Thursday 24 October 2013

మన్నాడే


ఈరోజు ప్రముఖ హిందీ సినిమా నేపధ్య గాయకుడు మన్నాడే మరణించాడు.

మన్నాడే మధుర గాయకుడు, శాస్త్రీయ సంగీతంలో నిష్టాతుడు.. ఇలా అనేక విశేషాలతో రేపటి పత్రికల్లో వ్యాసాలు వస్తాయి. ఆసక్తి ఉన్నవారు రేపటిదాకా ఆగవలసి ఉంటుంది.

మన్నాడే తన పాటలతో నన్ను అలరించాడు. ఆయనది చాలా క్లీన్ వాయిస్.

శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రతిభ కలవారు సినిమా పాటలు పాడటానికి ఇబ్బందిగా ఫీలవుతారు. కారణం.. సినిమా అనేది పూర్తిగా డిఫెరెంట్ మీడియం. అక్కడ సన్నివేశాన్ని అనుసరిస్తూ, సందర్భాన్ని బట్టి నటీనటుల బాడీ లాంగ్వేజికి అనుగుణంగా పాడవలసి ఉంటుంది.

రాకెట్ సైంటిస్టుని రాకెట్ ఎలా ఎగురుతుందో ఒక చందమామ కథలాగా చెప్పమంటే ఇబ్బంది పడతాడు. వెయ్యిమందికి అవలీలగా వంట చేసేవాణ్ణి.. ఇద్దరికీ కాఫీ పెట్టమంటే చికాకు పడతాడు. రోజూ గుండె ఆపరేషన్లు చేసే డాక్టర్ని.. గొంతు నొప్పికి మందడిగితే చాలాసేపు ఆలోచిస్తాడు. ఇవన్నీ సింపుల్ గా కనిపించే ఇబ్బందికరమైన అంశాలు.

అట్లాంటి ఇబ్బందే గొప్ప గాయకులకి కూడా ఉంటుంది. మనకి తెలిసిన ఘంటసాల, రఫీలు శాస్త్రీయ సంగీతాన్ని పద్దతిగా నేర్చుకున్నారు. మంచి ప్రతిభావంతులు. అయితే వారు తమ ఇబ్బందిని అధిగమించి.. సినిమా పాటలకి తగ్గట్టుగా తమని తాము మలచుకున్నారు. గొప్ప విజయాలు సాధించారు. ఇదేమీ మామూలు విషయం కాదు. మన్నాడే కూడా ఈ మహాగాయకుల కోవకి చెందినవాడేనని నా అభిప్రాయం.

రచయితలకైతే ఫలానా కథ అని గుర్తు చేసుకుంటాం. గాయకులకైతే ఫలానా పాట అని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంటర్నెట్ లో యూట్యూబ్ లింక్ ఇచ్చుకుని చూసుకునే సౌకర్యం ఉంది కాబట్టి.. నాకు నచ్చిన సినిమాలోంచి, నచ్చిన మన్నాడే పాటొకటి  ఇస్తున్నాను. చూసి ఆనందించండి.