాలు మాట్లాడేప్పుడు రాజకీయ భాషనే వాడు. సినిమా భాష వాడకు. అవును ఏ పార్టీకైనా రాజకీయ లబ్దే అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. డాక్టర్లు వైద్యం చేస్తారు. వంటవాడు వంటే చేస్తాడు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇంకోటి చెయ్యవు. దేశంలో రాజకీయ లబ్ది చూసుకొని రాజకీయ పార్టీ ఏదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"అవుననుకో. కానీ నాకెందుకో బాధగా ఉంది." అన్నాను.

"అవును. కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన ఒక రాజకీయ అంశం. రాజకీయ అంశాలని emotional గా చూడరాదు మిత్రమా! ఒకరకంగా కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి నరేంద్ర మోడీ ముఖ్యకారకుడు. కాంగ్రెస్ పార్టీ 2014 లో రాహల్ గాంధీని ప్రధానిగా చెయ్యడానికి రోడ్ మేప్ వేసుకుంది. బిజెపి నరేంద్ర మోడీతో రోడ్ మేప్ సిద్ధం చేసుకుంటుంది. ఈ రెండు మ్యాపుల్లో ఒక మ్యాప్ మాత్రమే సక్సస్ అవుతుంది. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో నిధి కోసం వేసుకునే ఎత్తులు, పైయ్యెత్తులు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య ఈ వాతావరణమే నెలకొని ఉంది. అందువల్ల దేశంలోని ప్రతి పార్లమెంటు సీటు కీలకంగా మారింది." అన్నాడు సుబ్బు.

"అందువల్ల రాష్ట్రం విడగొట్టాలని దుర్మార్గమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటావ్?" అడిగాను.

"మళ్ళీ సినిమా భాషలో మాట్లాడుతున్నావ్. ఇక్కడ దుర్మార్గం, సన్మార్గం ఏముంది? అంతా రాజకీయ  మార్గమే! నువ్వు రాష్ట్ర రాజకీయాల్ని ఢిల్లీ వైపు నుండి చూట్టం నేర్చుకో. విషయం చాలా తేలికగా అర్ధమవుతుంది." అన్నాడు సుబ్బు.

"నేను నిఖార్సైన తెలుగువాణ్ని. సమస్యని నా ప్రాంతం నుండి మాత్రమే చూస్తాను. ఇంకేవైపు నుండి చూడను." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఖాళీ కాఫీకప్పు టేబుల్ పై పెట్టి కుర్చీలోంచి లేచాడు. నా ఎదురుగా నించొని.. నా నుదిటిపై తన కుడిచేతి చూపుడు వేలు ఆనించాడు.

"ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది.. వస్తుంది. హాయిగా నిద్ర పోతున్నావ్. నిద్ర పోయ్యావ్. నిద్ర పో.. య్యా .. వ్." అన్నాడు.

ఆశ్చర్యం! నాకు నిజంగానే నిద్రోచ్చింది. అలాగే కుర్చీలో ఒరిగిపొయ్యాను.

"మిత్రమా! ఇప్పుడు నువ్వు సాధారణ పౌరుడివి కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడవి. నువ్విప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగులో ఉన్నావు. నేను సోనియా గాంధీని. అదిగో చూడు.. ఎదురుగా అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, ఆంటోని.. కనిపిస్తున్నారా?"

"అవును. స్పష్టంగా కనిపిస్తున్నారు మేడం." అన్నాను.

"మీరు CWC లో ఆంద్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యులు. పార్టీ అధ్యక్షురాలిగా ఏపీలో మన పార్టీ పరిస్థితిపై మీ నివేదిక అడుగుతున్నాను. ఏం చెబుతారో చెప్పండి." అన్నాడు సుబ్బు.

నేను గొంతు సరి చేసుకుని చెప్పటం మొదలెట్టాను.

"నమస్తే మేడం! ఏపీలో మన పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు మేడం. సీమాంధ్రలో జగన్ పార్టీ దూసుకుపోతుంది. తెలంగాణా కెసిఆర్ కోటగా మారిపోయింది. తెలంగాణలో బిజెపి కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్ట్రంలో ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిచోటా మన పార్టీ డిపాజిట్టు కోల్పోయింది. కాబట్టి మన రాష్ట్ర నాయకుల మాటలకి విలువనివ్వడం శుద్ధదండగ." అన్నాను.

"అలాగా? సరే! మీరేం చేస్తారో నాకనవసరం. ఎట్లాగైనా సరే అక్కడ మన పార్టీ పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి. మనకి ఏపీ నుండి మేక్జిమం పార్లమెంటు సీట్లు రావాలి. ఏం చేద్దామంటారు?" అడిగాడు సుబ్బు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"మేడం! మనం అర్జంటుగా తెలంగాణా ఇచ్చేద్దాం. అందువల్ల ఇరవై మూడు జిల్లాల్లో పది జిల్లాలు మన ఖాతాలో పడతయ్. ఈ దెబ్బకి తెలంగాణలో బిజెపి అవుట్. కెసిఆర్ ఎలాగూ మనతో కలిసిపోతాడు. కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాని స్వీప్ చేసేస్తాం." ఉత్సాహంగా అన్నాను.

"వెరీ గుడ్. మరప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఏం చేద్దాం?" అడిగాడు సుబ్బు.

"అక్కడ రాజకీయం చెయ్యడానికి మనకి వెసులుబాటు ఉంది మేడం. జగన్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రంగం సిద్ధం చేశాను. ద డీల్ ఈజ్ జగన్ బాబు CM, మన రాహుల్ బాబు PM."

"ఇప్పుడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నడుస్తుంది. మరి తెలంగాణా ఆపేద్దామా?" అడిగాడు సుబ్బు aka సోనియా గాంధీ.

"అదెలా కుదురుతుంది. ఇప్పుడు రాష్ట్ర విభజనని పెండింగ్ లో పెడితే అన్నింటికి చెడతాం మేడం. దీన్నే మా తెలుగు భాషలో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారు. మనకి ముందుకు పోవడం మించి వేరే దారి లేదు మేడం." అన్నాను.

"అంతేనంటారా?"

"అంతే మేడం. మీరు తెలంగాణా ఇస్తానని ఒకసారి ఎలక్షన్ మీటింగులో చెప్పారు. ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే మాట నిలబెట్టుకున్నట్లూ ఉంటుంది.. రాజకీయంగా లాభమూ చేకూరుతుంది. తెలంగాణా ఇవ్వకుండా రాష్ట్రం మొత్తం నష్టపొయ్యేకన్నా.. ఇచ్చి ఒక భాగాన్ని మన ఖాతాలో వేసుకోవడం ఉత్తమం."

"మరి రాష్ట్రవిభజన విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారేమిటి?" అడిగాడు సుబ్బు.

"చూడండి మేడం! ఎదురుగా మసాలా దోశ విత్ అల్లం పచ్చడి అండ్ కొబ్బరి చట్నీలతో రెడీగా ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు తిందాం. హడావుడిగా తినవలసిన అవసరం మనకేంటి?" అన్నాను.

"అర్ధం కాలేదు." అన్నాడు సుబ్బు.

"కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో మనమే ఉన్నాం గదా మేడం. ఎన్నికల సమయానికి క్లైమేక్స్ వచ్చేట్లుగా మనం రాజకీయాలు నడిపిద్దాం. మా  తెలుగు సినిమాల్లో పదోరీల్లోనే పోలీసులు వస్తే హీరో ఫైటింగు చెయ్యని అసమర్ధ వెధవగా మిగిలిపోతాడు. కాబట్టి దర్శకుడు పద్నాలుగో రీలు దాకా పోలీసుల్ని ఆపుతాడు. అంచేత తెలంగాణా ఇవ్వాల్సిన టైమింగ్ మన ఇష్టప్రకారం మాత్రమే ఉంటుంది. చివరిదాకా ఎవరికీ ఇంకే అవకాశం లేకుండా చెయ్యడమే మన మాస్టర్ ప్లాన్." అన్నాను.

కుర్చీలోంచి లేచాడు సుబ్బు. తన కుడిచేతి చూపుడు వేలుతో నా నుదురు తాకాడు.

"ఇప్పుడు నువ్వు నిద్ర లోంచి లేస్తున్నావు. నిదానంగా కళ్ళు తెరుస్తున్నావు. ఇప్పుడు నేను సోనియా గాంధీని కాను. నువ్వు CWC సభ్యుడవి కాదు.. సభ్యుడవి కాదు. నువ్వొక సాధారణ పౌరుడివి." అన్నాడు సుబ్బు.

నిద్రలోంచి మెలకువ వచ్చినట్లు నిదానంగా కళ్ళు తెరిచాను. వెలుగు భరించలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఎదురుగా నవ్వుతూ సుబ్బు.

ఇందాక ఏదో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఆఁ.. గుర్తొచ్చింది. రాష్ట్ర విభజన గూర్చి సుబ్బుతో చర్చిస్తున్నాను.

" సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." అన్నాను.

"అవునా? అయితే ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఒక్కటే! రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణా జిల్లాల్లో ఉద్యమం చెయ్యడం. బెస్టాఫ్ లక్." అంటూ నవ్వుతూ గదిలోంచి నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)